ఆ గొప్ప గురువు యొక్క ప్రసంగాలు మరియు తరగతులను రికార్డ్ చేయడం

శ్రీ శ్రీ దయామాత

పరమహంస యోగానందగారి సంభాషణలు మరియు వ్యాసాల నుండి సేకరించబడిన మూడు సంపుటాలకు దయామాతగారి ముందుమాట నుండి

పరమహంస యోగానందగారిని నేను మొదటిసారి చూసినప్పుడు, సాల్ట్ లేక్ సిటీలో విస్తారమైన, పరవశులైన ప్రేక్షకుల ముందు ఆయన ప్రసంగిస్తున్నారు. అది 1931వ సంవత్సరం. నేను కిక్కిరిసిన ఆడిటోరియం వెనుక నిల్చున్నప్పుడు, వక్త మరియు ఆయన మాటలు తప్ప నా చుట్టూ ఉన్న ఏదీ తెలియకుండా నేను నిశ్చేష్టితురాలయ్యాను. నా ఆత్మలోకి ప్రవహిస్తున్న మరియు నా హృదయాన్ని మరియు మనస్సును నింపేస్తున్న జ్ఞానం మరియు దివ్య ప్రేమలో నా సర్వస్వం లీనమయ్యింది. నేను ఇలా మాత్రమే ఆలోచించగలిగాను, “నేను ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమించాలని కోరుకున్నట్లే ఆయన కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయనకు దేవుడు తెలుసు. నేను ఆయన్నే అనుసరిస్తాను.” మరియు ఆ క్షణం నుండి, నేను అదే చేశాను.

పరమహంసగారితో తొలిరోజులలో ఆయన మాటల రూపాంతర శక్తిని నా స్వంత జీవితంలో అనుభవించినప్పుడు, ఆయన మాటలను ప్రపంచమంతటి కోసం ఎల్లకాలం పాటు భద్రపరచవలసిన తక్షణ ఆవశ్యకతగా నాకు అనిపించింది. పరమహంస యోగానందగారితో నేను కలిసి ఉన్న చాలా సంవత్సరాలలో, ఆయన ఉపన్యాసాలు మరియు తరగతులు, అనేక అనధికారిక సంభాషణలు మరియు వ్యక్తిగత సలహాలను రికార్డ్ చేయడం నా పవిత్రమైన మరియు ఆనందకరమైన హక్కుగా మారింది – నిజంగా విస్తారమైన, అద్భుతమైన జ్ఞానం మరియు భగవంతుని ప్రేమ యొక్క కోశాగారం.

గురుదేవులు మాట్లాడుతున్నప్పుడు, వడిగా సాగే ఆయన ప్రసంగంలో, ప్రేరణా ప్రవాహం తరచుగా ప్రతిబింబించేది; ఆయన ఒక సమయంలో నిమిషాల పాటు విరామం లేకుండా మాట్లాడవచ్చు మరియు ఒక గంట పాటు కొనసాగించవచ్చు. ఆయన శ్రోతలు పరవశించి కూర్చుంటే, నా కలం వాయువేగముతో వెళ్ళేది! నేను ఆయన మాటలను సంక్షిప్తలిపిలో వ్రాస్తునప్పుడు, గురుదేవుల స్వరాన్ని పుటలలోని అక్షరాలలోకి అనువదిస్తున్నప్పుడు, తక్షణమే నాపై ఒక ప్రత్యేకమైన దయ ప్రసరించేది. వారి లిప్యంతరీకరణ ఈనాటికీ కొనసాగుతున్న ఆశీర్వాదించబడిన కార్యం. చాలా కాలం తర్వాత కూడా నా నోట్స్‌లో కొన్నింటిని నేను లిప్యంతరీకరణ ప్రారంభించినప్పుడు అవి నలభై సంవత్సరాలకుపైగా పాతవైనా, అవి నిన్న రికార్డ్ చేయబడినట్లుగా నా మనస్సులో అద్భుతంగా తాజాగా ఉన్నాయి. నేను ప్రతి ప్రత్యేక పదబంధంలో గురుదేవుల స్వరంలోని అంతర్లీనాలను కూడా వినగలను.

గురుదేవులు తన ఉపన్యాసాల కోసం చాలా అరుదుగా, అతి తక్కువగా సన్నాహం చేసుకునేవారు; ఆయన ఏదైనా సిద్ధం చేసినట్లయితే, అది త్వరితగతిన వ్రాసిన వాస్తవమైన ఆనవాళ్ళు లేదా త్వరగా వ్రాసుకున్నది, రెండూ కలిగి ఉండవచ్చు. చాలా తరచుగా, కారులో గుడికి వెళ్ళే దారిలో వెళుతున్నప్పుడు, ఆయన మాలో ఒకరిని మామూలుగా అడిగేవారు: “ఈ రోజు నేను మాట్లాడాల్సిన విషయం ఏమిటి?” ఆయన దాని మీద తన మనస్సును ఉంచేవారు, ఆపై దివ్య ప్రేరణతో అంతర్గత తటాకము నుండి ఉపన్యాసాన్ని హఠాత్తుగా ఇచ్చేవారు.

ఆలయాలలో గురుదేవుల ఉపన్యాసాలకు సంబంధించిన అంశాలను ముందుగానే ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగేది. కాని కొన్నిసార్లు ఆయన మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆయన మనస్సు పూర్తిగా భిన్నమైన నాళములో పని చేసేది. “ఆ రోజుకి సంబంధించిన అంశం” తో సంబంధం లేకుండా, ఆ సమయంలో గురుదేవులు తన చైతన్యంలో మునిగిపోయి ఉన్న సత్యాలను వినిపించేవారు, తన స్వంత ఆధ్యాత్మిక అనుభవం మరియు సహజమైన అవగాహన యొక్క సమృద్ధి నుండి అమూల్యమైన జ్ఞానాన్ని స్థిరమైన ప్రవాహంలో కురిపించేవారు. దాదాపు ఎల్లప్పుడూ, అటువంటి సేవా కార్యక్రమం ముగింపులో, చాలా మంది వ్యక్తులు తమను ఇబ్బంది పెడుతున్న సమస్యపై జ్ఞానోదయం కలిగించినందుకు లేదా తమకు ప్రత్యేకంగా ఆసక్తి కలిగి ఉన్న కొన్ని తాత్విక భావనలను వివరించినందుకు కృతజ్ఞతలు తెలపడానికి ముందుకు వచ్చేవారు.

కొన్నిసార్లు, ఆయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, గురుదేవుల చైతన్యం ఎంత ఉన్నతంగా ఉండేదంటే, ఆయన క్షణం పాటు ప్రేక్షకులను మరచిపోయి దేవునితో నేరుగా సంభాషించేవారు; ఆయన సంపూర్ణ జీవం, దివ్యానందం మరియు మైమరిపించే ప్రేమతో పొంగిపోయేది. చైతన్యం యొక్క ఈ ఉన్నత స్థితులలో, ఆయన మనస్సు పూర్తిగా దివ్య చైతన్యంతో ఏకమై, ఆంతర్యంలో సత్యాన్ని గ్రహించి మరియు ఆయన చూసినదాన్ని వివరించేవారు. ఒక సందర్భంలో, దేవుడు ఆయనకు జగన్మాతగా లేదా ఇతర అంశలలో దర్శనమిచ్చేవాడు; లేదా మన గొప్ప గురువులలో ఒకరు, లేదా ఇతర సాధువులు, అంతర్దర్శనంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యేవారు. అలాంటి సమయాల్లో హాజరయిన ప్రేక్షకులందరు, ప్రత్యేకముగా ప్రసాదించబడిన గాఢమయిన ఆశీస్సులు అనుభవించేవారు. ఇలాంటి ఒక సందర్భములో గురుదేవులు గాఢంగా ప్రేమించే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి దర్శనమిచ్చినప్పుడు, “దేవా! దేవా!దేవా!” అనే అందమైన పద్యం రచించడానికి గురుదేవులు ప్రేరేపించబడ్డారు.

జ్ఞానోదయం పొందిన గురువును భగవద్గీత ఈ విధంగా వివరిస్తుంది: “జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకున్నవారిలో ఆత్మ సూర్యునిలా ప్రకాశిస్తుంది” (V:16). పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక ప్రకాశానికి ఎవరైనా చకితులై ఉండవచ్చు, ఆయన ఆత్మీయత, సహజత్వం మరియు నిశ్శబ్ద వినయస్వభావం వల్ల కాదు, ప్రతి ఒక్కరినీ తక్షణమే తేలికపరుస్తుంది. గురుదేవుల ప్రసంగం వ్యక్తిగతంగా తమను ఉద్దేశించి చేసినట్లుగా ప్రేక్షకులలోని ప్రతి ఒక్కరూ భావించేవారు. గురుదేవుల మనోహరమైన లక్షణాలలో హాస్య చాతుర్యం కూడా ఒకటి. ఒక అంశం మీద గాఢంగా మరియు సుదీర్ఘంగా ఏకాగ్రత చూపిస్తున్నప్పుడు, వారికి సేదతీర్చడానికి, ఎంపిక చేసిన కొన్ని పదబంధాలు, సంజ్ఞలు లేదా ముఖ కవళికల ద్వారా సరైన సమయంలో కృతజ్ఞతతో కూడిన ప్రతిస్పందన అయిన, హృదయపూర్వకమైన చిరునవ్వును వ్యక్తం చేసేవారు.

ఈ శ్రేణిలోని మొదటి సంపుటమైన మానవుడి నిత్యాన్వేషణలోని ఒక ఉపన్యాసంలో పరమహంసగారు ఇలా అన్నారు: “సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ఒకే ఉద్దేశ్యం, ఒక వ్యక్తికి భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని పొందడానికి మార్గాన్ని బోధించడం.” మానవజాతి యొక్క నిజమైన ఆశ, మన ఆత్మలలో ఉన్న దేవుని సాన్నిధ్యాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఎదురుచూస్తున్న మహత్తరమైన ప్రేమ మరియు అవగాహనను కనుగొనడానికి సమయాన్ని వెచ్చించేవారిలో ఉంది, దాని ప్రవాహాన్ని మన ప్రపంచ కుటుంబ సభ్యులందరికీ స్వస్థత చేసే ఔషధంగా మళ్లిస్తుంది.

ఆ ఆశీర్వాదాలు పూజనీయమైన నా గురుదేవుల నుండి ఎంత స్పష్టంగా ప్రసరించేవో. బయట వీధిలోని అపరిచితులు కూడా ప్రబలంగా ఆకర్షించబడి గౌరవప్రదంగా వివరాలు తెలుసుకొనేవారు: “ఆయన ఎవరు? ఆ మనిషి ఎవరు?” ఆయన సమక్షంలోని గాఢమైన ధ్యాన సమయాలలో, ఆయన పూర్తిగా పరమానందభరితులై దైవంతో ఐక్యమవ్వడం చూశాము. గది మొత్తం దేవుని ప్రేమకాంతితో నిండిపోయేది. పరమహంసగారు జీవిత ప్రయాణం యొక్క అత్యున్నత లక్ష్యాన్ని సాధించారు; ఆయన ఉదాహరణతో మరియు మాటలతో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల మార్గాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి.

పరమహంస యోగానందగారి అద్వితీయమైన మరియు విశాలమైన, ఉజ్వలమైన ప్రేమ వ్యక్తిత్వాన్ని ఒక పుస్తకము పుటలలో తెలియజేయలేము. కాని ఈ సంక్షిప్త నేపథ్యాన్ని ఇవ్వడంలో, ఈ పుస్తకంలో అందించిన ప్రసంగాల పట్ల పాఠకుల ఆనందాన్ని మరియు ప్రశంసలను సుసంపన్నం చేసే వ్యక్తిగత సంగ్రహావలోకనం పొందాలని నా వినయపూర్వకమైన ఆశ.

నా గురుదేవులను దైవంలో ఐక్యమవ్వడం చూడటం; ఆయన ఆత్మ నుండి వెలువడిన అగాధమైన సత్యాలను మరియు భావపరంపరను వినడం; రాబోయే యుగయుగాల కొరకు వాటిని రికార్డ్ చేయడం; మరియు ఇప్పుడు అందరితో పంచుకోవడం, నాకు ఎంతటి సంతోషం! గురుదేవుల ఘనమైన వాక్కులు, మన ప్రియమైన తండ్రి, తల్లి మరియు శాశ్వతమైన మిత్రుడు అయిన భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసానికి, గాఢమైన ప్రేమకు మార్గాన్ని విశాలము చేయుగాక.

ఇతరులతో షేర్ చేయండి