సువార్తలలో దాగి ఉన్న సత్యాలు

కొత్త నిబంధనపై పరమహంస యోగానందగారి రెండు-సంపుటాల వ్యాఖ్యానం నుండి సారాంశాలు:

ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You )

హెన్రిచ్ హాఫ్మాన్ గీసిన ఏసుక్రీస్తు.ఈ పేజీలలో, క్రీస్తు చైతన్యంతో ప్రత్యక్ష సంసర్గం ద్వారా పొందిన అంతర్ దృష్టితో ఏసుక్రీస్తు పలికిన వాక్కులకు నేను గ్రహించిన సత్యాల యొక్క ఆధ్యాత్మిక వివరణను ప్రపంచానికి అందిస్తున్నాను. అవి క్రైస్తవ బైబిల్ కు, భారతదేశం యొక్క భగవద్గీతకు, మరియు అన్ని ఇతర సనాతన సత్యగ్రంథాలకు ఉన్న పరిపూర్ణమైన ఐక్యతను వెల్లడిస్తాయి.

జగద్రక్షకులు వైరుధ్యమైన సిద్ధాంత విభజనలను ప్రోత్సహించడానికి రారు; వారి బోధనలు ఆ దిశగా ఉపయోగించకూడదు. క్రొత్త నిబంధనను “క్రైస్తవ” బైబిల్‌గా పేర్కొనడం కూడా తప్పు, ఎందుకంటే ఇది ఏ ఒక్క వర్గానికి మాత్రమే చెందినది కాదు. సత్యం మొత్తం మానవ జాతిపై ఆశీస్సులు కురిపించడానికి, వారి ఉద్ధరణ కోసం ఉద్దేశించబడింది. విశ్వవ్యాప్తమైన క్రీస్తు చైతన్యం వలె, ఏసుక్రీస్తు కూడా అందరికీ చెందినవాడు.

ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనే శీర్షిక గల ఈ రచనలో నేను ఏసుక్రీస్తు భూమికి యధార్థంగా తిరిగి రావడం గురించి ప్రస్తావించడం లేదు…. భూమి మీద ప్రజలు తమ వ్యక్తిగత చైతన్యాన్ని శుద్ధి చేసుకొని, క్రీస్తు చైతన్యం యొక్క రెండవ ఆగమనం ఏసుక్రీస్తులో వ్యక్తీకరించబడినట్లుగా విస్తరింపజేసుకోవటం ద్వారా క్రీస్తులాగా మారితే తప్ప ఇక్కడికి పంపబడిన వెయ్యి మంది క్రీస్తులైనా ప్రజలకు విముక్తి కలిగించలేరు. క్రీస్తుచైతన్యంతో సంసర్గం, ధ్యానం యొక్క నిత్య నూతన ఆనందాన్ని అనుభవించటమే క్రీస్తు యొక్క నిజమైన రెండవ ఆగమనం-మరియు అది భక్తుని స్వీయ-చైతన్యంలోనే జరుగుతుంది.

"ఏకైక కుమారుడు": క్రీస్తు చైతన్యం

ఏసు మరియు క్రీస్తు పదాలకు అర్థాలు వేరు. ఆయన పేరు ఏసు; ఆయనకు గౌరవ బిరుదు “క్రీస్తు.” భగవంతుని సర్వజ్ఞ జ్ఞానంతో, సృష్టిలోని ప్రతి భాగం మరియు కణము నందు విస్తారమైన సర్వవ్యాప్త క్రీస్తు చైతన్యం, ఏసు అని పిలువబడే ఆయన చిన్న మానవ దేహంలో జన్మించింది. ఈ చైతన్యమే “దేవుని యొక్క ఏకైక కుమారుడు,” ఎందుకంటే ఇది సర్వోత్కృష్ట సంపూర్ణ, పరమాత్మ లేదా తండ్రి అయిన దేవుని సృష్టిలో ఏకైక పరిపూర్ణ ప్రతిబింబం.

దేవుని ప్రేమ మరియు ఆనందంతో నిండిన ఆ అనంతమైన చైతన్యంతో, సెయింట్ జాన్ ఇలా అన్నాడు: “ఆయన్ని (క్రీస్తు చైతన్యం) స్వీకరించిన వారందరికీ, వారు దేవుని కుమారులుగా మారడానికి తగిన శక్తిని ఇచ్చాడు.”…

సహస్రాబ్దాలుగా భారతదేశ యోగులకు, ఋషులకు మరియు ఏసుకు తెలిసిన ఖచ్చితమైన ధ్యాన శాస్త్రం ద్వారా, భగవంతుణ్ణి అన్వేషించే ఏ వ్యక్తి అయినా భగవంతుని విశ్వవ్యాప్త మేధస్సును తనలోకి స్వీకరించడానికి తన చైతన్యాన్ని సర్వజ్ఞత్వానికి విస్తరించగలడు.

వీడియో: “Christ Consciousness: The Goal for Each One of Us”

ఈస్టర్ స్మారక ధ్యాన కార్యక్రమం నుండి సంగ్రహించబడిన ఈ చిన్న వీడియోలో, పైన సెయింట్ జాన్ ఉదహరించిన వాటికి శ్రీ పరమహంస యోగానందగారు యిచ్చిన లోతైన ప్రాముఖ్యత గురించి; మరియు పరమహంసగారు నేర్పించిన యోగదా సత్సంగ పాఠాల్లోని బోధనలు మరియు ప్రక్రియలను అభ్యాసం చేయడం ద్వారా, జీసస్ లో వ్యక్తమైన అనంత చైతన్యాన్ని, మనలో సాక్షాత్కరించుకోవడం ఎలా సాధ్యమవుతుందో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ స్వామి చిదానంద గిరి చర్చిస్తారు.

ఏసుక్రీస్తు ఉపమానాల్లో దాగి ఉన్న సత్యం

మరియు శిష్యులు వచ్చి, “నీవు వారితో ఉపమానాలుగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిచ్చాడు, “పరలోక రాజ్య రహస్యాలను తెలుసుకోవడం మీకు ఇవ్వబడింది, కానీ వారికి ఇవ్వబడలేదు….కాబట్టి నేను వారితో ఉపమానాలుగా మాట్లాడుతున్నాను: ఎందుకంటే చూసినా కూడా వారు చూడలేరు; మరియు విన్నా కూడా వారు వినలేరు, లేదా వారు అర్థం చేసుకోలేరు.”

ఉపమానాల యొక్క సూక్ష్మ దృష్టాంతాలలో ప్రజలకు ఎందుకు బోధించావు అని ఏసుక్రీస్తును ఆయన శిష్యులు అడిగినప్పుడు, ఆయన ఇలా సమాధానమిచ్చాడు, “నా నిజమైన శిష్యులైన మీరు, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ, నా బోధనల ప్రకారం మీ చర్యలను క్రమశిక్షణలో ఉంచుకుంటూ, మీ ధ్యానాలలో మీ అంతర్గత మేల్కొలుపు కారణంగా స్వర్గం యొక్క మర్మమైన రహస్యాల యొక్క సత్యాన్ని మరియు దేవుని రాజ్యాన్ని అంటే, విశ్వ మాయ యొక్క ప్రకంపన సృష్టి వెనుక దాగి ఉన్న విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి, పొందడానికి విధించబడ్డారు. కానీ సాధారణ ప్రజలు, వారి గ్రహణశక్తి రీత్యా సిద్ధంగా లేరు, లోతైన జ్ఞాన-సత్యాలను గ్రహించలేరు లేదా ఆచరించలేరు. ఉపమానాల ద్వారా నేను వారికి పంపిన జ్ఞానం నుండి వారు వారి అవగాహన ప్రకారం సరళమైన సత్యాలను సేకరించారు. వారు పొందగలిగే వాటిని ఆచరణాత్మకంగా అన్వయించడం ద్వారా వారు విముక్తి వైపు కొంత పురోగతిని సాధిస్తారు.”…

స్వీకరించే వ్యక్తి సత్యాన్ని ఎలా గ్రహిస్తాడు, అయితే గ్రహించలేనివారు “చూసి కూడా చూడలేరు; విని కూడా వినలేరు, అర్థం చేసుకోలేరు”? స్వర్గం మరియు దైవసామ్రాజ్యం యొక్క అంతిమ సత్యాలు, ఇంద్రియ గ్రహణశక్తి వెనుక ఉన్న వాస్తవికత మరియు హేతుబద్ధమైన మనస్సు యొక్క కల్పనలకు ఆవల, మేల్కొనే ఆత్మ యొక్క సహజమైన జ్ఞానం, స్వచ్ఛమైన గ్రహణశక్తి అయిన సహజావబోధం ద్వారా మాత్రమే గ్రహించబడతాయి.

ఏసు ప్రాచ్య క్రీస్తు - ఒక సర్వోన్నత యోగి

క్రీస్తును ప్రపంచం చాలా తప్పుగా అర్థం చేసుకుంది. ఆయన బోధనల యొక్క అత్యంత ప్రాథమిక సూత్రాలు కూడా అపవిత్రం చేయబడ్డాయి మరియు వాటి రహస్య లోతులు మరచిపోబడ్డాయి. అవి పిడివాదం, పక్షపాతం మరియు సంకుచిత అవగాహన చేతిలో సిలువ వేయబడ్డాయి. క్రైస్తవ మతం యొక్క మానవ నిర్మిత సిద్ధాంతాల యొక్క ఊహాజనిత అధికారుల కారణంగా మారణహోమ యుద్ధాలు జరిగాయి, మాంత్రికులు మరియు మతవిశ్వాసుల పేరుతో ప్రజలు కాల్చబడ్డారు. అజ్ఞానపు చేతుల నుండి అమరమైన బోధనలను ఎలా రక్షించాలి? మనం ఏసును ప్రాచ్య క్రీస్తుగా, భగవత్ సాయుజ్యమనే సార్వత్రిక శాస్త్రంలో సంపూర్ణ పాండిత్యాన్ని ప్రదర్శించిన అత్యున్నత యోగిగా తెలుసుకోవాలి, అందుకే ఏసు రక్షకునిగా, దేవునికి స్వరంగా అధికారంతో మాట్లాడగలడు మరియు పని చేయగలడు. ఆయన చాలా పాశ్చాత్యీకరించబడ్డాడు.

భగవత్ సంసర్గం అనే సార్వత్రిక మతం వెల్లడించే నిగూఢమైన సత్యం

గ్రంథం యొక్క బాహ్యమైన పఠనం మతం యొక్క సార్వత్రికతను పిడివాదంలో ముంచుతుంది. నిగూఢమైన సత్యాన్ని అర్థం చేసుకోవడం వలన ఐక్యతా దృశ్యం వెల్లడి అవుతుంది….దైవ అవతారాలు భగవత్ సాక్షాత్కారానికి సంబంధించిన ఒక మతాన్ని పునరుద్ధరించడానికే కానీ ప్రత్యేకమైన మతాన్ని లేదా కొత్త మతాన్ని తీసుకురావడానికి రావు.

చాలా చర్చిలు మరియు దేవాలయాలు ఆయన పేరు మీద స్థాపించబడ్డాయి, తరచుగా సంపన్నమైనవి మరియు శక్తివంతమైనవి, కానీ ఆయన నొక్కిచెప్పిన సంసర్గం-దేవునితో అసలైన సంబంధం ఎక్కడ ఉంది? మొట్టమొదట మానవ ఆత్మలలో దేవాలయాలు స్థాపించబడాలని ఏసు కోరుకుంటున్నాడు; ఆ తరువాత ఆరాధన కోసం దేవాలయాలను బాహ్యంగా స్థాపించవచ్చు. బదులుగా, లెక్కలేనన్ని భారీ భవనాల్లో విస్తారమైన సమ్మేళనాలు జరుపడమే చర్చియానిటీలో బోధించబడుతోంది. కానీ లోతైన ప్రార్థన మరియు ధ్యానం ద్వారా నిజంగా క్రీస్తుతో సన్నిహితంగా ఉన్న ఆత్మలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

ఏసు హృదయంలోని సందేశాన్ని తిరిగి కనుగొనడం

వ్యక్తిగత ప్రార్థన మరియు దేవునితో సంసర్గం లేకపోవడం వల్ల ఆధునిక క్రైస్తవులు మరియు క్రైస్తవ వర్గాలకు నిజమైన భగవత్ జ్ఞానం గురించి ఏసు నిజమైన బోధనల నుండి ఎడబాటు కలిగింది, ఇదే విధంగా దేవుడు పంపిన ప్రవక్తలు ప్రారంభించిన ఇతర అన్ని మతపరమైన మార్గాల్లో కూడా ఇది నిజం, వారిని అనుసరించినవారు అసలైన దైవ సంసర్గం కంటే సిద్ధాంతాలు, ఆచారాలు అనే చిన్న దారుల్లో కూరుకుపోయారు. నిగూఢమైన అత్మోద్ధారక శిక్షణ లేని మార్గాలు తమను తాము సిద్ధాంతంతో నిమగ్నం చేసుకొని, విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులను వేరు చేసే గోడలను నిర్మిస్తాయి. భగవంతుడిని నిజంగా గ్రహించే దివ్య-జీవులు ప్రతి ఒక్కరినీ తమ ప్రేమ మార్గంలో చేర్చుకుంటారు, తత్వగ్రాహ సమాజం అనే భావనతో కాక, నిజమైన భగవత్ ప్రేమికులందరి పట్ల అన్ని మతాల సాధువుల పట్ల వారికుండే గౌరవప్రదమైన దివ్య స్నేహంలో.

ఆత్మల శ్రేష్టమైన కాపరి అందరికీ తన చేతులు చాపాడు, ఎవరినీ తిరస్కరించలేదు. విశ్వ ప్రేమతో తన త్యాగం, వైరాగ్యం, క్షమాగుణం, స్నేహితుల పట్ల – శత్రువుల పట్ల సమమైన ప్రేమకు, అన్నింటినీ మించి దేవుని పట్ల మహోన్నతమైన ప్రేమకు నిదర్శనంగా విముక్తి మార్గంలో తనను అనుసరించడానికి ప్రపంచాన్ని ప్రేరేపించాడు. బెత్లెహెమ్‌లోని తొట్టిలో చిన్న పసికందుగా, రోగులను స్వస్థపరిచి, చనిపోయినవారిని బ్రతికించిన రక్షకునిగా, దోషాల గాయాలపై ప్రేమ పరిరక్షణను పూసిన రక్షకునిగా, మానవులు కూడా దేవుళ్ళ వలె జీవించటం నేర్చుకునేందుకు ఉదాహరణగా ఏసులోని క్రీస్తు మానవులలో ఒకరిగా జీవించారు.

వర్ణనాతీతమైన దైవ-ప్రేమ

“నాయందు మీరును, మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును…..

“తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”

ఏసు తన శిష్యులకు “మీరు నాలో ఉండి, నా మాటలు మీలో నిలిచి ఉంటే”-వారి చైతన్యం క్రీస్తు చైతన్యంతో మరియు దాని విశ్వ-ప్రకంపనలతో సంపూర్ణంగా అనుసంధానమై ఉంటే-విశ్వవ్యాప్తంగా పనిచేసే సృజనాత్మక సూత్రం ద్వారా వారు చెప్పలేని అద్భుతాలను ప్రదర్శించగలుగుతారు….

అప్పుడు ఏసు వారితో అమూల్యమైన మాటలు మాట్లాడాడు, భక్తుని హృదయానికి ఇంతకన్నా ప్రియమైనది లేదు, పరలోకపు తండ్రి తనను ఎంతగా ప్రేమించాడో అదే దివ్యమైన, నిష్పక్షపాతమైన, అచంచలమైన ప్రేమతో వారిని ప్రేమించాడు….ఈ వచనాలలో ఏసు చెప్పిన ప్రేమను ఊహించడానికి ప్రయత్నించండి….

అన్ని స్వచ్ఛమైన హృదయాల యొక్క మూల-ప్రేమను అనుభూతి చెందడం అంటే చాలా ఉన్నతమైన, చాలా అఖండమైన, ఆనంద పారవశ్యంలో తీసుకెళ్ళబడటం, జీవుడు పొందే ఆనంద ఆవేశం వెయ్యి మిలియన్ వోల్టుల అద్భుతమైన శక్తి–తట్టుకోలేనంత మహత్తరమైనది. వర్ణనాతీతమైన దివ్య భావోద్వేగం–అనంత దయామయుడితో వాక్కుతో చెప్పలేనంత మధురమైన సంసర్గం. అదే ఏసు క్రీస్తు పొందిన దివ్య-ప్రేమ, మరియు దానిలో ఆయన తన శిష్యులకు ఆశ్రయం ఇచ్చాడు: “తండ్రి నన్ను ప్రేమించినట్లు, నేను మిమ్మల్ని ప్రేమించాను: మీరు నా ప్రేమలో నిలిచిఉండండి.”

ఈ పవిత్ర సందర్భంలో ఏసు మాటల సంకలనమును సువార్త భద్రపరుస్తుంది; కానీ ఆ మాటల వెనుక భగవంతుని యొక్క స్పష్టమైన స్పందన-రూపమైన ఉనికి ఉందని పాఠకులు తెలుసుకోవాలి, మరియు అది ఉన్నట్లు తమ అంతరంగంలో అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. ఏసు తన శిష్యులతో ఆఖరి విందు చేయడం వంటి దివ్య-సహవాస (సత్సంగ) సమయాల్లో వలె, గ్రహణశక్తి ఉన్నవారు గురువు మాట్లాడుతున్నప్పుడు భగవంతుని ప్రత్యక్షానుభవము యొక్క ఉన్నత చైతన్యాన్ని తమ హృదయాలు మరియు మనస్సులలో ధారపోస్తున్నట్లు అనుభవం పొందుతారు. ఆరాధనాత్మకమైన ధ్యానం అనే గాఢమైన అంతరంగ ఆలయంలో గురువు యొక్క ఆ అనుగ్రహాన్ని శిష్యుడు పిలిచినప్పుడల్లా ఈ అనుసంధానం భక్తుని యొక్క చైతన్యంలో అత్యున్నతంగా ఇంకుతుంది.

ఏసు క్రీస్తు పునరుత్థానం మరియు ఆయన అమరమైన సాన్నిధ్యము

అత్యున్నత యుగాల ప్రారంభం నుండి భారతదేశంలోని నిష్ణాతులైన యోగులు పునరుత్థానమును బాగా అర్థం చేసుకున్నారు. ఏసు స్వయంగా సిద్ధి పొందిన యోగి: జీవన మరణాల అధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని ప్రావీణ్యం పొందినవాడు, మాయ నుంచి విముక్తి చేసి దైవ సామ్రాజ్యాన్ని పొందే విధానం, దైవ-సంసర్గం మరియు దైవ-సాయుజ్యం పొందే విధానం తెలిసినవాడు. ఏసు తన జీవితంలోనూ మరియు మరణంలోనూ తన శరీరంపై, మనస్సుపై మరియు ప్రకృతి యొక్క తిరుగులేని శక్తులపై పూర్తి అధికారాన్ని ప్రదర్శించాడు. శిలువ వేయబడిన తన దేహాన్ని ఏసు దేవుని-స్వేచ్ఛ మరియు వెలుగులోకి పునరుత్థానం చేసిన అంతర్లీన సూత్రాలను స్పష్టంగా నిర్వచించే యోగ శాస్త్రాన్ని మనం గ్రహించినప్పుడు పునరుత్థానాన్ని దాని నిజమైన భావంలో అర్థం చేసుకుంటాము….

ఆత్మగా భగవంతుని వ్యక్తీకృత చైతన్యం మనిషిలో దాని పరిణామం మరియు పరమాత్మలోకి తిరిగి అధ్యాత్మిక అధిరోహణను ఏ ఇతర శాస్త్రం ఇంతగా వివరించలేదు. ఈ ఆధునిక యుగంలో, మానవ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేయడానికి మరియు అధిరోహణ యొక్క అంతరంగ మేధోమేరుదండ మార్గాన్ని తెరవడానికి, ఆధ్యాత్మిక నేత్రం ద్వారా ఆత్మను పరిశుద్ధాత్మ – క్రీస్తు చైతన్యం మరియు తండ్రి అయిన దేవుని విశ్వ చైతన్యం అనే రాజ్యంలోకి విడుదల చేయడానికి ఒక ఖచ్చితమైన పద్ధతిగా, చీకటి యుగాలలో కోల్పోయిన తర్వాత క్రియాయోగం ముందుకు తీసుకురాబడింది.

మీలో ఉన్న దైవ-సామ్రాజ్యం

“మీలో ఉన్న దైవ-సామ్రాజ్యం”లోకి ప్రవేశించడానికి ఏసుక్రీస్తు బోధనలకు మరియు శారీరక రాజ్యాన్ని సరైన రీతిలో పాలించడానికి మానవుడిలో ఉన్న దేవుని ప్రతిబింబమైన రాజోచిత ఆత్మను సరైన రీతిలో పునరుద్ధరించడానికి, ఆత్మ యొక్క దివ్యచైతన్య స్థితులను పూర్తిగా గ్రహించడానికి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన యోగ బోధనల మధ్య ఒక అందమైన సమన్వయము ఉంది. దివ్య-చైతన్యం యొక్క అంతరంగ రాజ్యంలో మానవుడు స్థిరపడినప్పుడు ఆత్మ యొక్క మేల్కొన్న సహజావబోధము పదార్థం, జీవశక్తి మరియు చైతన్యం యొక్క ముసుగులను భేదించి విశ్వహృదయంలోని భగవంతుని ఉనికిని వెలికితీస్తుంది….

రాజయోగం, భగవత్-ఐక్యానికి రాజ మార్గం, మనిషికి తనలో ఉన్న దైవ-సామ్రాజ్యాన్ని వాస్తవికంగా గ్రహించడానికి ఉపకరించే శాస్త్రం. నిజమైన గురువు నుండి దీక్ష సమయంలో పొందబడిన పవిత్రమైన అంతర్ముఖత్వపు యోగ పద్ధతులను అభ్యసించడం ద్వారా, అతీంద్రియ చైతన్యపు స్వర్గ ధామాలకు ప్రవేశ ద్వారాలైన మెదడు మరియు వెనుబాములోని జీవశక్తి మరియు చైతన్యం యొక్క సూక్ష్మ, కారణ కేంద్రాలను మేల్కొల్పడం ద్వారా ఆ రాజ్యాన్ని కనుగొనవచ్చు. అటువంటి జాగృతిని సాధించే వ్యక్తి సర్వవ్యాపి అయిన భగవంతుడిని-తన అనంతమైన స్వభావంలో, తన ఆత్మ యొక్క స్వచ్ఛతలో మరియు మార్పుకు లోనయే భౌతిక రూపాలు మరియు శక్తుల యొక్క భ్రాంతికరమైన వస్త్రాలలో కూడా తెలుసుకుంటాడు.

ఏసు చాలా లోతుగా బోధించాడు, అవి బయటకు సరళంగా కనిపిస్తాయి—చాలా మంది ప్రజలు అర్థం చేసుకున్న దానికంటే చాలా లోతుగా ఉంటాయి. వాటిలో [ఆయన బోధనలలో] యోగ శాస్త్రం మొత్తం ఉంది, ధ్యానం ద్వారా దివ్య సంయోగం యొక్క సర్వోత్కృష్టమైన మార్గం.

ఇతరులతో షేర్ చేయండి