“భగవంతుడే నా స్వరం ద్వారా మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. సెల్ఫ్-రియలైజేషన్ [యోగదా సత్సంగ] వాణి సాక్షాత్తుగా భగవంతుని వాణి. దానిని అనుసరించండి. భగవంతుని కొరకు గాఢమైన ఆకాంక్ష గల మహాత్ములు ఈ మార్గాన్ని అనుసరిస్తూ, దైవ సాన్నిధ్యమనే సుధను గ్రోలుతున్నారు. ఈ బోధనలను ఆచరణలో పెట్టండి. జీవితం ఎంత సుందరంగా మారుతుందో మీరు కూడా చూస్తారు.”
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
ప్రియమైన దివ్యాత్మా,
గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మా అందరి తరఫున శుభాకాంక్షలు మరియు ప్రేమపూర్వక ప్రణామాలు.
మీ ప్రార్థనలు, సుహృద్భావం మరియు అచంచలమైన ఆదరణలతో ఈ సంవత్సరంలో లభించిన ఎన్నో ఆశీస్సులను మీతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.
ఈ సంవత్సరంలోని అనేక మైలురాళ్లలో ఇవి కొన్ని:
- మన గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి భారతదేశం మరియు నేపాల్ పర్యటన
- వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం కోసం ఒక బృహత్ ప్రణాళికను తయారు చేయడం
- ఈ సంవత్సరం జరిగిన కుంభమేళాలోని వై.ఎస్.ఎస్. శిబిరంలో వేలమంది ఆధ్యాత్మిక భారతదేశం యొక్క నిత్యానందమయమైన ఆత్మను అనుభవించారు
- ఆన్లైన్ ధ్యానకేంద్రాన్ని అదనపు ప్రాంతీయ భాషల్లో విస్తరించడం
- వివిధ భారతీయ భాషల్లో నూతన వై.ఎస్.ఎస్. ప్రచురణలు
- తొలి యువ సాధక సంగం
- గురుదేవుల “ఎలా జీవించాలి” ఆదర్శాలను రాబోయే తరం వాళ్ళు పెంపొందించుకునేందుకు సహాయపడే యువజన కార్యక్రమాలు
- వివిధ ధార్మిక మరియు ఆపత్సహాయ కార్యక్రమాలు
మీ వంటి భక్తుల ప్రేమ మరియు దాతృత్వంతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ విజయాల ఆనందాన్ని పాలుపంచుకోవడంలో మాతో చేరాలని మరియు తమ ఉత్కృష్టమైన క్రియాయోగ బోధనల ద్వారా మానవాళిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలన్న గురుదేవుల దివ్యలక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మాతో పాటు ప్రయాణాన్ని కొనసాగించాలని హృదయపూర్వకమైన కృతజ్ఞతతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ విరాళం –ఆన్‌లైన్ లో సమర్పించినా లేదా మీ దగ్గరలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమం, కేంద్రం లేదా మండలిలో సమర్పించినా – అసంఖ్యాక ఆత్మలకు దివ్య ప్రేరణ, ఆశ మరియు ఓదార్పును తీసుకురావడంలో సహాయపడుతుంది.
భగవంతుడు మరియు గురువుల ఆశీస్సులు మిమ్మల్ని మరియు మీ ప్రియతములను ఎల్లప్పుడు మార్గనిర్దేశం చేసి బలపరచుగాక.
దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు బాహ్యవ్యాప్తి కార్యక్రమాలు
ఈ సంవత్సరంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు బాహ్యవ్యాప్తి కార్యకలాపాలను వై.ఎస్.ఎస్. నిర్వహించింది:
- మన గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, నోయిడా మరియు ఖాట్మండులకు చేసిన పర్యటన వేలమంది భక్తులకు స్ఫూర్తినిచ్చి వారిని ఉద్ధరించింది
- వై.ఎస్.ఎస్. కుంభమేళా శిబిరం 2500 మందికిపైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ఆతిథ్యమిచ్చి, దైనందిన సామూహిక ధ్యానాలు, కీర్తనలు, సత్సంగాలు మరియు ధార్మిక వైద్య ఆసుపత్రి ద్వారా వేలమంది యాత్రికులకు సేవలందించింది
- వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో, భారతదేశం మరియు నేపాల్ లోని వివిధ నగరాల్లో సన్యాసులు నిర్వహించిన సాధనా సంగమాలు, బహిరంగ ఉపన్యాసాలు మరియు క్రియా దీక్షలలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు
- వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు మరియు 70,000 ఆన్‌లైన్ వీక్షణాలతో కలిపి, అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు వేలమందిని చేరాయి
- భారతదేశమంతటా 40 పుస్తక మహోత్సవాల్లో మనం పాల్గొనడం వల్ల అసంఖ్యాక అన్వేషకులకు గురుదేవుల బోధనలతో పరిచయం లభించింది








ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తుల కొన్ని ప్రత్యక్ష అనుభవాలను దిగువున ఇవ్వడమైనది:
“స్వామి చిదానందగారి ఒక-రోజు కార్యక్రమం ఒక పరివర్తనకారక అనుభవం... మూడు గంటల ధ్యానం నమ్మలేనంత గాఢంగాను మరియు ప్రశాంతంగాను అనిపించింది....నా సందేహాలు తొలగిపోతున్నట్లుగా అనిపించి, ఎంతో సౌఖ్యాన్ని, విశ్వాసాన్ని అనుభవించాను. ఆయన సందర్శన కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అంతకంటే చాలా గొప్పదైన ఒక మేలుకొలుపు. ఆయన పలుకులు, ఆయన ఉనికి, మరియు సమావేశం యొక్క సామూహిక శక్తి ఒక శాశ్వత అనుభవాన్ని సృష్టించాయి.”
“గురుదేవులు మరియు వై.ఎస్.ఎస్. దృష్టాంతాలుగా నిలిచే అన్ని లక్షణాలను – కరుణ, క్రమబద్ధత, దయ, ప్రశాంతత మొదలగు వాటిని – ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. నేను ఈ కార్యక్రమానికి, కేవలం స్వామి చిదానందగారిని వ్యక్తిగతంగా దర్శించాలని తప్ప, వేరేమీ ఆశించకుండా వచ్చాను. నేను ఎన్నడూ ఊహించని ఎన్నో గొప్ప శుభప్రదమైన విషయాలతో తిరిగి వెళ్ళాను.”
ఆశ్రమం మరియు కేంద్రాల అభివృద్ధి
దక్షిణ భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక మందిరాన్ని సృష్టించడం:
సెప్టెంబర్ 2024లో, మన గౌరవనీయ అధ్యక్షులు స్వామి చిదానందగారు, వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసమును పూర్తిస్థాయి వై.ఎస్.ఎస్. ఆశ్రమంగా అభివృద్ధి చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దైవానుసంధానం, దివ్య సహవాసం మరియు దివ్య ప్రేరణల కోసం ఈ ఆశ్రమం ఇప్పుడు, మరియు భవిష్యత్తులోను ఎంతోమంది సత్యాన్వేషకులను ఆకర్షించాలని మేము ప్రార్థిస్తున్నాం.
ఈ పవిత్ర దార్శనికతను నిజం చేయడానికి, అనుభవజ్ఞులైన వాస్తుశిల్పులు మరియు ఇంజనీర్ల నైపుణ్యం సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేయడం జరిగింది. ప్రకృతి మాత ఒడిలో ఉంటూనే — గురుదేవుల బోధనలపై చింతన, అధ్యయనం, గాఢమైన ధ్యానంలో భక్తులు లీనమయ్యేలా ప్రశాంతమైన, పచ్చని, అందమైన దృశ్యాలతో కూడిన ఆశ్రమ ప్రాంగణాన్ని సృష్టించడమే మా లక్ష్యం.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తమ పర్యటనలో భాగంగా, స్వామి చిదానందగారు చెన్నై ఆశ్రమాన్ని స్వయంగా సందర్శించి, ఈ బృహత్ ప్రణాళికను సమీక్షించి ఈ ప్రాజెక్టును ఆశీర్వదించారు.
ఈ ప్రాజెక్టు యొక్క ఆధారభూతమైన పనులు మరియు మొదటి దశ సంపూర్తికి ₹65 కోట్ల ఆర్థిక మొత్తం అవసరమవుతుంది. ఈ దివ్య కార్యాచరణ ఫలించడానికి మీ తోడ్పాటును మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
స్వామి స్మరణానంద ప్రసంగించారు.
తునిలో నూతన ధ్యాన మందిరం:
యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం — తుని (ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఉన్నది) కి చెందిన భక్తులు, అవిశ్రాంత అంకితభావం మరియు హృదయపూర్వక ఉత్సాహంతో అందమైన నూతన ధ్యాన మందిర నిర్మాణం పూర్తి చేశారని తెలియజేయడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. దీని ప్రారంభోత్సవం ఈ సంవత్సరం జులై 25న జరిగింది. ఈ పావన కార్యక్రమంలో 200 మందికి పైగా భక్తులు హాజరయ్యారు.
యువజన కార్యక్రమాలు మరియు విద్యాబోధన
యువ సాధక సంగమం:
2025 సెప్టెంబర్ 10 నుండి 14 వరకు రాంచీ ఆశ్రమంలో 23 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువ సాధకుల కోసం వై.ఎస్.ఎస్. నిర్వహించిన మొట్టమొదటి సాధనా సంగమంలో 200 కంటే ఎక్కువ మంది యువ సాధకులు పాల్గొన్నారు. జీవితంలో స్పష్టత, శక్తి మరియు లక్ష్యాలను అలవరుచుకోవడం కోసం పరమహంస యోగానందగారి సార్వత్రిక బోధనలపై యువతలో పెరుగుతున్న ఆసక్తిని ఈ ప్రత్యేక సమావేశం ప్రతిబింబించింది.
ఆలోచనాత్మకంగా రూపొందించబడిన ఈ కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానాలు, వై.ఎస్.ఎస్. పాఠాల సామూహిక అధ్యయనం, వర్క్ షాప్-లు, సేవా అవకాశాలు, వినోదం, మరియు రాత్రిపూట ఆత్మపరిశీలన ఉండేవి — వీటిలో ప్రతి అంశం గురుదేవుల బోధనలపై ఆధారితమై, సమతుల్య జీవన విధానానికి ప్రేరణనిస్తుంది. యువ భక్తులు గురుదేవుల మార్గదర్శకత్వంలో లీనమయ్యేందుకు, శాశ్వత ఆధ్యాత్మిక స్నేహాలను నిర్మించుకొనేందుకు, మరియు తమ అంతర్గత జీవితాలను బలోపేతం చేసుకొనేందుకు ఆచరణాత్మక సాధనాలతో ఇంటికి తిరిగి వెళ్ళేలా ఈ సంగమం ఒక పావనమైన అవకాశాన్ని కలుగజేసింది.



రాంచీ, నోయిడా, ద్వారాహాట్, మరియు చెన్నైలలో బాలల కోసం వేసవి శిబిరాలు:
పరమహంస యోగానందగారి సరళమైన, ఆరోగ్యకరమైన జీవన ఆదర్శం నుండి ప్రేరణ పొందిన బాలుర మరియు బాలికల వార్షిక వేసవి శిబిరాలు ఈ సంవత్సరం, రాంచీ, నోయిడా, ద్వారాహాట్ మరియు చెన్నైలలోని మా ఆశ్రమాలలో ఆనందంగా నిర్వహించబడ్డాయి. అనుభవజ్ఞులైన భక్త-ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో, పిల్లలు ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసం, సంకల్ప శక్తి మరియు ఆత్మపరిశీలన గురించి తెలుసుకోవడానికి “జీవించడం ఎలా” తరగతుల శ్రేణిలో పాల్గొన్నారు. వారి రోజువారీ కార్యక్రమాలు సామూహిక ధ్యానాలు, శక్తిపూరణ వ్యాయామాలు, యోగాసనాలు మరియు చిత్రలేఖనం మరియు చేతిపనులు వంటి సృజనాత్మక కార్యకలాపాలను కూడి ఉండేవి.
రాంచీలోని జగన్నాథ్ పూర్ లోని వై.ఎస్.ఎస్. విద్యా సంస్థలు:
రాంచీలోని వై.ఎస్.ఎస్. విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విద్యా ఫలితాల్లో అత్యుత్తమ విజయాలు సాధించారు. ఈ విజయాలు మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషికి మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక విలువల్లో పాదుకొని, శ్రేష్టత కోసం కృషి చేయడానికి యువ మనస్సులను ప్రేరేపించే గురుదేవుల “జీవించడం ఎలా” సూత్రాల యొక్క ఉత్తేజకరమైన ప్రభావానికి కూడా నిదర్శనంగా నిలుస్తాయి.
ఆన్లైన్ మరియు డిజిటల్ బాహ్యవ్యాప్తి
వై.ఎస్.ఎస్. వెబ్ సైట్ బెంగాలీ మరియు కన్నడ భాషలలో ఇప్పుడు అందుబాటులో ఉంది:
ఆన్లైన్ ధ్యాన కేంద్రంలో విస్తరించబడిన కార్యక్రమాలు:
భారతదేశమంతటా భక్తులకు మెరుగైన సేవలందించేందుకు, ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, కన్నడం, తమిళం మరియు తెలుగులో నిర్వహిస్తున్న భక్తుల నేతృత్వంలోని ధ్యానాలను ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం మలయాళంలో కూడా పరిచయం చేసింది. ఇంకా, శుక్రవారం కొనసాగుతున్న ప్రాథమిక పాఠాల అధ్యయన బృందంతో పాటు, అనుబంధ పాఠాల అధ్యయన బృందం కూడా ప్రతి సోమవారం సాయంత్రం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమాలు, వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం దగ్గరలో నివసించని ఎంతో మంది గృహాలలోకి గురుదేవుల బోధనలు తీసుకువచ్చేందుకు సహాయపడుతూ, సామూహిక ధ్యానం మరియు ఆధ్యాత్మిక అధ్యయనం యొక్క ఆశీస్సులను వారికి తీసుకువస్తున్నాయి.
నూతన ప్రచురణలు మరియు అనువాదాలు




- పదహారు వై.ఎస్.ఎస్. ప్రచురణలు (ముద్రణా రూపంలో) వివిధ భారతీయ భాషల్లో విడుదలయ్యాయి.
- బెంగాలీ, నేపాలీ మరియు ఒడియా భాషల్లో ఒక యోగి ఆత్మకథ అనువాదాలతో కూడిన ఏడు నూతన ఈ-పుస్తకాలు విడుదలయ్యాయి.
- ఒక యోగి ఆత్మకథ ఆడియో పుస్తకాలను నేపాలీ మరియు మలయాళంలో వై.ఎస్.ఎస్. ఆవిష్కరించింది.
ధార్మిక మరియు మానవతావాద కార్యకలాపాలు
ఉత్తరాఖండ్ సహాయక చర్యలు:
ఉత్తరాఖండ్ లో జరిగిన మేఘవిస్ఫోటనం, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన సందర్భాలలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించింది. సెప్టెంబరులో, వై.ఎస్.ఎస్. సన్యాసులైన స్వామి ఈశ్వరానంద మరియు స్వామి ధైర్యానంద ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామిని డెహ్రడూన్ లో కలిసి, కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹25 లక్షల చెక్కును అందించారు.



వైద్యసహాయ కార్యక్రమాలు:
వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం నుండి కేవలం 1.5 కి.మీ. దూరంలో ఒక ధార్మిక ఆసుపత్రి ఈ సంవత్సరం జూన్ లో ప్రారంభించబడింది. వారానికి అయిదు రోజులు తెరిచి ఉండి, ఉచిత సంప్రదింపులు మరియు మందులను అందించే ఈ ఆసుపత్రి ఇప్పటికే వెయ్యి మందికి పైగా రోగులకు ఆరోగ్య సంరక్షణ అందించింది.
వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమం, అట్టడుగు వర్గాలకు ఎంతగానో అవసరమైన ఆరోగ్య సంరక్షణను అందించిన మూడు వైద్య శిబిరాలను నిర్వహించింది, ఈ శిబిరాల ద్వారా 2,000 మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారు.
వార్షిక స్కాలర్‌షిప్‌లు:
పేద నేపథ్యం నుండి వచ్చిన అర్హులు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా వై.ఎస్.ఎస్. వారికి సేవను కొనసాగిస్తోంది. గత సంవత్సరం, ₹75 లక్షల స్కాలర్‌షిప్‌ల పంపిణీ జరిగింది.
విజ్ఞప్తిని పూర్తిగా చదవడానికి (ఆంగ్లంలో), దయచేసి క్రింద ఉన్న బటన్ క్లిక్ చేయండి.
మీ సహాయాన్ని గాఢంగా అభినందిస్తున్నాము
గురుదేవుల పవిత్ర కార్యాచరణ యొక్క వృద్ధి కొనసాగుతూ ఉండడంతో, సత్యం మరియు ఆంతరంగిక శాంతిని కోరుకొనే చిత్తశుద్ధి గల అన్వేషకులకు సేవ చేసే నూతన అవకాశాలు మనముందు విస్తరిస్తున్నాయి. ఈ దివ్యకార్యాచరణ, గురుదేవుల యొక్క ఆత్మవిముక్తిని కలిగించే క్రియాయోగ సందేశాన్ని, భగవంతుడి ప్రేమ మరియు కాంతి కోసం ఆరాటపడే అసంఖ్యాక ఆత్మలకు అందించడంలో సహాయపడే మీ వంటి భక్తుల స్థిరమైన ప్రేమ మరియు ఉదార సహాయాలతో మాత్రమే కొనసాగుతుంది.
ఈ పవిత్ర కార్యంలో మాతో చేరమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. donateyss.org లో ఆన్‌లైన్ విరాళం ద్వారా లేదా మీ సమీప వై.ఎస్.ఎస్. ఆశ్రమం, కేంద్రం లేదా మండలిని సందర్శించడం ద్వారా మీరు చేసే సమర్పణ, అసంఖ్యాక ఆత్మలకు దివ్య ప్రేరణ, ఆశ మరియు ఓదార్పును తీసుకువచ్చేందుకు మాకు సహాయపడుతుంది.
ఈ పవిత్రమైన కార్యం కోసం మీరు చేసే ప్రార్థనలు, మరియు మీరు ఉత్సాహంగా సామూహిక ధ్యానాలు మరియు సేవలలో పాల్గొనడం, మరియు గురుదేవుల బోధనలను ప్రతిరోజూ సాధన చేయడం వంటివి భగవంతుడికి, గురువులకు మరియు మాకు ఎంతో అమూల్యమైనవి. మద్దతు యొక్క ప్రతి వ్యక్తీకరణ, ఏ రూపంలోదైనా, మన ప్రియతమ గురుదేవుల ప్రేమ మరియు ఆనందాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేసే ఒక పవిత్ర మార్గమవుతుంది.



















