బాల్యజీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ

యోగానందగారి చిన్ననాటి చిత్రం.

శ్రీ పరమహంస యోగానంద 1893లో జనవరి 5వ తారీఖున గోరఖ్ పూర్ లో సంపన్నులు, భక్తి తత్పరులు అయిన బెంగాలీ కుటుంబంలో ముకుందలాల్ ఘోష్ గా జన్మించారు. చిన్ననాటి నుండి ఆయనకు లోతైన ఆధ్యాత్మిక అవగాహన మరియు అనుభవం మామూలు మనుష్యులకన్నా చాలా ఎక్కువగా ఉండేదని ఆయనతో పరిచయం ఉన్నవారందరికీ స్పష్టంగా తెలుసు.

వారి తల్లిదండ్రులిద్దరు కూడా, అధునాతన భారతదేశంలో క్రియాయోగాన్ని పునరుద్ధరించిన ప్రఖ్యాత యోగులైన శ్రీ లాహిరీ మహాశయుల శిష్యులు. చిన్నపిల్లవాడిగా తల్లి ఒడిలో ఉన్న శ్రీ యోగానందను, లాహిరీ మహాశయులు ఆశీర్వదించి భవిష్యవాణిని ఈ విధంగా చెప్పారు: “చిట్టి తల్లీ, నీ బిడ్డ గొప్పయోగి అవుతాడు. ఆధ్యాత్మిక రైలింజనులా ఎంతోమంది ఆత్మలను భగవంతుని రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు.”

స్వామి శ్రీయుక్తేశ్వర్ — యోగానందగారి గురువుగారు.

యువకుడిగా ఉన్నప్పుడే ముకుందుడు, తన ఆధ్యాత్మిక అన్వేషణలో దారి చూపగలిగిన, జ్ఞానప్రకాశులైన ఒక గురువును వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ ఋషులను, సాధువులను దర్శించడం జరిగింది. 1910లో, పదిహేడు సంవత్సరాల వయసులో పూజనీయులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారిని (కుడివైపు) కలుసుకొని ఆయనకు శిష్యులయ్యారు. తరువాతి పది సంవత్సరాలలో చాలా భాగం, ఈ విశిష్ట యోగ గురువుల ఆశ్రమంలో, శ్రీయుక్తేశ్వర్ గారి అతి కఠినమైన మరియు ప్రేమతో కూడిన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో గడిపారు.

అమెరికాలోనూ, ప్రపంచ దేశాలన్నిటిలోనూ ప్రాచీన క్రియాయోగ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఎంపిక చేయబడ్డావని, తన యువ శిష్యుడితో శ్రీయుక్తేశ్వర్ గారు తమ మొట్టమొదటి సమావేశంలోనే కాక, తర్వాత మరెన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది.

పరమహంస యోగానందగారి (ఆధ్యాత్మిక గురువు) చిన్న వయస్సు చిత్రం

కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత 1915లో, పూజనీయమైన భారతీయ సన్యాసాశ్రమ పరంపరలో, సన్యాస దీక్షను ముకుందుడు తీసుకున్నప్పుడు ‘యోగానంద’ (పరమానందాన్ని సూచిస్తుంది, యోగం ద్వారా పొందే ఆనందం) అనే నామం స్వీకరించడం జరిగింది. భగవవంతునిపై ప్రేమకు మరియు సేవకు తన జీవితాన్ని అంకితం చేయాలనే తీవ్రమైన కోరిక అప్పుడు నెరవేరింది.

ఇతరులతో పంచుకోండి