జీవితం యొక్క ప్రయోజనం

పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

సరస్సు దగ్గర హంసతో ఉన్న స్త్రీమానవజాతి “ఇంకేదో” తమకు పరిపూర్ణమయిన, అంతులేని ఆనందాన్నిస్తుందని ఆశిస్తూ ఒకానొక నిత్యాన్వేషణలో ఆకర్షితమై ఉంది. భగవంతుణ్ణి వెతికి, కనుగొన్న వ్యక్తులకు అన్వేషణ పూర్తయింది: ఆ ఇంకేదో భగవంతుడే.

భగవంతుడిని కనుగొనడమే జీవిత ప్రయోజనమనే మాటను చాలా మంది సందేహించవచ్చు; కాని ఆనందాన్ని పొందడమే, జీవిత ప్రయోజనమనే అభిప్రాయాన్ని అందరూ అంగీకరిస్తారు. భగవంతుడే ఆనందమని నేను అంటాను. ఆయనే పరమానందం. ఆయనే ప్రేమ. ఆయన మీ ఆత్మ నుండి ఎన్నటికీ విడివడని ఆనందం. కాబట్టి ఆ ఆనందాన్ని పొందేందుకు మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? మరెవరూ మీకు అది ఇవ్వలేరు. మీకు మీరే దానిని నిరంతరం పెంపొందించుకోవాలి.

సంపద, అధికారం, స్నేహితులు — ఇలా జీవితం మీకు కావలసినవన్నీ ఒక సమయంలో ఇచ్చినప్పటికీ కొంతకాలం తర్వాత మీరు మళ్ళీ అసంతృప్తి చెందుతారు మరియు ఇంకేదైనా కావాలనుకుంటారు. కాని మీకు ఎప్పటికీ పాతబడని విషయం ఒకటి ఉంది — అది ఆనందమే. ఆనందకరమైన వైవిద్యభరితమైన ఆనందం, దాని సారాంశం మార్పు లేనిదయినప్పటికీ ఆనందమే ప్రతి ఒక్కరూ కోరుకునే అంతర్గత అనుభవం. భగవంతుడే శాశ్వతమైన, నిత్య నూతనమైన ఆనందం. మీ లోపల ఈ ఆనందాన్ని కనుగొనడం ద్వారా, మీరు బయట కూడా ప్రతిదానిలో దాన్ని కనుగొంటారు. భగవంతునిలో మీరు శాశ్వతమైన, అంతులేని ఆనందపు జలనిధిని స్పృశిస్తారు.

మీకు చాలా విశ్రాంతి అవసరమైనప్పుడు, నిద్రపోనివ్వకుండా మీరు శిక్షించబడ్డారని అనుకుందాం, అకస్మాత్తుగా ఎవరైనా మీతో ఇలా అంటే: “సరే, మీరు ఇప్పుడు నిద్రపోవచ్చు.” అప్పుడు, నిద్రపోయే ముందు మీరు ఎంత ఆనందం అనుభవిస్తారో ఊహించండి. దానిని పది లక్షలతో గుణించండి! అయినప్పటికీ ఇది దైవ సంసర్గంలో కలిగే ఆనందాన్ని వర్ణించదు.

భగవంతుని ఆనందం హద్దులు లేనిది, ఎడతెగనిది, ఎల్లవేళలా నూతనమైనది. మీరు ఆ చైతన్యంలో ఉన్నప్పుడు శరీరం, మనస్సు ఏదీ మిమ్మల్ని భంగపరచలేదు — అలాంటిది భగవంతుని దయ మరియు మహిమ. మీరు అర్థం చేసుకోలేని వాటిని ఆయన మీకు వివరిస్తాడు; మీరు తెలుసుకోవాలనుకునే ప్రతిదీ.

ప్రగాఢ ధ్యానం యొక్క నిశ్శబ్దంలో మీరు ఉన్నప్పుడు, బయటి ప్రేరణలు లేకపోయినా లోపల నుండి ఆనందం వెల్లివిరుస్తుంది. ధ్యానంలో పొందే ఆనందం బ్రహ్మాండమైనది. ధ్యానం యొక్క నిజమైన నిశ్శబ్దంలోకి వెళ్ళని వారికి నిజమైన ఆనందం ఏమిటో తెలియదు.

మనస్సు మరియు భావాలు లోపలికి మళ్ళించబడినప్పుడు, మీరు దేవుని ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ఇంద్రియ సుఖాలు నిలవలేవు; కాని దేవుని ఆనందం శాశ్వతమైనది. ఇది సాటిలేనిది!

మనం దానిని సరిగ్గా, తెలివిగా మరియు పొదుపుగా ఉపయోగిస్తే, మనం జీవితానికి ఎంత ఇవ్వగలమో మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మన సమయాన్ని పొదుపు చేద్దాం — మనం మేల్కొనేలోపు జీవితకాలం క్షయమైపోతుంది, అందుకే దేవుడు మనకు ఇచ్చిన నిత్యమైన సమయం యొక్క విలువను మనం గుర్తించలేకున్నాము.

సోమరితనంతో మీ సమయాన్ని వృధా చేయకండి. చాలా మంది వ్యక్తులు అసంబద్ధమైన కార్యకలాపాలతో తమను తాము తీరిక లేకుండా చేసుకుంటారు. వారు ఏమి చేస్తున్నారో వారిని అడగండి, వారు సాధారణంగా “ఓహ్, నేను ప్రతి నిమిషం తీరిక లేకుండా ఉన్నాను!” కాని వారు దేనితో చాలా తీరిక లేకుండా ఉన్నారో గుర్తుంచలేరు!

తక్షణం మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టవలసి రావచ్చు; మీరు మీ అన్ని వాగ్దానాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు దేవుని కోసం సమయం లేనట్లుగా ఇతర కార్యకలాపాలకు మీరు మొదటి ప్రాముఖ్యత ఎందుకివ్వాలి? అది లోకజ్ఞానం కాదు. మనపై విసిరిన విశ్వ భ్రాంతి యొక్క వలయైన మాయ కారణంగానే మనం ప్రాపంచిక ప్రయోజనాలలో చిక్కుకుపోతాము మరియు భగవంతుడిని మరచిపోతాము.

మనము భగవంతునితో అనుసంధానమై ఉన్నట్లయితే మన గ్రహణశక్తి అపరిమితంగా ఉంటుంది, దేవుని సాన్నిధ్యమనే మహాసముద్ర ప్రవాహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పరమాత్మను తెలిసుకున్నప్పుడు మరియు మనల్ని మనం పరమాత్మగా తెలుసుకున్నప్పుడు, నేల, సముద్రం ఏదీ లేదు, భూమి లేదు ఆకాశమూ లేదు — అంతా ఆయనే. పరమాత్మలో ప్రతిదీ కరిగిపోవడమనేది వర్ణనాతీతమైన స్థితి. గొప్ప బ్రహ్మానందం — ఆనందం, జ్ఞానం మరియు ప్రేమ యొక్క శాశ్వతమైన సంపూర్ణతను అనుభవిస్తాము.

సర్వమునూ తనలో చేర్చుకొనే ప్రేమే – దైవ ప్రేమ, పరమాత్మ యొక్క ప్రేమ. మీరు దానిని అనుభవించిన తర్వాత, అది మిమ్మల్ని శాశ్వతమైన రాజ్యంలోకి నడిపిస్తుంది. ఆ ప్రేమ మీ హృదయం నుండి ఎప్పటికీ తీసివేయబడదు. అది అక్కడ దహిస్తూనే ఉంటుంది. దాని అగ్నిలో మీరు ఆత్మ యొక్క గొప్ప అయస్కాంతత్వాన్ని కనుగొంటారు, అది ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది మరియు మీకు నిజంగా అవసరమైన లేదా కోరుకునే వాటిని ఆకర్షిస్తుంది.

నా ప్రశ్నలన్నింటికీ మనిషి ద్వారా కాకుండా దేవుని ద్వారానే సమాధానాలు లభించాయని నేను మీకు నిజాయితీతో చెబుతున్నాను. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. నా ద్వారా మీతో మాట్లాడుతున్నది ఆయన ఆత్మయే. నేను మాట్లాడుతున్నది ఆయన ప్రేమ గురించే. పులకింత మీద పులకింత! సున్నితమైన మలయమారుతము వలె ఆత్మపైకి ఆయన ప్రేమ ప్రవహిస్తుంది. పగలు మరియు రాత్రి, వారం తర్వాత వారం, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇది పెరుగుతూనే ఉంటుంది — ముగింపు ఎక్కడ ఉందో మీకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది అదే. మీకు మానవ ప్రేమ మరియు శ్రేయస్సు కావాలని మీరు అనుకుంటున్నారు, కాని వీటి వెనుక మీ తండ్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చే అన్ని బహుమతుల కంటే ఆయనే గొప్పవాడని మీరు గ్రహించినప్పుడు, మీరు ఆయనను కనుగొంటారు.

దేవుణ్ణి తెలుసుకోవడం కోసం మాత్రమే మానవుడు భూమిపైకి వచ్చాడు; అతను వేరే ఏ ఇతర కారణం కోసం కాదు. ఇదే భగవంతుని నిజమైన సందేశం. తనను కోరుకునే మరియు ప్రేమించే వారందరికీ ఆయన దుఃఖ రహిత, వృద్ధాప్య రహిత, యుద్ధ రహిత, మరణ రహిత — శాశ్వతమైన భరోసా మాత్రమే ఉన్న ఆ గొప్ప జీవితాన్ని గురించి చెబుతాడు. అటువంటి జీవితంలో ఏదీ నాశనము కాదు. వర్ణనాతీతమైన ఆనందం మాత్రమే ఉంది, అది ఎప్పటికీ పాతబడదు — నిత్య నూతన ఆనందం.

అందుకే దైవాన్ని అన్వేషించడమే సముచితం. ఆయనను యథార్థంగా అన్వేషించే వారందరూ తప్పకుండా ఆయనను కనుగొంటారు. ప్రభువును ప్రేమించాలనుకునేవారు, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని తహతహలాడేవారు, ఆయనను తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకునే వారు ఆయనను కనుగొంటారు. పగలు రాత్రి ఆయన పట్ల నిరంతరం పెరుగుతున్న కోరికను మీరు కలిగి ఉండాలి. ఆయన శాశ్వతంగా మీకు తన వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా మీ ప్రేమను అంగీకరిస్తాడు మరియు మీరు ముగింపులేని సంతోషాన్ని మరియు ఆనందాన్ని తెలుసుకుంటారు. అంతా వెలుగే, అంతా ఆనందమే, అంతా శాంతియే, అంతా ప్రేమే. అంతా ఆయనే.

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో షేర్ చేయండి