గురుపౌర్ణమి విజ్ఞప్తి — 2025

4 జులై, 2025

“గురుదేవుల ఈ మాటలలో ఎంతటి మహత్తరమైన భరోసా ఉందో! ‘శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, నేను ముందుకంటే మీకు మరింత చేరువగా ఉంటాను.’ మీ జీవితంలో అత్యంత కష్టతరమైన లేదా పరీక్షా సమయాలలో కూడా, గురువు అక్కడే ఉన్నారని, అన్ని కష్టాలను పరిష్కరించగల లేదా భరించగల ఉన్నత చైతన్యానికి మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి తన రెండు చేతులు చాచి ఉన్నారని గుర్తుంచుకోండి.”

— శ్రీ శ్రీ దయామాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత

గురుపౌర్ణమి నాడు ఒక విశేష సమర్పణ చేయండి

మన ప్రియతమ గురుదేవులు, శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మనకు గుర్తుచేస్తున్నారు, ఒక నిజమైన గురువు, తన దివ్య దృష్టి ద్వారా, అందరిలోనూ దివ్యత్వాన్ని చూసి, ఇతరులను ఉన్నతీకరించడానికి ఆనందంగా తనను తాను అంకితం చేసుకుంటారని. గురు పౌర్ణమి అనేది, గురువులను — భగవంతుని ప్రేమ మరియు కాంతికి చెందిన దివ్య దూతలను — మనం సన్మానించే ఒక పవిత్ర సందర్భం.

ఆయన శిష్యులమైన మనకు, ఈ సందర్భం కేవలం ఒక వేడుక కంటే ఎక్కువ. ఆయన దివ్య ధర్మానికి సేవ చేయడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి, అత్యంత కృతజ్ఞతతో ఆయనకు మానసికంగా నమస్కరించడానికి ఇది ఒక తరుణం. మన గురువు నుండి మనం పొందిన ఆశీస్సుల గురించి మాత్రమే కాకుండా, మనం ఇతరులకు ఆయన కాంతికి మరియు కరుణకు సాధనాలుగా ఎలా మారగలమో కూడా ఆలోచించుకోవడానికి ఇది సమయం.

గురుదేవుల కార్యాన్ని ప్రేమపూర్వకంగా సేవ చేయడానికి ఒక అవకాశం

ఈ పవిత్ర సందర్భంలో మన ప్రియతమ గురువు చుట్టూ మన ఆలోచనలను మరియు హృదయాలను కేంద్రీకరించినప్పుడు, అనేక మంది భక్తులు అంతర్గతంగా ప్రేరేపించబడి ఇలా అడుగుతారు: “ఆయనకు అర్థవంతమైనదాన్ని నేను ఎలా తిరిగి సమర్పించగలను?”

ఈ గురుపౌర్ణమి నాడు, వై.ఎస్.ఎస్. చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని వ్రాయడానికి మీరు మాతో చేరాలని మేము ఆహ్వానిస్తున్నాము — దక్షిణ భారతదేశంలోని చెన్నైలో మొదటి వై.ఎస్.ఎస్. ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడంలో, అది సత్య-అన్వేషణ చేసే ఆత్మలందరికీ ప్రశాంతమైన మరియు శాంతియుత ఆశ్రయంగా మారుతుంది.

ఈ ఆధ్యాత్మిక ప్రాంగణం యొక్క ప్రాథమిక పనులు మరియు మొదటి దశ నిర్మాణం ₹65 కోట్లుగా అంచనా వేయబడింది — ఇది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గురుదేవుల గొప్ప ఆధ్యాత్మిక కుటుంబం యొక్క సమిష్టి భక్తి మరియు ప్రేమపూర్వక మద్దతుపై ఆధారపడిన ఒక పవిత్ర కార్యం.

గురుదేవుల వారసత్వంలో పాతుకుపోయిన ఒక దార్శనికత

పరమహంస యోగానందగారు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రభావం “ఒక మందమారుతంలా ప్రారంభమై, క్రమంగా శక్తి మరియు బలంలో పెరుగుతుందని, చివరకు, ఒక ప్రభంజనంలా , భగవంతుని బిడ్డల జీవితాలను కప్పివేసే చీకటిని మరియు మలినాలను తొలగించడానికి సహాయపడుతుందని” ముందే ఊహించారు. ఆయన ఆశీస్సులు రాంచీ, దక్షిణేశ్వర్, ద్వారహాట్ మరియు నోయిడాలోని ఆశ్రమముల ద్వారా వై.ఎస్.ఎస్. వృద్ధిని నిశ్శబ్దంగా పోషించాయి. అయినప్పటికీ, చాలా కాలం నుండి, భారతదేశంలోని విస్తారమైన దక్షిణ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆశ్రమం లేదు.

ఇప్పుడు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ కల నెరవేరుతోంది.

రిట్రీట్ నుండి ఆశ్రమానికి

మూడు వైపులా రిజర్వ్ అటవీ ప్రాంతం మరియు నాల్గవ వైపు ప్రశాంతమైన సరస్సుతో చుట్టుముట్టబడి, చెన్నై నుండి కేవలం 40 కి.మీ. దూరంలో, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ సమీపంలో మన్నూర్‌లో 17 ఎకరాల ప్రశాంతమైన పచ్చదనం మధ్యన ఉన్న యోగదా సత్సంగ చెన్నై రిట్రీట్ — 2010లో ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఒక పవిత్ర స్థలంగా ప్రారంభించబడింది.

2022లో యోగదా సత్సంగ పాఠాల తమిళ మరియు తెలుగు అనువాదాలు ప్రారంభించబడటంతో, ఆ ప్రాంతం నుండి పెరుగుతున్న సంఖ్యలో సత్య-అన్వేషణ చేసే ఆత్మలు పరమహంసగారి విముక్తినిచ్చే క్రియాయోగ బోధనల వైపు ఆకర్షితులయ్యారు.

ఈ పెరుగుతున్న ఆసక్తికి ప్రతిస్పందనగా, అందించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు క్రమంగా విస్తరించడానికి 2024లో రిట్రీట్‌లో ఒక నివాస సన్యాసి సంఘం స్థాపించబడింది. త్వరలోనే, ఈ రిట్రీట్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు కర్ణాటకలోని దక్షిణ రాష్ట్రాల నుండి, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుండి భక్తులను ఆకర్షించడం ప్రారంభించింది, తద్వారా ఇది ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఒక శక్తివంతమైన కేంద్రంగా మారింది.

ఇక్కడ జరిగిన వారాంతపు రిట్రీట్‌లు, సాధన సంగమాలు మరియు ప్రవచనాలు బాగా ప్రశంసించబడ్డాయి, ఎక్కువ మంది భక్తులు తమ సాధనను మరియు భగవంతునితో, గురుదేవులతో అనుసంధానాన్ని పెంపొందించుకోవడానికి రిట్రీట్ యొక్క ప్రశాంత వాతావరణాన్ని కోరుకున్నారు. ఈ ప్రాంతంలోని భక్తులకు మరింత ఆధ్యాత్మిక మద్దతును అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, మన పూజనీయులైన అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి, స్వామి చిదానంద గిరి, 2024 సెప్టెంబర్ 15న దీనిని అధికారికంగా యోగదా సత్సంగ శాఖ ఆశ్రమంగా ప్రకటించారు — దీనిని భారతదేశంలో ఐదవ వై.ఎస్.ఎస్. ఆశ్రమంగా స్థాపించారు.

ప్రశాంతమైన ఉద్యానవనాలలో ధ్యానం చేస్తున్న భక్తులు
స్వామి పవిత్రానంద సాధన సంగమం సమయంలో ప్రసంగిస్తున్నారు

ఈ పెరుగుతున్న ఆసక్తికి ప్రతిస్పందనగా, ఆశ్రమం వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తోంది: 

  • రోజువారీ సామూహిక ధ్యానాలు, ఆదివారపు సత్సంగాలు మరియు స్మారక కార్యక్రమాలు 
  • తమిళం, తెలుగు, కన్నడ మరియు ఆంగ్లంలో సాధన సంగమాలు మరియు రిట్రీట్‌లు. మలయాళంలో కూడా రిట్రీట్‌లు ప్రణాళిక చేయబడుతున్నాయి 
  • పిల్లల సత్సంగాలు, యువజన కార్యక్రమాలు మరియు స్వచ్ఛంద సేవకుల రిట్రీట్‌లు 
  • సన్యాసుల కౌన్సిలింగ్ మరియు సమీప కేంద్రాలకు అవుట్‌రీచ్ 
  • పరిసర ప్రాంతంలోని నిరుపేదలకు మద్దతుగా ధార్మిక సేవలు 
స్వామి శుద్ధానంద మరియు బ్రహ్మచారి నిరంజనానంద గురుపౌర్ణమి, 2024 నాడు ప్రభాత్ ఫేరీ సమయంలో గురుదేవుల చిత్రాన్ని పల్లకిలో మోస్తున్నారు
వై.ఎస్.ఎస్. సన్యాసులు నిరుపేదలకు సేవ చేయడానికి యోగదా సత్సంగ ఛారిటబుల్ మెడికల్ క్లినిక్‌ను ప్రారంభించారు

భక్తులు తమ హృదయపూర్వక అనుభవాలను పంచుకుంటున్నారు:

చెన్నై ఆశ్రమం కోసం ఒక దార్శనికతను రూపొందించడం: ప్రధాన ప్రణాళిక

కొత్తగా స్థాపించబడిన ఆశ్రమంలో కార్యక్రమాల విస్తరణతో, అసలు మౌలిక సదుపాయాల యొక్క కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి. ప్రారంభ నిర్మాణం సామాన్యమైనది, భక్తులకు, సేవకులకు మరియు సన్యాసులకు పరిమిత వసతి మరియు సౌకర్యాలను మాత్రమే అందించింది. ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాల పెరుగుతున్న స్థాయికి మద్దతు ఇవ్వడానికి ప్రస్తుత రిట్రీట్ భవనాలు రూపొందించబడలేదు.

ప్రస్తుత అవసరాలను తీర్చడానికి మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడానికి, పట్టణ ప్రణాళికారులు, వాస్తుశిల్పులు మరియు ఇతర నిపుణులతో సంప్రదించి ఒక సమగ్ర ప్రధాన ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడింది.

భారతదేశం మరియు నేపాల్‌కు ఇటీవల ఆయన చేసిన పర్యటనలో భాగంగా, స్వామి చిదానందగారు 2025 ఫిబ్రవరిలో వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమాన్ని మొదటిసారి సందర్శించారు. ఆయన సందర్శన సమయంలో, ఆయనకు ఆశ్రమ ప్రాంగణంలో పర్యటించి, ప్రతిపాదిత ప్రధాన ప్రణాళిక యొక్క స్థూలదృష్టిని అందించారు.

స్థల ప్రణాళిక – ఒక నిర్మాణ నమూనా

స్వామిజీ ఆశీస్సులతో, ఒక సమగ్ర ఆధ్యాత్మిక ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి రెండు-దశల నిర్మాణ ప్రణాళిక ఖరారు చేయబడింది — ఇది ప్రశాంతత, ఏకాంతం మరియు స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రణాళికలోని మొదటి దశను చేపట్టే ముందు, మనం కొన్ని ప్రాథమిక పనులను చేయాలి, దీనికి కొన్ని ప్రారంభ ఖర్చులు అవసరం.

ప్రాథమిక పనులు (₹10 కోట్లు)

  1. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న ఈశాన్య ప్రాంతంలో మట్టితో నింపి భూమిని చదును చేయడం.
  2. ప్రాంగణం యొక్క పరిధి చుట్టూ ఒక కాంక్రీట్ రోడ్డును, మరియు ఆశ్రమ ప్రాంగణంలోని వివిధ భాగాలను కలిపే అనేక నడకమార్గాలను నిర్మించడం.
  3. పరిధి రోడ్డు పక్కన వర్షపునీటి కాలువలు మరియు విద్యుత్ మరియు నెట్‌వర్క్ కేబుళ్లను వేయడానికి కందకాలు నిర్మించడం.
ఈశాన్య ప్రాంతంలో మట్టి నింపవలసిన ప్రదేశం, మరియు కాంక్రీట్ పరిధి రోడ్డు
వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమంలో స్థల వాస్తుశిల్పితో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానంద గిరి
మొదటి దశ: ధ్యాన మందిరం, వసతి మరియు పరిపాలనా భవనాలు (₹55 కోట్లు)
  • ధ్యాన మందిరం (1,200 మంది సామర్థ్యం)
  • భక్తుల వసతి భవనం (100 మంది సామర్థ్యం)
  • సన్యాసుల నివాసాలు (25 మంది సన్యాసుల కోసం)
  • వంటగది మరియు భోజనశాల (200 మంది సామర్థ్యం)
  • పిల్లల సత్సంగ సౌకర్యాలు
  • పరిపాలనా భవనం
  • వై.ఎస్.ఎస్. ప్రచురణల కోసం గిడ్డంగి
  • మురుగునీటి శుద్ధి కర్మాగారం
  • ల్యాండ్‌స్కేపింగ్ (ప్రదేశం అందంగా తీర్చిదిద్దడం)
ధ్యానమందిరం యొక్క నిర్మాణ నమూనాలు — ముఖభాగాల ఎలివేషన్లు
ధ్యాన మందిరం యొక్క నిర్మాణ నమూనాలు — పార్శ్వభాగాల ఎలివేషన్లు
భక్తుల వసతిభవనం యొక్క నిర్మాణ నమూనా – ముఖభాగపు ఎలివేషన్
గ్రౌండ్ ఫ్లోర్‌లో వంటగది మరియు భోజనశాల, మొదటి అంతస్తులో పిల్లల సత్సంగ సౌకర్యాలు మరియు బహుళ ప్రయోజన హాల్‌తో కూడిన భవనం యొక్క నిర్మాణ నమూనా

రెండవ దశ: భక్తుల సౌకర్యాల విస్తరణ & స్థిరమైన మౌలిక సదుపాయాలు (₹45 కోట్లు)

  • సత్సంగ మందిరం 
  • భక్తులకు అదనపు వసతి భవనాలు (200 మంది సామర్థ్యం) 
  • సేవకులకు నివాస గృహాలు 
  • యుటిలిటీస్ మరియు లాండ్రీ బ్లాక్ 
  • సౌర ఫలకాలు, నీటి ట్యాంక్ 

ప్రధాన ప్రణాళికను రూపొందించేటప్పుడు, ఉన్నటువంటి పచ్చదనాన్ని — ముఖ్యంగా మామిడి మరియు కొబ్బరి చెట్లను — వీలైనంత వరకు సంరక్షించడానికి మేము చాలా శ్రద్ధ తీసుకున్నాము. ప్రతి భవనం కార్యాచరణ మరియు కళాత్మక దృష్టి యొక్క సామరస్యపూర్వక సమ్మేళనాన్ని ప్రతిబింబించేలా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఈ సౌకర్యాలు రాబోయే తరాలకు — చిన్నవారు మరియు పెద్దవారు, దూరం నుండి మరియు దగ్గర నుండి — వేలాది మంది సాధకులకు సేవ చేస్తాయి.

ప్రాజెక్ట్ కాలక్రమం:

చెన్నై ఆశ్రమ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి షెడ్యూల్‌పై స్పష్టమైన చిత్రాన్ని అందించడానికి, ఈ క్రింది కాలక్రమం ప్రధాన దశలను వివరిస్తుంది:

దశప్రారంభంఆశించిన వ్యవధి
ప్రాథమిక పనులుజూన్ 2025*6 నెలలు
మొదటి దశజనవరి 20263 సంవత్సరాలు

*గమనిక: ప్రాథమిక దశ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 

మనందరం కలిసి నిర్మిద్దాం

ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక పనులు మరియు మొదటి దశకు మొత్తం ఆర్థిక అవసరం ₹65 కోట్లు. ఈ దివ్య దార్శనికతను సాకారం చేయడానికి మీ మద్దతును మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము.

ఈ పవిత్ర కార్యం మనలో ప్రతి ఒక్కరిలోనూ నిస్వార్థ గురు-సేవా స్ఫూర్తిని ఆహ్వానిస్తుంది. ప్రతి ప్రార్థన, ప్రతి సమర్పణ — ఎంత మొత్తమైనా సరే — సత్య-అన్వేషణ చేసే ఆత్మల కోసం నిర్మించబడుతున్న ఈ కాంతి మందిరంలో ఒక ఇటుక అవుతుంది.

మీరు ధ్యాన మందిరానికి విరాళం ఇవ్వడానికి, ఒక నిర్దిష్ట సౌకర్యానికి మద్దతు ఇవ్వడానికి లేదా విస్తృత దార్శనికత కోసం నెలవారీ బహుమతిని అందించడానికి ఆకర్షితులైనా — మీ దాతృత్వం రాబోయే సంవత్సరాలలో వేలాది మందికి పరమహంసగారి బోధనలను అందిస్తుంది, మరియు నిస్సందేహంగా ఆయన దివ్య ఆశీస్సులను ఆకర్షిస్తుంది.

గురుదేవులు ఇలా అన్నారు: “భగవంతుడు భక్తుల నిస్వార్థ సేవకు ప్రతిస్పందిస్తాడు; ప్రకృతి అంతటా స్పందించే ఆయన నిశ్శబ్ద ఆజ్ఞ తరచుగా రహస్యమైన మార్గాలలో వారి ప్రతి అవసరాన్ని నెరవేరుస్తుంది.”

మీ మద్దతును ఎలా అందించాలి

ఈ పవిత్ర కార్యానికి మద్దతు ఇవ్వడానికి మీరు ప్రేరేపించబడితే, మీరు ఈ క్రింది ఎంపికల నుండి ఎంచుకోవచ్చు:

పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడానికి లేదా ఈ ఆశ్రమ ప్రాజెక్టులోని ఒక నిర్దిష్ట అంశానికి మద్దతు ఇవ్వడానికి మీరు ప్రేరణ పొందినట్లయితే, మేము మీతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి సంతోషిస్తాము. దయచేసి వై.ఎస్.ఎస్. హెల్ప్‌డెస్క్‌ను (0651-6655 555, సోమ–శని: ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు) సంప్రదించడానికి సంకోచించకండి.

మా హృదయపూర్వక కృతజ్ఞతలు

మీ ప్రేమ మరియు ప్రార్థనలకు, మరియు గురుదేవుల కార్యానికి మీరు అందించే అనేక సేవలకు మేము చాలా కృతజ్ఞులం. మీ మద్దతుతో, యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం, చెన్నై, నిస్సందేహంగా గురుదేవుల కాంతి, ప్రేమ మరియు జ్ఞానాన్ని వచ్చే వారందరికీ ప్రసరింపజేసే ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వికసిస్తుంది.

మన ప్రియతమ గురుదేవులు మరియు మహాగురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండుగాక.

దివ్య స్నేహంతో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో పంచుకోండి