
- దేవుడితో వైయక్తికమైన అపరోక్షానుభూతి సాధించడానికి తోడ్పడే నిర్దిష్ట శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెయ్యడం.
- జీవితానికి ప్రయోజనం మానవుడి పరిమిత మర్త్యచేతనను దైవచేతనగా స్వయం కృషితో పరిణామం చెందేటట్లు చేయడమేనని బోధించడం; ఈ లక్ష్య సాధనకు, దైవానుసంధానం కోసం ఉద్దేశించిన యోగదా సత్సంగ మందిరాలను ప్రపంచవ్యాప్తంగా స్థాపించడం; దానితోబాటు, [భక్తుల] గృహాలలోను, హృదయాలలోను వ్యక్తిగత దైవ మందిరాలు స్థాపించుకునేలా ప్రోత్సహించడం.
- శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మూల యోగంలోనూ, ఏసుక్రీస్తు బోధించిన మూల క్రైస్తవంలోనూ సంపూర్ణ సామరస్యం, మౌలికమయిన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం; ఈ సత్య సూత్రాలు వాస్తవ మతాలన్నింటికీ సమానమయిన శాస్త్రీయ ప్రాతిపదికలని నిరూపించడం.
- నిజమయిన మతవిశ్వాస మార్గాలన్నీ నిర్దేశించే ఏకైక దివ్య రాజమార్గం చూపించడం; ప్రతి నిత్యం శాస్త్రీయమయిన పద్ధతిలో, భక్తిపూర్వకంగా చేసే భగవద్ధ్యానమే ఆ రాజమార్గం.
- శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానరాహిత్యం అనే మూడు రకాల బాధలనుంచి మానవుణ్ణి విముక్తుణ్ణి చేయడం.
- “నిరాడంబర జీవనం, ఉన్నత భావనం” ప్రోత్సహించడం; ప్రపంచ ప్రజలందరి ఏకత్వానికి దేవుడితో బాంధవ్యమనే శాశ్వత ప్రాతిపదిక ఉందని బోధించి వాళ్ళలో సోదరభావం వ్యాప్తిచేయడం.
- శరీరంకన్న మనస్సుకూ, మనస్సుకన్న ఆత్మకూ ఆధిక్యం ఉందని నిరూపించడం.
- చెడుని మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించడం.
- విజ్ఞానశాస్త్రానికీ మతానికీ ఆధారభూతమయిన సూత్రాల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని, దానిద్వారా ఆ రెంటినీ ఏకం చేయడం.
- తూర్పు, పడమటి దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవగాహన పెంపొందాలనీ వాటి సునిశిత విశిష్ట లక్షణాల వినిమయం జరగాలనీ ఉద్బోధించడం.
- మానవజాతిని విస్తృతమయిన తన ఆత్మగా గ్రహించి సేవ చేయడం.