YSS

శ్రీ శ్రీ మృణాళినీమాత: గురువు యొక్క మాధ్యమం

శ్రీ మృణాళినీమాత

ఆగస్టు 3, 2017న, మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ మృణాళినీమాత పరమాత్మలోని శాశ్వతరాజ్యం యొక్క ఆనందము, స్వేచ్ఛల కోసం శాంతియుతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. పరమహంస యోగానందగారి బోధనల ద్వారా తమ జీవితాలను పరివర్తన చేసుకున్న లక్షలాది మంది సత్యాన్వేషకులకు జ్ఞానం, అవగాహన మరియు ప్రేమ నిండిన ఒక మార్గదర్శక కాంతిగా, శ్రీ మృణాళినీమాత డెబ్బై సంవత్సరాలకు పైగా గురువు యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా సేవకు తనను తాను అంకితం చేసుకున్నారు. మన గురువుగారి పట్ల బేషరతు భక్తి మరియు సేవ ద్వారా, ఆయన జ్ఞానం మరియు ఆదర్శాలతో గాఢమైన అనుసంధానం పొందిన ఒక స్వచ్ఛమైన ఉదాహరణగా, ఈ మహోన్నతమైన ఆత్మ ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన భక్తులకు ఎల్లప్పుడూ భగవంతుని కాంతి మరియు ప్రేమలో నివసించడం కోసం మార్గాన్ని ప్రకాశవంతం చేశారు.

పరమహంస యోగానందగారిచే ఎంచుకోబడి సుశిక్షితులయ్యారు

శ్రీ మృణాళినీమాత, పరమహంసగారి అగ్రశ్రేణి ప్రత్యక్ష శిష్యులు, శిష్యురాళ్ళలో ఒకరిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన గతించిన తర్వాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క కార్యాన్ని కొనసాగించడానికి ఆయనచే ఎంపిక చేయబడి, వ్యక్తిగతంగా శిక్షణ పొందిన సమూహంలో ఆమె కూడా ఉన్నారు. 1955 నుండి 2010లో గతించే వరకు సేవ చేసిన శ్రీ దయామాత తరువాత 2011లో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కి నాల్గవ అధ్యక్షులుగా ఆమె నియమితులయ్యారు. పరమహంస యోగానందగారి బోధనలను ప్రచురించడానికి బాధ్యత వహించిన ఆమె వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలకు ముఖ్య సంపాదకులుగా కూడా పనిచేశారు—ఈ పాత్ర కోసం ఆమె స్వయంగా పరమహంసగారి వద్ద శిక్షణ పొంది తన జీవితాంతం వరకు ఈ పాత్రను పోషించారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు, మృణాళినీమాతాజీ ఎస్.ఆర్.ఎఫ్. ఉపాధ్యక్షురాలిగా నలభై ఐదు సంవత్సరాలు పనిచేశారు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మొత్తం సన్యాస పరంపరకు మార్గదర్శకత్వంలో శ్రీ దయామాతకు సన్నిహితంగా సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం సంఘం అందించే అనేక కార్యకలాపాలు మరియు సేవలను పర్యవేక్షించారు.

గురువు నుండి ఆమె గ్రహించిన ఆధ్యాత్మిక తేజము మరియు జ్ఞానాన్ని అందించడం

గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశయ సాధనా సేవలో ఆమె పోషించిన ప్రతి పాత్రలో మృణాళినీమాతాజీ, ఆయన బోధనల దివ్య జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడింది–మరియు ఆయనపట్ల విధేయత మరియు ఆయనపై సంపూర్ణ విశ్వాసంతో ఆమె అస్తిత్వం మొత్తం నిండిపోయింది. ఆమె గురువు నుండి పొందిన వ్యక్తిగత శిక్షణ కారణంగా, సన్యాసులకు మరియు గృహస్థ భక్తులకు, దేవుని కోసం నిజాయితీగా అన్వేషించేవారికి, ఆయన ఆధ్యాత్మిక జీవన సూత్రాలను, ఆయన ఉన్నత ప్రమాణాలను మరియు అదే సమయంలో ఆయన అందించిన ప్రేమపూర్వక ప్రోత్సాహాన్ని తెలియజేయడానికి ఆమె ఆదర్శంగా అర్హత పొందారు.

గురుదేవులతో గడిపిన సంవత్సరాలలో ఆమె పొందిన అనుభవాలను, ఉపన్యాసాలు మరియు రచనల రూపంలో పంచుకోవడం వల్ల చాలా మంది ప్రేరణ పొందారు. పరమహంసగారి ఆశ్రమాలలో సన్యాసుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడంలోనూ, ఆశ్రమ జీవితంలోకి ప్రవేశించే వారికి ఆయన ఆదర్శాలను సంపూర్ణంగా అందించడంలోనూ, ఆయన నుంచి తాను పొందిన శిక్షణను వారికి అందించడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.

ఆమె ఇంకా యుక్తవయస్సులో ఉన్నప్పుడు, చాలా సంవత్సరాల క్రితం పరమహంసగారు ఆమెతో ఇలా వ్యాఖ్యానించారు: “ఏదో ఒక రోజు, మీ దగ్గర శిక్షణ పొందేందుకు చాలా మంది ఉంటారు.” ఆ సమయంలో ఆమె ఆశ్చర్యపోయినప్పటికీ (ఆ మార్గంలో ఆమె చాలా కొత్తవారు), దూరదృష్టితో కూడిన గురువుగారి జోస్యం నెరవేరడం ద్వారా సంవత్సరాలుగా వేలాది మంది ఆశీర్వదించబడ్డారు. సన్యాసులకు మరియు సాధారణ సభ్యులకు, తమ ధ్యానాలు మరియు తమను తాము మార్చుకోవడంలో నిత్యం ప్రయత్నిస్తూ ఓర్పుతో కష్టపడమని ప్రోత్సహిస్తూనే – ఆధ్యాత్మిక పురోగతికి కీలకమైన దేవునిపై, గురువుపై మరియు ఆత్మయొక్క దివ్య సామర్థ్యంపై విశ్వాసం కలిగి ఉండటాన్ని మృణాళినీమాత ప్రోత్సహించారు. ఆ అపరిమిత సామర్థ్యాన్ని తమలో తాము చూసుకునేలా మరియు వారి జీవితాల్లో దానిని వ్యక్తీకరించేలా ఆమె భక్తులను ఎంతో తరచుగా ప్రేరేపించేవారు.

ఆమె ఇలా చెప్పారు: “ఈ క్షణంలో మీరు ఏమిటో, అలా మిమ్మల్ని మీరు తప్ప మరెవరూ మార్చలేదు. మీ స్వేచ్ఛా సంకల్పంతో మీరు సృష్టించిన దానిలో దేవుడు జోక్యం చేసుకోలేదు మరియు మీరు ఏమిటో ఏ ఇతర మానవుడు నిర్దేశించలేదు. మీ సరైన లేదా తప్పు చర్యలు, ఆలోచనలు, ఉద్దేశ్యాలు మరియు కోరికల ద్వారా ఇప్పుడున్న మిమ్మల్ని సృష్టించుకున్నది మీరే. మన విధిని మనం తయారు చేసుకున్నట్లయితే, మన విధిని మార్చగల శక్తి కూడా మనకు ఉంది. శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా అన్నారు: ‘మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతీదీ మెరుగుపడుతుంది.’ అన్నింటికి మించి నేను మీపై ఎక్కువగా ఏదైనా ఒక అంశం ముద్ర వేయాలంటే అది, బుద్ధిపూర్వకమైన అధ్యాత్మిక కృషి – మీ జీవితంలో ఏ అసంపూర్ణతనూ లేదా లోపాన్ని అంగీకరించకపోవటం.

ప్రారంభ జీవితం మరియు ఎస్.ఆర్.ఎఫ్. మార్గాన్ని కనుగొనడం

శ్రీ మృణాళినీమాత 1931లో కాన్సాస్‌లోని విచితలో జన్మించారు. సన్యాసానికి పూర్వాశ్రమ జీవితంలో మెర్నా బ్రౌన్‌గా ఉన్న ఆమె తన యవ్వనంలో సింహభాగాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో గడిపింది. ఇతరులచే గాఢమైన మతవాదిగా, బిడియంగల బిడ్డగా వర్ణించబడిన యువ మెర్నా, పద్నాలుగు సంవత్సరాల వయస్సప్పుడు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క శాన్ డియాగో ఆలయంలో పరమహంసగారిని మొదటిసారి కలుసుకుంది. గురువుగారి బోధనలపై తన పెద్ద కుమార్తె ఆసక్తి కనబరిచిన తర్వాత, ఆమె తల్లి శాన్ డియాగో ఆలయంలో పరమహంసగారి సేవలకు హాజరుకావడం ప్రారంభించింది మరియు గురువుగారితో అనేక వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసింది. పరమహంసగారు మృణాళినీమాతను కలవడానికి ముందే ఆమె పట్ల గాఢమైన ఆసక్తిని కనబరిచారు మరియు ఆమెను ఆశ్రమానికి తీసుకురావాలని ఆమె తల్లిని ప్రోత్సహించారు. అనేక విజ్ఞాపనల తరువాత, ఆమె మృణాళినీమాతను ఆదివారం సేవల్లో ఒకదానికి తనతో పాటు రమ్మని ఒప్పించగలిగింది. తాను పెరిగిన చర్చి పట్ల విధేయతతో, మృణాళినీమాత మరొక మతానికి చెందిన సేవకు హాజరు కావడానికి ఇష్టపడలేదు, అయితే పరమహంసగారి బోధనలు క్రీస్తు బోధించిన తత్వాన్ని అందంగా ప్రతిబింబిస్తున్నాయని ఆమె తల్లి వివరించిన తర్వాత ఎస్.ఆర్.ఎఫ్. ఆలయాన్ని సందర్శించడానికి ఆమె అంగీకరించారు.

1945 డిసెంబరులో ఒక రోజున, చేతిలో బైబిల్‌తో దృఢ నిశ్చయంతో ఉన్న యువతి మెర్నా ఎస్.ఆర్.ఎఫ్. శాన్ డియాగో ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించింది. మొదటిసారి పరమహంస యోగానందగారిని చూసినప్పుడు ఆమె “అద్భుతమైన ప్రశాంత అనుభూతి”తో మరియు “చిరంతన కాలంగా పరిచయం ఉన్న” భావనతో నిండిపోయింది.

పరమహంస యోగానంద సమక్షంలోని సంవత్సరాలు

రాబోయే సంవత్సరాల్లో తన పనిలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా పరమహంసగారు ఆమెను వెంటనే గుర్తించారు. సంవత్సరాల తరువాత, ఆయన గతించే ముందు, ఆయన ఆ మొదటి సమావేశం గురించి ఆమెతో ఇలా అన్నాడు: “నీకు తెలుసా, శాన్ డియాగోలోని ఆలయంలో జీవితంలో మొదటిసారి నేను నిన్ను చూసినప్పుడు, గత జన్మలలో మనం కలిసి ఉన్నప్పటి చరిత్ర మొత్తాన్ని చూశాను, మరియు భవిష్యత్తును చూశాను.… ఆ రోజు నేను చూసిన దానికంటే ఇది కొంచెం కూడా భిన్నంగా లేదు.

పరమహంసగారిని కలిసిన కొన్నాళ్ళకే, యువ మెర్నాకు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల సంఘంలో సన్యాసినిగా తన జీవితాన్ని భగవంతుడికి మరియు గురువుకు అంకితం చేయాలని అనిపించింది. మొదట ఆమెను జూనియర్ హైస్కూల్ విద్యను పూర్తి చేయమని గురుదేవులు అభ్యర్థించారు. తర్వాత, ఆమె తల్లిదండ్రుల అనుమతితో, జూన్ 10, 1946న, పదిహేనేళ్ళ వయసులో, కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్‌లోని ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమంలో నివసించడానికి వచ్చింది. ఎన్సినీటస్‌లో ఆమె పరమహంసగారి వ్యక్తిగత మార్గదర్శకత్వం మరియు ఆశ్రమ శిక్షణ పొందుతూ ఉన్నత పాఠశాల పూర్తి చేసింది. గురువుదేవుల అత్యున్నత స్థాయి శిష్యురాలు, ఆశ్రమానికి బాధ్యత వహించే శ్రీ జ్ఞానమాత, ఆ సంవత్సరాల్లో ఆమెకు ప్రియమైన మరియు ప్రభావవశాలియైన సలహాదారుగా మరియు ఆధ్యాత్మిక తల్లిగా ఉన్నారు. (మృణాళినీమాత స్వంత తల్లి రెండు సంవత్సరాల తరువాత ఆశ్రమంలో ప్రవేశించారు, ఆమె ఆఖరి సన్యాస ప్రమాణాలు పూర్తి చేసిన తర్వాత మీరామాత అనే పేరు పొందారు.)

గత జన్మల నుండి ఈ యువ శిష్యురాలి అసాధారణ ఆధ్యాత్మిక పరిపక్వత గురించి బాగా తెలిసిన పరమహంసగారు, కేవలం ఒక సంవత్సరం ఆశ్రమ జీవితం తర్వాత 1947లో సన్యాసుల చివరి ప్రమాణాలను ఆమెకు వ్యక్తిగతంగా ప్రసాదించారు. ఆయన ఆమె కోసం “మృణాళినీ” అనే సన్యాస నామాన్ని ఎంచుకున్నారు, ఇది తామర పువ్వు యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది, ఇది ఆధ్యాత్మిక వికాసానికి సనాతన చిహ్నం.

గురు బోధనలను ప్రచురించడంలో ఆమె పాత్ర

2004లో లాస్ ఏంజిలిస్ లో జరిగిన ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమావేశం సందర్భంగా నాలుగు సువార్తలపై పరమహంస యోగానందగారి వ్యాఖ్యానాల గ్రంథం, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ విడుదల

మృణాళినీమాత ఆశ్రమ జీవితం ప్రారంభించినప్పటి నుండి, ఆయన ఆమె కోసం ఊహించిన పాత్ర—ముఖ్యంగా తన యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాలు, రచనలు మరియు సంభాషణలకు సంపాదకురాలిగా ఆమె భావి బాధ్యత గురించి ఇతర శిష్యులతో మాట్లాడారు. 1950లో రాజర్షి జనకానందకు ఆయన స్వయంగా వ్రాసిన లేఖలో ఇలా వ్రాశారు, “ఆమె ఈ పనికై ఉద్దేశించబడింది.”

శ్రీ దయామాత ఇలా వ్రాశారు, “గురుదేవులు ఆమెను ఏ పాత్ర కోసం సిద్ధం చేస్తున్నారో మనందరికీ స్పష్టంగా చెప్పారు – తన బోధనలలోని ప్రతి అంశంలో ఆమెకు వ్యక్తిగత సూచనలను ఇస్తూ, ఆయన రచనలు మరియు ప్రసంగాల కూర్పు మరియు సిద్ధం చేయటం కోసం.”

తరువాతి సంవత్సరాలలో రోజువారీ సాంగత్యం ద్వారా, తన జీవితంలో చివరి సంవత్సరాల వరకు, పరమహంసగారు మృణాళినీమాత యొక్క ఆధ్యాత్మిక శిక్షణపై చాలా శ్రద్ధ వహించారు, ఆయన గతించిన తర్వాత ప్రచురణ కోసం తన లిఖిత ప్రతులను మరియు ప్రసంగాలను ఎలా సవరించాలో ఆమెకు వ్యక్తిగత సూచనలను అందించారు.

పరమహంస యోగానందగారి అనేక రచనలు – విమర్శకుల ప్రశంసలు పొందిన అనువాదం ‘గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత’ పై ఆయన వ్యాఖ్యానం, ‘ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ’ పై ఆయన అద్భుతమైన వ్యాఖ్యానాలు; ఆయన కవిత్వం మరియు స్ఫూర్తిదాయకమైన రచనల యొక్క అనేక సంపుటాలు; వ్యాసాల యొక్క మూడు సంకలనాల్లో 150 పైచిలుకు ఆయన ప్రసంగాలు ఆమె నిర్దేశంలో ప్రచురించబడ్డాయి, అలాగే ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె గతించే కొద్ది కాలం ముందు తన పనిని పూర్తి చేసిన ఇతర ప్రధాన ప్రచురణలను సమీప భవిష్యత్తులో ప్రకటించడానికి మేము ఎదురుచూస్తున్నాము.

భారతదేశానికి అనేక సందర్శనలు

సంవత్సరాలుగా, పరమహంస యోగానందగారి యోగదా సత్సంగ సొసైటీ యొక్క విస్తరణ మరియు పనికి మార్గనిర్దేశం చేయడంలో శ్రీ దయామాతకు సహాయం చేయడానికి శ్రీ మృణాళినీమాత భారతదేశాన్ని ఆరుసార్లు సందర్శించారు. ఆమె వై.ఎస్.ఎస్. ఆశ్రమాల్లో ఎక్కువ సమయం గడిపారు, ఉపఖండంలోని ప్రధాన నగరాల్లో ఆయన బోధనలపై ఉపన్యాసాలు ఇచ్చారు. గురు-శిష్య సంబంధాలతో సహా వివిధ విషయాలపై ఆమె చేసిన ప్రసంగాలు యోగదా సత్సంగ పత్రికలో, పుస్తక రూపంలో మరియు ఆడియో మరియు వీడియో రికార్డింగ్‌లలో ప్రచురించబడ్డాయి.

మృణాళినీమాత యొక్క స్ఫూర్తి మరియు సలహాలతో కూడిన ఆవర్తన లేఖలు మరియు సభ్యత్వానికి సంబంధించిన సలహాలతో పాటు ఆమె అపారమైన జ్ఞానం, కరుణ మరియు హాస్యం యొక్క అద్వితీయ కలయికతో, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యుల ప్రేమతో కూడిన గౌరవాన్ని మరియు ప్రగాఢమైన కృతజ్ఞతను పొందారు.

రాంచీలో శ్రీ మృణాళినీమాత
1973లో భారతదేశంలోని రాంచీ వై.ఎస్.ఎస్. పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేయడం

ఆమె జీవిత వారసత్వానికి శాశ్వత స్ఫూర్తి

మృణాళినీమాత యొక్క అనేక దశాబ్దాల నిస్వార్థ మరియు దైవికమైన సేవ ద్వారా ప్రచురణలోకి తీసుకురాబడిన దైవ ప్రేరేపిత జ్ఞానం మరియు సత్యం-పరమహంస యోగానందగారి బోధనలు-అమూల్యమైన వారసత్వం ద్వారా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులు మరియు ప్రపంచం శాశ్వతంగా ఆశీర్వదించబడింది. సంవత్సరాలు గడిచే కొద్దీ, ఈ విధంగా గురువు అభిలాషలను నెరవేర్చడం ద్వారా ఆమె చేసిన అపారమైన సహకారం, ఆమె ఆంతరంగిక మరియు బాహ్య దైవిక విజయానికి శాశ్వతమైన స్మారక చిహ్నంగా ఉంటుంది.

ఎల్లప్పుడూ భగవంతుని స్పృహలో ఉంటూ, శ్రీ మృణాళినీమాత భక్తులకు ఈ సలహాను అందించారు:

“నిజంగా భగవంతుణ్ణి క్షణమాత్రం అనుభవించిన ఏ వ్యక్తి అయినా మళ్ళీ అదే విధంగా ఉండలేడు—పరిమిత ప్రాపంచిక స్పృహతో ఇంతకు ముందు వలె మళ్ళీ సంతృప్తి చెందలేడు. మీరు ప్రపంచాన్ని లేదా దాని ఆరోగ్యకరమైన ఆనందాలను ఆస్వాదించడం మానేయరు; అవగాహన బయటి వైపు నుండి వాస్తవికత యొక్క లోపలి వైపుకు మారుతుంది. భౌతిక రూపాలు మరియు పరిమితులు, అనుబంధాలు మరియు కోరికలు, ఇష్టాలు మరియు అయిష్టాలు, సంతోషాలు మరియు దుఃఖాలతో గుర్తించబడకుండా, మీరు జీవితమంతా భగవంతుని వ్యక్తీకరణగా చూస్తారు. ప్రతీదీ ఆయన అనంతమైన కాంతి మరియు స్పృహతో తయారు చేసినట్లు మీరు గ్రహిస్తారు. మీరు మీ కుటుంబం యొక్క ప్రేమ మరియు సాంగత్యాన్ని ఆనందిస్తారు, ఎందుకంటే ఆ కుటుంబాన్ని ప్రేమించడానికి ఆయన మీకు అందించిన తన ప్రేమ, మీ ద్వారా ప్రవహిస్తున్నట్లు భావిస్తారు. వారి నుండి మీరు స్వీకరించే ప్రేమలో, మీరు కేవలం స్వార్థపూరితమైన, శారీరకమైన, పరిమితమైన మానవ భావోద్వేగంగా మాత్రమే కాకుండా, ఆ పరమాత్మ యొక్క అనంతమైన ప్రేమను అనుభవిస్తారు. మీరు గులాబీని లేదా దేవుడు సృష్టించిన అనేక అందమైన వస్తువులను చూసినప్పుడు, మీరు రేకుల అందం వెనుక, వాటిని సృష్టించిన మరియు ఆ అందాన్ని నిలబెట్టిన సృష్టికర్త యొక్క అనంతమైన కాంతి మరియు స్పృహను దర్శిస్తారు.

“మీరు బాహ్యంగా ఎలాంటి అనుభవాలను పొందినా, లేదా ఆ అనుభవాల ద్వారా మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నా, చైతన్యం ఎల్లప్పుడూ ఆ ఒక్క వాస్తవికతపైనే కేంద్రీకృతమై ఉండనివ్వండి—నిన్ను ఎన్నటికీ విఫలం చేయనిది, ఎప్పటికీ మార్పు చెందనిది, అది శాశ్వతమైనది—భగవంతుడు, మరియు ఆయనతో మీ సంబంధం.”

2015లో లాస్ ఏంజిలిస్ లో జరిగిన ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమావేశం సందర్భంగా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులు మరియు స్నేహితులతో సత్సంగం

ఆమె ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని మనం అనుభూతి చెందుతూనే మన చైతన్యాన్ని ఎల్లవేళలా ప్రేరేపించే ఆమె సలహా “శాశ్వతమైన ఆ ఒక్క వాస్తవికత-దేవుడు” ద్వారా మార్గనిర్దేశం చేయబడునుగాక.

మన ప్రియమైన శ్రీ మృణాళినీమాతకు మన హృదయపూర్వకమైన ప్రేమ మరియు కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము కలిసి వచ్చినప్పుడు, దయచేసి మాతో చేరండి. నిస్వార్థ సేవ, స్నేహం మరియు విధేయతతో కూడిన ఆమె జీవితం మిమ్మల్ని “దేవుని మరియు గురువును అనుమతించడానికి,” ఆమె సలహా, “మీలోని దైవిక స్వరూపాన్ని పూర్తిగా వ్యక్తీకరించడం కోసం మీ జీవితాన్ని రూపొందించుకోవడానికి” ప్రేరణనిచ్చుగాక.

శ్రీ మృణాళినీమాత జీవితంపై మీ జ్ఞాపకాలను లేదా పరివర్తనలను పంచుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp