యువజన కార్యక్రమాలు

పరిచయం

ప్రజలను సంతోషపెట్టగలిగేది విద్యా సంబంధమైన శిక్షణ మాత్రమే కాదు. అది ‘జీవించడం ఎలా’ అని తెలియజేసే విద్య — సామరస్యపూర్వకమైన, నైతిక జీవితాన్ని, దృఢమైన సంకల్పశక్తిని మరియు ఆధ్యాత్మిక అవగాహనను ఎలా పెంపొందించుకోవాలో తెలియజేస్తుంది — ఆనందాన్ని కలుగజేస్తుంది.

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారు, యువజన సంక్షేమం కోసం తీవ్రంగా ఆలోచించారు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి జీవితమంతా ఆసక్తిని కనబరిచేవారు. ఆయన అడుగుజాడల్లో కొనసాగుతూ, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) జీవించడం-ఎలా అనే వివిధ రకాల కార్యక్రమాలను అందిస్తోంది, ఇది యువకులకు ధ్యానం మరియు సరైన కార్యాచరణతో సమతుల్య జీవితాన్ని ఎలా గడపగలరో నేర్పుతుంది.

యోగానందగారు, ఒక యోగి ఆత్మకథ లో ఠాగూర్‌ను ఉటంకిస్తూ ఇలా అన్నారు: “నిజమైన విద్యాబోధన, లోపల ఉన్న అనంత జ్ఞాననిధిని బయటికి తీసుకురావడానికి సాయపడుతుందే కాని, బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు.”

ఈ తత్వశాస్త్రం ఆధారంగా, యువకులు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తీకరించగల ఒక శిక్షణాత్మక మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వై.ఎస్.ఎస్. యువజన కార్యక్రమాలు సృష్టిస్తాయి, నూతన జీవన నైపుణ్యాలను ఎంచుకుంటూ వారి సహజమైన ప్రతిభను మరియు ఆత్మ గుణాలను తెర ముందుకు తీసుకువస్తాయి.

రెండు వయస్సు బృందాలకు రెండు పరిమాణాలలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి

వై.ఎస్.ఎస్. యువజన సేవల విభాగం రెండు వయస్సుల వర్గాలను లక్ష్యంగా చేసుకుని యువతకు సహకరిస్తుంది:

  1. బాలల సత్సంగం (వయస్సు 8–12)
  2. యుక్తవయస్సు కార్యక్రమం (టీన్ ప్రోగ్రాం) (వయస్సు 13–17), మరియు

ఈ రెండు బృందాల కోసం కార్యక్రమాలు రెండు రకాలుగా — వ్యక్తిగతంగాను మరియు ఆన్‌లైన్‌లోను — నిర్వహించబడతాయి.

ప్రస్తుతం నడుస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలతోపాటు ప్రతి ఆదివారం మా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలలో బాలల సత్సంగాలు మరియు నోయిడా, చెన్నై ఆశ్రమాలలో మే-జూన్‌ నెలల్లో వేసవి శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

మేము అందించే ఆన్‌లైన్ కార్యక్రమాలలో బాలల సత్సంగాలు మరియు యుక్తవయస్సు కార్యక్రమాలు (టీన్ ప్రోగ్రామ్‌లు) ఉన్నాయి, ఈ రెండూ త్వరలో ప్రారంభించబడతాయి. అదనంగా, ప్రతి సంవత్సరం ఒక వారం పాటు ఆన్‌లైన్‌లో యువజన వేసవి కార్యక్రమాలు (ఎస్.ఆర్.ఎఫ్. సహకారంతో) నిర్వహించబడతాయి. ఇది బాలలు మరియు యుక్తవయస్కులకు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి బలమైన ఆధ్యాత్మిక మరియు నైతిక పునాదిని అందిస్తుంది. ఎస్.ఆర్.ఎఫ్. [వై.ఎస్.ఎస్.] యొక్క 2023 ఆన్‌లైన్ వేసవి యువజన కార్యక్రమానికి 21 దేశాల నుండి వందలాది మంది బాలలు హాజరయ్యారు! ఇతర కార్యక్రమాలు అభివృద్ధిలో ఉన్నాయి.

ప్రయోజనాలు

కొన్ని సంవత్సరాలుగా, పిల్లలు మరియు యుక్తవయస్కులు ఈ యువజన కార్యక్రమాల ద్వారా తాము పొందిన ప్రయోజనాల గురించి మాకు వ్రాశారు. కొన్ని ప్రయోజనాలు:

  • భగవంతుడిని కనుగొనడానికి యోగా ధ్యాన ప్రక్రియలను నేర్చుకోవడం
  • నూతన, జీవితకాల ఆధ్యాత్మిక స్నేహితులను కనుగొనడం
  • బాగా దృష్టి పెట్టగల సామర్థ్యం
  • భయం మరియు ఆందోళనను, ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఎదుర్కోగల సామర్థ్యం
  • శక్తిపూరణ వ్యాయామాలు, ఆసనాలు మరియు ప్రాణాయామం ద్వారా మెరుగైన ఆరోగ్యం
  • పరీక్షల్లో మెరుగ్గా రాణించగల సామర్థ్యం

యోగ్యతా పత్రము

ఎన్.బి., ఒక 17 ఏళ్ల ప్రాయం గలవాడు ఇలా వ్రాశాడు: “నాకు పదేళ్ల వయసులో, యువజన కార్యక్రమంలో ఏకాగ్రతను కలుగజేసే హాంగ్-సా ప్రక్రియను నేర్చుకున్నాను. నాకు 15 ఏళ్లు వచ్చేవరకు నేను ధ్యానంతో నిజంగా ప్రయోగాలు చేయడం ప్రారంభించలేదు. మాకు పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడల్లా, నేను వాటిని విశ్లేషిస్తాను మరియు నేను ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే నేను చేసిన అనేక తప్పులను సులభంగా నివారించవచ్చని గమనించాను. సంవత్సరం చివరి పరీక్షలు సమీపిస్తున్నాయి. నా గ్రేడ్ 88% వద్ద ఉంది మరియు నేను కాలిక్యులస్ తరగతిలో ఖచ్చితమైన ఫలితాన్ని కోరుకున్నాను.

“నా చివరి పరీక్షకు ముందు రోజు రాత్రి, నేను హాంగ్-సా యొక్క శాంతిని అనుభవించే వరకు గాఢంగా ధ్యానం చేశాను. మరుసటి రోజు నేను పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు, నేను ప్రశాంత చిత్తంతో పరీక్షను పూర్తి చేశాను. ఫలితాలు వచ్చినప్పుడు, నేను ఆనందంతో అరిచాను. మొత్తం క్లాసులో నేను ఒక్కడినే 100% మార్కులు తెచ్చుకున్నాను. కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు అందరికీ తెలుసని నేను భావించాను. పరీక్ష వంటి ఒత్తిడి సమయాలలో వాటిని తిరిగి పొందడం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. ధ్యానం నాకు ప్రశాంతత మరియు ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడింది, ఇంకా చెప్పాలంటే, అదే నాకు నిజంగా పాఠశాలలో సహాయపడింది.”

 

బాలల సత్సంగం

యువతకు సరైన విద్య అనే ఆదర్శం ఎల్లప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది….నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు నేటి అధికారిక పాఠ్యాంశాల్లో కొరవడ్డాయి, వాటిని ఉపయోగించకుండా ఏ మానవుడు ఆనందాన్ని పొందలేడు.

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

దక్షిణేశ్వరం
రాంచీ

ఈ మహా గురుదేవులు 1917లో బెంగాల్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఏడుగురు పిల్లలతో ఒక చిన్న పాఠశాలను స్థాపించడంతో తన కార్యాచరణ ప్రారంభించారు. తరువాత, ఆయన మార్గదర్శకత్వంలో అమెరికాలోని ఎస్.ఆర్.ఎఫ్. ఆలయాలు మరియు కేంద్రాలలో మొట్టమొదటి ఆదివారం పాఠశాలలు ఏర్పడ్డాయి. నేడు, వై.ఎస్.ఎస్. యువజన సేవల విభాగం ద్వారా వివిధ రకాల యువజన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

నిరంతరం వృద్ధి చెందుతున్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంతో, వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించే బాలల సత్సంగ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతోంది.

ప్రతి వారం జరిగే బాలల సత్సంగం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతర ఆధ్యాత్మిక బాలలతో కలిసి ఆనందకరమైన అభ్యాస వాతావరణంలో బాలలకు నిరంతర ప్రేరణను కలిగించడం, ఇది తోటివారితో అభ్యాసాన్ని సుసాధ్యం చేస్తుంది. తరగతులన్నీ దేవునితో ప్రేమపూర్వక వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు సరైన ప్రవర్తనతో సంతోషకరమైన, సమతుల్య జీవితం పొందేందుకు ప్రేరణ కలిగించేలా రూపొందించబడ్డాయి. ఆధ్యాత్మిక గీతాలాపన మరియు ధ్యానం బుద్ధిపూర్వక శ్రద్ధను కలిగించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గురుదేవుల రచనలలోని కథలు వారి ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ మేధస్సును మెరుగుపరుస్తాయి, అలాగే జట్టులో స్ఫూర్తి, సహకారం మరియు సామరస్యపూర్వకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను సామూహిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తాయి.

సృజనాత్మకత, పట్టుదల, చొరవ మరియు సహనం వంటి మంచి నడవడి కలిగించే లక్షణాలను బోధించడానికి ఆటలు లేదా వృత్తివిద్య తరచుగా చేర్చబడతాయి. శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానంలో పిల్లలకు వయస్సుకు తగ్గ సూచనలు ఇవ్వబడతాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఒత్తిడి ఉన్న తరగతి గదుల వంటి వాతావరణాన్ని నివారించడం మరియు వై.ఎస్.ఎస్. బోధనలను సరళంగా మరియు ఆకర్షణీయంగా అందించడం — బాలలు మళ్ళీ మళ్ళీ కోరుకునేటట్లుగా బాలల సత్సంగాన్ని ఆనందకరమైన అనుభవంగా మార్చడం.

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర

“స్వీయ-కేంద్రీకృత పరిమితులను దాటి ప్రేమ వికసించడం కుటుంబంతో ప్రారంభమవుతుంది — తనను తాను బయటికి వ్యక్త పరచుకునే సహజమైన ప్రారంభ పరిచయాన్ని అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంటుంది,” అని పరమహంస యోగానందగారు చెప్పారు.

పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులదే కీలకపాత్ర అని ఇది తెలియజేస్తోంది. వారి వర్ధమాన ఆధ్యాత్మిక జీవితం ప్రోత్సహించబడితే, అది ఒక విజయవంతమైన మరియు సంతోషకరమైన జీవితానికి పునాది అవుతుంది.

ఉపాధ్యాయులు పోషించే పాత్ర గురించి శ్రీ దయామాత మాట్లాడుతూ, “మన ఆదివారం పాఠశాల [పిల్లల సత్సంగం] ఉపాధ్యాయులకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి, ఎందుకంటే వారు ప్రపంచాన్ని మార్చడానికి సహాయపడగలరు. ఈనాటి పిల్లలకు తమ జీవితాల్లో దేవుడికి మొదటి స్థానం కల్పించాలని బోధించడం ద్వారా, యోగదా బాలల సత్సంగ ఉపాధ్యాయులు రేపటి కోసం ఒక నూతన, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు సహాయం చేస్తారు.”

గురుదేవుల తరువాతి తరం శిష్యులను తయారుచేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు పరిపాలన సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవకుల క్రియాశీల భాగస్వామ్యం వై.ఎస్.ఎస్. యువజన సేవలకు అవసరమవుతుంది. మీ స్థానిక కేంద్రం లేదా మండలిలో బాలల సత్సంగాన్ని ప్రారంభించాలనుకునేవారు మరియు ప్రస్తుతం నడుస్తున్న బాలల కార్యక్రమాలలో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిగా పనిచేయదలచుకొన్నవారు [email protected] ని సంప్రదించవచ్చు.

వేసవి శిబిరాలు

నోయిడాలో బాలికల కోసం వేసవి శిబిరం

పరమహంస యోగానందగారి ఆదర్శవంతమైన సరళమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని స్ఫూర్తిగా తీసుకుని, మే నెలలో నోయిడాలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంలో వార్షిక బాలికల శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో పాల్గొనే యువతలో శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహించడంతోపాటు ఆధ్యాత్మిక సహవాస భావాన్ని పెంపొందించే సంపూర్ణ అభ్యాస వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఉంది.

సామూహిక ధ్యానానికి ముందు జరిగే ప్రారంభ ప్రార్థనలో నిమగ్నమై ఉన్న బాలికలు
పర్యావరణపై అవగాహనను కలిగించడానికి క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఒక యుక్తవయస్కుల బృందం

శిబిరం యొక్క ముఖ్యాంశాలు

  • దైనందిన సామూహిక ధ్యానం
  • ఆధ్యాత్మిక గీతాలాపన తరగతులు
  • ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల నిర్వహణ మరియు అగ్ని లేకుండా వంట, వంటి వాటి ఆచరణాత్మక జ్ఞానం
  • శారీరక కార్యకలాపాలైన తైక్వాండో తరగతులు మరియు క్రీడలకు సమయం
  • క్రాఫ్ట్ (వృత్తి విద్య) ప్రాజెక్టులు
  • సమయ పాలన
  • ఈ-మెయిల్ మర్యాద క్రమము మరియు ఆన్‌లైన్ భద్రత
నోయిడా బాలికల శిబిరం 2023లో స్వచ్ఛంద భక్త సేవకులు మరియు బాలికలు
ఆధ్యాత్మిక గీతాలాపన జరుగుతున్న తరగతి

జీవించడం-ఎలా అనే అంశంపై తరగతులు

వ్యక్తిగత ఎదుగుదలను సులభతరం చేసేందుకు ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసం, సంకల్పశక్తి, ఆత్మపరిశీలన మరియు సఫలతా నియమం వంటి అంశాలపై ఒక క్రమమైన “జీవించడం-ఎలా” తరగతులను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. శిబిరం యొక్క కార్యక్రమం, రోజుకు మూడు సార్లు ధ్యాన సమయాలతో ముడిపడి ఉంటుంది, దానితో పాటు శక్తిపూరణ వ్యాయామాలు మరియు యోగాసనాల అభ్యాసం కూడా ఉంటుంది.

ఆడియో-వీడియో మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు

ఒక క్రమమైన సాయంత్రం కార్యక్రమాలలో పాల్గొనేవారు తమ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి మరియు తమ ఆధ్యాత్మిక జ్ఞానం, అవగాహనను మరింతగా పెంచుకోవడానికి సహాయపడతాయి. గురుదేవులపై వీడియో ప్రదర్శనలు, భారతీయ సాధువులపై ప్రదర్శనలు మరియు భజనలు ఆలపించడం వంటివి వీటిలో ఉంటాయి.

ఒక సాధారణ సాంస్కృతిక కార్యక్రమంతో ఐదు-రోజుల శిబిరం ముగుస్తుంది.

సరియైన జీవన కళను నేర్చుకోండి. మీకు ఆనందం ఉంటే మీకు అన్నీ ఉన్నట్లే.

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

నోయిడా ఆశ్రమంలో బాలుర కోసం వేసవి శిబిరం

బాలుర వేసవి శిబిరం సంతోషకరమైన, సరియైన జీవనం యొక్క ఆదర్శంపై దృష్టి పెడుతుంది. ఇది ఒక ఐదు-రోజుల శిబిరం, ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో నోయిడాలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం బాలుర శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక రంగాలలో చక్కటి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

బాలుర పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామి ఆలోకానంద
క్రీడలు మరియు ఆటలు పిల్లలలో జట్టుగా ఒక స్ఫూర్తిని మరియు సోదర భావాన్ని పెంపొందిస్తాయి

పరిచయ కార్యక్రమం

కార్యక్రమం యొక్క మొదటి రోజు పరిచయ కార్యక్రమంతో కూడిన తరగతితో ప్రారంభమవుతుంది, దీనిని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ఈ శిబిరాలలో పాల్గొనేవారు సురక్షితమైన మరియు సంతోషకరమైన వాతావరణంలో శిబిరం నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడేందుకు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన సూత్రాలు — “చేయదగినవి మరియు చేయకూడనివి” — వివరించబడతాయి.

జీవించడం-ఎలా తరగతులు మరియు వర్క్‌షాప్‌లు

శిబిరంలో పాల్గొనే యువతకు శారీరక మరియు మానసిక ఎదుగుదలను సులభతరం చేయడానికి ఒక క్రమమైన రీతిలో వర్క్‌షాప్‌లతో పాటు క్రీడలు కూడా కార్యక్రమంలో కూడి ఉంటాయి. వృత్తివిద్యలు, వేద గణితం, ఈ-మెయిల్ మర్యాద క్రమం, సమయ పాలన, సంగీతం యొక్క ప్రాథమిక అంశాలు, బహిరంగంగా ప్రసంగించడం మరియు పర్యావరణంపై అవగాహన వంటి అనేక అంశాలపై వర్క్‌షాప్‌లు జరుగుతాయి. ప్రథమ చికిత్స మరియు అత్యవసర పరిస్థితుల నిర్వహణపై కూడా తరగతులు నిర్వహించబడతాయి. క్రీడా సమయంలో, అబ్బాయిలు ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కుక్క-ఎముక మరియు కబడ్డీ వంటి అనేక ఆటలను ఆడుతారు. ‘సఫలతా నియమం’ మరియు ‘ఆరోగ్యం మరియు పారిశుధ్యం’ వంటి వ్యక్తిగత వృద్ధికారక అంశాలు తెలుపబడతాయి.

యోగాసనాల కార్యక్రమం కోసం బాలురు ప్రతిరోజు ఉదయమే త్వరగా మేల్కొంటారు.
2023లో నోయిడా బాలుర శిబిరంలో సన్యాసులు, భక్త వాలంటీర్లు మరియు బాలురు

ఆధ్యాత్మిక సూచన

అబ్బాయిలలో ఆధ్యాత్మిక పురోగతిని సులభతరం చేయడమే శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. శక్తిపూరణ వ్యాయామాలు, మరియు సామూహిక ధ్యానం యొక్క అభ్యాసంతో యోగాసనాలు అనుసరించబడతాయి, వాటిని సన్యాసులు మరియు సాధారణ శిష్య వాలంటీర్లు నిర్వహిస్తారు. వై.ఎస్.ఎస్. బోధనలు మరియు భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం నుండి ప్రత్యేక కథనాలను సన్యాసులు చెప్పడం జరుగుతుంది. దేవుడు మరియు గురువులతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసం, అబ్బాయిలను ప్రేరేపించడానికి అనుభవజ్ఞులైన సన్యాసులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు.

ముగింపు కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనతో ముడిపడి ఉంటుంది. శిబిరంలో పాల్గొన్నవారు తమ ప్రత్యేక అనుభవాలను పంచుకుంటారు. స్లైడ్ షో ప్రదర్శన ద్వారా శిబిర కార్యకలాపాల సంగ్రహావలోకనాన్ని వీక్షించడానికి మరియు సన్యాసుల స్ఫూర్తిదాయక ప్రసంగాలను వినడానికి తల్లిదండ్రులు అవకాశాన్ని పొందుతారు.

చెన్నై ఆశ్రమంలో బాలబాలికల కోసం వేసవి శిబిరం

మే మరియు జూన్ నెలల్లో శ్రీపెరంబుదూర్‌లోని వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమంలో కూడా ఇలాంటి వేసవి శిబిరం నిర్వహించబడుతుంది.

యుక్త (టీన్) వయస్సు వారి కోసం కార్యక్రమాలు

“భగవంతుడిలో ఆత్మలు కలిసి పురోగమించాలని కోరుకుంటే, అప్పుడు దివ్యస్నేహం పుష్పిస్తుంది. హృదయంలోని స్వభావాలు ఆధ్యాత్మీకరించబడి, సహృదయులైన స్నేహితులతో పరిపూర్ణం చేయబడితే, ఆ ప్రేమ వలయం అందరినీ కలుపుకొనేలా విస్తరిస్తే, స్నేహితులందరికీ స్నేహితుడైనవాడిని మానవుడు కనుగొంటాడు.”

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

వై.ఎస్.ఎస్. యుక్తవయస్కుల కార్యక్రమం 13 నుండి 19 సంవత్సరాల వయస్సుగల యువతకు సేవలందించేందుకు ఏర్పాటయింది. పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనలపై తమ జీవితాల్లో యువజనులు ఒక ఆధ్యాత్మిక పునాదిని ఏర్పర్చుకొనేందుకు సహాయం చేయడమే దీని ఉద్దేశ్యం—నిర్మాణాత్మక కార్యాచరణతో కూడిన శాస్త్రీయ ధ్యానం యొక్క ఒక సంతులిత నియమావళిని ఇది కలిగి ఉంటుంది. 

యుక్త వయస్సు అనేది బాల్యం మరియు యవ్వనానికి మధ్య మార్పుకు ఒక సంధికాలం. ఈ కాలంలో యుక్తవయస్కులు శారీరకంగా మరియు మానసికంగా చాలా మార్పులకు లోనవుతారు. అదే సమయంలో, జీవితాన్ని తీర్చిదిద్దుకొనేందుకు మరియు జీవిత గమనానికి సంబంధించినవాటిని ఎన్నుకోవలసిన ఒత్తిడిని వారు ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి కీలకమైన దశలో, ఆధ్యాత్మిక స్నేహితులు మరియు సలహాదారులుగల విశ్వసనీయ సహచర బృందం యొక్క మద్దతును కలిగి ఉండటం ద్వారా ఈ యువజనులు గొప్ప ప్రయోజనం పొందుతారు. 

యోగదా యువజన కార్యక్రమంలో, యువజనులు సరిగ్గా అలాంటి సహాయక బృందాన్ని కనుగొంటారు. వారాంతపు కార్యక్రమాలు, వేసవి శిబిరాలు మరియు ఆధ్యాత్మిక ఏకాంత ధ్యాన వాసాల కార్యక్రమాలతో కలిపి ఆన్‌లైన్ మరియు వ్యక్తిగతంగా నిర్వహించే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంతర్దృష్టితో కూడిన చర్చలు, స్వీయ-అవగాహన వర్క్‌షాప్‌లు మరియు చర్చా సదస్సులు వంటి వాటితో వై.ఎస్.ఎస్. ఈ యువజనులను ప్రోత్సహించాలని కోరుకుంటోంది. 

ఇటీవలి కార్యక్రమాలు

2024 వేసవిలో, ప్రయోగాత్మకంగా ఒక ప్రారంభ ఆన్‌లైన్ యువజన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. నిర్వహించింది — 2024వ సంవత్సరం జూలై-సెప్టెంబర్ నెలల మధ్య యువజనుల కోసం సత్సంగం పది వారాల పాటు కొనసాగింది. మేము ఈ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని విస్తరించి, భారతదేశమంతటి నుండి యువత పాల్గొనేలా రాబోయే ఏడాది నుండి ప్రారంభించాలని ఆశిస్తున్నాము. 2024 శరత్కాలంలో, ప్రోత్సాహకరమైన ఫలితాలతో వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదివారం యువజన సత్సంగం వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో క్రొత్తగా ప్రారంభించబడింది. మరింతగా ఇక్కడ చదవండి. మేము ఇతర ప్రదేశాలలో యువత కోసం ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించాలని యోచిస్తున్నాము. 

సేవా అవకాశాలు మరియు వై.ఎస్.ఎస్. యువజన సేవల విభాగం గురించి సాధారణ సందేహాల నివృత్తి కోసం, దయచేసి సంప్రదించండి: [email protected]

ఎస్.ఆర్.ఎఫ్. ఆన్‌లైన్ కార్యక్రమాలు

అమెరికాలో ఉన్న సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క యువజన సేవల విభాగం దశాబ్దాలుగా ఎస్.ఆర్.ఎఫ్. మందిరాలు మరియు కేంద్రాలలో “జీవించడం-ఎలా” అనే అంశంపై (ఆదివారం పాఠశాల) తరగతులను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎస్.ఆర్.ఎఫ్. యువజన సేవా విభాగం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడం ప్రారంభించింది. భారతదేశంలోని పిల్లలు, తమకు అనుకూలమైన సమయంలో (స్లాట్‌ ప్రకారం) ఈ తరగతులకు నమోదు చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం.

పిల్లలు మరియు యుక్తవయస్కుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాలన్నిటినీ చూడటానికి మరియు ఆ కార్యక్రమాలలో నమోదు చేసుకోవడానికి ఎస్.ఆర్.ఎఫ్. యువజన సేవా కార్యక్రమాల పేజీని దయచేసి సందర్శించండి.

ఇతరులతో పంచుకోండి