ఇతరులతో మన సంబంధాలలో సామరస్యాన్ని సృష్టించుకోవడం

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

సంబంధాలలో సామరస్యాన్ని వర్ణించే రెండు హంసలు.

దివ్య ఆనందం తరువాత అన్నిటికన్నా గొప్ప ఆనందం ఏమిటంటే, ఒక వ్యక్తి తన సన్నిహిత వ్యక్తులతో, జీవితాంతం జీవించాల్సిన వారితో శాంతిగా ఉండడమే. ఎటువంటి నేర్పు లేకుండా అత్యంత సంక్లిష్టమైన మనోభావాల వ్యవస్థతో వ్యవహరించడానికి మనుషులు ప్రయత్నించినప్పుడు, వాటి పర్యవసాన ఫలితాలు తరచు ఘోరమైనవిగా ఉంటాయి. మన ఆనందంలో ఎక్కువ భాగం మానవ ప్రవర్తన యొక్క నియమాలను అర్థం చేసుకునే కళలోనే ఉందని చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు. అ౦దుకే చాలామ౦ది జనులు తరచూ తమ స్నేహితులతో “వేడివేడిగా” ఉంటారు. దానికన్నా ఘోర౦గా ఇ౦ట్లో తమ ప్రియమైన స్వ౦తవారితో నిరంతర౦ యుద్ధ౦ చేస్తారు.

సరియైన మానవ ప్రవర్తనకు మౌలిక సూత్రం, స్వీయ సంస్కరణ….మన స్నేహితులతో లేదా ప్రియమైనవారితో ఏదైనా సమస్య ఏర్పడి ఒక అసహ్యకర్యమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు మనస్సులో మనల్ని మనమే నిందించుకోవాలి, ఆ తరువాత దాని నుండి సాధ్యమైనంత తొందరగా, మర్యాదగా బయటపడటానికి ప్రయత్నించాలి. నిందార్హులని తెలిసినా, ఇతరులను బిగ్గరగా, నిర్దయగా, అగౌరవ౦గా ని౦ది౦చడ౦ ద్వారా సమస్యను పె౦చడ౦ నిష్ఫలమైనది. క్షణికోద్రిక్తులైన మన ప్రియతములను, పరుషమైన లేదా అహంకారపూరితమైన మాటల ద్వారా చేయగలిగిన దానిక౦టే, మంచి ఉదాహరణను కల్పించడం ద్వారా వంద రెట్లు మెరుగ్గా తమ లోపాలను సరిదిద్దుకోవడం మన౦ నేర్పించవచ్చు.

చాలాసార్లు ప్రజలు తమ స్వంత దృష్టికోణం నుండే మాట్లాడతారు, అలాగే వ్యవహరిస్తారు. వారు అవతలి వ్యక్తి వైపు నుండి అరుదుగా చూస్తారు, లేదా అరుదుగా చూడటానికి ప్రయత్నిస్తారు. అవగాహన లోపంతో, మీరు ఎవరితోనైనా గొడవకు దిగితే, మీలో ప్రతి ఒక్కరూ మిగిలినవారితోబాటు సమానంగా నిందించబడతారని, ఆ వాదనను ఎవరు ప్రారంభించినా కూడా అలాగే జరుగుతుందని గుర్తుంచుకోండి. “మూర్ఖులు వాదిస్తారు; వివేకవంతులు చర్చిస్తారు.”

ప్రశాంతమైన భావాలు కలిగి ఉండడమంటే, మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటూ, ప్రతి ఒక్కరు చెప్పింది ఏకీభవిస్తున్నారని కాదు – మీరు సత్యాన్ని గౌరవిస్తారు, కాని దానికోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనుకుంటారు. ఇది అంతిమ స్థాయికి వెళుతుంది. ఈ విధంగా తమ మంచి స్వభావాన్ని మెచ్చుకోవాలనే కోరికతో అందరినీ మెప్పించడానికి ప్రయత్నించేవారికి, తమ భావోద్వేగంపై నియంత్రణ ఉండవలసిన అవసరం లేదు…..భావోద్వేగాలపై నియంత్రణ ఉన్నవాడు సత్యాన్ని అనుసరిస్తాడు, తనకు వీలైన చోట ఆ సత్యాన్ని పంచుకుంటాడు, ఏదీ స్వీకరించనివారిపై అనవసరంగా చిరాకును చూపించడు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో ఆ వ్యక్తికి తెలుసు, కాని తన స్వంత ఆదర్శాలకు మరియు అంతర్గత శాంతికి ఎన్నడూ రాజీపడడు. అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక గొప్ప సహనశీలశక్తి.

మర్యాదపూర్వకమైన, స్వచ్ఛమైన భాష అనే దివ్య వస్త్రాన్ని ధరించడం ద్వారా మనల్ని మనం ఆకర్షణీయంగా మలుచుకోవాలి. ముందుగా, మన దగ్గరి బంధువుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. ఒక వ్యక్తి అలా ఉన్నప్పుడు, ప్రజలందరి పట్ల దయా స్వభావం కలిగి ఉంటాడు. అవగాహన మరియు కరుణాపూరితమైన మాటలనే వేదికపై నిజమైన కుటుంబ స౦తోష పునాదులు ఉంటాయి. కరుణ చూపించడానికి ప్రతిదానికీ అంగీకరించాల్సిన అవసరం లేదు. తనతో ఇతరులు ఏకీభవించినా లేదా విభేదించినా నిశ్చల మౌనము, నిష్కపటము మరియు కరుణాపూర్వకమైన మాటలనేవి, ఎలా ప్రవర్తించాలో తెలిసిన వ్యక్తిగా గుర్తింపును తీసుకువస్తాయి.

మీరు ప్రేమించబడాలనుకుంటే, మీ ప్రేమ అవసరమైన ఇతరులను ప్రేమించడం ప్రారంభించండి….ఇతరులు మీ పట్ల సానుభూతి చూపాలని మీరు కోరుకుంటే, మీ చుట్టూ ఉన్నవారి పట్ల సానుభూతి చూపించడం ప్రారంభించండి. మీరు గౌరవించబడాలనుకుంటే, యువకులు మరియు వృద్ధులు ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకోవాలి….ఇతరులు ఎలా ఉండాలనుకుంటున్నారో, ముందుగా మీరే అలా ఉండండి; అప్పుడు ఇతరులు మీకు అదే విధంగా ప్రతిస్పందించడాన్ని మీరు గమనిస్తారు.

వివాహం యొక్క ఆధ్యాత్మిక సూత్రాలు

నీటిలో ప్రతిబింబిస్తున్న హంసలు.

దైవసాక్షాత్కారం కోసం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి తమ జీవితాలను కలుపుకొన్న ఇద్దరు వ్యక్తులు తమ వివాహాన్ని సరైన ప్రాతిపదికన నిర్మించుకుంటారు: బేషరతైన స్నేహం.

భార్యాభర్తల మధ్య, తల్లిద౦డ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, మనం అ౦దరితోను స్వచ్ఛమైన, బేషరతైన ప్రేమను పె౦పొ౦ది౦చుకోవడమనే పాఠం నేర్చుకోడానికే మనం భూమిపైకి వచ్చాము.

నిజమైన వివాహం అనేది ఒక ప్రయోగశాల, దీనిలో స్వార్థం, చెడ్డ గుణము మరియు చెడ్డ ప్రవర్తనలైన విషాలు, సహనం యొక్క పరీక్షా నాళికలో పోయబడి, ప్రేమ యొక్క ఉత్ప్రేరక శక్తి మరియు ఉన్నత వర్తనానికి చేసే నిరంతర ప్రయత్నం ద్వారా సంతులనమై, తటస్థీకరించబడతాయి.

వికారమైన లక్షణాలను రేకెత్తించే అలవాటు లేదా లక్షణం మీ జీవిత భాగస్వామిలో ఉన్నట్లయితే, మీలో దాగి ఉన్న విషాలను బయటకి తీసుకురావడం, తద్ద్వారా వాటిని విసర్జించి మీ నైజాన్ని శుద్ధి చేసుకోవడం కోసమే ఆ పరిస్థితుల యొక్క ఉద్దేశ్యమని మీరు గ్రహించాలి.

భర్త లేదా భార్య తన జీవిత భాగస్వామి కోసం ప్రధానంగా కోరుకోవాల్సింది ఆధ్యాత్మికత; ఎందుకంటే ఆత్మ ఆవిష్కృతమవడం వల్ల అవగాహన, సహన౦, చిత్తశుద్ధి, ప్రేమ అనే దివ్య లక్షణాలను వెలికితీస్తు౦ది. కానీ ఆధ్యాత్మిక పురోగతిపై కోరికను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రేమతో జీవించండి, మీ మంచితనమే మీ ప్రియమైన వారందరికీ స్ఫూర్తినిస్తుంది.

ఒకరునొకరు సంతోషంగా ఉంచాలనే కోరికతో, భర్త భార్యకు, మరియు భార్య భర్తకు సేవ చేసినప్పుడు, క్రీస్తు చైతన్యం – సృష్టిలోని ప్రతి అణువులో వ్యాపించి ఉన్న దేవుని ప్రేమపూరిత విశ్వజ్ఞానం – వారి చైతన్యం ద్వారా వ్యక్తమవడం ప్రారంభమవుతుంది.

ఒకరిపట్ల ఒకరు అపరిమితమైన ఆకర్షణను ఇద్దరు వ్యక్తులు అనుభూతి చెందినపుడు, ఒకరి కోసం ఒకరు త్యాగానికి సిద్ధపడినపుడు, వారు నిజమైన ప్రేమలో ఉన్నట్లే.

ప్రియమైన వ్యక్తిలో పరిపూర్ణత కోరుకోవడం, అలాగే ఆ ఆత్మ గురించి ఆలోచించడంలో నిర్మలమైన ఆనందాన్ని అనుభూతి చెందడమే దివ్య ప్రేమ; మరియు అదే నిజమైన స్నేహం యొక్క ప్రేమ.

ప్రతిరోజూ ఉదయం, మరీ ముఖ్యంగా రాత్రి పూట కలిసి ధ్యానం చేయండి…. భార్యాభర్తలిద్దరూ, పిల్లలు భగవంతునిపట్ల ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించడానికి, తమ ఆత్మలను నిత్యానందభరితమైన విశ్వచైతన్యంలో ఐక్యం చేయడానికి ఒక చిన్న కుటుంబ పూజా వేదికను ఏర్పాటు చేసుకొండి…..మీరు ఎంత ఎక్కువగా కలిసి ధ్యానం చేస్తే, ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంత లోతుగా పెరుగుతుంది.

ప్రతిజ్ఞ

ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

“నేను ఇతరులకు ప్రేమను, సద్భావనను ప్రసరింపజేసినప్పుడు, దేవుని ప్రేమ నా వద్దకు వచ్చే౦దుకు మార్గాన్ని తెరుస్తాను. దివ్యప్రేమ అనేది నాకు సర్వ శుభాలను ఆకర్షించే అయస్కాంతం.”

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో షేర్ చేయండి