రాంచీలో నూతన యుక్త వయస్కుల కార్యక్రమ ప్రారంభోత్సవం

1 నవంబర్, 2024
నూతన యుక్త వయస్కుల కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో యువజన కార్యక్రమానికి చెందిన యుక్తవయస్కులు మరియు బాలలు

యువజనులలో ఆధ్యాత్మిక, మరియు వ్యక్తిగత అభివృద్ధిని పెంపొందించే ముఖ్యమైన ప్రణాళికలో భాగంగా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్) 13 నుండి 19 సంవత్సరాల వయస్సుగల వారికోసం ఒక క్రొత్త యుక్త వయస్కుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని శివ మందిరంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి స్వామి శంకరానంద, మరియు అమెరికాలోని ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాల నుండి వచ్చిన ఇద్దరు ప్రత్యేక అతిథులు — స్వాములు సరళానంద, పద్మానంద హాజరయ్యారు.

బాలలు ఆనందంతో “జై గురు” గానం చేస్తుండగా గురుదేవుల చిత్రపటం ముందు స్వామి పద్మానంద జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత ఆయన ఎస్.ఆర్.ఎఫ్.లో యువజనులను ప్రోత్సహించే బాహ్య కార్యక్రమాలతో లభించిన తమ దశాబ్దాల అనుభవాల నుండి — శాన్ డియాగో ఆలయంలో యువజన సంఘం సమావేశాలను నిర్వహించడం, ఇంకా ఎస్.ఆర్.ఎఫ్. వేసవి యువజన శిబిరాలలో ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడం తో సహా — ఆకట్టుకునే కథనాలను పంచుకుంటూ స్ఫూర్తిదాయకమైన ప్రారంభోత్సవ సందేశాన్ని అందించారు. దాదాపు 25 మంది యుక్త వయస్కులైన ప్రేక్షకులతో ఆయన ఆకర్షణీయమైన రీతిలో గాఢంగా అనుసంధానమవుతూ ఇలా అన్నారు: “మీరు ఎక్కడికి వెళ్ళినా గురుదేవులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని గుర్తుంచుకోండి. జీవితంలోని అన్ని పరిస్థితులలో మీరు విశ్వాసం మరియు ఆశావాదంతో ఆయన హస్తం కోసం వెతుకుతూనే ఉంటే, అనేక సంఘటనల ద్వారా ఆయన తమ ఉనికిని మీకు వెల్లడిస్తారు.”

పాల్గొన్న యుక్తవయస్కులలో ఒకరు ప్రార్థన, కీర్తనలను నిర్వహించారు. దీని తరవాత ఇతర యుక్తవయస్కులు తమ జీవితాలపై బాలల సత్సంగం యొక్క ప్రభావాన్ని గురించి హృదయపూర్వకమైన భావనలను పంచుకున్నారు. 13 సంవత్సరాల అనిమేష్ బాలల సత్సంగ తరగతులకు హాజరవడం ఎలా తనకు ప్రేరణ నిచ్చిందో పంచుకోగా, ఈ నూతన యుక్త వయస్కుల కార్యక్రమంలో నేర్చుకోవడం ద్వారా, వృద్ధి చెందాలన్న ఆశాభావాన్ని 16 సంవత్సరాల ఆద్య వ్యక్తం చేసింది. వై.ఎస్.ఎస్. యువజన కార్యక్రమాల పరివర్తనకారక ప్రభావానికి నిదర్శనంగా వారి పలుకులు నిలుస్తున్నాయి.

అనిమేష్ భావాల నుంచి ఒక సంగ్రహం: “దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా వై.ఎస్.ఎస్. రాంచీ బాలల సత్సంగంలో పాల్గొనే గొప్ప అవకాశం మరియు అనుగ్రహం నాకు లభించింది. అంతేకాక వేసవి శిబిరాలు, వార్షిక వనభోజనాలు (పిక్నిక్‌లు), తీర్థయాత్రలు మొదలైన వాటిలో కూడా పాల్గొనే అవకాశం నాకు లభించింది. మన జీవితాల్లో భగవంతుడు మరియు గురువుల యొక్క ప్రాముఖ్యత, ధ్యానంలో గురుదేవులతో ఎలా సంబంధం పెట్టుకోవాలి, ఇంకా గురుదేవులు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారని, నాకు మార్గదర్శనం చేస్తూ, రక్షిస్తూ ఉన్నారని తెలుసుకొని మంచి, సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలన్న అతిముఖ్యమైన విషయం నేను నేర్చుకొన్నాను.”

ఆద్య తన వ్యాఖ్యలలో, “నూతన యుక్త వయస్కుల కార్యక్రమం నుండి మనం ధ్యానం చేయడం, మరియు మన ఏకాగ్రతను ఎలా అభివృద్ధి చేసుకోవాలో నేర్చుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వయస్సులో, మనని పెడదారి పట్టించే విషయాలు చాలా ఉన్నాయి; వీటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో పాఠశాలలు నేర్పించవు. తోటివారి ఒత్తిడి, అభద్రతాభావం, తక్కువ ఆత్మగౌరవం, నకారాత్మక ఆలోచనలు, భయం, ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి వివిధ సమస్యలు ఉన్నాయి.

“ప్రస్తుత తరంలో ఉన్న యుక్తవయస్కులు చాలా మంది, ముఖ్యంగా పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, కృంగిపోతారు. నిరంతర ప్రయత్నం తర్వాత కూడా వారు విఫలమైతే, ఈ విధంగా ఆలోచించడం ప్రారంభిస్తారు: ‘నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? నేను దీనికి అర్హులు కావడానికి నేను ఏమి చేశాను?’ కొందరు తమ భయంకరమైన విధికి భగవంతుడిని నిందించడం కూడా ప్రారంభిస్తారు. అందువల్ల, చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ నేడు ఎవరూ పరిష్కరించని ఇలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ తరం వారు కట్టుకథలను, కల్పితాలను నమ్మరు. వారు రుజువులతో పాటు ఆచరణాత్మక పరిష్కారాలను కోరుకుంటారు. గురుదేవుల బోధనలు పరిపూర్ణమైన మార్గదర్శకాలు. గురుదేవుల యొక్క ఆచరణాత్మకమైన ఉపదేశాలు మన అంతర్గత యుద్ధాలను గెలవడానికి సహాయపడతాయని నేను నమ్ముతున్నాను.”

స్వామి శంకరానంద తన ప్రసంగంలో ఇలా అన్నారు, “గురుదేవుల “జీవించడం ఎలా” బోధనలు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు మన సహజసిద్ధమైన ఆత్మశక్తిపై ఎలా ఆధారపడాలో మనకు చూపిస్తాయి. శారీరక ఆరోగ్యం, మానసిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం, ఆపై ధ్యానం ద్వారా ఆత్మ సహజావబోధాన్ని మేల్కొల్పడం వంటి అంశాలతో కూడినవి—సంతోషకరమైన జీవితానికి అవసరమైన సంతులిత మరియు సమగ్రాభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను అవి నొక్కి చెపుతాయి. అలాగే, వైఫల్యం, భయం మరియు నష్టాన్ని నిర్మాణాత్మక మార్గాల్లో ఎదుర్కోవడంతో సహా, మన భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం స్థితిస్థాపకతకు, అంటే ఎదురుదెబ్బల నుండి తిరిగి పుంజుకునే మన సామర్థ్యానికి, చాలా ముఖ్యం.”

ఆయన ఇంకా ఇలా అన్నారు, “మన నూతన యుక్త వయస్కుల కార్యక్రమంలో మనం ఇటువంటి అనేక విషయాలను సామూహిక చర్చలు, నాటకాలు, చేతి పనులు, ఆటలు, ప్రదర్శనలు, మరియు సేవా కార్యక్రమాలు వంటి వివిధ రూపాలలో పరోశోధిస్తాము. రాబోయే వారాలు, నెలల్లో నిరూపితమైన బోధనా పద్ధతుల ద్వారా, యోగానందగారి ఉపదేశాల సంపూర్ణమైన గాఢతను, పరిధిని మీ అందరికీ పరిచయం చేయాలని మేము ఆశిస్తున్నాము.”

యుక్త వయస్కుల జీవితాల్లో తల్లిదండ్రులు మరియు వయోజన మార్గదర్శకులు పోషించే ముఖ్యమైన పాత్ర గురించి ఆయన నొక్కిచెప్పారు. సమతుల్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోను, వృద్ధిపూర్వకమైన తల్లిదండ్రుల మార్గదర్శకత్వానికి, దృష్టాంతంగా ముకుందుడి (పరమహంస యోగానంద గారి చిన్నప్పటి పేరు) తండ్రి తమ పిల్లల అభ్యర్థనలను ఎంత సాలోచనగా పరిశీలించేవారో—ఒక యోగి ఆత్మకథ లో వివరించిన విధంగా గురుదేవుల తండ్రి భగవతి చరణ్ ఘోష్ గారిని ఉదహరిస్తూ ఉటంకించారు.

ఇతరుల కోసం ప్రార్థన మరియు స్వస్థతా ప్రక్రియ అభ్యాసం, ఆ తరువాత, కార్యక్రమంలో పాల్గొన్న ఒక యువజనుల నేతృత్వంలో జరిగిన ముగింపు ప్రార్థనలతో ఈ కార్యక్రమం ముగిసింది. చివరకు స్వామి సరళానంద, స్వామి పద్మానంద పాల్గొన్నవారందరికీ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు (క్రింద చూడండి).

ఇతరులతో పంచుకోండి