పునరుత్థానంపై ఒక ధ్యానం

పునరుత్థానంపై ఒక ధ్యానం(ధ్యానం చేసే వారందరినీ ఈస్టర్ సమయంలో తమ చైతన్యాన్ని అనంతమైన క్రీస్తు చైతన్యంతో విస్తరింపజేయమని పరమహంస యోగానందగారు ప్రోత్సహించారు. క్రీస్తు చైతన్యం అనగా సమస్త సృష్టిలో అంతర్లీనంగా వ్యక్తమైన భగవత్ చైతన్యం; ఏసుక్రీస్తు, కృష్ణుడు మరియు ఇతర అవతారాల ద్వారా వ్యక్తీకరించబడిన విశ్వ చైతన్యం, దేవునితో ఐక్యత. ఆయన బోధించిన ధ్యానాలలో ఒకటి క్రింద ఇవ్వబడినది:)

ఏసుక్రీస్తు మేల్కొన్నాడు. ఆయన భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం యొక్క పరిమితుల నుండి సర్వవ్యాపకత్వంలో మేల్కొన్నాడు. సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యంతో, ప్రతి పువ్వు, ప్రతి సూర్యకిరణం, ప్రతి గొప్ప ఆలోచన హృదయంలో ఏసుక్రీస్తు మేల్కొన్నాడు. అతను అణు యుగంలో మేల్కొన్నాడు. జ్ఞానం మరియు విశ్వప్రేమల ఊయల నుండి పరమాత్మగా ఎదుగుతున్న ఆయన ఈ కొత్త జన్మను అణుయుగం, మరియు దాని విధ్వంసాలేవీ దాచలేవు.

ఆయన మన మనస్సులలో, హృదయాలలో, ఆత్మలలో మేల్కొన్నాడు – ఆయనకు మనకు మధ్య ఎడబాటు లేదు. ఆయన మన ప్రేమ తోటలో, పవిత్రమైన భక్తి తోటలో, మన ధ్యానం మరియు క్రియాయోగ తోటలలో నడుస్తున్నాడు.

ఆయన అణువణువులోను, కణకణంలోను మేల్కొన్నాడు, మేఘాలలో మేల్కొన్నాడు, అన్ని గ్రహాలలో మేల్కొని ఉన్నాడు. విశ్వాలలోను, విశ్వాల చుట్టూ తిరుగుతున్న కిరణములలోను, దాని వెలుపల చల్లని కాంతిలోను మేల్కొన్నాడు. విశ్వాల నుండి విశ్వచైతన్య నిశ్శబ్దంలోకి మేల్కొన్నాడు. మరియు మీ భక్తి మరియు క్రియాయోగం ద్వారా ఆయన మళ్ళీ మీలో మేల్కొంటాడు. మీ జ్ఞానం మేల్కొన్నప్పుడు మీలో క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూస్తారు. మీ ధ్యానం మరియు దైవానుసంధానం ద్వారా మీరు శరీరం మరియు మర్త్య స్పృహ అనే సమాధి నుండి పరమాత్మ యొక్క నిత్యానంద అనంతత్వంలోకి ఆయనతో పునరుత్థానం చేయబడతారు.

“ఓ ఏసుక్రీస్తు, మీరు పరమాత్మలో పునరుత్థానం చెందారు. మాంస పంజరంలోకి దిగి వచ్చిన మాకు మీ పునరుత్థానం మరియు దైవ సంతానంగా పరమపిత రాజ్యంలోకి తిరిగి తీసుకువెళ్ళే మీ వాగ్దానం ఆనందకరము. ఈ ఈస్టర్ నాడు, మా భక్తి, మా హృదయాల రోదనలు, మాలోని మంచితనపు పరిమళం, మీ సర్వవ్యాపకమైన పాదాలకు మేము సమర్పిస్తున్నాము. మేము మీవారము, మమ్ములను స్వీకరించుము! క్రీస్తు చైతన్యం ద్వారా, శాశ్వతమైన పరమాత్మలో మీతో కలిసి మమ్మల్ని పునరుత్థానం కావించుము. మమ్మల్ని శాశ్వతంగా ఆ ఆనంద రాజ్యంలో ఉంచుము.”

ఈస్టర్ ఉదయం కోసం ప్రార్థన మరియు ధృవీకరణ

“పరలోకపు క్రీస్తు, మీ చైతన్యంతో మా చైతన్యమును నింపుము. మీలో మాకు కొత్త జన్మను ప్రసాదించుము”

ధృవీకరించి అనుభూతి చెందండి

“దివ్యమైన తండ్రీ, నన్ను క్రీస్తు చైతన్యంలో మేల్కొల్పండి.
క్రీస్తు మరియు నేను ఒక్కటే.
ఆనందం మరియు నేను ఒక్కటే.
శాంతి మరియు నేను ఒక్కటే.
జ్ఞానం మరియు నేను ఒక్కటే.
ప్రేమ మరియు నేను ఒక్కటే.
ఆనందం మరియు నేను ఒక్కటే.
క్రీస్తు మరియు నేను ఒక్కటే. క్రీస్తు మరియు నేను ఒక్కటే. క్రీస్తు మరియు నేను ఒక్కటే.”

“పునరుత్థానంపై ఒక ధ్యానం” సేకరణ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You) — ఏసుక్రీస్తు దివ్య బోధనలపై పరమహంస యోగానందగారి వ్యాఖ్యానం

ఇతరులతో షేర్ చేయండి