YSS

ప్రతిజ్ఞలు

"నేను సేద తీరి అన్ని మానసిక భారాలను పక్కన పెడతాను, దేవుడు నా ద్వారా తన పరిపూర్ణమైన ప్రేమను, శాంతిని, మరియు జ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తాను."

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పర్వత శిఖరం నుండి సూర్యోదయం

మనస్సు మరియు శరీరాన్ని నయం చేయడంలో ప్రతిజ్ఞ శక్తిని కనుగొనడానికి, దశాబ్దాలకు ముందు ప్రధాన (జీవన) స్రవంతిలో పరమహంస యోగానందగారు దేశవ్యాప్తంగా తన సభలకు విచ్చేసిన ప్రేక్షకులకు, ప్రతి మానవునిలో దాగి ఉన్న అద్భుతమైన స్వస్థత శక్తులను నేరుగా ఎలా పొందాలో, ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించారు. ఆయన 1924లో తన మొదటి అమెరికా సుడిగాలి పర్యటనలో ఈ శక్తివంతమైన స్వస్థత పద్ధతిని అమెరికా ప్రేక్షకులకు పరిచయం చేశారు. 1930 – 1940 సంవత్సరాల మధ్యలో, ఆయన ద్వారా స్థాపించబడిన ఎస్.ఆర్.ఎఫ్. మందిరాలలో, గొప్ప గురువు అయిన యోగానందగారు దాదాపుగా ప్రతిసారీ తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అక్కడ ఉన్నవారి స్వస్థత కోసం, లేదా సంకల్ప శక్తిని మేల్కొల్పడం కోసం, భక్తి లేదా దేవుని సాన్నిధ్యం గ్రహించడం కోసం, ప్రతిజ్ఞతో ఎల్లప్పుడూ ప్రారంభించేవారు లేదా ముగించేవారు. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వారి శాస్త్రీయ స్వస్థత ప్రతిజ్ఞల పద్ధతుల అభ్యాసం నుండి ప్రయోజనం పొందారు.

సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ (Scientific Healing Affirmations), అనే తన మార్గదర్శక పుస్తకంలో, పరమహంసగారు ఇలా చెప్పారు

నిజాయితీ, నమ్మకం, విశ్వాసం మరియు అంతర్ దృష్టితో నిండిన పదాలు అత్యంత పేలుడు ప్రకంపనలు కలిగిన బాంబుల వంటివి, ఇవి ఉపయోగించినప్పుడు, కష్టాల బండలను పగలగొట్టి, కావలసిన మార్పుని తీసుకు వస్తాయి…..చిత్తశుద్ధి గల పదాలు లేదా ప్రతిజ్ఞలు, అర్థం చేసుకొని, అనుభూతి చెందుతూ మరియు ఇష్ట పూర్వకంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసినట్లైతే తప్పకుండా, మీ కష్టంలో సహాయం అందించడానికి సర్వ వ్యాప్త విశ్వ శక్తీ కదలివస్తుంది. అన్ని సందేహాలను పక్కనపెట్టి అనంతమైన విశ్వాసంతో ఆ శక్తికి విజ్ఞప్తి చేయండి, అలా చేయకపోతే మీ ఏకాగ్రత అనే బాణం దాని గురిని తప్పుతుంది.

"మీ ప్రకంపనా ప్రార్థన-విత్తనాలను మీరు విశ్వ చైతన్యం యొక్క మట్టిలో నాటిన తర్వాత, అవి మొలకెత్తినవా లేదా అని చూడటానికి తరచుగా వాటిని పెరికి చూడకండి. దైవ శక్తులకు నిరంతరాయంగా పని చేయడానికి అవకాశం ఇవ్వండి."

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద, సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ (Scientific Healing Affirmations)

"ఒకరు విభిన్నమైన ప్రతిజ్ఞలను ఉపయోగిస్తున్నప్పుడు, అతని మనస్సు యొక్క వైఖరి మారాలి; ఉదాహరణకు, సంకల్ప ప్రతిజ్ఞలకు తోడుగా దృఢ నిశ్చయం ఉండాలి; భావన ప్రతిజ్ఞలకి తోడుగా భక్తి ఉండాలి, కారణ ప్రతిజ్ఞలకి తోడుగా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇతరులను నయము చేసేటపుడు, మీ రోగి యొక్క ఊహాత్మక, భావోద్వేగ లేదా ఆలోచనాత్మక స్వభావానికి అనుకూలమైన తగిన ప్రతిజ్ఞను ఎంచుకోండి. అన్ని ప్రతిజ్ఞలకి గాఢమైన శ్రద్ధ ముఖ్యమైనది, కానీ దానిని కొనసాగించటం మరియు పునశ్చరణ చేయటం కూడా అంతే ముఖ్యమైనవి. ఫలితాల గురించి పట్టించుకోకుండా భక్తి, సంకల్పం మరియు విశ్వాసములను మీ ప్రతిజ్ఞలలోనికి పదే పదే దృఢంగా చొప్పించినప్పుడు, ఫలితాలు మీ శ్రమకు సహజ ఫలాలుగా లభిస్తాయి."

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద, సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ (Scientific Healing Affirmations)

ప్రసంగిస్తున్న యోగానందగారు.శారీరక స్వస్థత కోసం మాత్రమే కాదు, అన్ని అడ్డంకులను అధిగమించి, మన జీవితంలో అన్ని విధాల విజయాన్ని సృష్టించడానికి — పరమహంస యోగానందగారు కేంద్రీకృత ఆలోచన శక్తిని ఉపయోగించుకోవడానికి దాగి వున్న సూత్రాలను వెల్లడించారు. శరీరాన్ని నయం చేయడం, విశ్వాసాన్ని పెంపొందించడం, జ్ఞానాన్ని మేల్కొల్పడం, చెడు అలవాట్లను నయం చేయడం మరియు ఇంకా చాలా వాటి కోసం సమగ్ర సూచనలు మరియు అనేక రకాల ప్రతిజ్ఞలు చేర్చబడ్డాయి.

ప్రతిజ్ఞల సూచనలు

ఒక ప్రతిజ్ఞని ఎంచుకోండి

ఉదయం మేల్కొన్న వెంటనే లేదా రాత్రి నిద్రపోయే ముందు ప్రతిజ్ఞలు అభ్యాసము చేయడము అత్యంత ప్రభావవంతమైనది. ప్రతిజ్ఞలు ప్రారంభించే ముందు, సరైన ధ్యాన భంగిమలో, కుర్చీ లేదా దృఢమైన ఉపరితలంపై కూర్చోవడం ముఖ్యం. వెన్నెముకను నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకొని, మెడ వెనుక భాగంలో “మెడుల్లా అబ్లాంగేటా” మీద కేంద్రీకరించాలి. విరామం లేని ఆలోచనలు మరియు చింతల నుండి మనస్సును విముక్తి చేయండి.

ఈ క్రింద ప్రతిజ్ఞలలో ఒకదాన్ని ఎంచుకొని మీ స్వరం గుసగుసలాడే వరకు మొదట బిగ్గరగా, తర్వాత మృదువుగా మరియు మరింత నెమ్మదిగా అన్నింటినీ పదే పదే ఉచ్చరించండి. అప్పుడు మీరు లోతైన, ఎడతెగని ఏకాగ్రత సాధించినట్లు మీకు అనిపించే వరకు ప్రతిజ్ఞను మానసికంగా మాత్రమే పునరుద్ఘాటించాలి. మీరు పెరుగుతున్న శాంతిని అనుభవిస్తున్నప్పుడు, మీ ఏకాగ్రతను మరింతగా పెంచే ప్రయత్నం చేయండి, తద్వారా మీరు అధిచేతన రాజ్యంలోకి ప్రవేశించి, మీ ప్రతిజ్ఞలను వ్యక్తం చేసుకోగలుగుతారు.

“నేను శాశ్వతమైన వెలుగులో మునిగిపోయాను. అది నా అస్తిత్వంలోని ప్రతి కణంలోకి చొచ్చుకుపోతుంది. నేను ఆ వెలుగులో జీవిస్తున్నాను. పరమాత్మ నన్ను లోపల మరియు వెలుపల తనతో నింపుతుంది.”

“దేవుడు నా లోపల, నా చుట్టూ ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు; కాబట్టి నేను ఆయన మార్గదర్శక కాంతిని నిరోధించే భయాన్ని పారద్రోలుతాను.”

“పరిపూర్ణ మైన తండ్రీ, నీ వెలుగు క్రీస్తు ద్వారా, అన్ని మతాల సాధువుల ద్వారా, భారతదేశ మహర్షుల ద్వారా, మరియు నా ద్వారా ప్రవహిస్తోంది. ఈ దివ్యమైన కాంతి నా శరీర భాగాలన్నింటిలోనూ ఉంది. నేను బాగున్నాను.”

“దేవుని శక్తి అపరిమితమైనదని నాకు తెలుసు; మరియు నేను ఆయన రూపములో తయారు చేయబడి ఉండటము వలన, నేను కూడా అన్ని అడ్డంకులను అధిగమించే శక్తి కలిగి వున్నాను.”

“నేను సేద తీరి అన్ని మానసిక భారాలను పక్కన పెడతాను, దేవుడు నా ద్వారా తన పరిపూర్ణమైన ప్రేమను, శాంతిని మరియు జ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తాను.”

“జననంలో, దుఃఖములో, సంతోషంలో, కార్యాచరణలో, ధ్యానంలో, అజ్ఞానంలో, పరీక్షల్లో, మరణంలో మరియు చివరి విముక్తిలో, నీ సర్వ రక్షకమైన, సర్వవ్యాపకమైన కాంతిలో నేను ఎల్లప్పుడూ కప్పబడి ఉన్నానని అనుభూతి చెందడం నాకు నేర్పు.”

“నీ మంచితనపు కాంతి మరియు నీ రక్షణ శక్తి నా ద్వారా ఎప్పుడూ ప్రకాశిస్తున్నాయి. నేను వాటిని చూడలేదు, ఎందుకంటే నా జ్ఞానము అనే కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నీ శాంతి అనే స్పర్శ నా కళ్ళను తెరిచింది; నీ మంచితనం మరియు నిరంతర రక్షణ నా ద్వారా ప్రవహిస్తున్నాయి.”

“నా స్వర్గలోకపు తండ్రీ, నువ్వు ప్రేమ రూపానివి, మరియు నేను నీ స్వరూపంలో తయారు చేయబడ్డాను. నేను ప్రేమ యొక్క విశ్వ గోళాన్ని, నాలో అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, అన్ని జీవులు, మరియు మొత్తం సృష్టిని మెరుస్తున్న వెలుగులుగా చూస్తున్నాను. నేను మొత్తం విశ్వాన్ని ప్రకాశింప చేసే ప్రేమను.”

“ఒక్కొక్కప్పుడు నవ్వడము నాకు కష్టంగా ఉన్నప్పటికీ కూడా, నా చిరునవు ద్వారా, రోదించేవారు నవ్వడానికి నేను సహాయం చేస్తాను.”

“నేను ఇతరులకు ప్రేమను, సద్భావనను ప్రసరింప చేయడము ద్వారా భగవంతుడి ప్రేమను అందరికీ చేరడానికి ఒక మార్గము ఏర్పరుస్తాను.”

ఇక్కడ ఇవ్వబడిన ఎంపికలు పరమహంస యోగానందగారి పుస్తకాలు, సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ (Scientific Healing Affirmations) and మెటాఫిజికల్ మెడిటేషన్స్ (Metaphysical Meditations) నుండి సంగ్రహించబడ్డాయి.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp