పరమహంస యోగానందగారిని కలిసిన అనుభవం

డా. బినయ్ రంజన్ సేన్, ద్వారా

డాక్టర్ సేన్ అమెరికాకు మాజీ భారత రాయబారి మరియు ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్. ఆయన దీనిని 1990లో శ్రీ దయామాత రాసిన ఫైండింగ్ ద జాయ్ వితిన్ యు అనే పుస్తకానికి పీఠికగా రాశారు.

దాదాపు నలభై సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారిని కలిసే అదృష్టం నాకు కలిగింది, ఆ దివ్య ఆత్మ యొక్క స్ఫూర్తి మరియు బోధనలు ఈ ఉపన్యాసాల సంపుటిలో గురుదేవుల ప్రముఖ శిష్యురాలు శ్రీ దయామాత మానోహరంగా వివరించారు. శ్రీ పరమహంసగారిని కలిసిన అనుభవం నా జీవితంలో మరపురాని సంఘటనలలో ఒకటిగా నా జ్ఞాపకాలలో చెక్కబడింది. ఇది 1952 మార్చిలో జరిగింది. నేను 1951 చివరలో యునైటెడ్ స్టేట్స్‌లో భారత రాయబారిగా నా విధులను చేపట్టాను. అపుడు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే అధికారిక పర్యటనలో ఉన్నాను. నేను లాస్ ఏంజిలిస్ వచ్చిన తరువాత, నా మనస్సులో ఉన్న అన్నింటి కన్నా ముఖ్యమైన ఆలోచన, యునైటెడ్ స్టేట్స్‌లోనే కాదు, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఎవరి సెల్ఫ్-రియలైజేషన్ బోధనలు గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించాయో ఆ పరమహంసగారిని కలవడం.

పరమహంసగారి గురించి మరియు ఆయన రచనల గురించి గాని నేను చాలా విన్నప్పటికీ, మౌంట్‌ వాషింగ్టన్లోని సెల్ఫ్-రియలైజేషన్ సెంటర్‌లో నాకు ఎదురైన దాని కోసం నేను నిజంగా సిద్ధంగా లేను. నేను అడుగుపెట్టిన క్షణం నుండి, మూడు వేల సంవత్సరాల క్రితం పవిత్ర గ్రంథాలలో మనం చదివిన పురాతన ఆశ్రమాలలో ఒకదానికి నేను వెళ్ళినట్లు అనిపించింది. ఇక్కడ తన శిష్యులతో పరివేష్టింపబడిన ఒక గొప్ప ఋషి (ఆత్మ సాక్షాత్కారం పొందిన ఋషి), సన్యాసి (పరిత్యాగి) కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఇది కల్లోలాలకు గురయ్యే ఒక ఆధునిక యుగ సముద్రంలో ఉన్న ఒక దివ్య శాంతి మరియు ప్రేమ ద్వీపంగా అనిపించింది.

పరమహంసగారు నన్ను, నా భార్యను పలకరించడానికి ద్వారం వద్ద ఉన్నారు. ఆయన్ని చూసినపుడు కలిగిన ప్రభావం అనిర్వచనీయమైనది. నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని దివ్యానుభూతి కలిగింది. నేను ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు, ఆ కాంతితో నా కళ్ళు ఎంతో సమ్మోహనాభరితమయ్యాయి – ఆయన నుండి అక్షరాలా ఆ ఆధ్యాత్మిక కాంతి ప్రకాశించింది. ఆయనలోని అంతులేని దయ, వారి అనుగ్రహాపూర్ణకారుణ్యము, నా భార్యను మరియు నన్ను వెచ్చని సూర్యరశ్మిలా చుట్టుముట్టాయి.

తరువాతి రోజులలో, గురుదేవులు ఆయన గడప గలిగిన ప్రతి నిమిషాన్ని మాతో కలసి పంచుకొన్నారు. మేము భారతదేశం యొక్క ఇబ్బందుల గురించి మరియు ఆ దేశ ప్రజల పరిస్థితులను మెరుగుపరచడానికి మన నాయకులు వేస్తున్న ప్రణాళికల గురించి విపులంగా మాట్లాడుకున్నాం. ఆయన ఎంతో ఆధ్యాతిక చింతనాపరుడైనప్పటికీ, ఆయన అవగాహన మరియు అంతర్దృష్టి మామూలు ప్రాపంచిక సమస్యలకు కూడా విస్తరించి ఉన్నదని నేను తెలుసుకున్నాను. భారతదేశపు ప్రాచీన జ్ఞాన సారాంశాన్ని ప్రపంచానికి అందించి, వ్యాపింపచేసే ఆయనలో నేను భారతదేశం యొక్క ఒక నిజమైన రాయబారిని చూశాను.

బిల్ట్‌మోర్ హోటల్‌లోని అధికారిక విందులో వారితో గడిపిన చివరి సన్నివేశం నా మనస్సులో ఒక శాశ్వత దృశ్యంగా ముద్రితమైంది. ఈ సంఘటనల ప్రస్తావన మరోచోట వివరింపబడింది; ఇది ఒక వాస్తవ మహాసమాధి దృశ్యం. అటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగే విధంగా, ఒక గొప్ప ఆత్మ నిష్క్రమించిందని వెంటనే స్పష్టమైంది. మాలో ఏ ఒక్కరికీ ధుఖించాలని అనిపించిందని నేను అనుకోను. ఒక దివ్య ఘటనను చూసిన ఆ అనుభూతి అన్నింటికంటే ఎంతో అద్భుతమైనది.

ఆ రోజు నుండి నా వృత్తి నన్ను చాలా దేశాలకు తీసుకెళ్లింది. శ్రీ పరమహంసగారి దివ్య కాంతితో ప్రభావితమయిన ఎంతోమంది దక్షిణ అమెరికా, యూరప్ మరియు భారతదేశాలలో, నన్ను కలసి, నేను హాజరైన ఆయన జీవిత చివరి రోజుల గురించి, ఛాయాచిత్రాలతో ఎంతో విస్తృతంగా ప్రచురించబడిన, ఈ అద్భుత వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పమని అడిగారు. ఈ సమస్యాత్మక కాలంలో వారి జీవిత గమ్యానికి కోరుకుంటున్నారని నన్ను కలిసిన వారి ఆతృత బట్టి నేను గ్రహించాను. గురుదేవులు ఆరంభించిన పని ఆయన పరమపదించడంతో అంతం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలపై దాని వెలుగును నింపడం నేను చూస్తున్నాను.

ఎక్కడా లేని విధంగా పావన శిష్యురాలైన శ్రీ దయామాతలో ఆయన అందించిన సంప్రదాయం వెల్లివిరిసింది, తన వారసత్వంగా తన అడుగుజాడల్లో కొనసాగడానికి ఆమెను సిద్ధంచేశారు. ఆమెతో ఇలా అన్నారు, “నేను పోయిన తరువాత, కేవలం ప్రేమ మాత్రమే నా స్థానంలో ఉంటుంది.” దాదాపు నలభై సంవత్సరాల క్రితం సెల్ఫ్-రియలైజేషన్ కేంద్రానికి నా మొదటి సందర్శనలో నన్ను ఆకట్టుకున్న స్ఫూర్తి, నాలా పరమహంసగారిని కలియగలిగిన అదృష్టవంతులందరికీ ఆయన దైవ ప్రేమ, దయ యొక్క అదే స్ఫూర్తిని దయామాతగారిలో ప్రతిబింబించిందని చూశారు. ఈ సంపుటిలో నమోదు చేయబడిన ఆమె మాటలలో, మనకు మన అద్భుత గురుదేవుల నుండి ఆమె జీవితంలోకి వెలువడిన జ్ఞానం మరియు ప్రేమలను ఒక అమూల్యమైన బహుమతిగా పొందుతాము, అంతేకాదు అది నా జీవితముమీద కూడా చెరగని ముద్ర వేసింది.

మన ప్రపంచం కొత్త సహస్రాబ్ది వైపు కదులుతుండగా, మనము మునుపెన్నడూ లేని విధంగా చీకటి మరియు గందరగోళానికి గురవుతున్నాము. సార్వత్రిక ప్రేమ, అవగాహన మరియు ఇతరుల పట్ల దయ వంటి కొత్త స్ఫూర్తులతో, దేశం ప్రతిగా దేశం, మతం ప్రతిగా మతం, మనిషి ప్రతిగా ప్రకృతి వంటి పాత విధానాలను మనం అధిగమించాలి. ఇది భారతదేశపు జ్ణానుల అమర సందేశం – శ్రీ పరమహంస యోగానందగారు మన ప్రస్తుత కాలానికి మరియు రాబోయే తరాల కోసం తీసుకువచ్చిన సందేశం. ఇప్పుడు శ్రీ దయామాత చేతిలో ఉన్న ఆయన వదిలిపెట్టిన దివిటీ, గమ్యాన్ని వెతుకుతున్న లక్షలాదిమంది ప్రజలకు వారి జీవిత మార్గంలో కాంతి నింపుతాయని ఆశిస్తున్నాను.

ఇతరులతో షేర్ చేయండి