తమ గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ప్రోత్సాహంతో, పరమహంస యోగానందగారు యువ శిష్యుల ఆధ్యాత్మిక శిక్షణను క్రమబద్ధీకరించడం ప్రారంభించారు, అదే సమయంలో వారికి ప్రాథమిక విద్యను కూడా అందించారు. కాసిం బజార్ మహారాజు సర్ మణీంద్ర చంద్ర నందిగారి ఉత్సాహభరితమైన సహకారంతో, మార్చి 22, 1917న పశ్చిమ బెంగాల్లోని దిహికా వద్ద కేవలం ఏడుగురు అబ్బాయిలతో యోగదా సత్సంగ బ్రహ్మచార్య విద్యాలయ స్థాపనతో అధికారికంగా సంస్థాగత ప్రారంభం జరిగింది.
ఒక సంవత్సరం తరువాత, పాఠశాల సాఫల్యంతో వచ్చిన ప్రోత్సాహంతో, దిహికా స్థలమును మించిపోయిన శీఘ్ర వృద్ధితో, మహారాజు ఝార్ఖండ్‌లోని రాంచీలోగల తన వేసవి రాజభవనాన్ని, దాని 25 ఎకరాల మైదానాలను దయతో సమర్పించారు, 1918లో పాఠశాలను అక్కడకు తరలించడం జరిగింది.
1935లో, సంవత్సరంపాటు పర్యటించేందుకు పరమహంసగారు భారతదేశానికి వచ్చినప్పుడు, ఆయన ఈ ఆస్తిని మహారాజాగారి కుమారుడు శ్రీ శిరీష్ చంద్ర నంది నుండి కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను అమెరికాలోని ఆయన శిష్యులు, ఆయన తండ్రి శ్రీ భగవతి చరణ్ ఘోష్, అమెరికా మరియు ఐరోపాలలో ఆయన ప్రసంగాల ద్వారా పొదుపు చేసిన నిధుల నుండి సేకరించడం జరిగింది. పరమహంసగారి ప్రియమైన ఉన్నత శిష్యులు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. రెండవ అధ్యక్షులు అయిన రాజర్షి జనకానందగారు ఉదారంగా ఒక విరాళాన్ని సమర్పించారు.
రాంచీ పాఠశాలను ఒక దృఢమైన పునాది మీద నిలబెట్టడానికి సహాయం చేసిన వారందరి పేర్లను యోగదా సత్సంగ శాఖా మఠంలోని ప్రధాన భవనం యొక్క స్తంభం మీద చెక్కడం జరిగింది. తమ తండ్రి అందించిన సహకారం గురించి యోగానందగారు అరుదుగా మాట్లాడినప్పటికీ, సంస్థను స్థాపించడంలో ఆయన చేసిన సహాయం చాలా కీలకమైనది.
1967లో భవనం యొక్క ముఖ్యమైన పునర్నిర్మాణాన్ని స్వామి శ్యామానంద గిరి చేపట్టడం జరిగింది. 1979 చివరిలో, ఒక కాంక్రీట్ పైకప్పు నిర్మించబడింది మరియు ముందుతరాల కోసం దాన్ని సంరక్షించేందుకు మరియు పునరుద్ధరించేందుకు అవసరమైన మరమ్మతులు చేయబడ్డాయి. వాలుగా ఉండే పైకప్పుతో కూడిన భవనం యొక్క మూల నిర్మాణ ఆకృతి అలాగే ఉంచబడింది, అలాగే పురాతన చెక్క దూలాలను కూడా ఇప్పటికీ చూడవచ్చు.
తొలి సంవత్సరాల్లో పాఠశాల ప్రారంభం మరియు ఎదుగుదల
ప్రారంభ సంవత్సరాల్లో, వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో బాలుర ఆశ్రమ పాఠశాలకు ఈ భవనం ఆశ్రయమిచ్చింది. పరమహంస యోగానందగారు పాఠశాల యొక్క విద్యా కార్యక్రమాన్ని రూపొందించారు, విద్యార్థుల శారీరక, మానసిక మరియు ఆత్మ యొక్క సమగ్రాభివృద్ధికి కోసం ఇది రూపొందించబడినది. ఇందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య మరియు విద్యా పరమైన విషయాలు ఉన్నాయి. కాలపరీక్షకి నిలిచిన ఋషుల విద్యా ఆదర్శాలను అనుసరించి, పరమహంసగారు చాలా తరగతులను ఆరుబయట నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
క్రియాయోగంలో శిష్యులకు దీక్ష ఇవ్వడం, రాంచీ యొక్క విశిష్ట లక్షణం. ఆధ్యాత్మిక వ్యాయామాలను క్రమబద్ధంగా అభ్యసించడం, గీతా శ్లోకముల పారాయణ, నిరాడంబరత, స్వార్థత్యాగము, మర్యాద మరియు సత్యం అనే సద్గుణాల బోధన రోజువారీ కార్యక్రమములో అంతర్భాగంగా ఉండడం జరుగుతుంది.
ఆయనకు ఉన్న పరిపాలన మరియు బోధనా బాధ్యతలతో పాటు, విద్యార్థుల జీవితాలలో పరమహంసగారు తల్లిదండ్రుల పాత్రను పోషించేవారు. శ్రీ ఎస్.కె.డి. బెనర్జీ, యోగదా సత్సంగ బ్రహ్మచార్య విద్యాలయ విద్యార్థి, అరవై సంవత్సరాల తరువాత ప్రేమతో ఇలా గుర్తుచేసుకున్నారు: “పరమహంసగారు మాకు తండ్రి, మరియు మేము ఆయనకు అంకితభావం గల కుమారులం. ఆయన సాన్నిథ్యంలో నివసించడమే ఒక ఆధ్యాత్మిక శిక్షణ. పరమహంసగారు మమ్మల్ని దివ్య పరిపూర్ణత అనే లక్ష్యం వైపు ప్రేరేపించేవారు.”
1920లో పశ్చిమ దేశాలకు బయలుదేరుతున్నప్పుడు, పరమహంసగారు పిల్లల బాధ్యతలను పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులకు అప్పగించారు.
1968 నాటికి, వై.ఎస్.ఎస్. ఉన్నత పాఠశాలల్లో సుమారు 1,400 మంది బాలురు, 400 మంది బాలికలు మరియు రెండు వై.ఎస్.ఎస్. కళాశాలల్లో సుమారు 800 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వేగంగా విస్తరించడం వల్ల, విద్యా సంస్థలను ఆశ్రమ మైదానాల వెలుపలకి మార్చవలసి వచ్చింది. 1981లో, బాలుర పాఠశాల మరియు కళాశాల ఒక క్రొత్త ప్రదేశం – జగన్నాథ్‌పూర్ – ఆశ్రమం నుండి 11 కిలోమీటర్ల దూరానికి మార్చబడినది. ఆధ్యాత్మిక సంస్థ యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు అప్పటి నుండి ప్రధాన భవనాన్ని కార్యాలయ స్థలంగా ఉపయోగించడం జరుగుతోంది.
ప్రధాన భవనంలో అనేక చిన్న గదులు మరియు హాళ్ళు – ఒక రిసెప్షన్ మరియు పుస్తకాల గది, మాతృ మందిర్, పరమహంస యోగానందగారి గది మరియు శత జయంతి ఫోటోలను ప్రదర్శించే హాలు ఉన్నాయి.
రిసెప్షన్ హాల్ మరియు పుస్తకాల గది
బయటి వరండా ఒక పెద్ద హాలులోకి దారితీస్తుంది, ఇది భక్తులు మరియు ఇతర ఆశ్రమ సందర్శకులకు రిసెప్షన్ కార్యాలయంగా పనిచేస్తుంది. వై.ఎస్.ఎస్. ప్రచురణలన్నీ ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి మరియు పుస్తక విక్రయ విభాగం కూడా ఇక్కడ ఉంది.
మాతృ మందిరం
వరండాకు ఎడమ వైపున తివాచీ వేయబడిన పెద్ద హాలే మాతృ మందిరం. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ శ్రీ దయామాతగారి పావనమైన పేరును ఈ హాలుకు పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో, శ్రీ దయామాతాజీ ఇక్కడ ఉన్న ఒక దివాను మీద ఆసీనురాలై ఒక సత్సంగంలో సంభాషిస్తూ ‘సమాధి’ లోకి ప్రవేశించారు. ఆమె ఫోటోలు మరియు ఈ హాలులో ఉంచబడిన రెండు దివాన్లు “మా” కి నివాళి మాత్రమే కాదు, గురుదేవులు ప్రసాదించిన సాధనను క్రమబద్ధంగా మరియు చిత్తశుద్ధితో అభ్యసించినప్పుడు యోగదా భక్తులందరు ఆధ్యాత్మిక శిఖరాలను చేరగలరని అవి గుర్తుచేస్తాయి. ప్రస్తుతం ఈ హాలు ధ్యానానికి, సలహా సమావేశాలకు మరియు తరగతులు నిర్వహించడానికి వినియోగించబడుతోంది.
పరమహంస యోగానందగారి గది
ఆ మహాగురువులు రాంచీలో నివసించిన సంవత్సరాలలో (1918 నుండి 1920 వరకు) బస చేసిన గది, ఒక పవిత్ర మందిరముగా భద్రపరచబడింది. ప్రతిరోజూ నిర్ణీత సమయంపాటు ఇది వ్యక్తిగత ధ్యానం కోసం అందరికీ తెరిచి ఉంచబడుతుంది. భక్తులు ఇక్కడ ధ్యానం చేసినప్పుడు గొప్ప ఉన్నతిని అనుభూతి చెందుతారు. యోగానందగారు ఉపయోగించిన చెక్క మంచంతోపాటు, ఈ గదిలో గురుదేవుల చేతి మరియు పాద ముద్రలు కూడా ప్రదర్శించబడుతున్నాయి—అమెరికాలో ఉన్న లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి వీటిని తీసుకురావడం జరిగింది.
ప్రార్థనలు అవసరమైన ప్రియమైనవారి పేర్లను ఈ మంచం మీద ఉన్న ఒక ప్రార్థన పెట్టెలో ఉంచవచ్చు. గురుదేవులు ఉన్న సమయంలో ఆయన ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయంలో భాగంగా, ప్రార్థనలు అభ్యర్ధించే వారందరి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు ప్రతిరోజూ ప్రార్థిస్తారు.
అదనంగా, గురువుగారి కొన్ని వ్యక్తిగత వస్తువులు ఈ గది వెలుపల ప్రదర్శించబడతాయి.
యోగానందగారి వ్యక్తిగత వస్తువుల ప్రదర్శన
ఆయన మహాసమాధి చెందిన తరువాత వారి శరీరంపై ఉంచిన గులాబీ పువ్వుతో సహా యోగానందగారి కొన్ని వ్యక్తిగత వస్తువులు ఈ గది వెలుపల ప్రదర్శించబడుతున్నాయి. ఇతర జ్ఞాపక చిహ్నాలలో ఒక గొడుగు, సన్యాసుల అంగీ, ఆయన ఉపయోగించిన మేజోళ్ళు మరియు ఆయన భుజించిన “లూచీ” లోని ఒక చిన్న భాగం ఇక్కడ ఉన్నాయి.
ఫోటో గ్యాలరీ
రిసెప్షన్ హాలుకు ముందు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయబడింది. 1917 నుండి 2016 వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క వంద సంవత్సరాల ప్రయాణ చరిత్రను వర్ణించే చిత్ర ప్రదర్శన ఉంది.