క్రియాయోగాన్ని అభ్యసించండి, మీరు ఆధ్యాత్మిక మార్గంలో తప్పకుండా సాఫల్యం పొందుతారు. అది నా స్వానుభవం. క్రియాయోగం యొక్క విమోచన శక్తి, కర్మ అనే జైలు ఊచలను ఖండిస్తుంది. తూర్పు పశ్చిమ దేశాలలో ఎక్కడా ఇంతగొప్ప ప్రక్రియను నేనెన్నడూ చూడలేదు. క్రియను, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మార్గాన్ని అనుసరించే ప్రతి వ్యక్తీ చాలా పురోగమిస్తాడు. ధ్యానం చేస్తూ, కొద్ది సంవత్సరాల తరువాత ఫలితాలను మీలోనే చూసుకోండి. కొంత సమయం ఆగండి. ఫలితాన్ని నిముషంలో ఆశించకండి. మీరు ఆరోగ్యం కాని, ధనం కాని ఒక్క రోజులో పొందలేరు. సమయం వెచ్చించవలసి ఉంటుంది. ఏదైనా ఒక అలవాటు ఏర్పడడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. మీరు ధ్యానం చేస్తూ క్రియను గాఢంగా ఎనిమిది సంవత్సరాలు అభ్యాసం చేస్తే, మీరు ఆత్మాధిపత్యం సాధించే దారిలో ఉన్నట్టు కనుగొంటారు.
— పరమహంస యోగానంద
క్రియాయోగ ధ్యానం వల్ల బహువిధాలైన ప్రయోజనాలు ఉంటాయి. క్రమం తప్పకుండా ధ్యాన ప్రక్రియలను అభ్యాసం చెయ్యడం ద్వారా ఒక వ్యక్తి శరీరంలో, మనస్సులో, మరియు ఆంతరిక చైతన్యంలో సూక్ష్మమైన పరివర్తనలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రయోజనాలలో కొన్ని వెనువెంటనే అనుభవంలోకి వస్తాయి; మిగిలినవి క్రమంగా వికసితమై, కొద్దికాలం తరువాత గోచరమవుతాయి.
- ధ్యానం యొక్క తొలి ఫలితాలలో మానసికశాంతి ఒకటి. దానితోపాటు మెరుగైన స్పష్టత, అవగాహన, మరియు ఆంతరిక మార్గదర్శనం కూడా లభిస్తాయి.
- ధ్యానం నిష్పాక్షిక దృక్పథాన్ని, దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సహజావబోధజ్ఞానాన్ని తీసుకువస్తుంది. అది ఒక వ్యక్తి యొక్క ఏకాగ్రతను, సమర్థతను, మరియు పనిపట్ల వైఖరినీ మెరుగుపరుస్తుంది.
- బేషరతైన ప్రేమను ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యాన్ని మేల్కొల్పడం ద్వారా, కుటుంబ జీవితానికి, సంబంధబాంధవ్యాలకు సామరస్యాన్ని, సంతోషాన్ని అది తీసుకువస్తుంది.
- శరీరంలోని ప్రాణశక్తులను క్రమబద్ధీకరించి, హానికరమైన ఒత్తిడిని తొలగించి, ఆరోగ్యాన్ని, జీవశక్తిని అది పెంపొందిస్తుంది.
- అన్నిటికన్నా ముఖ్యంగా, ఒక వ్యక్తి యొక్క చైతన్యం దైవంతో అనుసంధానం పొందేందుకు అది సహాయం చేస్తుంది, తద్ద్వారా జీవితంలోని అన్ని పరిస్థితులలోను అచంచలమైన అంతర్గత ఆనందాన్ని మరియు భద్రతను ప్రసాదిస్తుంది.
చిత్తశుద్ధితో చేసే ప్రయత్నంవల్లా, మరియు జీవితంలోని అంతిమలక్ష్యo — నిత్యనూతనానందం, మరియు ఆత్మసాక్షాత్కారం ద్వారా భగవంతునితో ఐక్యత — వైపు పరిశ్రమ కొనసాగించాలనే సంకల్పాన్ని సమీకరించడం వల్లా, ఈ ఫలితాలు సిద్ధిస్తాయి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాతగారు, ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు “ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ధ్యానం యొక్క మహత్తరమైన ప్రయోజనాలను కనుగొంటున్నారు,” ఇంకా ఆమె ఇలా కొసాగించారు:
“ఎవరికైనా ‘నిశ్శబ్ద సాధన’ చేయమని చెప్పినంత మాత్రాన, వారి ఆలోచనలను శాంతపరచే సాధనాలను వారికిచ్చినట్లు కాదు. కాని మనస్సును నియంత్రించే ఒక నిర్దిష్టమైన ప్రక్రియను వారికి ఇవ్వడం జరిగితే, ధ్యానమంటే కేవలం బాహ్యప్రపంచం యొక్క దృశ్యాలను, శబ్దాలను మూసివేయడం కంటే చాలా ఎక్కువని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు; ఇది శరీరాన్ని మరియు చైతన్యాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుతుందంటే, చైతన్యం స్ఫటికంలా, నిర్మలంగా ఉన్న సరస్సు వలె మార్చి భగవంతుని ఆనందభరితమైన ఉనికిని ప్రతిబింబించగలదు.”
ఎవరైనా క్రియాయోగ పథంలో అతిముఖ్యమైన ప్రాణాయామ ప్రక్రియలను ఎంత ఎక్కువగా అభ్యసిస్తే, అంతర్లీనంగా ఉన్న భగవంతుని ఉనికిని ఎంత ఎక్కువగా తెలుసుకొంటే, అంతగా తమ దైనందిన జీవితంలో ధైర్యం, విశ్వాసం, వివేకం, ప్రేమ, దయ వంటి దివ్యలక్షణాలను వ్యక్తపరచగలుగుతారు.
శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

క్రియాయోగం మతం యొక్క నిజమైన అనుభవాన్ని ఇస్తుంది
“మీరు ధ్యానం చేస్తే మీ జీవితం ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. నా పుస్తకం [ఒక యోగి ఆత్మకథ] ప్రచురించబడినప్పటి నుండి, ప్రతి ఒక్కరూ క్రియాయోగం గురించి అడుగుతున్నారు. అదే నా ఉద్దేశ్యం. నేను వేదాంతపరమైన సారాంశాలను ఇవ్వడానికి రాలేదు, కానీ నిష్కపటంగా ఉన్నవారు భగవంతుడిని నిజంగా తెలుసుకోగలిగే ప్రక్రియను ఇవ్వడానికి వచ్చాను, ఆయన గురించి సిద్ధాంతీకరించడమే కాదు….క్రియాభ్యాసం మతం యొక్క నిజమైన అనుభవాన్ని ఇస్తుంది, ఇది కేవలం భగవంతుని గురించి మాట్లాడటం ద్వారా పొందలేము. ఏసు ఇలా అన్నాడు: ‘మీరు నన్ను ప్రభువా, ప్రభువా అని ఎందుకు పిలుస్తారు, నేను చెప్పేది చేయకుండా?’
“క్రియాయోగం ద్వారా నేను నా ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరిచినప్పుడు, ప్రపంచం మొత్తం నా చైతన్యం నుండి దూరమవుతుంది మరియు దేవుడు నాతో ఉంటాడు. మరియు ఎందుకు కాదు? నేను ఆయన బిడ్డను. సెయింట్ ఇగ్నేషియస్ ఇలా అన్నాడు, ‘దేవుడు ఇష్టపడే హృదయాలను వెతుకుతాడు ఎందుకంటే తన అనుగ్రహాలను వారికి ఇవ్వడానికి….’ అది చాలా అందమైనది మరియు అదే నేను నమ్ముతాను. దేవుడు తన బహుమతులను ప్రసాదించడానికి, సిద్ధంగా ఉన్న హృదయాలను వెతుకుతాడు. ఆయన మనకు ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము స్వీకరించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడము.”
— శ్రీ పరమహంస యోగానంద,
జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్
దేవుడి ఆశీర్వాదాలకు సంసిద్ధులవ్వండి
“భక్తితో కూడిన ప్రార్థన అనేది, స్వేచ్ఛగా ప్రవహించే భగవంతుని ఆశీర్వాదాలకు తనను తాను తెరుచుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం, ఇది మానవుని జీవితానికి, అన్ని ప్రయోజనాలను అందించే అనంతమైన మూలానికి మధ్య అవసరమైన సంబంధం. కానీ మనస్సు బాహ్యంగా తిరుగుతున్నప్పుడు ప్రార్థన ప్రభావవంతంగా ఉండటానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఒక గంట క్రియాయోగ ధ్యానం ఇరవై నాలుగు గంటల సాధారణ ప్రార్థన కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది.
“క్రియా యొక్క ప్రక్రియను కొద్దిసేపైనా లోతుగా అభ్యసించి, ఫలితంగా వచ్చిన నిశ్చలత్వంలో చాలాసేపు ధ్యానంలో కూర్చున్న వారు, వారి ప్రార్థన యొక్క బలము రెట్టింపు, మూడు రెట్లు, వంద రెట్లు ఎక్కువ శక్తివంతమైనట్టుగా తెలుసుకొంటారు. ఎవరైనా నిశ్శబ్దం యొక్క అంతర్గత ఆలయంలోకి ప్రవేశించి, దేవుని పీఠం ముందు ప్రార్థన మరియు ఆయన సాన్నిధ్యాన్ని ఆవాహన చేస్తూ ఆరాధిస్తే, ఆయన త్వరగా వస్తాడు. శరీరం మరియు దాని పరిసరాల యొక్క ఇంద్రియ ఉపరితలం నుండి చైతన్యమును ఉపసంహరించి, ఆత్మ అవగాహన యొక్క మేదోమేరు (సెరెబ్రోస్పానియల్) పుణ్యక్షేత్రాలలో ఆ చైతన్యము కేంద్రీకరించబడినప్పుడు, అది ప్రార్థన చేయడానికి అత్యంత ప్రభావవంతమైన సమయం అవుతుంది.”
— శ్రీ పరమహంస యోగానంద,
ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్:
ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ
క్రియాయోగం—దేవునితో అనుసంధానము కొరకు అత్యున్నత పద్ధతి

[భగవద్గీత IV:29]
భగవద్గీతలో కృష్ణభగవానుడు క్రియాయోగాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: “పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చే గాలిలో వేల్చి, రెండు శ్వాసలను తటస్థీకరిస్తాడు యోగి; ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండె నుండి విడుదలచేసి, ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు.” దీని తాత్పర్యమేమిటంటే: “యోగి ఊపిరితిత్తులు గుండె చేసే పనిని నెమ్మదిచేసి, దానిద్వారా అదనంగా ప్రాణం (ప్రాణశక్తి) సరఫరా అయేటట్టు చేసుకుని, శరీరంలో తరుగుదలను (జీవకణక్షయాన్ని) అరికడతాడు; అంతే కాకుండా అతడు, అపానాన్ని (విసర్జక ప్రవాహం) అదుపుచేసుకోవడం వల్ల శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు; ఈ ప్రకారంగా తరుగుదలనూ పెరుగుదలనూ నిలుపుచేసి, యోగి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోడం నేర్చుకుంటాడు.”
“ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్నివేల సంవత్సరాల క్రిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ, క్రీస్తుకు మరియు సెయింట్ జాన్ కూ, సెయింట్ పాల్ కూ మరియు తదితర శిష్యులకూ తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే.” అని లాహిరీ మహాశయులతో బాబాజీ అన్నారు.
— శ్రీ పరమహంస యోగానంద,
ఒక యోగి ఆత్మకథ
“క్రియాయోగం భగవంతుని చేరుకొనుటకు అత్యున్నత పద్ధతి. దేవుడి కోసం నా స్వంత అన్వేషణలో నేను భారతదేశం అంతటా పర్యటించాను మరియు భారతదేశ గొప్ప గురువుల పెదవుల నుండి జ్ఞానాన్ని విన్నాను. యోగదా సత్సంగ (సెల్ఫ్-రియలైజేషన్) బోధనల్లోని సత్యాలు మరియు శాస్త్రీయ ప్రక్రియలు, భగవంతుడు మరియు మహాత్ములు మానవాళికి అందించిన అత్యున్నతమైనవిగా నేను ధ్రువపరుస్తున్నాను.
“క్రియాసాధన, అనంతరం వచ్చే ఫలితాలతో పాటు అత్యంత శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. క్రియతో వచ్చే ఆనందం అన్ని ఆహ్లాదకరమైన శారీరక అనుభూతుల ఆనందాల కంటే గొప్పది. ‘ఇంద్రియ ప్రపంచానికి ఆకర్షించబడకుండా, యోగి తనలో అంతర్లీనంగా ఉన్న నిత్య నవీన ఆనందాన్ని అనుభవిస్తాడు. పరమాత్మతో ఆత్మ యొక్క దివ్య కలయికలో నిమగ్నమై, అతను అనశ్వరమైన ఆనందాన్ని పొందుతాడు’ (భగవద్గీత V:21). నాకు వెయ్యి నిద్రల నుండి వచ్చే విశ్రాంతిని, ధ్యానంలో అనుభవించే ఆ ఆనందం ద్వారా పొందుతాను. అభివృద్ధి చెందిన క్రియాయోగికి వాస్తవంగా నిద్ర అనవసరమవుతుంది.
“క్రియాయోగం ద్వారా భక్తుడు సమాధిలోకి ప్రవేశించినప్పుడు, అతని కళ్ళు, శ్వాస మరియు హృదయం ప్రశాంతంగా ఉంటాయి, మరొక ప్రపంచం మన దృష్టి ముందుకి వస్తుంది. శ్వాస, శబ్దం, కళ్ళ కదలికలు ఈ ప్రపంచానికి చెందినవి. కానీ శ్వాసపై నియంత్రణ ఉన్న యోగి స్వర్గలోకపు సూక్ష్మ మరియు కారణ ప్రపంచాలలోకి ప్రవేశించి, అక్కడ దేవుని సాధువులతో అనుసంధానం పొందవచ్చు లేదా విశ్వ చైతన్యంలోకి ప్రవేశించి భగవంతునితో అనుసంధానం పొందవచ్చు. యోగికి ఇంకదేనిలోనూ ఆసక్తి ఉండదు.
“ఎవరైతే ఇతర విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ, నేను చెప్పినదాన్ని గుర్తుంచుకుంటారో, వారు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు.”
— శ్రీ పరమహంస యోగానంద,
మానవుడి నిత్యాన్వేషణ
మానసికమైన చెడు అలవాట్లను మరియు కర్మలను నిర్మూలించండి
“మీ ప్రతి అలవాటు మెదడులో ఒక నిర్దిష్ట ‘గాడిని’, లేదా, మార్గాన్ని సృష్టిస్తాయి. ఈ తీరులు మిమ్మల్ని ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించేలా చేస్తాయి, ఇవి తరచుగా మీ కోరికకు వ్యతిరేకంగా ఉంటాయి. మీ జీవితం మీరే మెదడులో సృష్టించిన గాళ్లను అనుసరిస్తుంది. ఆ కోణంలో మీరు స్వతంత్ర వ్యక్తి కాదు; మీరు ఏర్పరచుకున్న అలవాట్లకు మీరే కొద్దో గొప్పో బాధితులు. ఆ తీరులు ఎంతగా దృఢపడ్డాయి అనేదానిపై ఆధారపడి, ఆ స్థాయిలో మీరు ఒక కీలుబొమ్మ అవుతారు. కానీ మీరు ఆ చెడు అలవాట్ల ఆదేశాలను తటస్థీకరించవచ్చు. ఎలా? వాటికి వ్యతిరేకంగా మంచి అలవాట్ల మెదడు తీరులు సృష్టించడం ద్వారా. మరియు మీరు ధ్యానం ద్వారా చెడు అలవాట్ల గాళ్లను పూర్తిగా తొలగించవచ్చు. వేరే మార్గం లేదు. అయితే, మంచి సాహచర్యం మరియు మంచి పరిసరాలు లేకుండా మీరు మంచి అలవాట్లను పెంపొందించుకోలేరు. మంచి సహవాసం మరియు ధ్యానం లేకుండా మీరు చెడు అలవాట్ల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోలేరు…
“మీరు దేవుని గురించి గాఢముగా ధ్యానించిన ప్రతిసారీ, మీ మెదడు తీరులలో ప్రయోజనకరమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు ఆర్థిక వైఫల్యులు లేదా నైతిక వైఫల్యులు లేదా ఆధ్యాత్మిక వైఫల్యులు అనుకుందాం. గాఢమైన ధ్యానం ద్వారా, ‘నేను మరియు నా తండ్రి ఒక్కటే,’ అని ధృవీకరించడం ద్వారా, మీరు దేవుని బిడ్డ అని మీరు తెలుసుకుంటారు. ఆ ఆదర్శాన్ని పట్టుకోండి. మీరు గొప్ప ఆనందాన్ని అనుభవించే వరకు ధ్యానం చేయండి. ఆనందం మీ హృదయాన్ని తాకినప్పుడు, దేవుడు మీ ప్రసారానికి సమాధానమిచ్చారు; ఆయన మీ ప్రార్థనలకు మరియు సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తున్నాడు. ఇది ప్రత్యేకమైన మరియు నిశ్చితమైన పద్ధతి:
“మొదట, ‘నేను మరియు నా తండ్రి ఒక్కటే,’ అనే ఆలోచనపై ధ్యానం చేయండి, గొప్ప శాంతిని అనుభవించడానికి ప్రయత్నిస్తూ, ఆపై మీ హృదయంలో గొప్ప ఆనందాన్ని పొందండి. ఆ ఆనందం వచ్చినప్పుడు, ‘తండ్రీ, నువ్వు నాతో ఉన్నావు. తప్పుడు అలవాట్లను మరియు నా మెదడు కణాలలో ఉన్న గత బీజ ధోరణులను మట్టుబెట్టమని నాలో ఉన్న నీ శక్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను.’ ధ్యానంలో భగవంతుని శక్తి దాన్ని చేస్తుంది. మీరు పురుషుడు లేదా స్త్రీ అనే పరిమిత స్పృహ నుండి మిమ్మల్ని మీరు వదిలించుకోండి; నీవు దేవుని బిడ్డవని తెలుసుకో. అప్పుడు మానసికంగా ధృవీకరిస్తూ మరియు దేవునికి ప్రార్థించండి: ‘నేను ఆజ్ఞాపిస్తున్నాను నా మెదడు కణాలను మారమని, నన్ను కీలుబొమ్మగా చేసిన చెడు అలవాట్ల యొక్క గాడిని నాశనం చేయమని. ప్రభూ, వాటిని నీ దివ్యకాంతిలో కాల్చివేయి.’ మరియు మీరు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ధ్యాన పద్ధతులను, ముఖ్యంగా క్రియాయోగమును అభ్యసించినప్పుడు, మీకు బాప్తిజమిచ్చే భగవంతుని కాంతిని మీరు నిజంగా చూస్తారు.”
— శ్రీ పరమహంస యోగానంద,
దివ్య ప్రణయం