కొత్త నిర్ణయాలు తీసుకోండి: మీరేం కావాలనుకుంటున్నారో అలా ఉండండి!

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

1934లో నూతన సంవత్సర పండుగ సందర్భంగా పరమహంస యోగానందగారు తాను స్థాపించిన సంస్థ యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా]లో ఇచ్చిన ప్రసంగం నుండి క్రింది సారాంశాలు ఉన్నాయి. మొత్తం వ్యాసం పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల మూడవ సంచిక ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం అనే పుస్తకంలో ప్రచురించబడింది. (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురణ).

వచ్చే సంవత్సరంలో మీరేం చేయదల్చుకున్నారో, మీరేం అవదల్చుకున్నారో, వాటి గురించి కొత్త నిర్ణయాలు తీసుకోండి. మీకోసం మీరొక కార్యక్రమాన్ని రూపొందించుకోండి; దాన్ని నెరవేర్చండి. మీరింకా ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటారో మీరే చూస్తారు. అభివృద్ధి కోసం మీరు రూపొందించుకున్న కార్యక్రమానికి కట్టుబడి ఉండకపోడానికి అర్థం, మీ సంకల్పాన్ని చచ్చుబడేట్టు చేశారని. మీ కన్నా మీకు గొప్ప శత్రువు కాని, మిత్రుడు కాని లేరు. మీతో మీరు స్నేహం చేస్తే, సాఫల్యాన్ని పొందుతారు. మీరేమి అవాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించకుండా అడ్డుకునే దైవనియమం ఏదీ లేదు. మీరు అంగీకరిస్తే తప్ప మీకు జరిగిన హానికర సంఘటనలు ఏవీ మిమ్మల్ని ప్రభావితులను చేయలేవు.

మీరేం కావాలనుకుంటే అది అవగలననే మీ నమ్మకాన్ని, ఏదీ బలహీనం చేయనివ్వకండి. స్వయంగా మీరు తప్ప మరెవ్వరూ దాన్ని అడ్డుకోవడం లేదు. దీని గురించి నా గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ జీ పదే పదే చెప్పినా మొదట్లో దాన్ని నమ్మడం నాకు కష్టంగా ఉండేది. కాని భగవంతుడు ఇచ్చిన కానుకైన సంకల్పశక్తిని వాడడం మొదలుపెట్టాక అదే నా రక్షకుడని నేను తెలుసుకున్నాను. సంకల్పాన్ని వాడకుండా ఉండడమంటే బండరాయిలా, జడపదార్థంలా, ఒక నిర్జీవ పదార్థంలా, ఒక అసమర్ధుడైన మానవుడిగా ఉండడమే.

దాగి ఉన్న గొప్ప అదృశ్యదీపంవలె నిర్మాణాత్మకమైన ఆలోచన మీకు తప్పకుండా విజయానికి దారి చూపిస్తుంది. తీవ్రంగా ఆలోచిస్తే మీకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. కొద్దిపాటి ప్రయత్నం తర్వాత వదిలేసే మనుషులు తమ ఆలోనా శక్తిని బలహీనం చేసుకుంటారు. మీ లక్ష్యానికి దారి చూపించడానికి కావలసినంతగా మీ ఆలోచన ప్రకాశవంతం అయ్యేంతవరకు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ శాయశక్తులా మీరు ఆలోచనను ఉపయోగించాలి.

అన్ని ప్రతికూల ఆలోచనలను, భయాలను పారద్రోలండి. భగవంతుడి బిడ్డగా మనుష్యులలో అతి శ్రేష్టులైన వారికి ఇవ్వబడిన అవే సామర్థ్యాలు మీరూ కలిగి ఉన్నారు. ఆత్మలుగా ఎవరూ ఎవరి కన్నా గొప్పవారు కాదు. మహర్షులు భగవంతుడి జ్ఞానాన్ని వ్యక్తీకరించినట్లు, భగవంతుడి జ్ఞానం ద్వారా నడిపించబడేటట్టుగా మీ సంకల్పాన్ని అనుసంధానం చేయండి. మీ సంకల్పాన్ని జ్ఞానంతో జత చేస్తే మీరు దేన్నైనా సాధించగలరు.

చెడు అలవాట్లు, మీకున్న అన్నిటికన్నా మీకు బద్ధ శత్రువులు. మీరు చేయవద్దనుకున్న పనులను అవి మీ చేత చేయించి, వాటి పర్యవసానాలను అనుభవించమని మిమ్మల్ని వదిలేస్తాయి. మీరు చెడు అలవాట్లను తప్పక విడిచిపెట్టాలి; మీరు ముందుకు పురోగమిస్తూ ఉండగా వాటిని వెనక్కి వదిలేయాలి. ప్రతిరోజూ పాత అలవాట్ల నుంచి మరింత మంచి అలవాట్లలోకి మారుతూ ఉండాలి. ఈ రాబోయే సంవత్సరం మీ అత్యున్నత శ్రేయస్సుకు ఉపకరించే అలవాట్లను మాత్రమే ఉంచుకుంటానని ఒక సత్యనిష్ఠతో కూడిన నిర్ణయాన్ని తీసుకోండి.

మీ అవాంఛనీయ సంస్కారాలను పోగొట్టుకునే అత్యుత్తమ పద్ధతి, వాటి గురించి ఆలోచించకుండా ఉండడమే; వాటిని గుర్తించకండి. ఒక అలవాటుకు మీపై పట్టు ఉందని ఎన్నడూ ఒప్పుకోకండి. మీరు “వద్దు” అని గట్టిగా చెప్పగలిగే అలవాటును పెంపొందించుకోవాలి. చెడు అలవాట్లకు ప్రేరణనిచ్చే విషయాలకు దూరంగా ఉండండి.

స్వార్థపరత్వమనే సంకుచితత్వంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. మీ విజయాల్లో, మీ ఆనందంలో ఇతరులను చేర్చుకోండి. అప్పుడు మీరు దైవ సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. మీ గురించి ఆలోచించుకొన్నప్పుడల్లా ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీరు శాంతిని కోరుకుందామని అనుకున్నప్పుడు, శాంతి అవసరమున్న ఇతరుల గురించి ఆలోచించండి. ఇతరులను సంతోషపెట్టడానికి మీరు చేయగలిగినది అంతా చేస్తూ ఉంటే, మీరు మీ తండ్రి అయిన భగవంతుడిని ప్రీతి నొందిస్తున్నట్టు తెలుసుకుంటారు.

సామరస్యంతో జీవించడం, మిమ్మల్ని పంపిన భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం దృఢమైన సంకల్పశక్తితో జీవించడం, ఇవి మాత్రమే మీరు ఆసక్తి చూపించాల్సిన విషయాలు. ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోవద్దు, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. హృదయంలో నుంచి వచ్చే చిరునవ్వు మొహంలో కనిపించే చిరునవ్వుల మధ్య పూర్తి సామరస్యం ఉండాలి. మీ శరీరం, మనస్సు, ఆత్మ — ఇవన్నీ భగవంతుని ఆంతరిక చైతన్యంలోంచి వచ్చే చిరునవ్వును వ్యక్తపరిస్తే, మీరు వెళ్ళిన చోటల్లా చిరునవ్వులను వెదజల్లగలరు.

మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతోనే ఎప్పుడూ ఉండండి; మిమ్మల్ని ఉన్నత భావప్రపంచానికి లేవనెత్తే వారిని మీ చుట్టూ ఉంచుకోండి. మీ నిర్ణయాలు, సానుకూల దృక్పధాలను దుస్సాంగత్యం ద్వారా విషపూరితం చేయకండి. మీకు స్ఫూర్తినిచ్చే సత్సాంగత్యం దొరక్కపోయినా, ధ్యానంలో మీరు దాన్ని పొందవచ్చును. మీరు పొందగలిగిన అత్యుత్తమ సహచరుడు, ధ్యానంలో కలిగే ఆనందమే.

మీ జీవితమనే పాత్ర లోపలా, బయటా దైవసాన్నిధ్యంతో నిండి ఉంది, కానీ మీకు దాని మీద ధ్యాస లేకపోవడం వల్ల, అంతస్థమై ఉన్న భగవంతుడిని గ్రహించలేకపోతున్నారు. ఒక రేడియోను శృతి చేసినట్టు మీరు సమశ్రుతిలో ఉంటే, అప్పుడు మీరు పరమాత్మను పొందుతారు. అది ఎలా ఉంటుందంటే, సముద్ర జలాలతో నిండిన ఒక సీసాను తీసుకొని, బిరడా బిగించి సముద్రంలోకి విసిరేస్తారు; సీసా నీటి మీద తేలుతూ ఉన్నప్పటికీ దానిలో ఉన్న నీరు చుట్టూ ఉన్న సముద్ర జలాలతో కలువవు. కాని సీసా మూత తెరిస్తే, లోనున్న నీరు సముద్రంలో కలుస్తుంది. పరమాత్మతో అనుసంధించడానికి ముందు మనం అజ్ఞానం అనే బిరడాను తొలగించాలి.

అనంతత్వం మన దివ్యగృహం. శరీరమనే సత్రంలో మనం కేవలం కొద్ది కాలం బస చేస్తున్నాం. మాయతో మత్తెక్కిపోయిన వాళ్ళు భగవంతుడిని చేర్చే దారిని అనుసరించడమెలాగో మరచిపోయారు. కాని ధ్యానంలో, దైవం దారి తప్పిన పుత్రుడిని పట్టుకున్నప్పుడు ఇంక విహారాలు ఉండవు.

కొత్త సంవత్సర మహాద్వారంలోకి కొత్త ఆశతో అడుగడదాం. మీరు భగవంతుడి బిడ్డ అని గుర్తుంచుకోండి. మీరేం అవదల్చుకున్నారో అది మీ మీదే ఆధారపడి ఉంది. మీరు భగవంతుడి బిడ్డ అని గర్వంగా ఉండండి. మీరు భయపడడానికేముంది? ఏం జరిగినా భగవంతుడే దాన్ని పంపిస్తున్నాడని నమ్మండి; ఈ దైనందిన సవాళ్లను ఎదుర్కోడంలో మీరు సఫలీకృతులవ్వాలి. అందులోనే విజయం ఉంది. ఆయన సంకల్పాన్ని నెరవేర్చండి; అప్పుడు మీకేదీ హాని కలిగించలేదు. ఆయన మిమ్మల్ని నిత్యమూ ప్రేమిస్తున్నాడు. దాని గురించి ఆలోచించండి. దాన్ని నమ్మండి. దాన్ని తెలుసుకోండి. అకస్మాత్తుగా ఒక రోజు మీరు భగవంతునిలో అనంతంగా జీవించి ఉన్నారని తెలుసుకుంటారు.

మరింత ఎక్కువగా ధ్యానించండి. ఏం జరిగినా భగవంతుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడనే గట్టి స్పృహతో నమ్మండి. అప్పుడు మాయా తెర తొలగించబడిందని, భగవంతుడితో మీరు ఏకమయ్యారని మీరు చూస్తారు. నా జీవితంలో గొప్ప ఆనందాన్ని నేను ఆ విధంగానే పొందాను. నేనిప్పుడు దేనికోసమూ చూడడం లేదు, ఎందుకంటే నాకు ఆయనలో అన్నీ ఉన్నాయి. అన్ని సంపదలలోకీ గొప్ప సంపద అయిన దానిని నేను ఎన్నడూ వదిలిపెట్టను.

నా కొత్త సంవత్సర సందేశం ఇదే.

ఇతరులతో పంచుకోండి