ఆత్మపరిశీలన: మీ అత్యున్నత సామర్థ్యాన్ని ఎలా సఫలపరచుకోవాలి

సీతాకోకచిలుక, గులాబీలు మరియు ఆత్మపరిశీలన యొక్క కళ్ళుయోగదా సత్సంగ పత్రిక అక్టోబర్-డిసెంబర్ 2009 సంచికలోని ఒక వ్యాసంలోని సారాంశాలు.

అనాదిగా భారతదేశ ఋషులు సకల మానవ జీవనాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి, జీవితపు అత్యున్నత సామర్థ్యాలను ఎలా సాధించాలో జనులకు ఉపదేశించారు. మీరు ఏమిటో మనస్తత్వ శాస్త్రం మీకు బోధిస్తుంది; మీరు ఎలా ఉండాలో నీతిశాస్త్రములు తెలియచేస్తాయి. శరీరం, మనస్సు, మరియు ఆత్మల ఆధ్యాత్మిక ఆవిష్కృతం కోసం నిజమైన మత శిక్షణలో భాగంగా ఋషులు రెండింటినీ నొక్కి చెప్పారు.

ప్రతిరోజూ మీ ముఖాన్ని మరియు శరీరాన్ని మీరు అద్దంలో వీక్షిస్తారు, ఎందుకంటే మీరు ఇతరుల ముందు సర్వోత్తమంగా కనిపించాలని కోరుకుంటారు. ఆత్మపరిశీలన, స్వీయ విశ్లేషణ అనే లోపలి దర్పణాన్ని అనుదినమూ చూడటం, పైపై వాలకము వెనుక ఉన్న దాని సరైన ముఖచిత్రాన్ని నిర్ధారించడం మరింత ముఖ్యం కాదా? బాహ్య ఆకర్షణ అంతా ఆత్మ యొక్క దివ్యత్వం నుండి ఆవిర్భవిస్తుంది. ముఖంపై ఒక చిన్న మొటిమ లేదా మచ్చ కూడా ముఖం యొక్క అందాన్ని పాడుచేసినట్లే, కోపం, భయం, ద్వేషం, అసూయ, మర్త్య ఉనికి యొక్క అనిశ్చితుల నుండి ఆందోళన, ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని వైకల్య పరుస్తుంది. ప్రతిరోజూ ఈ వక్రీకరణల నుండి మిమ్మల్ని మీరు విముక్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ అంతరాత్మ యొక్క సౌందర్యం తేజరిల్లుతుంది.

మనం విశ్లేషణ ద్వారా మానవ సమస్యలు మూడు విధాలుగా ఉంటాయని గమనిస్తాము: బాహ్య శరీరాన్ని బాధించేవి, మనస్సుపై దాడి చేసేవి, ఇంకా ఆత్మను కప్పివుంచేవి. రోగం, వృద్ధాప్యం, మరణం శరీరానికి ఎదురయ్యే ఇబ్బందులు. మానసిక వ్యాధులు దుఃఖం, భయం, కోపం, తీరని కోరికలు, అసంతృప్తి, ద్వేషం, నరాల ఉత్తేజం తాలూకు ఏదైనా జ్వరం లేదా భావోద్వేగ వ్యామోహం వంటి మానసిక క్యాన్సర్ వంటి వాటి ద్వారా దాడి చేస్తాయి. ఇక అవిద్య అనేది ఆత్మ రుగ్మత, అన్నిటికంటే ఇది అత్యంత హానికరమైనది, ఇది అన్ని ఇతర ఇబ్బందులు రావటానికి కారణమైనది.

నిజమైన స్వేచ్ఛ ఆత్మ చైతన్యంలో మాత్రమే ఉంది. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మరి మీ ఆత్మ చైతన్యం ఏ మేరకు అజ్ఞానం యొక్క మూలాలతో బంధించబడిందో నిర్ధారించుకోండి. ఆ మూలాలు ఛేదించబడినప్పుడు మాత్రమే మీకు నిజమైన స్వాతంత్య్రం సాధ్యమవుతుంది.

ఆలోచించండి, మీ జీవిత ప్రణాలిక వేసుకోండి, మరి మీరు ఎలా పరివర్తనంచెందుతారో చూడండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి నిరంతర యత్నం చేయండి. సత్ సాంగత్యాన్ని, దేవుని గురి౦చి, జీవిత౦లోని ఉదాత్తమైన విషయాలను మీకు గుర్తు చేసే మ౦చి సాహచర్యాన్ని వెతకండి. మీ చెడు అలవాట్లను మీరు ఎలా మార్చుకోబోతున్నారో అనుదినమూ జాగరూకలో ఉండండి; మీరు మీ రోజును ఎలా స్థిర ప్రణాళిక చేయబోతున్నారు; మీ ప్రశాంతతను ఎలా నిలుపుకోబోతున్నారు. ఇంకా మనస్సులో తరచుగా అన్ని వేళలా నేను ఇలా అనుకుంటాను, “ప్రభు, నేను నా సమయాన్ని వృధా చేస్తున్నానా? నీతో ఉండటానికి నేను ప్రతిరోజూ కొంచెం ఖాళీ సమయాన్ని ఎలా పొందగలను?” దానికి భగవంతుడు ఇలా స్పందిస్తాడు, “నీవు నాతోనే ఉన్నావు, ఎందుకంటే నీవు నన్ను తలుస్తున్నావు కాబట్టి.”

ధ్యానంతో ఉదయాన్ని ఆరంభించండి మరియు భగవంతుడిని గాఢంగా ప్రార్థించండి; ధ్యానించిన తరువాత, మీ జీవితాన్ని మరియు మీ ఉత్తమ ప్రయత్నాలన్నింటినీ నడిపించమని భగవంతుడిని ప్రార్థించండి: “ప్రభు, నేను ఆలోచిస్తాను, సంకల్పిస్తాను, చేస్తాను; అయితే ప్రతిదానిలోను నేను చేయవలసిన సరియైన కార్యముకొరకు నా వివేకమును, సంకల్పమును, కార్యమును నేను చేసే ప్రతి పనిలో సరి అయిన మార్గములో నడిపించు వాడివి నీవే.” ఈ రోజు అన్ని విధాల మేలైనదిగా ఉండాలని నిశ్చయించుకోండి. మీరు ఆ రోజు ఉదయం నుంచి, మీ ప్రశాంతతను నిలుపుకునే ప్రయత్నంతో పనిచేస్తూనే ఉంటే, లేదా మీరు పొందగోరు ఏదైనా మంచి అలవాటును ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే, మీరు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు ఆ రోజును సద్వినియోగం చేసుకున్నానని గ్రహించి, రాత్రి పూట నిద్రకు ఉపక్రమించవచ్చు. మీరు పురోగతి సాధిస్తున్నారని మీకు తెలుస్తుంది.

ఇతరులతో పంచుకోండి