మహావతార బాబాజీ ఆశీస్సు

భారతదేశంలో పరమహంస యోగానందుల ఆశ్రమాలను సందర్శించినప్పుడు (అక్టోబర్ 1963 – మే 1964), మహావతార్ బాబాజీ సశరీరులుగా అక్కడ ఉండటంవల్ల పవిత్రమైన ఒక హిమాలయ గుహకు శ్రీ శ్రీ దయామాతగారు తీర్థయాత్రగా వెళ్ళారు. తరువాత కొంతకాలంవరకు తమ అనుభవాన్ని గురించి బహిరంగ సమావేశాలలో మాట్లాడడానికి శ్రీ దయామాత నిరాకరించారు. కాని ఎన్సినీటస్ లోని ఈ సత్సంగంలో ఒక భక్తుడు మాతాజీని, బాబాజీ గుహను సందర్శించడం గురించి చెప్పమని అడిగినప్పుడు దైవసంకల్పం సానుకూల స్పందన వచ్చేటట్లుగా ప్రేరేపించింది. ఆమె ఇచ్చిన కథనం అందరి ప్రేరణ కోసం దిగువ ఇవ్వడం జరిగింది.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, ఎన్సినీటస్, కాలిఫోర్నియా, ఆగస్ట్ 24, 1965లో ఇచ్చిన ప్రసంగం నుండి.

పరమహంస యోగానందులకూ బాబాజీకీ మధ్య ఒక విశేషమైన అనుబంధం ఉండేది. గురుదేవులు తరచుగా బాబాజీని గురించీ, తాము ఈ దేశానికి రావడానికి భారతదేశంనుంచి వచ్చే ముందు మహావతారులు వారికీ కలకత్తాలో దర్శనమిచ్చిన సందర్భాన్ని గురించీ మాట్లాడుతూ ఉండేవారు. గురుదేవులు ఆ మహావతారమూర్తిని గురించి ప్రస్తావించినప్పుడల్లా, ఎంత భక్తితో, ఎంత గౌరవభావంతో మాట్లాడేవారంటే, మా హృదయాలు దివ్యప్రేమతో, తపనతో నిండిపోయేవి. ఒక్కోసారి నా హృదయం పగిలిపోతుందేమో అనిపించేది.

గురుదేవుల మహాసమాధి తరువాత బాబాజీని గురించిన ఆలోచన నా చైతన్యంలో ఇంకా దృఢంగా పెరుగుతూ వచ్చింది. పరమ గురువులందరిపట్ల ఉండవలసిన ప్రేమ, గౌరవాలు ఉన్నా, నా హృదయంలో బాబాజీ మీద ఒక విశేషానుభూతి ఎందుకు ఉందని నేను ఎప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉండేదాన్ని. వారితో గుర్తించదగిన సాన్నిహిత్యపు భావన నాలో స్పందించేటట్లు వారి దగ్గరినుంచి ఎటువంటి నిర్దిష్టమైన ప్రేరణా వచ్చినట్లుగా నా ఎరుకలో లేదు. నన్ను నేను పూర్తిగా అనర్హురాలినిగా భావించుకొని ఉండటంవల్ల, బాబాజీ పవిత్ర దర్శనమనే వ్యక్తిగతానుభవం నాకు కలుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. బహుశా, వచ్చే ఏదో ఒక జన్మలో ఈ ఆశీర్వాదం నాకు లభిస్తుందని నేను అనుకున్నాను. ఆధ్యాత్మిక అనుభవాల కోసం అడగడం కానీ ఆపేక్షించడం కానీ నేనెప్పుడూ చేయలేదు. భగవంతుణ్ణి ప్రేమించాలని వారి ప్రేమను అనుభవించాలని మాత్రమే నేను కోరుకున్నాను. భగవంతుణ్ణి ప్రేమించడంలో నాకు ఆనందం ఉంది; ఈ జీవితంలో నేనింకే బహుమానమూ కోరను.

కిందటిసారి మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు, నాతో ఉన్న ఇద్దరు భక్తులు బాబాజీ గుహను దర్శించాలనే కోరికను వెలిబుచ్చారు. మొదట అక్కడికి వెళ్ళాలలనే గాఢమయిన వ్యక్తిగతమయిన కోరికైతే నాకు కలుగలేదు కాని, మేము దాన్ని గురించి వాకబు చేశాం. ఆ గుహ రాణీఖేత్ కు అవతల నేపాల్ సరిహద్దుకు దగ్గరగా హిమాలయ పర్వత పాదప్రాంతాలలో ఉంది. ఉత్తరాన ఉన్న సరిహద్దు ప్రాంతాలను విదేశీయులకు మూసివేశారని ఢిల్లీలో ఉన్న అధికారులు మాకు చెప్పారు. అలాటి యాత్ర అసంభవంగా కనిపించింది. నేను నిరాశ చెందలేదు. తాను సంకల్పించిన దేనినైనా సంభవమయ్యేలా చేసే శక్తి జగన్మాతకు ఉందన్న విషయాన్ని సందేహించను. ఎందుకంటే నేను చాలా మాహాత్మ్యాలు చూశాను. ఆ ప్రయాణం జరగాలని ఆమె సంకల్పించకపోతే నాకు ఆ విషయంలో వ్యక్తిగతమైన కోరికేమీ లేదు.

ఒకటి రెండు రోజులయ్యాక, బాబాజీ గుహ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగారితో ప్రస్తావించినట్లుగా యోగాచార్య వినయ్ నారాయణ్ గారు నాతో చెప్పారు. మా బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి ముఖ్యమంత్రిగారు ప్రత్యేక అనుమతి నిచ్చారు. రెండు రోజుల్లో మేము ప్రయాణానికి సిద్ధమయ్యాం. మాములు చీరలు, మా భుజాల చుట్టూ కప్పుకోడానికి ఉన్ని శాలువలూ తప్ప, ఆ పర్వతాలలోని చలి వాతావరణానికి సరిపడే వెచ్చదనాన్ని చేకూర్చే దుస్తులేవీ మా దగ్గర లేవు. మా ఆతురుతలో మేము కొంచెం అనాలోచిత సాహసం చేశామని చెప్పాలి.

ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో చేరడానికి మేము రైలు ఎక్కి, సాయంకాలం 8 గంII లకు గవర్నరుగారింటికి చేరాం. ముఖ్యమంత్రి, ఇతర అతిథులతో పాటు మేము ఆయనతో కలిసి భోంచేశాం. ముఖ్యమంత్రిగారు మాతోటి రాగా 10 గంII లకు కాఠ్ గోదామ్ వెళ్ళే రైలులో ఉన్నాం మేము. ఆ చిన్న స్టేషనుకు మేము చేరేసరికి ఇంచుమించుగా తెల్లారిపోయింది. అక్కడినుంచి మేము, మాలాంటి యాత్రికులకు బసలున్న పర్వతప్రదేశమైన ద్వారాహాట్ చేరేందుకు ఇంకా కారులో ప్రయాణించవలసి ఉంది.

బాబాజీ దగ్గరినుంచి దివ్య ధ్రువీకరణ

1963లో రాణిఖేత్ సమీపంలోని హిమాలయాలలోని మహావతార్ బాబాజీ గుహలో దయామాత ప్రగాఢ దివ్య భగవదనుసంధానములో ఉన్నప్పుడు తీసిన ఫోటో. “ఇదివరకెన్నడూ, నిశ్శబ్దం ఇన్ని విషయాలు చెప్పలేదు. నిశ్శబ్దం దైవసన్నిధిని గురించి బిగ్గరగా మాట్లాడింది. అనుభూతి అలలు నా చైతన్యం ద్వారా ప్రవహించాయి; నేను ఆ రోజు చేసిన ప్రార్థనలు ఆ తరువాత ఫలించాయి.”

కాఠ్ గోదామ్ రైల్వేస్టేషనులో నేను కొంతసేపు ఒంటరిగా కూర్చున్నాను. మిగిలిన భక్తులు కారులకోసం చూడ్డానికని బయటికి వెళ్ళారు. భగవన్నామాన్ని అదే పనిగా జపిస్తూ, భారతదేశంలో మనం ‘జపయోగం’ అనే సాధనను నేను గాఢమైన ప్రేమతో, భక్తితో చేస్తున్నాను. ఈ సాధనలో చైతన్యమంతా, మిగిలిన అన్నిటినీ వదిలిపెట్టేసి, ఒకే భావనలో క్రమేపి లీనమైపోతుంది. నేను బాబాజీ నామాన్ని జపిస్తున్నాను. నా ఆలోచనంతా బాబాజీమీదే! వర్ణనాతీతమైన ఒకానొక పులకింతతో నా హృదయం నిండిపోయింది.

హఠాత్తుగా నేను ప్రాపంచిక స్పృహను కోల్పోయాను. నా మనస్సు ఇంకొక చేతనాస్థితిలోకి సంపూర్ణంగా మళ్ళిపోయింది. అత్యంత మధురమైన ఆనందంతో కూడిన పారవశ్యంతో నేను బాబాజీ సన్నిథిని దర్శించాను. అవిలాకు చెందిన సెయింట్ థెరిసా, తాను నిరాకార క్రీస్తును “దర్శించానని” చెప్పినప్పుడు, ఆమె ఏమిటి ఉద్దెశించారో నేను అర్థం చేసుకున్నాను. ఆలోచనాసారాన్ని దుస్తులుగా ధరించిన పరమాత్మతాలూకు ఒక ప్రత్యేక వ్యక్తీకరణ. ఈ “దర్శించడం” అన్నది వివరణలో భౌతిక రూపాల స్థూల రేఖాకారలకన్నా లేక దివ్య దర్శనాలకన్న ఎక్కువ స్పష్టమైన, కచ్చితమైన అనుభవం. ఆంతర్యంలో నేను వారికి వంగి నమస్కరించి, వారి పాదధూళిని శిరసున ధరించాను.

గురుదేవులు మాలో కొందరితో చెప్పారు: “మన సంస్థ నాయకత్వాన్ని గురించి మీరెవ్వరూ చింతపడవలసిన అవసరం లేదు. ఈ కార్యాన్ని నడిపించేందుకు ఉద్దిష్టమయిన వారెవరో వారిని బాబాజీ ఇప్పటికే ఎంచి ఉంచారు.” సభామండలి నన్ను ఎంపిక చేసినప్పుడు నేనిలా అడిగాను, “నేనే ఎందుకు?” ఇప్పుడు బాబాజీకి ఆ విషయంలో విన్నపం చేస్తున్నట్లుగా నన్ను నేను గమనించాను: “వారు నన్ను ఎన్నుకున్నారు, నేను చాలా అనర్హురాలిని. ఇదెలా సాధ్యం?” నేను ఆంతర్యంలో వారి పాదాల దగ్గర విలపించాను.

ఎంతో మధురంగా వారు జవాబిచ్చారు. “అమ్మాయి, నీ గురువును నువ్వు సందేహించగూడదు. ఆయన సత్యాన్నే పలికారు. ఆయన నీకు చెప్పింది వాస్తవమే.” బాబాజీ ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా ఒక పరమానందదాయకమైన శాంతి నాన్నవరించింది. నా అస్థిత్వమంతా ఆ శాంతిలో, ఎంతసేపో నాకు తెలీదు, నిమగ్నమయి ఉండిపోయింది.

బృందంలోని ఇతరులు గదిలోకి వచ్చేశారని క్రమేపి నేను తేలుసుకొన్నాను. నేను కళ్ళు తెరిచినప్పుడు నా చుట్టూరా పరిసరాలను ఒక కొత్తజ్ఞానంతో చూడసాగాను. “ఔను! నేనింతకు ముందు ఇక్కడ ఉన్నాను” అని ఆనందంతో ఆశ్చర్యపోవడం నాకు గుర్తుంది. ప్రతిదీ తక్షణమే సుపరిచతమైనదిగా తోచింది. ఒకానొక గతజన్మ స్మృతులు మళ్ళా మేల్కొన్నాయి!

మమ్మల్ని కొండపైకి తీసుకుని వెళ్ళాల్సిన కార్లు సిద్ధంగా ఉన్నాయి. మేము వాటిలో ఎక్కి, చుట్టూ తిరిగి వెళ్ళే పర్వత రహదారిమీద ప్రయాణించాం. ప్రతి ప్రదేశమూ చూసిన ప్రతి దృశ్యమూ నాకు పరిచితమైనవే. కాఠ్ గోదాములోని అనుభవం తరువాత, బాబాజీ ఉనికి ఎంత దృఢంగా నాలో ఉండి పోయిందంటే, నేను చూసిన చోటల్లా బాబాజీ ఉన్నట్లే కనిపించేది. రాణీఖేత్ లో కొద్దిసేపు మేము ఆగినప్పుడు మా సందర్శనను గురించి ముఖ్యమంత్రిగారు అందజేసిన సమాచారం ద్వారా తెలుసుకొన్న ఆ పట్టణ అధికారులు మాకు స్వాగతం పలికారు.

చిట్టచివరికి మేము హిమాలయ పర్వతపాదప్రాంతంలో ఎతైన ప్రదేశంలో నెలకొనిఉన్న మారుమూల కుగ్రామమైన ద్వారాహట్ కు చేరుకున్నాం. ఒక సర్కారు-విశ్రాంతి గృహంలో బసచేశాం; యాత్రికులకు చిన్న వసతి. చుట్టుపక్కలనుంచి చాలామంది మమ్మల్ని చూడటానికి వచ్చారు. పవిత్రమైన గుహను దర్శించడానికి పాశ్చాత్య దేశాలనుంచి యాత్రికులు వచ్చారని వారు విన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది బాబాజీ — ఆయన పేరుకు అర్థం “గౌరవనీయులైన తండ్రి” అని — గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీరు మాపై ప్రశ్నలను గుప్పించారు. ఇప్పుడు మనం జరుపుకొంటున్నట్లే, మేమందరం సత్సంగం జరుపుకొన్నాం. వాళ్ళలో చాల మందికి ఇంగ్లీషు అర్థం అవుతుంది. అర్థంకాని వాళ్ళకు పక్కనున్నవాళ్ళు అనువాదంచేసి చెప్పారు.

భవిష్యత్తును తెలిపే దివ్యదర్శనం

సత్సంగం పూర్తయ్యాక గ్రామస్థులందరూ వెళ్ళిపోయాక మేము ధ్యానంచేసుకొని నిద్రకు ఉపక్రమించాం. నడిరాత్రివేళ నాకొక అతీంద్రయానుభవం కలిగింది. ఒక కారుమేఘం నన్ను కబళించడానికి ప్రయత్నిస్తూ హఠాత్తుగా నామీద కమ్ముకుంది, అది ఆలా వస్తూ ఉండగా దేవుడి కోసం గట్టిగా అరిచాను. అది విని నాతో పాటు అదే గదిలో ఉన్న ఉమా మాత, ఆనంద మాతలు మేలుకొన్నారు. వాళ్ళు కంగారుపడి, ఏమయిందన్నారు, ఆతురుతతో, “దాన్ని గురించి నేనిప్పుడు మాట్లాడదల్చుకోలేదు, నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరు నిద్రపోండి,” అన్నాను నేను. ధ్యానసాధనవల్ల మనలో ప్రతి ఒక్కరిలో అన్నిటినీ తెలుసుకోగలిగిన శక్తి గల సహజావభోధం పెంపొందుతుంది. సంకేత రూపంలో వచ్చిన ఈ అనుభవంద్వారా దేవుడు నాకు ఏం తెలియ జేస్తున్నాడన్న విషయాన్ని నేను (సహజవబోధంతో) అర్థంచేసుకున్నాను. త్వరలో నేను లోనవబోయే ప్రమాదకరమైన జబ్బును గురించి అది ముందుగానే తెలియజేసింది; మానవాళి అంతా ఒక చెడు కాలాన్ని ఎదుర్కొంటుందనీ, ఆ సమయంలో దుష్టశక్తి ప్రపంచాన్నంతనూ కబళించాలని ప్రయత్నిస్తుందని కూడా అది సూచించింది. ఆ మేఘం నన్ను పూర్తిగా ఆక్రమించుకోలేకపోవడంవల్ల — దేవుణ్ణి గురించి నేను చేస్తున్న ఆలోచనలవల్ల దానికి ప్రతిఘటన కలిగింది — వ్యక్తిగత ప్రమాదం నుంచి నేను బయటపడతానాని, ఆ దివ్యదర్శనం నాకు తెలియజేసింది; అలాగే నేను దానినుంచి బయటపడ్డాను. అదే విధంగా ఈ ప్రపంచం కూడా చిట్టచివరికి భీతిగొలుపుతున్న ఆ నల్లని మేఘం వంటి కర్మనుంచి బయటపడుతుంది; కానీ, మానవాళి తన వంతుగా మొదట దేవుడివైపు తిరగాలి.

మరుసటి రోజు ఉదయం 9 గంటలకు గుహకు వెళ్ళడానికి నడవసాగాము. ప్రయాణంలోని ఈ భాగంలో ఎక్కువ మార్గం నడవవలసి వచ్చింది. కాని, అప్పుడప్పుడు గుర్రంమీద కానీ ‘దండి’లో కానీ వెళ్ళేవాళ్ళం. దండి అంటే కర్రలతో తయారుచేసిన పల్లకిలాంటి వాహనం; మోసే నలుగురు మగవారి భుజాలమీద ఉంచుకొనే రెండు పొడవాటి కర్రలకు తాడుతో వేలాడదీసి ఉంటుంది.

మేము పైకి, పైపైకి కష్టం మీద నడక సాగించాం; చాలాచోట్ల దారి చాల నిటారుగా ఉండటంవల్ల, ఒక్కోసారి మేము అక్షరాలా పాక్కుంటూ వెళ్ళాం. దారిలో ఉన్న రెండు విశ్రాంతి భవనాల దగ్గర మేము స్వల్పకాలం మాత్రమే ఆగాo. ఆ రెండో బంగాళాలోనే తిరుగు ప్రయాణంలో మా రాత్రి బస అని చెప్పారు. సాయంకాలం అయిదు గంటలకు సరిగ్గా కొండల వెనక సూర్యుడు అస్తమించబోతూ ఉండగా మేము గుహను చేరాం. అది సూర్యకాంతా, ఇంకొక శక్తికాంతా? ఆ వాతావరణాన్ని అంతనూ అక్కడున్న వస్తువులన్నింటినీ తళతళలాడే బంగారుకాంతి కప్పేసింది.

వాస్తవానికి, ఆ ప్రదేశంలో చాలా గుహలున్నాయి. ఒకటి తెరుచుకొని, ఒక బ్రహ్మాండమైన శిలలోంచి (బహుశా లాహిరీ మహాశయులు బాబాజీని మొదటిసారి దర్శించినప్పుడు వారు నిలబడి ఉన్నది ఆ కొండకొనే కావచ్చు) ప్రకృతి మలచినది. తరవాత అక్కడ ఇంకో గుహ ఉంది; దాంట్లోకి ప్రవేశించాలంటే, చేతులమీదా మోకాళ్ళమీదా పాకాలి. దాంట్లోనే బాబాజీ ఉండేవారని ప్రతీతి. దాని నైసర్గిక స్వరూపం, ముఖ్యంగా ప్రవేశ ద్వారం, బాబాజీ నివసించిన తరువాత గడచిన ఒక శతాబ్దం పైకాలంలో ప్రకృతిశక్తులవల్ల మారిపోయింది. ఈ గుహలోపలి గదిలో మేము గాఢధ్యానంలో చాలాసేపు కూర్చొని మన గురువుల శిష్యులందరి కోసం, మానవజాతి అంతటి కోసం ప్రార్థించాం. ఇదివరకెన్నడూ, నిశ్శబ్దం ఇన్ని విషయాలు చెప్పలేదు. నిశ్శబ్దం దైవసన్నిధిని గురించి బిగ్గరగా మాట్లాడింది. అనుభూతి అలలు నా చైతన్యం ద్వారా ప్రవహించాయి; నేను ఆ రోజు చేసిన ప్రార్థనలు ఆ తరువాత ఫలించాయి.

మా సందర్శన చిహ్నంగా, ఆ దివ్య మహావతారుల పట్ల గురుదేవుల శిష్యులందరికీ గల గౌరవానికి, భక్తికి సంకేతంగా యోగదా సత్సంగ [సెల్ఫ్-రియలైజేషన్] చిహ్నం కుట్టిన చిన్న రుమాలును ఆ గుహలో వదిలి వచ్చాం.

చీకటి పడ్డాక, తిరుగుముఖం పట్టాం. చాలామంది గ్రామస్థులు మా తీర్థయాత్రలో పాల్గొన్నారు. వారిలో కొద్దిమంది ముందాలోచనతో తెలివిగా కిరసనాయిలు దీపాలు తీసుకొని వచ్చారు. పర్వతం కిందికి మేము దారి తీస్తూ ఉండగా, దేవుణ్ణి గురించిన పాటలతో గొంతులు ఎగిశాయి. తొమ్మిది గంటల ప్రాంతంలో గుహకు మాతో పాటు వచ్చిన ఆ ప్రాంతపు అధికారులలో ఒకరి, నిరాడంబరమైన గృహానికి చేరాం; ఇక్కడ మమ్మల్ని విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించారు. ఇంటి బయట ఎగిసిపడుతున్న మంట చుట్టూరా మేము కూర్చున్నాం; వేయించిన బంగాళాదుంపలు, నల్లని రొట్టె, తేనీరు మాకు వడ్డించారు. రొట్టెను నిప్పులమీద కాల్చడంవల్ల, అది ఎంత నల్లగా తయారవగలదో అంత నల్లగా అయ్యింది. పవిత్ర హిమాలయాల బలమైన నిశీధి పవనాలలో ఆ భోజనం ఎంత రుచిగా ఉందో నేనెన్నటికీ మరచిపోలేను.

మేము గుహకి వెళ్ళేదారిలో ఆగిన, సర్కారు వసతి గృహాన్ని చేరేసరికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ మేము ఆ రాత్రి — మిగిలిన రాత్రి — గడపాలి! రాత్రివేళ ఆ ప్రదేశంనుంచి విశ్వాసమొక్కటే మమ్మల్ని తీసుకురాగలిగిందని తరువాత చాలామంది వ్యాఖ్యానించారు. ఆ ప్రదేశం ప్రమాదకరమైన పాములు, పులులు, చిరుతపులులకు నిలయం. చీకటి పడ్డాక అక్కడ ఉండటమనేది ఎవ్వరూ కలలో కూడా ఊహించలేని విషయం. కానీ అజ్ఞానమే ఆనందం అన్నట్లు, భయపడాలనే విషయమే మాకు తట్టలేదు. ప్రమాదాన్ని గురించి తెలిసినా కూడా, సురక్షితంగా ఉన్నామనే మేము భావించేవాళ్ళమని నాకు కచ్చితంగా తెలుసు. అయినప్పటికీ రాత్రిపూట ఈ ప్రయాణం చేయమని సాధారణంగా నేనెవరకి సిఫార్సు చెయ్యను.

కాఠ్ గోదామ్ లో బాబాజీతో నాకు కలిగిన అనుభవం, రోజంతా నా చైతన్యంలో భాగమైపోయింది; గతంతాలూకు దృశ్యాలను నేను తిరిగి జీవిస్తున్నాననే నిరంతరభావం నాలో కలిగింది.

"నా స్వభావం ప్రేమ"

ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. నేను ధ్యానంలో కూర్చోగానే హఠాత్తుగా గది అంతటా ఒక బంగారు కాంతితో వెలిగింది. ఆ కాంతి ఒక దేదీప్యమానమైన నీలంగా మారింది; అక్కడ మళ్ళా మన ప్రియమైన బాబాజీ దర్శనమిచ్చారు! ఈసారి వారు ఇలా అన్నారు: “తల్లీ, ఇది తెలుసుకో: నన్ను కలుసుకోడానికి భక్తులు ఈ స్థలానికి రావలసిన అవసరం లేదు. నన్ను పిలుస్తూ, నాలో నమ్మకముంచి నన్ను గాఢంగా ధ్యానించేవాళ్ళు నా సమాధానాన్ని అందుకుంటారు.” ఇది వారు భక్తులందరికీ ఇచ్చిన సందేశం. ఎంత నిజం! మీరు నమ్మకంతో, భక్తితో మౌనంగా బాబాజీని పిలిస్తే మీకు వారి జవాబు తప్పకుండా అనుభూతమవుతుంది.

అప్పుడు నేనిలా అన్నాను. “బాబాజీ, నా దైవమా, మేము జ్ఞానాన్ని అనుభూతం చేసుకోవాలని అనుకున్నప్పుడల్లా, జ్ఞానస్వరూపులు కాబట్టి, శ్రీయుక్తేశ్వర్ గారిని ప్రార్థించాలని; ఆనందాన్ని అనుభూతంచేసుకోవాలని అనుకున్నప్పుడల్లా లాహిరి మహాశయులతో అనుసంధానంలో ఉండాలని మా గురుదేవులు మాకు చెప్పారు. మీ తత్వం ఏమిటి?” నేనిలా అనగానే, ఓహ్! నా హృదయం ప్రేమతో బ్రద్దలయిపోతుందా అనిపించింది. అది ఎటువంటి ప్రేమ! కోటానుకోట్ల ప్రేమలు కలిసి ఒక్కటైన ప్రేమ. వారంతా ప్రేమాస్వరూపమే. వారి స్వభావమంతా దివ్యప్రేమే.

మాటల్లో చెప్పనప్పటికీ ఇంతకన్న ఎక్కువ స్పష్టమైన సమాధానాన్ని నేను ఊహించలేను, అయినప్పటికీ ఈ మాటలను జోడించి వారు దాన్ని మధురంగానూ అర్థవంతంగానూ చేశారు: “నా స్వభావం ప్రేమ; ఎందుకంటే, ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మార్చగలదు.”

ఆ మహావతారమూర్తి సన్నిధి, నన్ను వదిలివెళ్తూ క్రమేపి తగ్గుతున్న నీలికాంతిలోకి మెల్లగా అదృశ్యమైంది. దివ్యప్రేమాచ్చాదిత ఆనందంలో నేను ఉండిపోయాను.

గురుదేవులు తమ శరీరాన్ని త్యజించడానికి కొద్దికాలం ముందు నాతో ఏమన్నారో నాకు గుర్తొచ్చింది. నేను వారిని అడిగాను, “గురుదేవా, సాధారణంగా నాయకుడు వెళ్ళిపోగానే అతడు స్థాపించిన సంస్థ ఇక ఏ మాత్రమూ పెరగకుండా అంతరించిపోవడం మొదలు పెడుతుంది. మీరు లేకుండా మేమెలా కొనసాగించాలి? మీరిక్కడ శరీరంలో లేకపోతే మమ్మల్ని కలిపి ఉంచేది, మాకు స్ఫూర్తినిచ్చేది ఏది?” వారిచ్చిన సమాధానాన్ని నేనెన్నటికి మరచిపోలేను, “నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చెయ్యగలదు. భగవంతుడిమీది ప్రేమతో రేయింబగళ్లు నీకు అది తప్ప నీకింకేదీ తెలియనంతగా నువ్వు మత్తులో ఉండాలి. ఆ ప్రేమను అందరికి పంచు.” బాబాజీ సందేశం కూడా ఇదే; ఇదే ఈ యుగానికి సందేశం.

దేవుడి కోసం ప్రేమ, అందరిలో ఉన్న దేవుడి కోసం ప్రేమ, ఈ భూమి మీద అవతరించిన ఆధ్యాత్మిక మహనీయులందరూ బోధించిన సనాతన సత్యం, నిత్యాహ్వానం. ఇది మనమందరం మన జీవితాలలో పాటించి తీరవలసిన సత్యం. రేపును గురించి మానవాళి అనిశ్చిత స్థితిలో ఉన్న ఈ సమయంలో ద్వేషం, స్వార్థం, దురాశ, ప్రపంచాన్ని మహావతార బాబాజీ ఆశీస్సు నాశనం చేయగలిగినట్లు కనిపించే ఈ సమయంలో ఇది చాల ముఖ్యం. మనం ప్రేమ, కరుణ, అవగాహనా అనే ఆయుధాలను ధరించిన దివ్యసైనికులుగా ఉండాలి; ఇదే ఇప్పుడు అత్యవసరం.

ప్రియమిత్రులారా, బాబాజీ జీవించి ఉన్నారని మీరందరూ తెలుసుకొంటారనే నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. వారు నిశ్చయంగా ఉన్నారు; నిత్యమైన దివ్యప్రేమే వారి సందేశం. స్వార్థ పూరితం, సంకుచితం, వ్యక్తిగతం, తన సొంతం అనే భావనలతో కూడిన మానవ బాంధవ్యాల ప్రేమను గురించి నేను ప్రస్తావించడం లేదు. క్రీస్తు తన శిష్యులకు, [కృష్ణుడు తన భక్తులకు], గురుదేవులు మనందరికీ పంచి ఇచ్చే ప్రేమ: నిర్నిబద్ధమయిన దివ్యప్రేమను నేను ఉద్దేశిస్తున్నాను. ఈ ప్రేమనే మనం అందరికి పంచిపెట్టాలి. దానికోసమే మనమందరం పాకులాడతాం. ఈ గదిలో ఉన్న మనలో ప్రేమ, కొద్దిపాటి కరుణ, అవగాహనకోసం పరితపించనివాళ్ళు ఒక్కరూ లేరు.

మనం ఆత్మ స్వరూపులం; ఆత్మ స్వభావం పరిపూర్ణత; కాబట్టి పరిపూర్ణత కన్నా తక్కువగా ఉన్న దేనితోనూ మనం ఎన్నటికీ పూర్తిగా తృప్తిచెందలేము. పరిపూర్ణ ప్రేమమూర్తి తండ్రి, తల్లి, స్నేహితుడు, ప్రియతముడు మనవాడైన భగవంతుణ్ణి తెలుసుకొనే వరకు పరిపూర్ణత అంటే ఏమిటో మనం ఎన్నటికీ తెలుసుకోలేము.

ఇతరులతో షేర్ చేయండి