శ్రీ దయామాత నూతన సంవత్సర సందేశం: 2011

ప్రియమైన సభ్యులు మరియు మిత్రులారా,

మన ప్రియతమ ప్రెసిడెంట్ మరియు సంఘమాత శ్రీ దయామాతాజీ మరణించడానికి ముందు, ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభంలో మన ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు స్నేహితులకు ఆమె పంపే సందేశాన్ని ఆమె సిద్ధం చేసింది. ఆమె సహాయం మరియు ఆశీర్వాదాలు ఇప్పటికీ మనతో ఉన్నాయి. ఆమె మీ పట్ల మరియు దేవునితో లోతైన సంబంధాన్ని హృదయపూర్వకంగా కోరుకునే అన్ని ఆత్మల పట్ల ఆమెకున్న గాఢమైన శ్రద్ధకు గుర్తుగా మీరు ఈ లేఖను కలిగి ఉండాలని మేము భావిస్తున్నాము. ఆమె మాటల ద్వారా మీరు ఆమె ఉనికిని మరియు ప్రోత్సాహాన్ని అనుభవించవచ్చు మరియు ఆమె దివ్యప్రేమతో ఉద్ధరించబడవచ్చు.

మృణాళినీమాత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరుపున

నూతన సంవత్సరం 2011

గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మేమందరం మీ కోసం ప్రార్థిస్తున్నాము మరియు మనం కలిసి ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే సందర్భంగా మా ఆత్మీయ స్నేహాన్ని మీకు పంపుతాము. క్రిస్మస్ సమయంలో మీ ప్రేమపూర్వక సందేశాలకు మరియు జ్ఞాపకాలకు మరియు గత నెలల్లో మీ ఆదరం వ్యక్తపరచినందుకు మీకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువుగారి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఐక్య ప్రార్థనలు మరియు మనం పంచుకున్న ఆదర్శాలను మన జీవితాల్లో నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల ద్వారా, మనం ఒకరినొకరు బలపరుస్తాము. దేవుని మంచితనంపై మరియు ప్రతి ఆత్మ యొక్క దివ్య సామర్థ్యంపై విశ్వాసపు స్ఫూర్తిని వ్యాప్తి చేయడానికి సహాయ పడతాము. నిరంతరం మారుతున్న ప్రపంచంలోని దైనందిన వాస్తవాలను నిర్భయంగా ఎదుర్కొంటూనే, మన చైతన్యాన్ని భగవంతుని మార్పులేని ప్రేమలో ఉంచుకుందాం, తద్వారా మనం అతని ఉనికిని అనుభవించవచ్చు మరియు ప్రతిబింబించవచ్చు. మనం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతూ – మన సంతోషంపై లేదా మన లక్ష్య సాధనా సామర్థ్యంపై మనం ఉంచిన ఏవైనా హద్దులను విడిచిపెట్టడం చేసినప్పుడు అలాంటి స్వేచ్ఛాభావన వస్తుంది. మన గత అనుభవాలు లేదా ప్రస్తుత పరిస్థితి ఏమైనప్పటికీ, సంతృప్తికరమైన, సేవా జీవితాన్ని గడపడానికి ఈ క్షణం నుండి మనం ఎంచుకోవచ్చు; భగవంతునితో అనుసంధానమును తీసుకువచ్చి తద్వారా విలువైన విజయాలను సాధ్యం చేసే స్వభావ గుణాలను మనం పెంపొందించుకోవచ్చు. రాబోయే సంవత్సరంలో లభించే కొత్త అవకాశాల ద్వారా, మన ఆత్మ యొక్క మరుగుపడిన నిర్భయత్వాన్ని మరియు అజేయతను తిరిగి మేల్కొలపడానికి-మన జీవితానికి బాధ్యత వహించడానికి మరియు సమర్ధులుగా మనం సాధించగలిగినంత సాధించాలని దైవం మనల్ని పిలుస్తుంది. మన చైతన్యం యొక్క దృష్టిని ప్రతికూలత నుండి సానుకూలంగా మార్చడం – అవరోధాల నుండి లక్ష్యం వైపు, పరిస్థితుల నేపథ్యంలో నిష్క్రియాత్మకత నుండి మన స్వధర్మాన్ని నిర్వర్తించగలమని గ్రహించడం ఒక ముఖ్యమైన మొదటి అడుగు. మీరు కావాలనుకుంటున్న ప్రతిదీ మీలోనే ఉంది మరియు మీరు సానుకూల ఆలోచన మరియు నిర్దిష్ట చర్యల ద్వారా ఆ లక్షణాలను బయటకు తీసుకురావచ్చు. మీరు ప్రత్యేకించి వ్యక్తం చేయాలనుకుంటున్న అధిక సంకల్ప శక్తి, విశ్వాసం లేదా సహనం వంటి లక్షణాలను నిరంతరం ధృవీకరించండి మరియు సాధన చేయండి. అట్లా మీరు మీ చైతన్యం యొక్క లోతైన స్థాయిలలో విజయానికి బీజాలు వేస్తారు. పాత సంస్కారాలు పునరావృతమైతే, ఓటమికి నిరాకరించండి. పునరుత్తేజిత సంకల్పాన్ని ముందుకు తెచ్చే ప్రతి రోజు లేదా ప్రతి క్షణం మీరు కొత్తగా ప్రారంభానికి నాంది పలకవచ్చని గుర్తుంచుకోండి.

ఈ ప్రపంచంలో మనం కోరుకునే ప్రతిదాని వెనుక మనకు అన్నింటికంటే గొప్ప అవసరం ఉంది—మన ఉనికికి మూలమైన ఆయనతో మన సంబంధాన్ని తిరిగి స్థాపించడం. మీకు మరియు ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని ఆలోచనలను విడిచిపెట్టి మీరు ఆయనతో సంభాషించినప్పుడు, ఎలాంటి ఓదార్పుతో కూడిన శాంతి హృదయాన్ని నింపుతుందంటే—అది మరేదీ ఇవ్వలేని మాధుర్యపు మరియు శ్రేయస్సు యొక్క భావన. మీరు ఆయన ప్రేమలో సురక్షితంగా ఉన్నారు మరియు ఆయన సహాయంతో మీరు ఏదైనా చేయగలరని తెలుసుకుంటారు. గురూగారు చెప్పినట్లుగా, “మీకు ప్రతిబంధకాలు అనిపించిన ప్రతిసారీ, కళ్ళు మూసుకుని, ‘నేనే అనంతుడిని’ అని చెప్పుకోండి, మరియు మీ శక్తి ఏమిటో మీరు చూస్తారు.” మిమ్మల్ని మీరు స్థిరంగా మెరుగుపరచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించడం ద్వారా, మీ మార్గాన్ని దాటిన వారందరిపై మీరు సానుకూలమైన, ఉత్తేజకరమైన ప్రభావం చూపగలరు. మీరు మీ అత్యున్నత ఆకాంక్షలను మరియు సంకల్పాలను భగవంతుని ముందు ఉంచినప్పుడు, ఆయన సహాయక ఉనికిని మరియు మీ ఆత్మ వికాసానికి మార్గనిర్దేశం చేస్తూ మిమ్మల్ని తనకు దగ్గరగా తీసుకువెళుతున్న ఆయన యొక్క సుతిమెత్తని సంరక్షణ గురించి మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

మీకు మరియు మీ ప్రియమైన వారికి అత్యంత శుభకరమైన క్రిస్మస్,

శ్రీ దయామాత

ఇతరులతో పంచుకోండి