గృహ అధ్యయనం కోసం పాఠాలు

ధ్యానము మరియు ఆధ్యాత్మిక జీవనాలపై సమగ్ర పాఠ్య క్రమం

ధ్యానిస్తున్న జంట

వై.ఎస్.ఎస్. పాఠాలు ఏవేవి?

అంతులేని నీ ఆత్మ సామర్థ్యాన్ని గుర్తించు: క్రియాయోగ శాస్త్రం

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి బోధనల ద్వారా జీవితాన్ని మార్చగలిగే ఆత్మ శాంతి, ఆత్మానందం మరియు ఆత్మజ్ఞాన మార్గంలోకి పయనిద్దాం రండి….

పరమహంస యోగానందగారి బోధనలలో ప్రధానమైనవి ధ్యానంలోని మెళకువలు. అవి అత్యంత శక్తివంతమైనవి: ధ్యానానికి సంబంధించిన శాస్త్రమే. ఈ సనాతన ఆత్మ చైతన్య శాస్త్రం మనలో ఉన్నత ఆధ్యాత్మిక స్పృహను, దైవిక సాక్షాత్కారం యొక్క అంతర్గత ఆనందానుభూతిని మేల్కొల్పడానికి అవసరమైన శక్తివంతమైన పద్ధతులను మనకు అందిస్తుంది.

క్రియాయోగ శాస్త్రం యొక్క వాస్తవ పద్ధతులను పరమహంస యోగానందగారు తన యోగద సత్సంగ పాఠాలలో బోధించారు. ధ్యానం, ఏకాగ్రత మరియు శక్తి సాధనను, ఆధ్యాత్మిక సంతులనాన్ని సాధించటానికి, విజయవంతమైన జీవితాన్ని గడపటానికి అవసరమైన సూచనలను దశల వారీగా అందించే శ్రీ యోగానంద రచనలు, పాఠాలు అత్యంత విశిష్టమైనవి.

ఈ సాధనను జీవితకాలం కొనసాగించడానికి వీలుగా అవసరమైన వేగంతో ఈ పాఠాలను అధ్యయనం చేయండి.

మీలోని భగవంతుడిని మేల్కొల్పడమే నా లక్ష్యం. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత దూరం వెళ్ళాలనుకున్నా, నేను మీకు మార్గం చూపగలను. మీరు ఈ పాఠాలలోని మెళకువలను అభ్యసిస్తే, మీ పురోగతిలో మీకు ఎప్పటికీ స్తబ్దత అనిపించదు.

— పరమహంస యోగానంద

వై.ఎస్.ఎస్. పాఠాలు (ప్రాథమిక శ్రేణి)

విద్యార్థులందరూ ఇక్కడ ప్రారంభించండి: ధ్యానం, ఏకాగ్రత మరియు శక్తినిచ్చే వై.ఎస్.ఎస్. పద్ధతులు మరియు సమతుల ఆధ్యాత్మిక జీవనం యొక్క పునాది సూత్రాలను నేర్చుకోండి.

మీ అధ్యయనాన్ని కొనసాగించండి

క్రియాయోగ దీక్ష అనుక్రమం

క్రియాయోగా సాధనకు అవసరమైన సూచనలు, మెళకువలు మరియు పరమహంస యోగానందగారితో గురుశిష్య సంబంధాన్ని ఏర్పరచుకోవడం

అనుబంధ శ్రేణి

ఈ పాఠాలు ప్రాథమిక శ్రేణిలో జీవన సూత్రాలను, ధ్యాన పద్ధతులను బోధిస్తాయి

పాఠ్య క్రమం

ప్రయోజనం & చరిత్ర

క్రియాయోగ శాస్త్ర పాఠాల బోధన వల్ల ఉపయోగాలు:

తన ఒక యోగి ఆత్మకథ లో, పరమహంస యోగానందగారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పని వెనుక ప్రకాశించే గురు పరంపరను పరిచయం చేశారు. వారు శ్రీ మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, శ్రీయుక్తేశ్వర్ మహరాజ్ లు. భగవత్సాక్షాత్కారం పొందిన ఈ గురువులు తనను ఎలా ఎంచుకున్నారో, భగవత్సాక్షాత్కారానికి సంబంధించిన పురాతన క్రియాయోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్ళడానికి, దానిని ప్రపంచవ్యాప్తం చెయ్యడానికి తనను ఎలా సిద్ధం చేశారో ఆయన వివరించారు. ఒక యోగి ఆత్మకథ లో పరమహంస యోగానందగారు వివరించిన క్రియాయోగ ధ్యాన మార్గాన్ని నిజంగా అభ్యసించాలనుకునే వారి కోసం ఆత్మ-సాక్షాత్కార మార్గం లో యోగదా సత్సంగ పాఠాలు ఉద్దేశించబడ్డాయి. “సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న పుస్తకంలో నేను సాంకేతిక విషయాలను పొందుపరచలేను. ఎందుకంటే అవి పవిత్రమైనవి. వారు వాటిని గౌరవంగా, గోప్యతతో స్వీకరించారని నిర్ధారించుకోవడానికి ముందుగా…. కొన్ని పురాతన ఆధ్యాత్మిక ఆదేశాలను అనుసరించాల్సి ఉంటుంది. అనంతరం వారు వాటిని సరిగ్గా ఆచరించగలుగుతారు,” అని ఆయన వివరించారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్) అందించే పాఠాలలో నమోదు చేసుకోవడం: పరమహంస యోగానందగారు తన బోధనలను వ్యాప్తి చేయడానికి మరియు ఆయన మిషన్ యొక్క నిరంతర నెరవేర్పు కోసం స్థాపించిన సంస్థ, దీనిని అనుసరించాలనుకునే వారందరికీ సరైన మార్గదర్శకత్వం మరియు వాంఛనీయ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆయన ప్రపంచానికి తీసుకువచ్చిన పవిత్ర ధ్యాన పద్ధతులను అనుసరించండి మరియు సాధన చేయండి.

పరమహంస యోగానందగారి బోధనలలో ప్రధానమైన పాఠాలు

శ్రీ పరమహంస యోగానంద, తన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ పాఠాలను, నాగరిక ప్రపంచానికి భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తం కాగల ఆధ్యాత్మిక ప్రబోధాలుగా గుర్తించారు.

ప్రముఖమైన తన పుస్తకాలలో ప్రచురితమైన పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనలలో, శ్రీ పరమహంసజీ ఆధ్యాత్మిక జీవనం కోసం ప్రజలకు ఆచరణాత్మక మార్గదర్శక సంపదను అందిస్తున్నారు — నిరంతరం పరిణామం చెందుతూ ఉండే ఈ ప్రపంచంలో నిత్యమూ ఎదురయ్యే ఎడతెగని సవాళ్లు మరియు అవకాశాల మధ్య ఆనందంగా, విజయవంతంగా జీవించడం ఎలా. ఆ స్ఫూర్తిని రోజువారీ ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవాలనుకునే వారి కోసమే ఈ యోగదా సత్సంగ పాఠాలు.

శ్రీ పరమహంస యోగానంద ప్రచురణలలో పాఠాలు విశిష్టమైనవి. ధ్యానము, ఏకాగ్రత మరియు శక్తి సాధనలకై ఆయన క్రియాయోగాతో సహా దశలవారీగా బోధించిన మెళకువలు మరియు సూచనలను మనకు తెలియజేస్తాయి.

ఈ సరళమైన, అత్యంత ప్రభావవంతమైన యోగా పద్ధతులు మనలోని జీవశక్తిని, ఆధ్యాత్మిక స్పృహను మేల్కొల్పుతాయి. శరీరాన్ని శక్తిమంతం చేయడానికి, మనస్సులోని అపరిమితమైన అంతఃశక్తిని మేల్కొల్పడానికి, మన దైనందిన జీవితంలో దైవికత గురించి ఎప్పటికప్పుడు లోతైన అవగాహనను అనుభవించడానికి మనకు తోడ్పడుతుంది. మనలో ఆధ్యాత్మిక స్పృహను అత్యున్నత స్థితికి చేర్చి భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవంలోకి తెస్తుంది.

యోగా అనేది ఒక నిర్దిష్ట విశ్వాసాలకు, మత సమూహాలకు కట్టుబడి ఉండదు. పూర్తిగా మన అభ్యాసము మరియు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అన్ని మతావలంబకులు, అలాగే ఏ మతాన్నీ అనుసరించని వారూ, ఎవరైనా సరే ఈ ప్రాథమిక పాఠాల శ్రేణిలోని ఆధ్యాత్మిక బోధనల నుండి ప్రయోజనం పొందవచ్చు. అందులో బోధించిన పద్ధతులను క్రమం తప్పకుండా సాధన చేస్తే ఈ పద్ధతులు లోతైన ఆధ్యాత్మిక అవగాహనను, స్పష్టతను ఖచ్చితంగా కలిగజేస్తాయి.

యోగదా సత్సంగ బోధనలు, శరీరం, మనస్సు మరియు ఆత్మలకు సమగ్ర వికాసాన్ని అందిస్తాయి. నేను మరో కొత్త మతాన్ని, తెగను సృష్టించటానికి ఇక్కడికి రాలేదు. కానీ మీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను భగవంతునితో అనుసంధానించగల ఒక అద్భుతమైన మార్గాన్ని మీకు చూపటానికే నేను ఇక్కడికి వచ్చాను.

— పరమహంస యోగానంద

పాఠాల మూలం, విస్తరణ

స్వాధ్యాయం కోసం భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ ద్వారా అందించబడ్డ పరమహంస యోగానందగారి పాఠాలు, వాస్తవానికి అమెరికాలో తన యుగ-నిర్మాణ మిషన్ ను కొనసాగించే సమయంలో అభివృద్ధి చేశారు. 1920లు మరియు 30వ దశకంలో, పరమహంసజీ యునైటెడ్ స్టేట్స్ అంతటా పర్యటించారు. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో యోగాదా సత్సంగ్ సొసైటీ/సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ బోధనలపై ఆయన ఇచ్చిన బహిరంగ ఉపన్యాసాలను వినడానికి వేలాది మంది హాజరయ్యారు.

ప్రతి ప్రధాన నగరంలోనూ 2,3 వారాలపాటు సాగే తన ప్రసంగాలకు ఆయన, లోతైన ఆధ్యాత్మిక తృష్ణ కలిగి నిరంతర సాధన చెయ్యాలనుకునే వారిని ఆహ్వానించారు. ఆత్మ సాక్షాత్కార పద్ధతులను, ధ్యానంలో మెళకువలను తెలిపే తన బోధనలను ఆయన అనేక వారాలపాటు కొనసాగించారు. ఆరంభంలో కొన్ని సంవత్సరాలపాటు విద్యార్థులకు తరగతులలో బోధించే విషయాలపై సంక్షిప్త వివరణతో కూడిన నోట్సును కూడా అందించేవారు.

స్వాధ్యాయానికి ఉపయోగపడే సమగ్రమైన గ్రంథాన్ని ఆయన 1934లో వెలువరించారు.
ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలను తెలుసుకుందాం:

“నా శిష్యులు ఎప్పటికీ శుషుప్తావస్థలోకి జారుకోకుండా, వారికి నిత్య ఆధ్యాత్మిక చైతన్యాన్నిచ్చే ఒక నూతన ఒరవడిని నిర్మించటమెలా? అని నేను గత పధ్నాలుగేండ్లుగా రేయింబవళ్ళూ ఆలోచన చేస్తూనే ఉన్నాను. నేను వారికి ప్రతి వారమూ కొన్ని పాఠాలను పంపాలని యోచించాను. అవి వచ్చే వారం మొదలవుతాయి. ఇక ప్రతి వారమూ అలా వస్తూ ఉంటాయి. ‘మీరు వారం వారం పాఠ్య క్రమాన్ని ఎందుకు ఇవ్వకూడదు?’ అని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన శిష్యులనేకులు నన్ను అడుగుతూ ఉండేవారు. ఎట్టకేలకు నేను పరిష్కారాన్ని కనుక్కోగలిగాను. ఇప్పుడిక దీని ద్వారా వేలాదిమంది ఆత్మానందాన్ని పొందగలుగుతారని నాకు తెలుసు.”

ఆ విధంగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాలు జనించాయి. అనంతరం అనతికాలంలోనే యోగదా సత్సంగ పాఠాలుగా భారత్ లోనూ ప్రారంభమయ్యాయి. అనేక సంవత్సరాల పాటు ధారావాహికగా సాగిన ఆ పాఠాలు 1934 – 1938 సంవత్సరాల మధ్య క్రోడీకరింపబడ్డాయి. 1935 – 36 లలో శ్రీ పరమహంస యోగానంద భారత పర్యటన సందర్భంగా వాటన్నిటినీ యోగదా సత్సంగ సొసైటీ పాఠాల ప్రతిగా తన భారతీయ భక్తులకు అందించే ఏర్పాటు చేశారు. భారతీయ భక్తులకనుగుణంగా పరమహంస యోగానందగారి మార్గదర్శకత్వంలో పాఠాలలోని పదజాలం స్వల్పంగా మార్పులు చెయ్యబడింది. బోధనలు, సాధన మరియు ధ్యాన పద్ధతులు మాత్రం అవే. చిన్న చిన్న మార్పు చేర్పులతో అభివృద్ధి పరచబడిన ఆ పాఠాలు 2019 వరకూ అంతటా ప్రసారమయ్యాయి.

పాఠాల విస్తరణ, అభివృద్ధి

తన చివరి రోజులలో శ్రీ పరమహంస యోగానంద క్రొత్త రచనలు చెయ్యడానికి, తన పాత ప్రచురణల సమీక్షకే అధిక సమయాన్ని వెచ్చించి ఆ కార్యానికే అంకితమయ్యారు. ఇతర కార్యకలాపాలతో పాటుగా బోధనల విషయంలో కూడా శ్రీ మృణాళినీమాత ఆయనకు వ్యక్తిగతంగా తోడ్పాటునందించారు. తదనంతర కాలంలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీకి నాల్గవ అధ్యక్షురాలిగా సేవలందించిన ఆమె అప్పటికి ఒక యువ భక్తురాలు. పరమహంసజీ ఆమెతో కలసి మొత్తం పాఠాలన్నిటినీ సమీక్షించారు. ఆ పాఠాలలో ఆయన పరిష్కరించాలనుకున్న అనేక సమస్యలు, లోపాలను గుర్తించి, సమగ్రమైన పునర్విమర్శ కోసం అవసరమైన సూచనలను ఆమెకు చేశారు. మొదట సంకలనం చేయబడిన పాఠాలతో పాటు ఇటీవలి సంవత్సరాలలో తాను చేసిన అనేక రచనలు, ప్రసంగాల నుండి కూడా పాఠాలు తీసుకోవలసిందిగా పరమహంసగారు ఆమెకు చెప్పారు. “పాఠాలే నీ జీవన కార్యం కావచ్చు,” అని ఆయన ఆమెతో అన్నారు.

ఆ “జీవన కార్యం” ఫలించి ఇప్పుడు ఈ పాఠ్య క్రమం రూపంలో మన ముందుకొచ్చింది. 2017లో ఆమె పరమపదించే కొద్ది రోజుల ముందే ఆమె ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేశారు. పరమహంసజీ భౌతికంగా మనకు అందుబాటులో లేకపోయినా, ఎంతో విస్తృతి పొందిన సంస్థ, 1934 నాటి వారి సంకలనాలలోని బోధనలతో కూడిన ఈ సరిక్రొత్త మెటీరియల్ తో సుసంపన్నమైంది. వై.ఎస్.ఎస్. పాఠాల ఈ క్రొత్త సంకలనం మునుపెన్నడూ లేనంత సమగ్రమైనది. గతంలో వచ్చిన ప్రచురణలకంటే అత్యంత ప్రేరణదాయకమైనది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల కొత్త ఎడిషన్ ప్రారంభోత్సవం

జనవరి 31, 2019న ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ కార్యాలయంలో యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానంద గిరి నిర్వహించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల కొత్త ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులు మరియు స్నేహితులకు ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. పూర్తి కార్యక్రమం యొక్క వీడియో కూడా అందుబాటులో ఉంది

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ — అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ డిజిటల్ ఆధ్యాత్మిక సహవాసి

YSS-SRF-App-Responsive-Devices-July29-2022 (1)

మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయపడే ఒక డిజిటల్ సాధనము

ఆధ్యాత్మిక మహా కావ్యం, ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ పరమహంస యోగానందగారి బోధనల ద్వారా జీవితాన్ని పరివర్తన చేసే ఆత్మ యొక్క శాంతి, జ్ఞానం మరియు ఆనందాల మేల్కొలుపును అనుభవించండి.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ప్రతి ఒక్కరి కోసం ఉన్నది — మీరు పరమహంస యోగానందగారి బోధనలకు సరికొత్తగా వచ్చినవారైనా లేక దశాబ్దాలుగా ఈ గొప్ప గురుదేవుల జ్ఞాన బోధనలలో నిమగ్నమైనవారైనా, ధ్యానం, క్రియాయోగ శాస్త్రం గురించి మరియు ఆధ్యాత్మికంగా సమతుల్య జీవితాన్ని గడపడానికి, ఆచరణాత్మక మార్గాల గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది.

యాప్ లోని అంశాలు:

  • 15 నుండి 45 నిమిషాల వరకు అనుకూలించదగిన ధ్యాన సమయాలతో — శాంతి, నిర్భయంగా జీవించడం, దేవుడు కాంతిగా, చైతన్యాన్ని విస్తరించడం వంటి వాటిపై మార్గదర్శక ధ్యానాలు మరియు మరిన్ని
  • ఆన్‌లైన్ ప్రత్యక్ష ధ్యాన కార్యక్రమాలకు ఉచిత ప్రవేశం
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వార్తలు మరియు కార్యక్రమాల సమాచారం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠముల విద్యార్థుల కోసం...

మీ రోజువారీ జీవితంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగ బోధనలను వర్తింపజేయడంలో సహాయపడటానికి మీ పాఠాల డిజిటల్ అనువాదాలతో పాటు అనేక రకాల ప్రసార సాధనాల విషయాలను ఈ యాప్ కలిగి ఉంటుంది.

అదనంగా:

  • పరమహంస యోగానందగారి ఆడియో రికార్డింగ్ లు
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నిర్వహించే మార్గదర్శక ధ్యానాలు మరియు మానసిక చిత్రీకరణలు
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు
  • దశలవారీ సూచనలతో కూడిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. శక్తిపూరణ వ్యాయామాల వీడియో

మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థి అయితే, యాప్ లోని పాఠాలను పొందడానికి, మీ నిర్ధారించిన ఖాతా సమాచారాన్ని దయచేసి ఉపయోగించండి.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ను నేనెలా పొందగలను

  • ఇంకా మీరు పాఠాల విద్యార్థి కాకపోతే? ముందుగా వై.ఎస్.ఎస్. పాఠాల సభ్యత్వాన్ని పొందండి. అప్పుడు మీరు యాప్ ని డౌన్ లోడ్ మరియు సైన్-ఇన్ ఎలా చేయాలో తెలిపే సూచనలతో కూడిన ఈమెయిల్ ను అందుకుంటారు.
  • ప్రస్తుతం మీరు వై.ఎస్.ఎస్. ప్రాధమిక పాఠాల సభ్యత్వం పొందినట్లైతే? గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. లాగిన్ చేయడానికి మీ వై.ఎస్.ఎస్. డివోటీ పోర్టల్ యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ మీకు అవసరమవుతుంది.

వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు, వై.ఎస్.ఎస్. పాఠాలను మరియు ఆక్సీలరీ మెటీరియల్ ను (అనుబంధ విషయాలను) కూడా డెస్క్-టాప్ యాప్ పై వీక్షించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

యాప్ కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను చదవడానికి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.