క్రియాయోగం పునరుజ్జీవనపు 150వ వార్షికోత్సవం – 2011

మృణాళినీమాత పంపిన సందేశం

ఈ సంవత్సరం, ఎంతోకాలంగా మరుగున పడిపోయిన, ఈ యుగం కోసం ఇచ్చిన ఒక ప్రత్యేక వరప్రసాదమైన, క్రియాయోగ శాస్త్రం పునరుజ్జీవనపు 150వ వార్షికోత్సవం. దైవ సాక్షాత్కారం పొందిన సనాతన ఋషుల ఆధ్యాత్మిక యుగానికి చెందిన దివ్య భాండాగారం నుంచి భగవంతుడు మరియు మన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ వారి గురుపరంపర మనకు ప్రసాదించిన ఈ అమూల్యమైన కానుక కోసం మనం ఆనందంతో, కృతజ్ఞతతో పండుగ చేసుకొనే ఒకానొక సందర్భం ఇది.

క్రియాయోగం మానవ చైతన్యాన్ని ఉద్ధరించే శాస్త్రం, మానవుడిలోనున్న దైవ సామ్రాజ్యాన్ని తెరచే తాళంచెవి. సాధారణ మానవ దృక్పథం యొక్క లౌకిక వ్యవహారాల పైనే దృష్టిని పెట్టే ప్రాపంచికత నుంచి దాచి పెట్టబడిన భగవంతుని సర్వవ్యాపకత్వం లోనున్న భూలోక స్వర్గాన్ని కనిపెట్టగలిగే తాళంచెవి. ఈ కానుకతో పాటుగా వచ్చే వరాలు—భగవంతుడి కృప మరియు నిజాయితీ గల నిష్ఠాగరిష్టులైన క్రియాయోగులందరికీ మన మహా గురువులు సహాయాన్ని, మార్గదర్శనాన్ని అందిస్తామని చేసిన వాగ్దానం. క్రియాయోగాన్ని సక్రమంగా సాధన చేయడానికి, సరిగ్గా జీవించడానికి విశ్వాసంతో చేసే ప్రతి ప్రయత్నమూ సర్వదా వారు కురిపించే ఆశీస్సులతో భక్తుడు చేసే అనుసంధానాన్ని గాఢతరం చేస్తుంది.

క్రియాయోగాన్ని పునఃపరిచయం చేయడం, మన గురుదేవులు పరమహంస యోగానందుల వారి సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అది వ్యాప్తి చెందడం మానవాళి పరిణామ క్రమంలో ఒక క్లిష్టమైన ఘట్టంలో సంభవించాయి. శతాబ్దాలుగా శాస్త్రీయ, సాంకేతిక విజయాల దృష్ట్యా గొప్ప పురోగతి సాధించబడింది కానీ నిజమైన ఆనందాన్ని, సాఫల్యతను కొనితేవడానికి అటువంటి పురోగతి మాత్రమే సరిపోదని దానితో పాటుగా వచ్చిన అనుచిత అల్లకల్లోల సమయాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. దైవానుసంధానం ద్వారా ప్రాప్తించే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మనుష్యుల హృదయాలలో ఒక శూన్యం ఎప్పుడూ ఉంటుంది; విషయవాంఛలను, అహంకారపూరిత లక్ష్యాలను ఎంతగా తీర్చినా ఆ వెలితిని పూడ్చలేము. భగవంతునితో మనకు గల శాశ్వత సంబంధాన్ని గురించి, ఆయనను మన దైనందిన జీవితాలలో చేర్చుకోవలసిన ఆవశ్యకత గురించి మనం గ్రహించినపుడే మన జీవితాలు పరిపూర్ణ౦ అవుతాయి. క్రియాయోగ శాస్త్రం బోధించే సరైన జీవన విధానం మరియు ధ్యానము — మనతో మనకి, ఇతరులతో, మన సృష్టికర్తతో సామరస్యాన్ని కొనితెస్తాయి. మాయకు దాసులవడం ఫలితంగా కలిగిన బాధల నుంచి విముక్తులవడానికి తపించే ఎన్నో ఆత్మల పిలుపుకు జవాబుగా భగవంతుడు కరుణతో ఇచ్చిన సమాధానమిది. భగవంతుని శాంతి, దివ్యప్రేమలను అనుభవించడానికి, ఆయనతో మనకు గల అనుబంధంలోనే మన శ్రేయస్సును కనుగొనడానికి, చివరగా మన చైతన్య కే౦ద్రాన్ని, దేహంతో తాదాత్మ్యం చెందిన అహంకారం నుంచి అమరమైన మన ఆత్మకు మార్చడానికి ఒక సాధనాన్ని అది మనకు అందిస్తో౦ది. గురుదేవులు పరమహంసజీ ఆ చైతన్యంతోనే జీవించారు. ఆయనకు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ దైవదత్తమైన కార్యాన్ని నెరవేర్చడంలో భగవంతుని ఉత్కృష్టమైన పరమానందంలోనే ఆయన ఎప్పుడూ స్థిరంగా నెలకొని ఉండేవారు. క్రియాయోగం ప్రసాదించే ముక్తిదాయక దీవెనలను అందరితో పంచుకోడానికి ఆయన ఎంత అవిశ్రాంతంగా సేవలందించేవారో!

ఈ జీవితకాలంలోనే భగవంతుడిని తెలుసుకోడమనే ఆధ్యాత్మిక జన్మహక్కు మనలో ప్రతి ఒక్కరిలో స్వతఃసిద్ధంగానే ఉందని గురూజీ మనకు గుర్తు చేశారు. ప్రగాఢమైన క్రియాధ్యానం ద్వారా మనం అనంతుడైన భగవంతుడిని స్పృశించినప్పుడు, బాహ్యంలో మనం పోషిస్తున్న పాత్రలలోనికి భగవంతుడి దివ్య కళ్యాణగుణాలను మనం తెస్తాము. ఇతరులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోడానికి, మన స్వంత సవాళ్లను ఎదుర్కొనడానికి భగవంతుడి జ్ఞానం మనల్ని సమర్థులుగా చేస్తుంది. ఆయన ప్రేమను అనుభవిస్తూ మనం మరింత కరుణామయులుగా, క్షమాశీలురుగా తయారవుతాము. “మానవుడు అనంతుడైన పరమేశ్వరుని వ్యక్తిగతంగా అలౌకికంగా అనుభూతి చెందడం ద్వారా దేశాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడంలో” క్రియాయోగం సహాయపడ్తుందని మహావతార్ బాబాజీ భవిష్యవాణి పలికినప్పుడు, ఆయన క్రియాయోగం యొక్క పరివర్తన కారకశక్తిని గురించే మాట్లాడారు. మనలో ప్రతి ఒక్కరూ చేసే కృషి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మన చైతన్యం నుంచి మాయాతెరలు తొలగిపోతూ ఉంటే, మనం మరింత ఎక్కువగా భగవంతుడి కాంతిని ప్రతిఫలిస్తాము, ప్రసారం చేస్తాము. మరింత ఎక్కువమంది క్రియాసాధన చేయడం ద్వారా భగవంతుడిని అన్వేషించడంలో కలిసినప్పుడు, ఆ స్వస్థత చేకూర్చే కాంతి ప్రభావం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మనమందరం కలిసి ఈ శుభప్రదమైన వార్షికోత్సవాన్ని స్మరించుకుంటూ ఉండగా క్రియాయోగం ద్వారా, గురూజీ ఆశీస్సుల ద్వారా, స్వయంగా మీ ఆత్మ ముక్తిని పొందడం ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించగలరని, ఆయన మిమ్మల్ని ఎక్కడ ఉంచితే అక్కడే భగవంతుడి మంచితనాన్ని ప్రసరింపజేస్తారని ప్రార్థిస్తూ నేను మీకు నా ప్రేమను, ప్రార్థనలను పంపుతున్నాను.

భగవంతుడు, గురుదేవుల ప్రేమతో అంతులేని ఆశీస్సులు,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2011 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

క్రియాయోగం: 150 సంవత్సరాల ఉత్సవం

ఇతరులతో పంచుకోండి