యోగశాస్త్ర విశ్వజనీనత

శ్రీ పరమహంస యోగానందగారి
మానవుడి నిత్యాన్వేషణ లో “యోగశాస్త్ర విశ్వజనీనత” నుండి సారాంశాలు

1944 మే 21, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియాలో ఇచ్చిన ప్రసంగం. ఈ ప్రసంగం మరియు ఇతర ప్రసంగాలు వై.ఎస్.ఎస్. ప్రచురించిన పరమహంసగారి మూడు సంపుటాల ప్రసంగాల, వ్యాసాల కూర్పులో కనిపిస్తాయి.

ముకుళిత హస్తాలతో శ్రీ పరమహంస యోగానంద

యోగం యొక్క ప్రయోజనం

శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం. మనం భగవంతుడినుంచి వచ్చాం; కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి. మనం భగవంతుడినుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ, మనం ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యమవాలి. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఆయననుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలోనుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది. మిల్టన్ కవి, మానవుడి ఆత్మను గురించి, అది ఏ విధంగా తాను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందాలో రాశాడు. మానవుడు తాను కోల్పోయిన స్వర్గంలాంటి ఆత్మచేతనను తిరిగి పొందడానికి, తద్వారా తాను ఇప్పుడు, ఎల్లప్పుడూ, పరమాత్ముడితో కలిసే ఉన్నాడని తెలియజేయడమే యోగానికున్న ఉద్దేశం, లక్ష్యం.

యోగం అనేది నిజమైన మతం యొక్క శాస్త్రం

ప్రపంచంలోని విభిన్నమయిన మతాలు ఇంచుమించుగా మానవుడి నమ్మకాలమీద ఆధారపడ్డవి. కాని మతానికి నిజమైన ప్రాతిపదిక, మనందరికీ తండ్రి అయిన భగవంతుణ్ణి చేరడానికి భక్తులందరూ ఉపయోగించదగిన శాస్త్రమయి ఉండాలి. యోగం అటువంటి శాస్త్రం. అటువంటి మతధర్మశాస్త్ర ఆచరణ తప్పనిసరి. వివిధ పిడివాదపు మత “సిద్ధాంతాలు” మానవజాతిని విభజించాయి. ఏసు క్రీస్తు ఈ విధంగా వేలెత్తి చూపాడు: “ఒక ఇంట్లోవాళ్ళు తమలో తాము కలహించుకుంటూ ఉంటే, ఆ ఇల్లు నిలవజాలదు” (మార్కు 3:25). వివిధ మతాలమధ్య ఏకత్వం, ఆయా మతాలను ఆచరించే వ్యక్తులు తమలో ఉన్న భగవంతుణ్ణి నిజంగా ఎరిగిననాడే సాధ్యమవుతుంది. అప్పుడే మానవులమధ్య నిజమైన సోదర భావం, భగవంతుడి పితృత్వభావం కింద వెల్లడి అవుతాయి.

ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భగవంతుణ్ణి కనుక్కోవలసిన అవసరాన్ని, మానవులందరి మధ్యఉన్న సోదరభావాన్ని గురించి ప్రబోధిస్తున్నాయి. మతాలన్నింటికీ భగవంతుడి పది ఆజ్ఞల (Ten Commandments) వంటి నైతిక నియమావళి ఉంది. అలాంటప్పుడు వాటిమధ్య విభేదాలు సృష్టిస్తున్నది ఏది? మనుషుల మనస్సుల్లో ఉన్న మతదురభిమానమే. పిడివాదంమీద దృష్టి కేంద్రీకరించడంవల్ల కాక వాస్తవమయిన ఆత్మజ్ఞానంవల్లనే భగవంతుణ్ణి చేరగలం. వివిధ మతాలన్నిటికీ ఆధారమయిన సార్వజనీన సత్యాలను గ్రహించినప్పుడు మానవులు పిడివాదంనుంచి ఇక సమస్యలు ఎదుర్కోరు. నాకు యూదుడు, క్రైస్తవుడు, హిందూ అనే తేడా లేదు. అందరూ నా సోదరులే. నేను అన్ని మందిరాల్లో పూజ చేస్తాను, ఎందుకంటే అవన్నీ పరమాత్ముణ్ణి గౌరవించడానికి నెలకొల్పినవి కాబట్టి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రవేశ పెట్టిన “సర్వమతాలయ,” (Church of all Religions) భావంతోనే ప్రపంచ ఐకమత్యాన్ని సాధించడం మొదలుపెట్టాలి మనం; అన్ని మతాల్లోని మంచిని ఎంపిక చేయడంవల్ల కాక, అన్ని మతాలనూ దైవసన్నిధికి చేర్చే వేరువేరు దారులుగా గౌరవించడంవల్ల. అటువంటి మందిరాలు, అన్ని మతాలవారు పూజించే ఒకే భగవంతుడికి అంకితమైనవి ప్రతిచోటా నిర్మించాలి. ఇది జరగబోతుందని నేను ముందుగానే చెబుతున్నాను. ప్రాచ్య పాశ్చాత్యాలు, భగవంతుడి మందిరాల్లోని సంకుచిత విభాగాలను శాశ్వతంగా నాశనం చెయ్యాలి. యోగంద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది మానవులంతా తాము ఆ పరమాత్ముని సంతానమని తెలుసుకొంటారు.

గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడు

భగవంతుడి సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులందరిలోను ఈ ఏకతా భావం రుజువయింది. గుడ్డివాడు వేరొక గుడ్డివాడికి దారి చూపలేడు. ఒక గురువు, భగవంతుణ్ణి తెలుసుకొన్నవాడు మాత్రమే భగవంతుణ్ణి గురించి సరిగా ఇతరులకు బోధ చేయగలడు. ఒకరు తమ దివ్యత్వాన్ని తిరిగి పొందాలనుకొంటే వారికి తప్పకుండా అలాంటి బోధకుడు లేదా గురువు ఉండాలి. ఎవరైతే సద్గురువును నమ్మకంగా అనుసరిస్తారో వాళ్ళు ఆయనలాగే అవుతారు. ఎందుకంటే గురువు తాను పొందిన సాక్షాత్కార స్థితికి తన శిష్యుణ్ణి కూడా పెంపుచేస్తాడు. నేను మా గురుదేవులు, స్వామి శ్రీ యుక్తేశ్వరులవారిని కనుక్కొన్న తరవాత, వారి ఉదాహరణనే అనుసరించాలని మనస్సులో నిర్ణయించుకున్నాను: భగవంతుణ్ణి ఒక్కణ్ణే నా హృదయపీఠంపైన నిలపాలని, ఆయనను ఇతరులతో కలిసి పంచుకోవాలని.

ప్రగాఢమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే సాధకుడు తన దృష్టిని సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రంపై కేంద్రీకృతం చేయాలని హైందవ గురువులు బోధిస్తారు. దృష్టిని గాఢంగా ఏకాగ్రం చేసినప్పుడు, యోగికానివారు కూడా తమ కనుబొమ్మల మధ్యనున్న నుదురు భాగం చిట్లిస్తారు. ఇది ఏకాగ్రతకు కేంద్రబిందువు, ఇంకా గోళాకారపు ఆధ్యాత్మిక నేత్రం, ఆత్మ అంతర్ జ్ఞానపు [లేదా సహజావబోధపు] స్థానం. అదే నిజమైన “స్ఫటిక గోళం.” దాన్ని చూస్తూ యోగి విశ్వరహస్యాలను తెలుసుకొంటాడు. గాఢమైన ఏకాగ్రతతో “మూడో” కంటిగుండా చొచ్చుకుపోగలిగినవారు భగవంతుణ్ణి దర్శిస్తారు. కాబట్టి సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహింపు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. యోగసాధన అంతర్ జ్ఞానపు చేతన కలిగిన ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకోడానికి సాధకుడికి సహాయపడుతుంది.

సహజావబోధం లేదా నేరుగా పొందే జ్ఞానం ఇంద్రియాలు అందించే వివరాలమీద ఆధారపడి ఉండదు. అందుకే అంతర్ జ్ఞాన్నాన్ని తరచుగా “ఆరో ఇంద్రియం (సిక్త్స్ సెన్స్)” అంటారు. అందరిలోనూ ఈ “ఆరో ఇంద్రియం” ఉంటుంది. కాని, చాలామంది దాన్ని అభివృద్ధి చేసుకోరు. ఏది ఏమయినా, ఇంచుమించు ప్రతి ఒక్కరికీ ఒకరకమైన అంతర్ జ్ఞాన అనుభూతి, ఫలానా విషయం జరగొచ్చుననే “భావన” ఇంద్రియాలు ఆ విషయంమీద ఏ విధమయిన ప్రమాణం ఇవ్వనప్పటికీ జరగడం అప్పుడప్పుడూ మనం చూస్తుంటాం.

అంతర్ జ్ఞానం లేదా నేరుగా పొందే ఆత్మజ్ఞానాన్ని పెంపుదల చేసుకోడం చాలా ముఖ్యం. భగవంతుడి చేతన ఉన్నవాళ్ళకు వాళ్ళమీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది. వాళ్ళకు తెలుసు, ఇది; వాళ్ళకు తెలుసుననే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి. ఒక నారింజపండు రుచి గురించి మనం ఎంత నిశ్చతాభిప్రాయంతో ఉంటామో, భగవంతుడి ఉనికిని గురించి అంతే నిశ్చతాభిప్రాయంతో నమ్మకంగా ఉండాలి. భగవంతుడితో ఏ విధంగా సంభాషించాలో మా గురుదేవులు నాకు చూపిన తరవాత, ప్రతి దినమూ భగవంతుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకొన్న తరవాత మాత్రమే ఇతరులకు ఆయన గురించి చెప్పాలనే ఆధ్యాత్మిక విధిని నేను తలపెట్టాను

పాశ్చాత్యప్రపంచంలో పెద్ద పెద్ద ఆరాధనా మందిరాలపై దృష్టి పెట్టారు, కాని కొద్దిమంది మాత్రమే భగవంతుణ్ణి కనుక్కోడమెలాగో భక్తులకు చూపారు. ప్రాచ్యప్రపంచంలో, దైవసాక్షాత్కారం పొందిన మనుషులను వృద్ధిచేయడాన్నే నొక్కిచెప్పారు. కాని చాలా సందర్భాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధకులకు దూరంగా ఏకాంతవాసంలో, ఇతరులకు అందుబాటులో లేకుండా ఉన్నారు. ప్రజలకు భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆధ్యాత్మిక కేంద్రాలు, భగవంతుడితో అనుసంధానం పొందడమెలాగో ప్రజలకు చూపే గురువులు, రెండూ అవసరమే. తనంత తానుగా భగవదనుభూతి పొందని బోధకుడినుంచి ఇతరులు భగవత్ సాక్షాత్కారం గురించిన జ్ఞానం ఎలా పొందగలుగుతారు? ఇతరులకు ఈశ్వరుడి గురించి బోధించేముందు మనం ఆయన్ని గురించి తెలుసుకొని ఉండాల్సిన అవసరాన్ని మా గురుదేవులు నా మనస్సుకు హత్తుకొనేలా చెప్పారు. వారి శిక్షణకు నేనేంతగానో కృతజ్ఞుణ్ణి! వారు స్వయంగా నిజంగా దేవుడితో అనుసంధానం కలిగినవారు.

ఈశ్వరానుభూతిని ఒకరు మొదట తమ శరీరాలయంలో గ్రహించాలి. ప్రతి సాధకుడూ నిత్యం తమ ఆలోచనలకు శిక్షణనిచ్చి, తమ భక్తిపుష్పాలను ఆత్మదైవపీఠంమీద సమర్పించాలి. తనలో ఉన్న భగవంతుణ్ణి కనుక్కొన్నవాడు ఆయన ఉనికిని తాను సందర్శించిన ప్రతి మందిరంలోనూ చర్చిలోనూ అనుభూతి పొందుతాడు.

యోగం మతధర్మ శాస్త్రాన్ని వ్యావహారికానుభూతిగా మారుస్తుంది

అన్ని మతాలలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి యోగం వీలు కలిగిస్తుంది. ప్రతీ మతం, వేరువేరు మాటల్లో, పది దైవాజ్ఞలనే బోధిస్తున్నాయి. కాని ఏసు క్రీస్తు నొక్కిచెప్పిన రెండు దైవాజ్ఞలు చాలా గొప్పవి: “నీ దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ మనస్సుతో ప్రేమించు,” ఇంకా “నీ పొరుగువాణ్ణి, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా ప్రేమించు.” (మత్తయి 22:37, 39).

భగవంతుణ్ణి “పరిపూర్ణ మనస్సుతో” ప్రేమించడమంటే ఒకరు తమ దృష్టిని ఇంద్రియాలనుంచి మరల్చి ఆ భగవంతుడిపైనే పెట్టడం. ధ్యానంలో ఒకరు తమ పూర్తి ఏకాగ్రతను ఆయనకే ఇవ్వడం. దైవాన్వేషకులు ప్రతి ఒక్కరూ ఏకాగ్రతను అభ్యసించాలి. మనస్సులో వేరే విషయాల గురించి ఆలోచన చేస్తూ అదే సమయంలో ఒకరు భగవంతుణ్ణి ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన నిజమయిన ప్రార్థన కాదు; భగవంతుడు వాటిని పట్టించుకోడు. దేవుణ్ణి కనుక్కోవాలంటే పూర్తి ఏకాగ్రతతో, ముందుగా ఆయన్ని మనఃస్ఫూర్తిగా కోరాలని యోగం బోధిస్తుంది.

యోగం అందరికీ సంబంధించినది

కొంతమంది అంటారు, యోగాభ్యాసం హిందువులకే తగినదని, యోగం పాశ్చాత్యులకు సరిపడనిదని. ఇది నిజం కాదు. ప్రస్తుతం చాలామంది పాశ్చాత్యులే యోగాభ్యాసానికి హిందువులకంటే చక్కగా తయారుగా ఉన్నారు. ఎందుకంటే, ఆధునిక శాస్త్ర పురోగతులు పాశ్చాత్యులకు ఎంతో ఖాళీ సమయాన్ని ఇచ్చాయి. జీవితాన్ని సరళంగాను, స్వేచ్ఛగాను చేసుకోడానికి భారతదేశం ఇంకా ఇంకా ఎక్కువగా పాశ్చాత్యదేశాల పురోగమన కారకాలయిన భౌతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి చేరడానికి దారి చూపే ఆచరణయోగ్యమైన యోగపద్ధతులను పాశ్చాత్యులు భారతదేశంనుంచి తీసుకోవాలి. యోగం ఒక పక్షానికే చెందింది కాదు. అది పరమపితను పొందడానికి విశ్వజనీనంగా అందరూ ఆచరించదగినది.

యోగం అందరికోసం, ప్రాచ్య పాశ్చాత్య ప్రజలందరికోసం. టెలిఫోను పాశ్చాత్యంలో ఆవిష్కరణ అయింది. కాబట్టి ప్రాచ్యంలో ఉపయోగించకూడదనడం సరి కాదు. అదే విధంగా, యోగపద్ధతులను, ప్రాచ్యంలో పెంపొందించినప్పటికీ అవి ప్రాచ్యానికే కాదు, మానవజాతికంతటికీ ఉపయోగకరమైనవి.

ఒక మనిషి భారతదేశంలో లేదా అమెరికాలో ఎక్కడ పుట్టినప్పటికీ, ఏదో ఒకరోజు అతడు పోవలసినదే. సెయింట్ పాల్ లాగ, “ప్రతి రోజూ భగవంతుడిలో చావడం” ఎందుకు నేర్చుకోగూడదు? (I కోరింథియనులు 15:31) యోగశాస్త్రం ఆ పద్ధతిని నేర్పుతుంది. మనిషి శరీరంలో ఖైదీలా జీవిస్తున్నాడు; తన సమయం తీరగానే, అవమానకరంగా అందులోంచి బయటకు తోసివేయబడటమనే కష్టం పొందుతాడు. కాబట్టి శరీరంపై ప్రేమ జైలుమీద ప్రేమకంటే ఎక్కువేం కాదు. చాలా కాలంగా ఈ శరీరంలో ఉండడమనే అలవాటుచేత నిజమయిన స్వాతంత్ర్యమంటే ఏమిటో మనం మరిచిపోయాం. పాశ్చాత్యుడవడం నిజమయిన స్వాతంత్ర్యాన్ని అన్వేషించకుండా ఉండడానికి మినహాయింపేమీ కాదు. ప్రతి మనిషికీ తన ఆత్మను కనుక్కొని, తన అమృతత్వ ప్రకృతిని తెలుసుకోడం ఎంతో ముఖ్యం. యోగం ఆ మార్గాన్ని చూపిస్తుంది.

ఆత్మ తిరిగి పైకి వెళ్ళి పరమాత్మను చేరాల్సిందే

సృష్టి ప్రారంభానికి ముందు విశ్వచేతన: పరమాత్మ లేదా దేవుడు; పరిపూర్ణుడు, నిత్యస్థిత [ఎప్పుడూ ఉండే], నిత్యచైతన్య, నిత్యనూతన ఆనందం [సచ్చిదానందం] రూపాలకు, ప్రత్యక్ష అభివ్యక్తికి అతీతంగా ఉంది. సృష్టి రూపందాల్చినప్పుడు, విశ్వచేతన (Cosmic Consciousness) భౌతిక విశ్వానికి “దిగి”నప్పుడు అది కూటస్థ చైతన్యం (క్రీస్తు చైతన్యం)గా సృష్టి అంతటిలోను అంతర్లీనంగాను గోప్యంగాను ఉన్న భగవంతుడి తెలివి, చేతనల సర్వవ్యాప్త, శుద్ధ ప్రతిబింబంగా వెల్లడయింది. ఈ కూటస్థ చైతన్యం మానవుడి భౌతిక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆత్మ, లేదా అధిభౌతికచేతనగా: భగవంతుడి నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్యనూతన ఆనందంగా ప్రత్యేకంగా [ప్రతి ఒక్కరి] శరీరంలో ఆవరించి ఉంది. ఆత్మ ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం అవుతుందో, అది అహంగా, మర్త్య చేతనగా అవుపడుతుంది. యోగం ఆత్మ తిరిగి ఈ చేతనా సోపానాలను ఎక్కి పరమాత్మతో కలవడమెలాగో నేర్పుతుంది.

మానవుడి ప్రాణం, దివ్యచైతన్యం – మనిషి ఆత్మ నివాసస్థలం మెదడులోని సూక్ష్మ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఉన్నాయని బోధిస్తుంది. సహస్రారం, సహస్రదళ పద్మం, సెరిబ్రమ్ మీద విశ్వచేతన స్థానం; కూటస్థం – కనుబొమ్మల మధ్య ఉంటుంది – కూటస్థ చేతనకు స్థానం; ఇంకా మెడుల్లా కేంద్రం (ధ్రువత్వ రీత్యా కూటస్థంతో కలిసి ఉంది) అధిభౌతిక చేతనకు స్థానం. ఈ ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రాలనుండి, ప్రాణం, చేతన శరీరానికి (లేదా మర్త్యచేతనకు) దిగివచ్చినప్పుడు అవి వెనుబాము గుండా, ఐదు ఆధ్యాత్మిక మేరుదండ కేంద్రాల ద్వారా భౌతిక శరీరపు ప్రాణ, ఇంద్రియ గ్రహణం, పని చేయడానికి బయటకు వస్తాయి.

భగవంతుడితో దివ్యానందదాయకమయిన ఏకత్వాన్ని తిరిగి సాక్షాత్కరించుకోడానికి, మానవుడి ఆత్మ తప్పకుండా దాన్ని కిందికి పోయే మార్గాన్నించి తిరిగి వచ్చిన చోటుకు పోయే పవిత్రమయిన వెనుబాము దారి గుండా పైకి పోతూ మెదడులోఉన్న ఉన్నతమయిన దివ్యచేతనాకేంద్రాలలో ఉన్న తన ఇంటికి చేరాలి. గురువు ఇచ్చిన శాస్త్రీయ ధ్యానప్రక్రియలను – యోగదా సత్సంగ పాఠాల నుంచి నేర్పేటటువంటి వాటి ద్వారా ధ్యానయోగం అభ్యాసం చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది.

భగవత్ సాన్నిధ్యచేతనే సంతోషపు రహస్యం

జీవితాన్ని అనుభవించడం మంచిదే; సంతోషపు రహస్యం ఏమిటంటే దేని బంధంలోను చిక్కుకోకుండా ఉండడం. పువ్వుల సువాసనను ఆస్వాదించండి, కాని దానిలో ఉన్న భగవంతుణ్ణి చూడండి. నేను ఇంద్రియ చేతనను ఏ స్థాయిలో పెట్టానంటే నేను వాటి ద్వారా భగవంతుణ్ణి గ్రహించడానికి, ఆలోచించడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తాను. “అంతటా ఉన్న నీ(భగవంతుడి) అందాన్ని చూడడానికి నాకు కళ్ళు ఉన్నాయి. అంతటా వినిపిస్తున్న నీ గాత్రాన్ని వినడానికే నా చెవులు ఉన్నాయి.” అదే యోగం, భగవంతుడితో ఐక్యత. ఆయన్ని కనుక్కోడానికి అడవులకు వెళ్ళక్కర్లేదు. మనం ప్రాపంచిక అలవాట్లనుంచి మనల్ని మనం విముక్తం చేసుకోనంతకాలం మనం ఎక్కడ ఉన్నా అవి మనలను పట్టి ఉంచుతాయి. తన హృదయపు గుహలో యోగి భగవంతుణ్ణి కనుక్కోడం నేర్చుకుంటాడు. తానెక్కడికి వెళ్ళినప్పటికీ, అతడు తనతో దివ్యానందపు చైతన్యభరితమైన భగవత్సాన్నిధ్యానుభూతిని తీసుకువెళతాడు.

మానవుడు మర్త్యత్వపు ఇంద్రియ చేతనకు దిగజారడమే కాక, ఇంద్రియ చేతనపు విపరీత లక్షణాలయిన లోభం, కోపం, అసూయ వంటి వాటికి కట్టుబడ్డాడు. భగవంతుణ్ణి పొందాలంటే మానవుడు ఈ అస్వాభావిక లక్షణాలను తొలగించుకోవాలి. ప్రాచ్య పాశ్చాత్యులు ఇద్దరూ ఇంద్రియ బానిసత్వంనుండి విముక్తి పొందాలి. ఒక సాధారణ మానవుడు ఉదయం కాఫీ తన కందియ్యకపోతే కోపం తెచ్చుకుంటాడు. కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుందని అతడు నమ్ముతాడు. అతడు తన అలవాట్లకు బానిస. అభివృద్ధి చెందిన యోగి స్వతంత్రుడు. ప్రతి ఒక్కరూ యోగి కాగలరు, తాము ప్రస్తుతమున్న స్థితిలోనే. మన సొంత అలవాట్లతో కూడిన జీవిత పరిధికి ఆవల ఉన్న విషయమేదైనా విచిత్రమైనదని, కష్టమైనదని వెంటనే భావిస్తాం. మన అలవాట్లు ఇతరుల దృష్టికి ఎలా కనపడుతున్నాయో అన్న ఆలోచనే చేయం!

యోగసాధన స్వేచ్ఛకు దారితీస్తుంది. కొంతమంది యోగులు బంధరాహిత్యాన్ని తీవ్రంగా పాటిస్తారు. వాళ్ళు మేకులతో చేసిన పరుపుమీద అసౌకర్యం లేకుండా పడుకోవాలంటారు. ఇంకా ఇలాంటి వివిధ రకాలైన తపస్సును, శరీర శిక్షణను బోధిస్తారు. మేకుల పరుపుమీద కూర్చొని దేవుడి గురించి ఆలోచించడమన్నది గొప్ప దృఢమైన మనస్సును నిజంగానే తెలియజేస్తుంది. కాని అలాంటి విన్యాసాలు అవసరం లేదు. మీరొక సౌకర్యమైన కుర్చీలో కూర్చొని దేవుడిమీద ధ్యానిస్తే సరిపోతుంది.

భగవంతుడిమీద యోగపరమైన ఏకాగ్రతకు, మీరు వెనుబాము నిటారుగా ఉంచడానికి ఉపయోగపడే ఏ ఆసనమైనా ధ్యానానికి మంచిదని పతంజలి బోధిస్తారు. హఠయోగంలో చెప్పినట్లు యోగసాధనకు శరీరాన్ని వంకర్లు తిప్పడంగాని, అసాధారణమయిన శారీరక దృఢత్వంగాని, సులభంగా వంగడానికి అవసరమైన అభ్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం భగవంతుడు. ఆయన సాన్నిధ్యచేతనను అలవరుచుకోడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. భగవద్గీత అంటుంది: “తన ఆత్మ నాలోనే నిమగ్నమయిఉండి, భక్తితో నాలో పూర్తిగాలీనమయి ఉండేవాణ్ణి అన్ని వర్గాల యోగుల్లోకీ అత్యంత సమతాస్థితుడిగా నేను పరిగణిస్తాను” (VI:47).

హైందవ యోగులు అమితమైన వేడి, చలివంటి వాటిని, దోమలు ఇంకా చిరాకు పుట్టించే కీటకాలవంటి వాటిని లెక్కచేయకుండా ధ్యానం చేశారు. అటువంటి ప్రదర్శనలు యోగికావడానికి అవసరం లేదు; కాని అవి నిపుణుడైన యోగికి సహజంగానే వచ్చే విజయాలు. దృష్టి మరల్చే వాటిని తొలగించడానికి ప్రయత్నించండి; లేదా అవసరమైతే వాటిని సహనంతో ఓర్చుకోండి. కాని మనస్సులో వాటివల్ల మీ శాంతికి భంగం కానీయకండి. ఒకళ్ళు శుభ్రంగా ఉండగలిగినప్పుడు, మురికిగా ఉండటంలో అర్థం లేదు. ఒకరు గుడిసెలో ఉన్నా అదే విధంగా భవంతిలో నివసిస్తున్నా బంధాలు కలిగి ఉండవచ్చు.

ఆధ్యాత్మిక సఫలతను సాధించడానికి ముఖ్యమైన కారకం మనఃపూర్వకంగా కృషిచేయడం. ఏసు అన్నాడు, “నిజంగా పంట చాలానే ఉంది, కాని కష్టం చేసేవాళ్ళు కొద్దిమందే” (మత్తయి 9:37). ప్రపంచానికి చెందినవాళ్ళు దేవుడి బహుమతులు ఆశిస్తారు. కాని తెలివైనవాళ్ళు బహుమతులిచ్చే దేవుణ్ణే కోరతారు.

ధ్యానంచేస్తే యోగులవుతారు. యోగి ప్రతి ఉదయం లేవగానే తాను తీసుకోబోయే ఆహారం గురించి ఆలోచించడు; అతడు తన ఆత్మను భగవత్ సంసర్గమనే అమృతంతో పోషిస్తాడు. గాఢమైన దైవధ్యానంతో నిండి ప్రేరణ పొందిన మనస్సుతో, అతడు తన రోజువారీ పనులన్నింటినీ ఆనందంగా చేస్తాడు.

ఈ భూమిని ఇలా తయారుచేయడానికి దేవుడికి ఒక ఉద్దేశముంది. ఆయన ప్రణాళికలో మానవుడి పాత్ర ఏమంటే ఈ ప్రపంచాన్ని మరింత చక్కజేయడం. పాశ్చాత్యుడు కొత్త కొత్త మెరుగైన భౌతిక సౌఖ్యాలు పొందడంలో ఎప్పుడూ బాగా కార్యవ్యగ్రుడై ఉంటాడు. అందుకోసం ఏమైనా చేయడానికి అతడు సిద్ధపడతాడు. తనకున్నదాంట్లోనే అతిగా సంతృప్తిపడుతుంటాడు ప్రాచ్యుడు. సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగే పాశ్చాత్యుడి స్ఫూర్తిలోను, అదే విధంగా సరళంగా, శాంతంగా పోయే ప్రాచ్యుడి స్ఫూర్తిలోను, వీరిద్దరి ప్రవృత్తులలోను ఒక ఆకర్షణ ఉంది. మనం ఈ రెంటికీ సమతుల్యతనిచ్చే మధ్యేమార్గాన్ని అవలంబించాలి.

ధ్యానం యోగిని చేస్తుంది

భగవంతుణ్ణి పొందాలనుకునేవారు, ప్రతి రోజూ ఉదయం, రాత్రి అదే విధంగా రోజులో కొంచెం ఖాళీసమయం దొరికినప్పుడు ధ్యానం చేయాలి. దీంతోబాటు, వారంలో ఒక రోజు ఆరు గంటలు ధ్యానం చేయడం ఎంతో ముఖ్యం. ఇది ఎక్కువేం కాదు; కొంతమంది పియానోను ప్రతి రోజూ పదిగంటలపాటు వారమంతా సాధన చేస్తారు. అదేం ఎక్కువ సాధన కాదని వాళ్ళు భావిస్తారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకొనేవాళ్ళు భగవంతుడికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరం. దేనికన్నా మిన్నగా ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని దేవుడు భావించాలి. ధ్యానంలో తగినంత అనుభవం సంపాదించిన తరవాత, అధిభౌతిక చేతనలో గాఢంగా పోగలిగినప్పుడు, ఐదు గంటల నిద్ర మనకు సరిపోతుంది. మిగిలిన రాత్రి సమయమంతా ధ్యానానికి కేటాయించవచ్చు. రాత్రుళ్ళు, పెందలకడ సమయాలు, సెలవు రోజులు దేవుడిమీద ధ్యానానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎవరైనా, ఎప్పుడూ కార్యవ్యగ్రుడిగా ఉండే పాశ్చాత్యుడైనా, యోగి కావచ్చు. కాబట్టి పాశ్చాత్య యోగులు కండి. మీరేం నాలాగా తలపాగా చుట్టక్కర్లేదు, పొడవు జుట్టు పెంచక్కర్లేదు!

మనకి మందిరాలనే “తేనెపట్లు” కావాలి. కాని ఆ మందిరాలను మన సొంత ఆత్మసాక్షాత్కారమనే “తేనె”తో నింపడం కూడా అవసరం. దేవుడు మందిరాల్లోను ఉన్నాడనుకోండి; కాని కేవలం అక్కడికి వెళ్ళడంవల్ల మాత్రమే భగవంతుడు మీకు దర్శనమీయడు. గుడికెళ్ళడం మంచిదే, కాని ధ్యానం చేయడం అంతకన్నా మిన్న. రెండూ చేయండి. ఎందుకంటే గుళ్ళకి వెళ్ళడంవల్ల మీరు ప్రేరణ పొందుతారు. రోజువారీ ధ్యానం ద్వారా ఇంకా ఎక్కువ స్ఫూర్తిని పొందుతారు. భక్తుడి హృదయం తపిస్తున్నప్పుడు ప్రార్థనలమీద ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు దిగి వస్తాడు. భగవంతుణ్ణి పొందాలంటే ఆ విధమైన ఎడతెగని భక్తి ఎంతో అవసరం. ప్రస్తుత ప్రపంచంతో పోటీపడుతూ, యోగి కావాలనుకుంటే, ఇంటిదగ్గర ధ్యానం చేయడం అవసరం. తమను తాము క్రమశిక్షణలో ఉంచుకోడం, అన్ని విధులను అవి భగవంతుడికి సేవ అనే దృక్పథంతో చేయాలి.

భగవంతుడి చిరునవ్వును మానవులందరి ముఖాల్లోను చూడడం, మానవ హృదయాలలో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే నాకున్న గొప్ప కోరిక. మీ ఆత్మల్లో భగవంతుడి మందిరాలు నెలకొల్పడమే మీ జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైన విజయం. అది సులువుగానే చేయవచ్చు. అందుకే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను పడమటి దేశాలకు పంపారు.

తన హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించినవారు ఎవరైనా యోగే. నాతో బాటుగా అతను కూడా యోగం తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమరల ప్రజలందరికోసమనీ, వాళ్ళు వేదాంతమనే పక్కదారులను అనుసరిస్తూ క్రమంగా యోగమనే రహదారి ఎక్కుతారని అనవచ్చు. సరయిన దారి భగవంతుడి దివ్యానంద సౌధానికి మార్గం చూపుతుంది. ఎవరైనా ఒకసారి ఆయన్ను చేరిన తరవాత “ఇంక బయటకు వెళ్ళనవసరం లేదు” (రివలేషన్ 3:12).

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో షేర్ చేయండి