మరణాన్ని మరియు నష్టాన్ని అర్థం చేసుకోవడం

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల సారాంశం

మరణం సమయంలో శరీరాన్ని విడిచిపెడుతున్న ఆత్మ.సాధారణ మానవుడు మరణాన్ని భయము, విచారముతో చూస్తున్నప్పటికీ, ముందు గతించినవారు దాన్ని శాంతి, స్వేచ్ఛల యొక్క అద్భుతమైన అనుభవంగా తెలుసుకున్నారు.

మరణ సమయంలో, మీరు భౌతిక శరీరం యొక్క అన్ని పరిమితులను మరచిపోయి మీరు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో గ్రహిస్తారు. మొదటి కొన్ని క్షణాల పాటు భీతి భావన కలుగుతుంది — చైతన్యానికి పరిచితం లేని, ఏదో తెలియని దాని గురించి భయం. కానీ దాని తరువాత: ఆత్మకు ఉల్లాసకరమైన ఉపశమనం మరియు స్వేచ్ఛలతో కూడిన ఒక గొప్ప అనభవం కలుగుతుంది. ఈ మర్త్యశరీరంగా కాక మీరు వేరుగా ఉన్నారని తెలుసుకుంటారు.

మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోతారు, కాబట్టి మరణానికి భయపడటం వల్ల ప్రయోజనం లేదు. నిద్రలో మీ శరీరం చేతనను కోల్పోయే అవకాశాన్ని మీరు దయనీయంగా భావించరు; ఎదురుచూసే స్వేచ్ఛా స్థితిగా మీరు నిద్రను స్వాగతిస్తారు. మరణం కూడా అంతే; ఇది విశ్రాంతి స్థితి, ఈ జీవితం నుండి వచ్చే పింఛను. భయపడాల్సిన పనిలేదు. మరణం వచ్చినప్పుడు, దానిని చూసి నవ్వండి. మరణం అనేది ఒక అనుభవం మాత్రమే, దీని ద్వారా మీరు గొప్ప పాఠం నేర్చుకోవాలి: మీకు చావు లేదు..

మన నిజమైన అస్తిత్వం, ఆత్మ, మరణంలేనిది. చావు అని పిలువబడే ఆ మార్పులో మనం కొద్దిసేపు నిద్రపోవచ్చు, కానీ మనని (ఆత్మను) ఎప్పటికీ నాశనం చేయలేము. మనమున్న ఈ అస్తిత్వం, శాశ్వతమైనది. అల ఒడ్డుకు వస్తుంది, తరువాత తిరిగి సముద్రంలోకి వెళుతుంది; అది పోలేదు. అది సముద్రంలో లీనమవుతుంది, లేదా మరొక తరంగం రూపంలో తిరిగి వస్తుంది. ఈ శరీరం వచ్చింది, ఇది అదృశ్యమవుతుంది; కానీ దానిలోని ఆత్మ సారం ఎన్నటికీ అస్తిత్వం కోల్పోదు. ఆ శాశ్వత చైతన్యాన్ని ఏదీ అంతం చేయజాలదు.

శాస్త్రవిజ్ఞానము నిరూపించినట్లుగా ఒక పదార్థ కణం గాని లేదా ఒక శక్తి తరంగం గాని నాశనరహితమైనది; మనిషి యొక్క ఆత్మ లేదా ఆధ్యాత్మిక సారం కూడా నాశనరహితమైనది. దేహం మార్పుకు లోనవుతుంది; ఆత్మ మారుతున్న అనుభవాలకు లోనవుతుంది. సమూలమైన మార్పులను మరణం అంటారు, కానీ మరణం లేదా రూపంలో మార్పు ఆత్మ సారాన్ని మార్చదు లేదా నాశనం చేయదు.

శరీరం ఒక వస్త్రం మాత్రమే. ఈ జన్మలో మీరు ఎన్నిసార్లు బట్టలు మార్చుకున్నారు, అయినా ఆ కారణంగా మీరు మారినట్లు చెప్పరు కదా. అదేవిధంగా, మీరు మరణంలో ఈ శారీరక దుస్తులను విడిచిపెట్టినప్పుడూ మీరు మారరు. మీరు కేవలం అదే అమర ఆత్మ, దేవుని సంతతి.

“మరణము” అనే పదము గొప్ప అపోహ, ఎందుకంటే మరణం లేదు; మీరు జీవితంలో అలసిపోయినప్పుడు, మీరు మానవశరీరము అనే పైచొక్కాను తీసివేసి సూక్ష్మ లోకానికి తిరిగి వెళతారు.

భగవద్గీత ఆత్మ యొక్క అమరత్వాన్ని గురించి చక్కగా మరియు ఉపశాంతి కలిగేలా నిర్వచించినది:

ఆత్మ పుట్టుక లేనిది; మరియు మరణం లేనిది;
ఆది, అంతము లేనిది. ఆది అంత్యాలు స్వప్న భావనలు!
జన్మ రహితముగా, చావు లేకుండా, మార్పు లేకుండా ఆత్మ నిత్యమైనదిగా ఉంటుంది ;
దాని (ఆత్మ) నివాసం నశించిపోయిందని అనిపించినప్పటికీ, మృత్యువు దానిని తాకలేదు.

మరణం ముగింపు కాదు: మీ ప్రస్తుత శరీరం మరియు పరిసరాలు తమ ప్రయోజనాన్ని నెరవేర్చాయని కర్మ నియమం నిర్ధారించినప్పుడు, లేక మీరు పూర్తిగా నిస్తేజమైనప్పుడు లేదా భరించలేని శారీరక బాధతో కృశించిపోయినప్పుడు మీకు ఇవ్వబడిన తాత్కాలిక విముక్తి. మరణమనేది, ఎవరైతే యాతన పడుతున్నారో, వారి బాధాతప్త శారీరక యాతనల ను౦డి శాంతి, సౌఖ్యాలలోకి మేలుకొలిపే పునరుత్థానం. వయస్సు చెల్లినవారికి, ఇది జీవితమంతా సంవత్సరాల తరబడి కష్టించడం వలన లభించిన పింఛను. అందరికీ, ఇది స్వాగతించతగిన విశ్రాంతి.

ఈ ప్రపంచం మృత్యువుతో నిండివుందని, మీ శరీర౦ కూడా త్యజి౦చబడాలనీ మీరు తలపోసినప్పుడు, దేవుని ప్రణాళిక ఎ౦తో క్రూరమైనదిగా అనిపిస్తు౦ది. అప్పుడు ఆయన దయగలవాడని మీరు ఊహించలేరు.

కానీ మీరు జ్ఞాన నేత్రంతో మరణం యొక్క ప్రక్రియను చూసినప్పుడు, ఇది కేవలం భగవంతుని యొక్క ఆలోచనగా మార్పు అనే పీడకల నుండి పరమాత్మునిలో మళ్ళీ ఆనందకరమైన కలయికగా మీరు గ్రహిస్తారు. సాధువులకు, పాపులకు ఒకలాగే మరణ సమయంలో, వారి యోగ్యతను బట్టి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. దేవుని స్వప్న సూక్ష్మలోకంలో — మరణం పిదప ఆత్మలు వెళ్ళే లోకంలో — భూతలంలో అవి ఎన్నడూ చవిచూడని స్వేచ్ఛను ఆత్మలు అనుభవిస్తాయి.

కాబట్టి మృత్యువు అనే మాయ గుండా సాగుతున్న వ్యక్తిపై జాలి పడవద్దు, ఎందుకంటే కొద్దిసేపటిలో అతను విముక్తి నొందుతాడు. ఆ మాయ నుండి బయటపడిన తర్వాత, చావు అంత చెడ్డది కాదని అతను గ్రహిస్తాడు. తన మరణ౦ కేవల౦ ఒక కల మాత్రమేనని గ్రహి౦చిన అతను, ఇప్పుడు ఏ అగ్ని తనను కాల్చివేయజాలదని, నీరు తనను ముంచలేదని ఆనందిస్తాడు; అతను స్వేచ్ఛగా ఇంకా సురక్షితంగా ఉంటాడు.

మరణిస్తున్న మనిషి యొక్క చైతన్యం అకస్మాత్తుగా శరీర బరువు నుండి, శ్వాస తీసుకోవాల్సిన ఆవశ్యకత నుండి మరియు అన్ని శారీరక బాధలు నుండి ఉపశమనం పొందుతుంది. చాలా ప్రశాంతమైన, మసక వెలుతురు ఉన్న సొరంగం గుండా ఎగురుతున్న అనుభూతిని ఆత్మ అనుభవమొందుతుంది. అప్పుడు ఆత్మ, భౌతిక శరీరంలో అనుభవించే గాఢమైన నిద్ర కంటే పది లక్షల రెట్లు గాఢమైన మరియు మరింత ఆహ్లాదకరమైన విస్మృతి కలిగించే నిద్రావస్థకి జారిపోతుంది….

భూమిపై ఉన్నప్పుడు వివిధ వ్యక్తులు తమ జీవన విధానాలకు అనుగుణంగానే వారి మరణానంతర స్థితిని వివిధ రకాలుగా అనుభవిస్తారు. వేర్వేరు వ్యక్తులు వారి నిద్రా వ్యవధి మరియు లోతు (గాఢత) ఎలాగైతే మారుతుంటాయో, అదే విధంగా మరణానంతరం వారి అనుభవాలూ మారుతూ ఉంటాయి. జీవితమనే కర్మాగారంలో కష్టపడి పనిచేసే ఒక మంచి మనిషి కొద్దిసేపు గాఢమైన, అపస్మారక స్థితిలో, ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఆయన సూక్ష్మలోక జీవిత౦లో ఏదో ఒక ప్రా౦త౦లో మేల్కొంటాడు: “నా త౦డ్రి ఇ౦టిలో అనేక భవంతులు ఉన్నాయి.”

సూక్ష్మ లోకంలో ఆత్మలు సున్నితమైన కాంతితో కప్పబడి ఉంటాయి. ఇవి, ఎముకల కండల అచ్ఛాదనంలో తమను తాము కప్పుకోవు. ఆత్మలు, ఇతర ముడి ఘనపదార్థాలుతో ఢీకొని విరిగిపోయే బలహీనమైన, భారీ ఆకారములను కలిగి ఉండవు. అందువల్ల సూక్ష్మలోకంలో మానవుని దేహంతో (ఆత్మతో), ఘనపదార్థాలకు, మహాసముద్రాలకు, పిడుగులకు, మరియు రోగాలకు పోరు ఉండదు. ప్రమాదాలూ ఉండవు, ఎందుకంటే అన్ని వస్తువులు వైరము కన్నా పరస్పర సహాయంతో సహజీవనం సాగిస్తాయి. స్పందన యొక్క అన్ని రూపాలు ఒకదానితో మరొకటి సామరస్యంగా పనిచేస్తాయి. సమస్త శక్తులు శాంతి మరియు చేతన సహాకారంతో జీవిస్తాయి. ఆత్మలు, అవి నడిచే కిరణాలు, అవి త్రాగే, తినే నారింజ కిరణాలు అన్నీకూడా సజీవ కాంతితో తయారు చేయబడ్డాయి. ఆత్మలు పరస్పర అవగాహన, సహకారాలతో జీవిస్తాయి, ఆక్సిజన్ కాక, పరమాత్మ యొక్క ఆనందాన్ని శ్వాసిస్తాయి.

“భిన్న జీవితాలలోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులభంగా గుర్తిస్తారు,” [శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పారు]. “స్నేహం యొక్క అమరత్వాన్ని ఆనందిస్తూ, ప్రాపంచిక జీవితం యొక్క విచారకరమైన వీడ్కోలు సమయ౦లో, తరచూ సంశయించే ప్రేమ యొక్క అవినాశితను తెలుసుకొంటారు.”

మరణానంతర జీవిత౦ ఎ౦త మహిమాన్వితమైనదో కదా! ఇకపై మీరు ఈ పాత ఎముకల గూడును, అన్ని ఇబ్బందులతో ఈడ్చుకెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు శారీరక పరిమితుల ఆటంకం లేకుండా నిరంతరాయంగా సూక్ష్మ స్వర్గలోకంలో స్వేచ్ఛగా ఉంటారు.

తమ ప్రియతముడు మరణి౦చినప్పుడు, అసమంజసమైన దుఃఖానికి బదులుగా, దైవేచ్ఛగా అతను ఉన్నత లోకానికి వెళ్ళాడని, అతనికి ఏది ఉత్తమమో భగవంతునికి తెలుసు అని గ్రహించండి. అతను స్వేచ్ఛగా ఉన్నాడని సంతోషించండి. మీ ప్రేమ,సహృద్భావాలు ముందుకు సాగే ఆతని మార్గంలో ప్రోత్సాహాన్ని అందించే దూతలుగా ఉండాలని ప్రార్థించండి. ఈ దృక్పథం మరింత సహాయకారిగా ఉంటుంది. నిజమే, మనం ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు విచారించకపోతే అది మానవీయం కాదు; అయితే, వారి కోసం ఒంటరితనాన్ని అనుభూతి చెందడంలో మన స్వార్థపూరితమైన అనుబంధం వారిని భూపరిధిలో ఉంచివేయడానికి కారణం కాకూడదు. విపరీతమైన దుఃఖం నిష్క్రమించిన ఒక ఆత్మను మరింత శాంతి, స్వేచ్ఛల వైపు ముందుకు సాగకుండా నిరోధిస్తుంది.

మీ ఆలోచనలను గతించిన ప్రియతములకు పంపడానికి, మీ గదిలో నిశ్శబ్దంగా కూర్చుని భగవంతుణ్ణి ధ్యానించండి. మీలో భగవంతుని శాంతిని మీరు అనుభూతి చెందినప్పుడు, రెండు కనుబొమ్మల మధ్య ఉన్న సంకల్ప కేంద్రమైన క్రీస్తు [కూటస్థ] కేంద్రంపై గాఢంగా ఏకాగ్రత ఉంచి గతించిన వారికి మీ ప్రేమను ప్రసారం చేయండి.

క్రీస్తు (కూటస్థ) కేంద్రంలో మీరు సాంగత్యం పెట్టుకోదలచిన వ్యక్తిని ఊహించుకోండి. ఆ ఆత్మకు మీ ప్రేమ స్పందనలనూ, బలాన్నీ, ధైర్యాన్ని ప్రసారం చేయండి.

మీరు దీన్ని నిరంతరంగా చేస్తే, మరి ఆ ప్రియతమ వ్యక్తిపై మీ ఆసక్తి యొక్క తీవ్రతను మీరు కోల్పోకపోతే, ఆ ఆత్మ ఖచ్చితంగా మీ స్పందనలను స్వీకరిస్తుంది. అలా౦టి ఆలోచనలు మీ ప్రియతములకు శ్రేయస్సు, ప్రేమ భావములను ఇస్తాయి. మీరు వారిని మరచిపోలేదు అలాగే వారూ మిమ్మల్ని మరచిపోలేదు.

ప్రేమ, సద్భావనలకు సంబంధించిన మీ ఆలోచనలను మీ ప్రియతములకు వీలైనంత తరచుగా, కనీసం సంవత్సరానికి ఒకసారి – బహుశా ఏదైనా ప్రత్యేక వార్షికోత్సవ సందర్భంగానైనా పంపండి. మానసికంగా వారికి చెప్పండి, “మనం మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాము మరియు మన దివ్య ప్రేమ, స్నేహాన్ని మనం ఒకరితో ఒకరు పెంపొందించుకుంటాము.” మీరు ఇప్పుడు మీ ప్రేమపూర్వక ఆలోచనలను వారికి నిరంతరం పంపితే, ఏదో ఒక రోజు మీరు వారిని మళ్ళీ కలుస్తారు. ఈ జీవితం ముగింపు కాదని, మీ ప్రియతములతో మీ సంబంధ బాంధవ్యాలు అఖండ గొలుసులో కేవలం ఒక అనుసంధానం మాత్రమేనని మీరు తెలుసుకుంటారు.

ప్రతిజ్ఞ

ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

“పరమాత్ముని సముద్రం నా ఆత్మ యొక్క చిన్న బుడగగా మారింది. పుట్టుకలో తేలియాడినా, చావులో కనుమరుగైనా, విశ్వ జాగృతి అనే మహాసముద్రంలో నా జీవితపు బుడగ చావదు. నేను అవినాశ చైతన్యాన్ని, పరమాత్మ అమరత్వం యొక్క అంతర్యంలో నేను సురక్షితం.”

మరింత చదవడానికి

ఇతరులతో షేర్ చేయండి