YSS

గాఢమైన ధ్యానం కోసం పరమహంసగారితో కలిసి విశ్వగీతాలు గానం చేయడం

దుర్గామాత జ్ఞాపకాలు

పరమహంస యోగానందగారి తొలినాటి సన్నిహిత శిష్యుల్లో దుర్గామాత (1903-1993) ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఆయన తన కార్యకలాపాలు విస్తరించడంలో ఆమె ప్రత్యేక పాత్ర పోషించారు. ఆ మహా గురువు మొదటి తరం ఇతర శిష్యులతో పాటు దుర్గామాతచాలా ఏళ్లపాటు ఆయనకు వ్యక్తిగతంగా సేవాసహకారాలందించారు, తద్ద్వారా భక్తితో పాడడం అనేది ఆయన నుండి నేరుగా నేర్చుకొన్నారు.

తమ దినచర్యనుండి ఆటవిడుపుగా ఏదో ఒక ప్రశాంతంగా ఉండే అటవీ ప్రదేశానికో, మరెక్కడికో గురువుగారితో పాటు వెళ్ళేవారిలో ఆమెకూడా ఉండేవారు. అలాంటి ఒక సందర్భాన్ని ఆమె తరచూ ప్రస్తావించేవారు:

“గురువుగారు ఒకసారి పామ్ కేన్యన్ జలపాతం దగ్గర ఉన్న ఎడారికి కొందరు శిష్యులతో వెళ్ళడం నాకు గుర్తుంది. మేము క్రింద లోయలోకి వెళ్ళి ధ్యానం చేశాము. అప్పుడు గురువుగారు గాఢమైన సమాధిలోకి వెళ్ళిపోయారు, నేను ఆయనకు దగ్గరలో లేను. ఒక పెద్ద రాతి మీద నేను ఒంటరిగా ధ్యానం చేసుకుంటున్నాను. కొంత సేపటి తరువాత ఆయన మమ్మల్నందరినీ హౌస్ కార్ దగ్గరకు తిరిగిరమ్మని పిలిచారు. ఆ లోయగుండా వెళ్ళే మార్గంలో ఆయన నడుస్తుంటే నేను ఆయన వెనుకనే దగ్గరగా నడుస్తున్నాను, ఒక్కసారిగా ఆయననుండి బ్రహ్మాండమైన నిశ్చలత్వం వెలువడుతుండడం నాకు అనుభూతమైంది. అది నా లోపలినుండి కాదు, ఆయన నుండి వెలువడుతోంది. ఆయన తేజో స్పందనల పరిధిలో ఉండేటంత దగ్గరగా నేను ఉన్నానన్నమాట. వెంటనే నన్నది గాఢమైన భావాతీత నిశ్చలతత్వంలోకి లేవనెత్తింది. నేను నడక కొనసాగించాను, నా చుట్టూ జరుగుతున్నది నాకు తెలుస్తూనే ఉంది — దారిలో రాళ్ళు అడ్డువచ్చి నేను ఆగాల్సి రావడం నేను చూస్తూనే ఉన్నాను. అయినా నేను నా శరీరాన్ని అనుభూతి చెందడం లేదు. ఇక్కడ సర్వవ్యాపిత నిశ్చలత్వం మాత్రమే ఉంది. నేను శరీరంలో ఉన్నానన్న భావనే నాకు లేదు.

“అప్పుడు గురువుగారు వెనక్కి నా వైపు తిరిగి: ‘కొన్ని పుల్లలు పోగుచెయ్యి. మనం మంట వేసుకోవాలి,’ అన్నారు. నేను కొంత కలప పోగుచేసి ఆ బరువుతో నడిచాను — కానీ ఆ ఆనంద భరిత నిశ్చలత్వం లోంచి ఒక్క రవ్వ కూడా నేను కోల్పోలేదు. నా మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది — అశాంతికరమైన ఒక్క ఆలోచన గాని, అల గాని లేదు, కానీ నేను అంతా చూస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. మేము హౌస్ కార్ దగ్గరకు వచ్చాక నా బరువు కింద పెట్టాను. అప్పుడు ఆయన నా వైపు తిరిగి అన్నారు: ‘నిశ్చలత్వమే ఈశ్వరుడు.’

“అదొక గొప్ప పాఠం. మనము ఈశ్వరుడి ప్రతి రూపాలుగా సృష్టి అయ్యాము; గురువుగారు తరచూ చెబుతున్నట్టు: ‘భగవంతుడిక్కడే, మనలోపలే ఉన్నాడు. ఆయనను మీరేందుకు చూడరు? ఎందుకంటే మీరు వేరే అన్ని వైపులకీ చూస్తున్నారు.’ మీ చైతన్యాన్ని నిరంతరం బాహ్యం వైపు పోనివ్వకుండా, లోపలికి మరలించి అక్కడే నిలుపుకోగలిగితే మీరాయనను ఈరోజు, రేపు, ఎప్పుడంటే అప్పుడు దర్శించగలరు.”

భక్తితో గానం చేయడం అనే కళ గురించి పరమహంస యోగానందగారి దగ్గర తాను అందుకున్న శిక్షణను దుర్గామాత తరచుగా భక్త సమూహాలతో కలిసినప్పుడు వారితో పంచుకొనేవారు. ఈ సమావేశాలు భక్తులకు గురువుగారి కీర్తనలలోని పదాలు, స్వరాలు నేర్చుకొనే అవకాశం ఇవ్వడమే కాక ఏకాగ్రతతో, భావస్ఫూర్తితో, భక్తితో గానం చేయడం కూడా నేర్చుకొనే వీలు కల్పించేవి. ఈ క్రిందది ఆయా సందర్భాలలో ఆవిడ చేసిన వ్యాఖ్యల సంకలనం:

“మన మనసును ప్రశాంత పరచి, అంతర్ముఖం చేసే అద్భుతమైన విధానం భక్తితో గానం చేయడం…అశాంతి అనే మట్టి, మన మనసుల్లో పేరుకొన్న చెత్త అంతా అడుగుకు పోయి ఈశ్వరుడు అనే సత్యాన్ని తేటగా దర్శించడానికి ఇది సహాయ పడుతుంది.”

“భక్తితో గానం చేయడం అనేది, గురుదేవులు చెప్పేటట్టుగా, ఈశ్వరుడిని తెలుసుకునే ఒక మార్గం… మనం భక్తితో గానం చేసినపుడు మన మనసును అదుపు చేసి ఆ పాటలోని భావంపై దాన్ని ఏకాగ్రం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. అప్పుడు పాడడం పూర్తి అయేసరికి మనం ఆ భావానికి, గానానికి, స్వరాలకు అతీతంగా, సులభంగా, నిశ్శబ్ద ధ్యానంలోకి వెళ్ళగలుగుతాము. అప్పుడే ఈశ్వరుడు మన వద్దకు రాగలడు: నిశ్శబ్ద, అంతరిక మానసిక నిశ్చలత్వంలో.

“గురువుగారు ఈ గీతాలను కూర్చినపుడు వాటిని — అవి అధ్యాత్మీకరించబడతాయి అని ఆయన చెప్పిన విధంగా జరిగేవరకు — మళ్ళీ, మళ్ళీ పాడేవారు. అంటే తాను ఈ గీతాల్లో వాడిన ప్రతీ పదం వెనుకా ఉన్న అధ్యాత్మికతను తాను స్వయంగా అనుభూతి చెందేవరకూ తాను పాడేవారన్నమాట. ఆయన వాటిని తన స్వరంతో మాత్రమే కాక, తన హృదయం, మనసు, ఇంకా ముఖ్యంగా తన ఆత్మతో గానం చేసేవారు. ఇక మేము ఆయనతో కలిసి పాడేటప్పుడు మేము నిజంగా అందులో లీనమైతే ఆయనకు అనుభవమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఆయన చైతన్యంలోంచి పొంగిపొరలి మాలోకి ప్రవహించి, ఆయన అనుభవిస్తున్న ఆనందానుభూతి మాకు కూడా కొంత రుచి చూపించేది.”

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp