ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని రూపొందించడం

ఒక యోగి ఆత్మకథ రాస్తున్న శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆత్మకథ చదివిన లెక్కలేనంతమంది పాఠకులు, ఆయన వ్యక్తిత్వం నుండి వెలువడినట్లుగానే, ఆ పుస్తకం యొక్క పేజీలలో ఉన్న ఆధ్యాత్మిక పాండిత్యంలో అదే ప్రకాశాన్ని అనుభవించవచ్చునని ధృవీకరించారు.

డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ముద్రణలో మొదటిసారిగా కనిపించినప్పటి నుండి అత్యుత్తమ రచనగా ప్రశంసించబడింది, ఈ పుస్తకం అద్భుతమైన గొప్పతనంతో నిండి ఉన్న జీవిత కథ మాత్రమే కాకుండా, తూర్పు ఆధ్యాత్మిక ఆలోచనల యొక్క ఆకర్షణీయమైన పరిచయాన్ని అందిస్తుంది – ప్రత్యేకించి దేవుడితో ప్రత్యక్ష వ్యక్తిగత ఐక్యత యొక్క ప్రత్యేక శాస్త్రాన్ని వివరిస్తూ – ఇదివరకు కొంతమంది పాశ్చ్యాతులకు మాత్రమే అందుబాటులో ఉన్న జ్ఞాన రాజ్యాన్ని ప్రజలందరికీ అందించింది. నేడు ఒక యోగి ఆత్మకథ ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రామాణిక గ్రంథంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది.

ఒక యోగి ఆత్మకథ వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర

ఈ గ్రంథం రచించబడుతుందని చాలా కాలం క్రితమే భవిష్యవాణి చెప్పబడింది. ఆధునిక కాలంలో యోగపునరుజ్జీవనానికి విశేష కృషి చేసిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు, పందొమ్మిదవ శతాబ్దపు గౌరవనీయ గురువులైన శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు ఇలా ప్రవచించారు:

“నేను పోయిన తరువాత సుమారు యాభై ఏళ్ళకి, పడమటి దేశాల్లో యోగవిద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి వ్రాయడం జరుగుతుంది. యోగవిద్యాసందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని – అంటే, మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని – నెలకొల్పడానికి తోడ్పడుతుందది.”

చాలా సంవత్సరాల తరువాత, లాహిరీ మహాశయుల అత్యున్నత శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ఈ భవిష్యవాణిని శ్రీ యోగానందగారికి తెలియజేశారు. “ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ మరియు ఆయన పవిత్ర జీవితాన్ని గురించి వ్రాయడంలోనూ నీ వంతు కృషి నీవు చేయాలి.”

లాహిరీ మహాశయులు పరమపదించిన సరిగ్గా యాభై సంవత్సరాల తరువాత 1945లో, పరమహంస యోగానందగారు తన ఒక యోగి ఆత్మకథను పూర్తి చేశారు, ఇది తన గురువు ఇచ్చిన రెండు ఆదేశాలను పూర్తిగా నెరవేర్చింది: ఆంగ్లంలో మొదటిసారిగా లాహిరీ మహాశయుల అసాధారణ జీవితాన్ని వివరణాత్మకంగా రూపొందించడం మరియు భారతదేశ ప్రాచీన ఆత్మశాస్త్రాన్ని ప్రపంచ ప్రజలకు పరిచయం చేయడం.

పదిహేనేళ్ళ ప్రేమపూర్వకమైన శ్రమ

ఒక యోగి ఆత్మకథ వ్రాయడం అనే బృహత్తర కార్యముపై పరమహంస యోగానందగారు చాలా సంవత్సరాలు పనిచేశారని, వారి మొదటి మరియు అత్యంత సన్నిహిత శిష్యులలో ఒకరైన శ్రీ దయామాతగారు జ్ఞాపకం చేసుకొన్నారు:

పరమానందంలో దయామాత

“నేను 1931లో వాషింగ్టన్ వచ్చినప్పటికే పరమహంసగారు దానిపై పని చేయడం ప్రారంభించినారు. ఒకసారి నేను ఆయన పఠనమందిరములో కొన్ని కార్యదర్శి విధులను నిర్వహిస్తున్నప్పుడు, ఆయన వ్రాసిన మొదటి అధ్యాయాలలో ఒకదాన్ని చూడగలిగే భాగ్యం నాకు కలిగింది – అది “టైగర్ స్వామి” అధ్యాయం. గురుదేవులు అది ఒక పుస్తకంలోకి చేర్చబడేది కావున దానిని భద్రపరచమని కోరారు. గ్రంథంలోని ఎక్కువ భాగం, తరువాత 1937 మరియు 1945 మధ్య రచించబడింది.”

1935 జూన్ నుండి 1936 అక్టోబర్ వరకు, శ్రీ యోగానందగారు తమ గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్‌గారి చివరి సందర్శన కోసం భారతదేశానికి (యూరప్ మరియు పాలస్తీనా మీదుగా) తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన, పుస్తకంలో చిరస్మరణీయముగా ఉండేలా వివరించబోయే తనకు తెలిసిన కొంతమంది సాధువులు మరియు ఋషులకు చెందిన కథలు మరియు వారి జీవితాలకు సంబంధించిన ఎంతో యధార్థమైన సమాచారాన్ని ఆత్మకథ కోసం సేకరించారు.

“లాహిరీ మహాశయుల జీవితాన్ని నేను వ్రాయవలసిందిగా శ్రీయుక్తేశ్వర్ గారు చేసిన అభ్యర్థనను నేనెప్పుడూ మరచిపోలేదు.” ఆ తర్వాత ఆయన ఇలా వ్రాశారు. “నేను భారతదేశంలో ఉన్న సమయంలో యోగావతారుల ప్రత్యక్ష శిష్యులను మరియు బంధువులను సంప్రదించడం కోసం నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను. వారి సంభాషణలను భారీ వివరణములలో సంలేఖనం చేస్తూ, నేను వాస్తవాలు మరియు తేదీలను ధృవీకరించుకున్నాను, ఛాయాచిత్రాలు, పాత లేఖలు మరియు పత్రాలను సేకరించాను.”

1936 చివరిలో ఆయన అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత, దక్షిణ కాలిఫోర్నియా తీరంలోని ఎన్సినీటస్‌లో ఆయన లేనప్పుడు ఆయన కోసం నిర్మించిన ఆశ్రమంలో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించిన గ్రంథాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టడానికి ఇది అనువైన ప్రదేశంగా నిరూపించబడింది.

శ్రీ దయామాత ఇలా వివరించారు: “ఆ ప్రశాంతమైన సముద్రతీర ఆశ్రమంలో గడిపిన రోజులు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆయనకు చాలా ఇతర బాధ్యతలు మరియు ఒప్పందాలు ఉండడం వల్ల, ఆయన ప్రతిరోజూ ఆత్మకథపై పని చేయలేకపోయేవారు; కానీ సాధారణంగా సాయంత్రాలను దాని కోసం ఆయన కేటాయించేవారు మరియు ఎప్పుడు ఖాళీ సమయమున్నా దాని కొరకే వినియోగించేవారు.”

1939 లేదా ’40 మొదటి నుండి, ఆయన తన పూర్తి సమయాన్ని పుస్తకంపై దృష్టి పెట్టడానికి వినియోగించగలిగారు మరియు దాని కోసం పూర్తి సమయం – తెల్లవారుజాము నుండి తెల్లవారుజాము వరకు! మా ఈ చిన్న శిష్యబృందం – తారా మాత; నా సోదరి ఆనందమాత; శ్రద్ధామాత మరియు నేను – ఆయనకు సహాయంచేయడానికి అక్కడ ఉండేవాళ్ళము. ప్రతి భాగాన్ని టైప్ చేసిన తరువాత గురుదేవులు దానిని, తనకు సంపాదకురాలిగా పని చేసిన తారామాతకు ఇచ్చేవారు.

“ఎంత చిరస్మరణీయమైన జ్ఞాపకాలు! ఆయన వ్రాస్తుండగా తాను సంలేఖనం చేస్తున్న పవిత్ర అనుభవాల జ్ఞాపకాలలో తిరిగి జీవించేవారు. సాధువులు మరియు గొప్ప గురువుల సహవాసంలో మరియు దివ్య వ్యక్తిగత సాక్షాత్కారంలో సిద్ధించు ఆనందాన్ని మరియు దివ్యానుభవాలను పంచుకోవడమే ఆయన దివ్య ఉద్దేశం. తరచుగా ఆయన కొంతకాలం విరామం ఇచ్చేవారు, ఆయన దృష్టి పైకి తిరిగి ఉండేది మరియు ఆయన శరీరము నిశ్చలముగా, భగవంతునిలో ఐక్యమై సమాధి స్థితిలో నిమగ్నమయ్యేవారు. గది అంతా దివ్యప్రేమ యొక్క మహత్తరమైన ప్రకాశంతో నిండిపోయేది. మాలాంటి శిష్యులు, అలాంటి సమయాల్లో కేవలం అక్కడ ఉండటంతోనే ఉన్నత చైతన్య స్థితికి ఎదిగేవాళ్ళము.

“చివరికి, 1945లో, పుస్తకం పూర్తైన సంతోషకరమైన రోజు వచ్చింది. పరమహంసగారు చివరి పదాలను వ్రాశారు, ‘ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసార మిచ్చావుకాదయ్య!’ అప్పుడు తన కలమును పక్కన పెట్టి హర్షిస్తూ ఇలా అన్నారు:

“అంతా చేశాను; ఇది పూర్తయ్యింది. ఈ పుస్తకం లక్షలాది మంది జీవితాలను మారుస్తుంది. నేను వెళ్ళిపోయిన తరువాత ఇది నా సందేశవాహకం అవుతుంది.”

ఇక ప్రచురణకర్తను వెదకడం శ్రీ తారామాతగారి బాధ్యత అయ్యింది. 1924లో శాన్ ఫ్రాన్సిస్కోలో వరుసగా ఉపన్యాసాలు మరియు తరగతులు నిర్వహిస్తుండగా పరమహంస యోగానందగారు తారామాతను కలిశారు. అరుదైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి కలిగిన ఆమె, వారి అత్యంత అధునాతన శిష్యుల ఒక చిన్న బృందంలో ఒకరుగా అయ్యారు. ఆయనకు ఆమె సంపాదకీయ సామర్థ్యాలపై ఎంతో గౌరవం ఉండేది మరియు ఆయన అప్పటివరకు కలుసుకున్న వారందరిలోనూ ఆమె చాలా తెలివైనదని అనేవారు.

భారతదేశ పవిత్ర గ్రంథాల గురించి ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని మరియు అవగాహనను ఆయన మెచ్చుకునేవారు మరియు ఒక సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారు: “నా గొప్ప గురువు శ్రీయుక్తేశ్వర్ గారిని మినహాయించి, భారతీయ తత్వశాస్త్రం గురించి చర్చించి, ఆనందించినట్లుగా మరెవరితోనూ లేదు.”

తారామాత వ్రాత ప్రతిని న్యూయార్క్ నగరానికి తీసుకెళ్ళారు. కాని ప్రచురణకర్తను వెదకడం అంత తేలికైన పని కాదు. తరచుగా గమనించినట్లుగా, ఒక గొప్ప రచన యొక్క నిజమైన ఔన్నత్యాన్ని మొదట్లో సాధారణ చిత్తం కలిగినవారు గుర్తించలేరు. పదార్థం, శక్తి మరియు ఆలోచన యొక్క సూక్ష్మ ఐక్యతపై పెరుగుతున్న అవగాహనతో కొత్తగా జన్మించిన పరమాణు యుగంలో ఉన్నప్పటికీ, ఆనాటి ప్రచురణకర్తలు “హిమాలయాలలో మహాభవన సృష్టి” మరియు “రెండు శరీరాలున్న సాధువు” వంటి అధ్యాయాలకు సిద్ధంగా లేరు.

ప్రచురణ సంస్థల కొరకు తారామాత వెతుకుతున్నప్పుడు చాలా తక్కువ గృహోపకరణాలు మరియు హీటర్ లేని చల్లటి నీరు మాత్రమే ఉన్న ఫ్లాట్‌లో ఒక సంవత్సరంపాటు నివసించారు. చివరికి ఆమె విజయ వార్తలతో ఒక టెలిగ్రామ్ వార్త పంపగలిగారు. గౌరవనీయ న్యూయార్క్ ప్రచురణకర్తలయిన ఫిలాసఫికల్ లైబ్రరీ, ఆత్మకథను ప్రచురించడానికి అంగీకరించింది. “ఈ గ్రంథం కోసం [ఆమె] ఏమి చేశారో నేను మాటలలో వర్ణించలేను…” అని శ్రీ యోగానందగారు అన్నారు. “కాని ఆమె సహాయం లేని పక్షంలో, ఈ గ్రంథం ఎప్పటికీ కొనసాగేది కాదు.”

ఒక అద్భుతమైన స్వాగతం

ఈ గ్రంథాన్ని పాఠకులు మరియు ప్రపంచ పత్రికా రంగం ప్రశంసనీయ పొగడ్తలతో ఆదరించారు.

“యోగం మీద ఇటువంటి అద్భుతమైన వివరణ ఆంగ్లంలో లేదా మరే ఏ ఇతర భాషలోనూ ఇంతకు ముందెప్పుడూ రచించబడలేదు,” అని కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ తన రివ్యూ ఆఫ్ రిలిజియన్స్‌లో వ్రాసింది.

న్యూయార్క్ టైమ్స్ దీన్ని “ఇది ఒక అసాధారణమైన కథ”గా ప్రకటించింది.
“యోగానందగారి పుస్తకం శరీరం కంటే ఆత్మకు సంబంధించిన కథ…ఇది ఒక అధ్యాత్మిక జీవన విధానం గురించి మనోహరంగా మరియు స్పష్టంగా వివరించబడిన అధ్యయనం, తూర్పు దేశాల కోమలమైన శైలిలో నేర్పుగా వర్ణించబడింది.” అని న్యూస్‌వీక్ నివేదించింది.

రెండవ సంచిక త్వరగా తయారు చేయబడింది మరియు 1951లో మూడవది. గ్రంథంలోని కొన్ని భాగాలను సవరించడం మరియు నవీకరించడంతో పాటు ప్రస్తుతము లేని సంస్థాగత కార్యకలాపాలను మరియు ప్రణాళికలను వివరించే కొన్ని ప్రకరణలను తొలగించడం జరిగింది. పరమహంస యోగానందగారు చివరి అధ్యాయాన్ని చేర్చారు — పుస్తకంలోని దీర్ఘమైన వాటిలో ఒకటి — 1940–1951 మధ్య సంవత్సరాలను వివరిస్తుంది.

క్రొత్త అధ్యాయానికి ఒక పాద పీఠికలో ఆయన ఇలా వ్రాశారు, “ఈ పుస్తకం మూడవ సంచికలో (1951), 49వ అధ్యాయంలో చాలా క్రొత్త విషయాలు చేర్చబడ్డాయి. అనేకమంది మొదటి రెండు సంచిక పాఠకులు చేసిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా, ఈ అధ్యాయంలో భారతదేశం, యోగం మరియు వేద తత్వశాస్త్రం గురించి వివిధ ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చాను.”

ఈ సంచిక ప్రచురణకర్త గమనికలో వివరించిన విధంగా పరమహంస యోగానందగారు చేసిన అదనపు సవరణలు ఏడవ సంచికలో (1956) చేర్చబడ్డాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రస్తుత సంచికలన్నిటిలోను, పుస్తకం చివరి అధ్యాయం కొరకు యోగానందగారి అభిలాషలన్నీ చేర్చబడ్డాయి.

“నేను అమితముగా చలించిపోయాను” శ్రీ యోగానందగారు 1951 సంచికకు, రచయిత గమనికలో ఇలా వ్రాశారు, “వేలాది మంది పాఠకుల నుండి వచ్చిన ఉత్తరాలు స్వీకరించి. వారి వ్యాఖ్యలు, మరియు పుస్తకం చాలా భాషలలోకి అనువదించబడిందనే వాస్తవాన్ని, ఈ పేజీలలో పాశ్చాత్యులు ఈ కింది ప్రశ్నకు ధృవీకరించే సమాధానం కనుగొన్నారని నన్ను నమ్మడానికి ప్రోత్సహిస్తుంది: ‘ప్రాచీన యోగశాస్త్రానికి ఆధునిక మానవుడి జీవితంలో ఏదైనా విలువైన స్థానం ఉందా?’”

కొనసాగుతున్న ఒక వారసత్వం

సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ “వేలాది మంది పాఠకులు” లక్షలుగా మారారు, మరియు ఒక యోగి ఆత్మకథ యొక్క శాశ్వతమైన మరియు విశ్వజనీనమైన ఆకర్షణ స్పష్టంగా కనబడుతోంది. ఇది మొదటిసారి ప్రచురించబడిన అరవై సంవత్సరాల తరువాత కూడా ఎక్కువగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన పుస్తకాల జాబితాలో ఇప్పటికీ కనిపిస్తుంది – అరుదైన ఘటన! అనేక అనువాదాలలో లభిస్తూ, ఇది ఇప్పుడు తూర్పు తత్వశాత్రం మరియు మతం నుండి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం, చరిత్ర మరియు వ్యాపార నిర్వహణ వరకు ఉన్న పాఠ్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో వినియోగించబడుతోంది. లాహిరీ మహాశయులు ఒక శతాబ్దం క్రితం తెలిపినట్లుగా, యోగసందేశం మరియు దాని పురాతన ధ్యాన సంప్రదాయం వాస్తవానికి ప్రపంచమంతా వ్యాపించింది.
పుస్తకం యొక్క చివరి అధ్యాయంలో, పరమహంస యోగానందగారు ప్రపంచంలోని అన్ని మతాల సాధువులు మరియు ఋషులు యుగయుగాలుగా ధృవీకరించిన ప్రస్ఫుటమైన హామీ గురించి వ్రాశారు:

“దేవుడంటే ప్రేమ; సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకోగలదు. ఆ చిన్న ఆలోచన పాండిత్యమండితమైన తర్కవితర్కాలకన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదూ? సత్యగర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువూ దివ్యమైన విశ్వప్రణాళిక ఒకటి ఉంటుందనీ అది సుందరమైనదనీ ఆనందమయమైనదనీ ధ్రువపరుస్తాడు.”

ఒక యోగి ఆత్మకథ దాని రెండవ అర్థ శతాబ్దంలోకి కొనసాగుతున్నందున, ఈ స్ఫూర్తివంతమైన కార్యములోని పాఠకులందరికీ మా ఆకాంక్ష — మొదటిసారిగా దీనిని చదువుతున్నవారు, అలాగే జీవితమార్గంలో దీనిని చిరకాల సహవాసిగా మార్చుకున్నవారు — వారి స్వీయ ఆత్మలు, జీవిత రహస్యాల యొక్క హృదయంలో ఉన్న అతీంద్రియ సత్యంపై లోతైన విశ్వాసానికి తెరతీస్తుందని కనుగొంటారు.

ఇతరులతో షేర్ చేయండి