శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు
నిజమైన సఫలత

క్రియాశీలకమైన సంకల్ప శక్తిని ఉపయోగించుట
మీరు అనుకుంటే తప్ప, ఏదీ అసాధ్యం కాదు.

ఒక మర్త్య జీవిగా మీరు పరిమితులు కలవారు, కాని దేవుని బిడ్డగా మీకు పరిమితులు లేవు….దేవునిపై మీ దృష్టిని కేంద్రీకరించండి ఏ దిశలోనైనా ఉపయోగించగలిగేట్లుగా, మీకు కావలసినంత శక్తిని మీరు కలిగి ఉంటారు.
సంకల్పం అనేది మీలో ఉన్న భగవంతుని ప్రతిరూపానికి సాధనం. ప్రకృతి శక్తులన్నింటినీ నియంత్రించే అపరిమితమైన ఆయన శక్తి సంకల్పంలో ఉంది. మీరు ఆయన ప్రతిరూపంగా తయారు చేయబడినందున, మీరు కోరుకున్నదంతా సంభవమయ్యేట్లుగా చేసే శక్తి మీకు కూడా ఉంది.






వైఫల్యంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం
సఫలతా బీజాలు నాటడానికి వైఫల్యాల కాలమే సరైన సమయం. పరిస్థితుల లాఠీ మిమ్మల్ని గాయపరచవచ్చు, అయినప్పటికీ మీ తల నిటారుగా ఉంచండి. మీరు ఎన్నిసార్లు విఫలమైనా, ఎప్పుడూ మరోసారి ప్రయత్నించండి. మీరు ఇకపై పోరాడలేరని మీరు అనుకున్నప్పుడు లేదా మీరు ఇప్పటికే మీ వంతు కృషి చేశారని మీరు అనుకున్నప్పుడు కూడా మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే వరకు పోరాడండి.

సఫలత యొక్క మనస్తత్వశాస్త్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. “అసలు వైఫల్యం గురించి మాట్లాడకండి” అని కొందరు సలహా ఇస్తారు. కాని అది మాత్రమే సరిపోదు. మొదటిగా, మీ వైఫల్యం మరియు దాని కారణాలను విశ్లేషించండి, అనుభవం నుండి ప్రయోజనం పొందండి, ఆపై దాని గురించిన ఆలోచన మొత్తాన్నీ తొలగించండి. ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ, తన లోపల ఓడిపోకుండా నిరంతరం పరిశ్రమించే వ్యక్తియే నిజమైన విజేత.

జీవితం చీకటిగా ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, అవకాశాలు ఉపయోగించుకోకుండా జారిపోవచ్చు, కాని మీలో మీరు ఎప్పుడూ ఇలా అనుకోకండి: “నా పని అయిపోయింది. దేవుడు నన్ను విడిచిపెట్టాడు.” అలాంటి వ్యక్తి కోసం ఎవరు మాత్రం ఏమి చేయగలరు? మీ కుటుంబం మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు; అదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టినట్లు కనపడవచ్చు; మానవ మరియు ప్రకృతి యొక్క అన్ని శక్తులు మీకు వ్యతిరేకంగా సమకూర్చబడి ఉండవచ్చు; కానీ మీలో ఉన్న దివ్య ప్రేరణ అనే లక్షణంతో, మీరు మీ స్వయంకృత అపరాధాల ద్వారా సృష్టించబడిన విధి యొక్క ప్రతి దండయాత్రనూ ఓడించవచ్చు మరియు దివ్యధామంలోనికి విజయవంతంగా సాగవచ్చు.

మీరు ఎన్నిసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉండండి. ఏమి జరిగినా, “భూమి బద్దలయిపోవచ్చు, కాని నేను చేయగలిగినంత బాగా చేస్తూనే ఉంటాను” అని మీరు శాశ్వతంగా సంకల్పించినట్లయితే, మీరు క్రియాశీలక సంకల్పాన్ని ఉపయోగిస్తున్నారు, మీరు విజయం సాధిస్తారు. ఆ చైతన్యవంతమైన సంకల్పమే ఒక మనిషిని ధనవంతుడిని చేస్తుంది, మరొక వ్యక్తిని బలవంతునిగా చేస్తుంది మరియు మరొక వ్యక్తిని సాధువుగా చేస్తుంది.
ఏకాగ్రత - విజయానికి కీలకం
జీవితంలో చాలా వైఫల్యాలకు మూల కారణం ఏకాగ్రతా లోపమే. శ్రద్ధ, ఒక శోధన దీపం వంటిది; దాని కాంతి పుంజం విస్తారమైన ప్రదేశంలో వ్యాపించినప్పుడు, ఒక నిర్దిష్ట వస్తువుపై కేంద్రీకరణ శక్తి బలహీనం అవుతుంది, కాని ఒక సమయంలో ఒక విషయంపై దృష్టి పెడితే అది శక్తివంతంగా మారుతుంది. మహాపురుషులు ఏకాగ్రత గలవారు. వారు తమ మనస్సును ఒకసారి ఒకదానిపై మాత్రమే ఉంచుతారు.

శాస్త్రీయమైన ఏకాగ్రతా పద్ధతిని (యోగదా సత్సంగ పాఠాలలో బోధిస్తారు) తెలుసుకోవాలి, దీని ద్వారా తనకు పరధ్యానం కలిగించే విషయాల నుండి తన ధ్యాసను వేరుచేసి ఒక సమయంలో ఒకే విషయంపై అతను కేంద్రీకరించవచ్చు. ఏకాగ్రతా శక్తి ద్వారా మనిషి తాను కోరుకున్న దానిని సాధించడానికి చెప్పనలవికాని మనోశక్తిని ఉపయోగించగలడు మరియు వైఫల్యం ప్రవేశించే అన్ని ద్వారాలను అతను పరిరక్షించగలడు.

మనం మనకు సమీపంలోని సమస్య లేదా కర్తవ్యాన్ని ఏకాగ్రతా శక్తితో స్వీకరించాలి మరియు దానిని పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఇదే మన జీవిత తత్వం కావాలి.

చాలా మంది ప్రతి పనిని నిరాసక్తంగా చేస్తారు. వారు తమ దృష్టిలో పదో వంతు మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే వారికి విజయం సాధించే శక్తి ఉండదు….అన్నిటినీ అవధానతా శక్తితో చేయండి. ఆ శక్తి యొక్క పూర్తి బలాన్ని ధ్యానం ద్వారా పొందవచ్చు. మీరు భగవంతుని యొక్క ఆ కేంద్రీకరణ శక్తిని ఉపయోగించినప్పుడు, మీరు దానిని ఏ విషయం పైన అయినా ఉంచవచ్చు, సఫలత సాధించవచ్చు.
సృజనాత్మకత






సర్వతోముఖ సఫలతను సృష్టించడం

గొప్ప బోధకులు మిమ్మల్ని నిర్లక్ష్యంగా ఉండమని ఎప్పటికీ బోధించరు; వారు మీకు సమతుల్యంగా ఉండాలని బోధిస్తారు. శరీరాన్ని పోషించడానికి మరియు వస్త్రాలు ధరించడానికి మీరు పని చేయాలనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని మీరు ఒక విధిని మరొక విధికి విరుద్ధంగా ఉండటానికి అనుమతించినట్లయితే, అది నిజమైన విధి కాదు. వేలాది మంది వ్యాపారవేత్తలు సంపదను సృష్టించడంలో చాలా తీరిక లేకుండా ఉన్నారు, వారు చాలా గుండె జబ్బులను కూడా సృష్టిస్తున్నారని మరచిపోతున్నారు! సంపద పట్ల కర్తవ్యం ఆరోగ్యం పట్ల మీ కర్తవ్యాన్ని మరచిపోయేలా చేస్తే, అది కర్తవ్యం కాదు. ప్రతి ఒక్కరు సంతులితంగా అభివృద్ధి చెందాలి. వేరుసెనగంత మెదడును కలిగి ఉంటే, అద్భుతమైన శరీరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. మనస్సు కూడా అభివృద్ధి చెందాలి. మీకు అద్భుతమైన ఆరోగ్యం, సంపద మరియు తెలివి ఉండి కూడా మీరు సంతోషంగా లేకుంటే, మీరు జీవితాన్ని విజయవంతం చేయనట్లే. “నేను సంతోషంగా ఉన్నాను, నా ఆనందాన్ని నా నుండి ఎవరూ వేరు చేయలేరు” అని మీరు నిజాయితీగా చెప్పగలిగినప్పుడు మీరు ఒక రాజు — మీలో దేవుని ప్రతిరూపాన్ని మీరు కనుగొన్నట్లే.

సఫలత యొక్క మరొక అర్హత ఏమిటంటే, సంతులితము మరియు ప్రయోజనకరమైన ఫలితాలను మనకు మాత్రమే తెచ్చుకోవడం కాకుండా, ఆ ప్రయోజనాలను ఇతరులతో కూడా పంచుకోగలుగుతాము.
జీవితం ప్రధానంగా సేవ అయ్యుండాలి. ఆ ఆదర్శం లేకపోతే, దేవుడు మీకు ఇచ్చిన తెలివితేటలు వాటి లక్ష్యాన్ని చేరుకోలేవు. సేవలో ఉన్నప్పుడు మీరు అల్పత్వాన్ని మరచిపోతారు, మీరు పరమాత్మ యొక్క బ్రహ్మాండమైన తత్వాన్ని అనుభవిస్తారు. ప్రాణాధారమైన సూర్య కిరణాలు అందరినీ పోషించినట్లే, మీరు నిరుపేదల, అనాధల హృదయాలలో ఆశా కిరణాలను పంచాలి, నిరుత్సాహానికి గురైన వారి హృదయాలలో ధైర్యాన్ని నింపాలి, తాము విఫలమయ్యాము అనుకున్న వారి హృదయాలలో కొత్త శక్తిని వెలిగించాలి. జీవితం ఒక సంతోషకరమైన కర్తవ్యం మరియు అదే సమయంలో గడిచిపోయే కల అని మీరు గ్రహించినప్పుడు, ఇతరులకు దయ మరియు శాంతిని అందించడం ద్వారా వారిని సంతోషపెట్టడంలో మీరు ఆనందంతో నిండినప్పుడు, దేవుని దృష్టిలో మీ జీవితం సఫలమైనట్లు.
సమృద్ధి మరియు శ్రేయస్సు
కేవలం తన అభివృద్ధి మాత్రమే కోరుకునే వారు చివరికి పేదలుగా మారడం లేదా మానసిక అశాంతికి గురవడం జరుగుతుంది; అయితే మొత్తం ప్రపంచాన్ని తమ నివాసంగా భావించే వారు, సమూహం లేదా ప్రపంచ అభివృద్ధి కోసం నిజంగా శ్రద్ధ వహించి పని చేసే వారు… ధర్మబద్ధంగా తమకు చెందిన వ్యక్తిగత సంపదను కనుగొంటారు. ఇది ఖచ్చితమైన రహస్య నియమం.

కేవలం స్వల్పమైనప్పటికీ, ఇతరుల సహాయార్ధం ప్రతి రోజు కొంత మేలు చేయండి, మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే మనుషులను ప్రేమించాలి. వారు ఆయన సంతానం. ఆర్తులకు భౌతిక అవసరాలను, దుఃఖితులకు మానసిక సాంత్వన, భయపడేవారికి ధైర్యం, మరియు బలహీనులకు నైతిక మద్దతును, దివ్య స్నేహాన్ని ఇవ్వడం ద్వారా మీరు సహాయంగా ఉండవచ్చు. మీరు ఇతరులకు భగవంతుని పట్ల ఆసక్తి పెంచినప్పుడు మీరు మంచితనాన్ని నాటుతారు మరియు వారిలో దేవుని పట్ల ఎక్కువ ప్రేమను, ఆయనపై గాఢమైన విశ్వాసాన్ని పెంపొందిస్తారు.

మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు, భౌతిక సంపదలన్నీ వదిలిపెడతాయి; కాని మీరు చేసిన ప్రతి మంచి మీతో పాటు వెళ్తుంది. పిసినారితనంతో జీవించే ధనవంతులు మరియు ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయని స్వార్థపరులు వారి తదుపరి జీవితంలో సంపదను ఆకర్షించరు. కాని తమకు ఉన్నది ఎక్కువైనా లేక తక్కువైనా దానం చేసేవారు మరియు ఇతరులతో పంచుకునే వారు సంపదను ఆకర్షిస్తారు. అది దేవుని నియమం.

దివ్య సమృద్ధిని, సేద తీర్చే శక్తివంతమైన వర్షంగా భావించండి; మీ చేతిలో ఉన్న పాత్ర ప్రకారమే దానిని మీరు పొందుతారు. మీరు చిన్న కప్పును పట్టుకుంటే, మీరు ఆ పరిమాణం మాత్రమే అందుకుంటారు. మీరు ఒక గిన్నెను పట్టుకుంటే, అది నిండుతుంది. మీరు దివ్య సమృద్ధి కోసం ఎలాంటి పాత్రను కలిగి ఉన్నారు? బహుశా మీ పాత్ర లోపాలు కలదై ఉండవచ్చు; అలా అయితే, అన్ని భయాలు, ద్వేషాలు, సందేహాలు మరియు అసూయలను తొలగించడం ద్వారా అది మరమ్మత్తు చేయబడాలి, ఆపై శాంతి, ప్రశాంతత, భక్తి మరియు ప్రేమ యొక్క పవిత్ర జలాల ద్వారా శుద్ధి చేయబడాలి. సేవ మరియు దాతృత్వం నియమాలను దివ్య సమృద్ధి అనుసరిస్తుంది. ఇచ్చి ఆపైన స్వీకరించండి. మీరు కలిగి ఉన్న ఉత్తమమైన వాటిని ప్రపంచానికి ఇవ్వండి, ఉత్తమమైనది మీ వద్దకు తిరిగి వస్తుంది.
విజయం కోసం ప్రతిజ్ఞలు
ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు
నాకు అవసరమైన సమయంలో నాకు అవసరమైన వాటిని తీసుకురావడానికి సర్వవ్యాపకమైన దయాశక్తిపై పరిపూర్ణ విశ్వాసంతో నేను ముందుకు వెళ్తాను.

నాలో అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. కొన్ని విజయాలైనా లేకుండా నేను మరణించను. నేను దైవాంశ గల మానవుడిని, వివేకవంతమైన జీవిని. నా ఆత్మ యొక్క క్రియాశీల మూలమైన పరమాత్మ యొక్క శక్తిని నేను. నేను వ్యాపార ప్రపంచంలో, ఆలోచన ప్రపంచంలో, జ్ఞాన ప్రపంచంలో ద్యోతకాలను సృష్టిస్తాను. నేను మరియు నా తండ్రి ఒక్కటే. నా సృజనాత్మక తండ్రి వలె, నేను కూడా కోరుకునే దేనినైనా సృష్టించగలను.
దివ్య సమృద్ధి కోసం ప్రతిజ్ఞలు

మరింత చదవడానికి
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన సఫలతా నియమం
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన To Be Victorious in Life
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్, "సఫలత కోసం అవధానతా శక్తిని కేంద్రీకరించడం"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన Journey to Self-realization, "Business, Balance, and Inner Peace: Restoring Equilibrium to the Work Week"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన మానవుడి నిత్యాన్వేషణ, "చొరవచేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోడం"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన దివ్య ప్రణయం, "మనస్సు: అనంతమైన శక్తికి ఉత్పత్తి స్థానం"