ఆలోచనకూ మేధస్సుకూ అతీతమైనది: అపరిమిత అంతర్దృష్టి కలిగించే ఆత్మసహజావబోధం

పరమహంస యోగానందగారి జ్ఞాన-వారసత్వం నుండి

ప్రతివారికీ సహజావబోధం ఉంది, మీకు కూడా

భగవంతుడి సంతానమందరికీ అత్యున్నత మేధస్సు ప్రదానం చేయబడింది: అది ఆత్మకు గల అన్నిటినీ తెలుసుకోగల శక్తి అయిన సహజావబోధం. సహజావబోధం అనేది పరమాత్మ శక్తి, దానిని వైయక్తిక ఆత్మ వారసత్వంగా తెచ్చుకుంది. దీనివల్ల సత్యం అనేది నేరుగా, ఇతర ఉపకరణాల మాధ్యమం లేకుండా గ్రహించబడుతుంది. సహజావబోధం అనేది ఆత్మ మార్గదర్శకత్వం, మానవుడి మనసు ప్రశాంతంగా ఉన్న సందర్భాలలో అతడిలో సహజంగా కనిపిస్తుంది. దాదాపు ప్రతివారికీ ఎప్పుడో ఒకసారి ఎందుకో చెప్పలేని విధంగా నిజమైన “ఊహ” లేక తన ఆలోచనను సరిగ్గా ఇతరులకు అందించగలగడం జరిగే ఉంటుంది. ప్రతి మనిషికీ ఆలోచనా శక్తి లాగే, సహజావబోధనా శక్తి ఉంటుంది. ఆలోచనను అభివృద్ధి చేసుకోగలిగినట్లే, సహజావబోధనా శక్తిని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. సహజావబోధంలో మనం సత్యంతో అనుశ్రుతిలో ఉంటాము — పరమానందలోకంతో, “భిన్నత్వంలో ఏకత్వ” స్థితితో, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నిర్దేశించే న్యాయ సూత్రాలతో, భగవంతుడితో. …అయితే దాన్ని మనం పెంపొందించుకోవాలి: ప్రతి వ్యక్తి జీవితంలోనూ పుట్టిన నాటినుండీ జ్ఞానానికి సంబంధించిన రెండు శక్తులు పనిచేస్తుంటాయి: (1) మానవుడి తార్కిక శక్తి, దాని ఉపగ్రహాలైన, ఇంద్రియానుభవాలు, గ్రహణ శక్తి, గుర్తింపు శక్తి మొదలైనవి; (2) సహజావబోధం లేక అంతర్ జ్ఞానం. వీటిలో మొదటివి సాంఘిక సంస్థలు, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాల వల్ల అభివృద్ధి చెందుతాయి. రెండవది సాధారణంగా సరైన మార్గదర్శకత్వం, శిక్షణా విధానాలు లేకపోవడం వల్ల నిర్లక్ష్యం చేయబడి, అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. ఒకరి సహజావబోధం అభివృద్ధి చెందకుండా ఉండిపోయినంత కాలం ఆ వ్యక్తి తన పరిమిత శక్తి కలిగిన మర్త్యత్వపు మేధస్సు యొక్క గ్రహణ శక్తి వల్ల నడిపించబడుతూ, అప్పుడప్పుడూ మాత్రమే ఆ సహజావబోధా జనిత ప్రేరణ అందుకుంటాడు. అలా అతడు కొన్ని మంచి పనులు చేస్తాడు, కానీ చాలా పొరపాట్లూ చేస్తాడు, అనేక చెడు అలవాట్లు చేసుకుంటాడు. కార్యకారణ సిద్ధాంతం లేదా, కర్మ సిద్ధాంతం పనిచేయడం వల్ల తాను సృష్టించుకొన్న విధిననుసరించి నిస్సహాయంగా కొట్టుకుపోతూ ఉంటాడు, సాధారణంగా ఇది క్లేశాన్ని కలిగిస్తుంది. ఒకరి జీవితం భగవంతుడి ఆంతరిక సహజావబోధనా మార్గదర్శకత్వంతో నడిపింపబడినప్పుడే అది జ్ఞానంతో, ఆనందంతో సమతుల్యంగా ఉండి, విజయవంతమూ, ఆరోగ్యవంతమూ, పరిపూర్ణమూ అవుతుంది. సత్యాన్ని తెలుసుకొని దానిలో జీవించడానికి ఏకైక మార్గం సహజావబోధనా శక్తిని పెంపొందించుకోవడం. అప్పుడు జీవితానికి ఒక అర్థం ఉన్నట్టూ, నీవేది చేసినా ఆ ఆంతరిక స్వరం నీకు దారి చూపుతున్నట్టూ నీవు చూస్తావు. జంతువులను తమ ప్రవృత్తి నడిపిస్తుంది, అలాగే సాధారణ మానవుడు తన అహంకారాన్ననుసరించి ప్రవర్తిస్తాడు. ఇక పరమాత్మ తత్వంతో ఏకత్వం పొందిన యోగి ఆత్మ వల్ల నడిపింపబడతాడు. ఆత్మసాక్షాత్కారానికి దారితీసే శాస్త్రీయమైన లోతైన ధ్యానం యొక్క దశల వారీ పద్ధతులను నేర్చుకోవడం ద్వారా ఈ సహజావబోధం యొక్క శక్తిని అభివృద్ధి చేయవచ్చు.

సహజావబోధం లక్షణాలు

ఇంద్రియాలు, ఆలోచనలు, మేధస్సుకు ఇది భిన్నమైనది… మన చైతన్యంలోకి విషయ పరిజ్ఞానం ప్రవేశించే మార్గం ఇంద్రియాలు, మనస్సు. మానవుడి విషయ పరిజ్ఞానం ఇంద్రియాలగుండా లోనికి చొచ్చుకొని వచ్చి మనస్సు చేత వివరింపబడుతుంది. ఇంద్రియాలు తమ గ్రాహ్యత పొరపాటుగా చేస్తే ఆ విషయాన్ని అర్థం చేసుకొని చేసే చివరి నిర్ణయం కూడా తప్పవుతుంది. దూరాన ఎగురుతున్న ఒక తెల్లటి, పల్చటి బట్ట దెయ్యం లాగా కనిపించవచ్చు. మూఢ నమ్మకాలున్న ఒక వ్యక్తి అది దెయ్యం అని నమ్ముతాడు; కానీ దగ్గరగా చూస్తే ఆ తీర్మానం తప్పని తేలుతుంది. ఇంద్రియాలు, గ్రహణశక్తి తేలిగ్గా మోసపోతాయి. ఎందుకంటే అవి సృష్టింపబడిన వస్తువుల అసలైన స్వభావాన్ని, పదార్థాన్ని, వాటి ప్రధాన లక్షణాన్ని గ్రహించలేవు.
మనిషి యొక్క అత్యున్నత సామర్థ్యం తార్కికత కాదు, సహజావబోధం: నమ్మడానికి వీలులేని ఇంద్రియాల, లేదా తార్కికత సహాయంతో కాక, తన ఆత్మ నుండి తనంతట తానుగా వెంటనే జనించిన గ్రహింపును స్వీకరించడం.

“సహజావబోధం ప్రశాంత చైతన్యంలో అనుభూతిగా వ్యక్తమౌతుంది, ఇది చాలావరకు హృదయంతో గ్రహింపబడుతుంది. అలాంటి భావన కలిగినప్పుడు, దానినుండి సరైన మార్గంలో వెళ్తున్నానన్న ఒక స్పష్టమైన భావన, అచంచలమైన విశ్వాసం జనిస్తాయి.”

సహజావబోధం లోపలినుండి వస్తుంది; ఆలోచన బాహ్యం నుండి. సహజావబోధం వాస్తవికతను ముఖాముఖీ దర్శింపజేస్తుంది; ఆలోచన దాన్ని పరోక్షంగా చూపుతుంది. సహజావబోధం ఒక విచిత్ర సహానుభూతితో, సత్యాన్ని సంపూర్ణంగా దర్శిస్తుంది, ఆలోచన దాన్ని ముక్కలుగా విడగొడుతుంది.

…దానికి అనుభూతిని జతచేస్తుంది

ఇంద్రియాలు, మేధస్సుకు అతీతంగా, సహజావబోధం ప్రశాంత చైతన్యంలో ప్రధానంగా హృదయంతో గ్రహింపబడి, అనుభూతిగా వ్యక్తమవుతుంది. ధ్యానంలో అలాంటి అనుభూతి జనించినపుడు, దానినుండి సరైన మార్గంలో వెళ్తున్నానన్న ఒక స్పష్టమైన భావన, అచంచలమైన విశ్వాసం జనిస్తాయి. అంతకంతకూ ఈ సహజావబోధాన్ని గుర్తించి అనుసరించడం మీరు నేర్చుకుంటారు. అంటే దీనర్థం మీరు వివేచన వదిలేశారని కాదు. ప్రశాంతమైన, నిష్పాక్షిక వివేకం కూడా సహజావబోధాన్ని కలిగిస్తుంది. ఇంగిత జ్ఞానాన్ని వాడండి. కానీ గుర్తుంచుకోండి. తొందరపాటు, లేదా భావోద్వేగంతో కూడిన తార్కికత దురభిప్రాయాలను కలిగించి, పొరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది.

స్వచ్ఛమైన వివేకం, స్వచ్ఛమైన అనుభూతి రెంటికీ సహజావబోధం లక్షణాలుంటాయి. స్వచ్ఛమైన అనుభూతి స్వచ్ఛమైన వివేకంలాగే విషయాన్ని తేటగా దర్శిస్తుంది. చాలామంది స్త్రీలకు తీక్షణమైన సహజావబోధం ఉంటుంది. వాళ్ళు అనవసరంగా ఉద్విగ్నతకు లోనైనప్పుడు మాత్రమే వారు తమ సహజావబోధాన్ని కోల్పోతారు. స్వచ్ఛమైన వివేకం కూడా అది తగినంతగా అభివృద్ధి చెందినపుడు సహజావబోధాన్ని కలిగి ఉంటుంది. లేకపోతే పూర్వభావన తప్పయితే తీర్మానం కూడా తప్పవుతుంది. తేటగా విషయ వివేచన చేసే ప్రతీ వ్యక్తీ, ముందో వెనుకో అసలైన సహజావబోధాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అది ఎప్పుడూ పొరపాటు చేయదు.

“స్వచ్ఛమైన వివేకం, స్వచ్ఛమైన అనుభూతి రెంటికీ సహజావబోధం లక్షణాలుంటాయి. స్వచ్ఛమైన అనుభూతి స్వచ్ఛమైన వివేకంలాగే విషయాన్ని తేటగా దర్శిస్తుంది.”

మీరు ఆలోచించడంతో పాటు అనుభూతి చెందాలి; మీ ఆలోచనలతోపాటు మీకు అనుభూతి లేకపోతే, ఒక సరైన నిర్ణయానికి రావడంలో మీరు విజయులు కాలేరు. అనుభూతి అనేది సహజావబోధం యొక్క వ్యక్తీకరణ. సమస్త జ్ఞానభండారం. అనుభూతి, ఆలోచన లేక వివేచన అనేవి సమతూకంలో ఉండాలి; అప్పుడే మీలో ఈశ్వరుడి ప్రతిబింబం అంటే ఆత్మ తన పూర్తి స్వభావాన్ని వ్యక్తీకరిస్తుంది. అందువల్ల ఒకరు తనలోని వివేకాన్నీ, అనుభూతినీ సంతులనం చేయడం ఎలాగో యోగం నేర్పిస్తుంది. ఆ రెండూ తనలో సమంగా కలిగి ఉండని వ్యక్తి సంపూర్ణంగా అభివృద్ధి చెందినవాడు కాదు.

వివేకం, అనుభూతీ సమతుల్యతతో ఉన్నప్పుడు సహజావబోధంతో విషయాన్ని గ్రహించడం, సత్యమేదో తెలుసుకొనే సామర్థ్యం అలవడతాయి. ఈ సమతూకం సాధించినప్పుడు, స్త్రీ, పురుషులు దేవుళ్ళవుతారు.

సహజావబోధం అభివృద్ధి చెందకపోతే కలిగే పరిణామాలు

అసలు నీవేవరో తెలియని అజ్ఞానం:

అభివృద్ధి చెందని సహజావబోధం ఆత్మ ముందర పెట్టిన స్ఫటికం వంటిది, ద్వంద్వ ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆత్మయే అసలైన స్వరూపం; ప్రతిబింబం అవాస్తవికమైనది — అది అహంకారం లేదా మిధ్యాత్మ. సహజావబోధం ఎంత తక్కువగా అభివృద్ధి చెంది ఉంటే ప్రతిబింబమైన అహంకారం అంత వక్రీకృతమైఉంటుంది. సహజావబోధం అభివృద్ధి చెందని కారణంగా సంభవించే ఈ మిధ్యా గుర్తింపు ఉనికి చేత మనిషి జీవితం నడిపింపబడేటపుడు అది అన్నీ పరిమితులకు, భ్రాంతిజనిత భావనలకు గురవుతూంటుంది. తత్ఫలితంగా తప్పులు చేయడం, దాని ఫలితాలు అనుభవించడం అనే గందరగోళ జీవనం తప్పదు.

ఒక వ్యక్తి తన శరీరంతో తాదాత్మ్యత చెందినపుడు శబ్ద, స్పర్శ, రూప, రస గంధాదులు, మరియు బరువు, కదలిక….ఇవి తప్ప మరేమీ అనుభవించడు. శారీరిక స్వప్నాలతో వినోదాన్ని పొందమని ఈశ్వరుడు మనిషిని ఈ భూమి మీదకు పంపాడు, అంతే కానీ తన అమరత్వపు చైతన్యాన్ని, ఈ శరీరంతో తాదాత్మ్యత చెందడం ద్వారా, మరుగు పరచమని కాదు.
ఒక వ్యక్తి తగినంత దీర్ఘ కాలం పాటు తన ఆలోచనలు, ఇంద్రియ సంవేదనలతో తాదాత్మ్యం చెందకుండా, స్పృహ కోల్పోకుండా ఉండగలిగితే, అతడి సహజావబోధనా శక్తి అభివృద్ధి చెందడం వల్ల ఆత్మ స్వభావాన్ని తెలుసుకోగలుగుతాడు.

“విజయాన్ని కోరుకొనే వ్యక్తి ఎవరైనా సరే పుస్తకాలు, కళాశాలల మీద ఆధారపడకుండా తన మెదడులోని కణాల గ్రహణ శక్తిని పెంపొందించుకోవడం చేస్తే ఎక్కువ సాధించగలుగుతాడు.”

“నేను శ్వాసను కాను; నేను శరీరాన్ని కాదు, ఎముకలు లేక కండ కాదు. నేను మనసును లేక అనుభూతిని కాదు. శ్వాసకు, శరీరానికి, మనసుకు, అనుభూతికి వెనుక ఏది ఉందో అది నేను.” మీరు శరీరము లేక మనసు కాదని ఎరిగి, ఈ ప్రపంచ చైతన్యానికి అతీతంగా వెళ్ళినపుడు, అయినా ఎప్పటికన్నాఇప్పుడే మీ ఉనికి మీకు ఎరుకలో ఉంటే — ఆ దివ్య చైతన్యమే మీరు. ఈ విశ్వంలోని ప్రతిదీ దేనిలో పాదుకొని ఉందో అదే మీరు.

పరిణతి చెందిన విద్యార్థి తన ఆలోచనలు కరిగి సహజావబోధంగా మారేవరకు గాఢంగా ధ్యానం చెయ్యాలి. ఆలోచనా తరంగాలు లేని సహజావబోధం అనే సరస్సులో, యోగి ఆత్మ అనే చంద్రుడి ప్రతిబింబాన్ని దర్శిస్తాడు.

సహజావబోధం అభివృద్ధి చెందకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు సంభవిస్తాయి. . .

మన తప్పుడు తీర్మానాలకు కారణం సహజావబోధం అభివృవృద్ధి చెందకుండా ఉండడం. మీలో చాలామంది మీరు గొప్పగా ఉండి, గొప్ప పనులు చేయాల్సిన వారమని అనుకుంటూ ఉంటారు; కానీ మీలో సహజావబోధనా శక్తి లేకపోవడంవల్ల, ఆ సామర్ధ్యం చాలావరకు నిద్రాణంగా ఉండిపోయింది.

మీ మనసు చేసే నిర్ణయాలు ఇంద్రియాలు తమకందించిన సమాచారాన్ననుసరించి ఉండడం వల్ల, మీ ఇంద్రియాలు ఒకవేళ పొరపాటు పడితే, మీరు ఒక వ్యక్తి లోపల నిజంగా ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతడు చాలా అద్భుతమైన వ్యక్తి అని భావించవచ్చు. మీ ఆత్మ బంధువు దొరికాడన్న భావనతో వివాహ బంధంలో చిక్కుకోవచ్చు; తరువాత విడాకుల కోర్టులో దానికి ముగింపు పాడవచ్చు. అయితే సహజావబోధం ఎన్నడూ అలాంటి తప్పులు చేయదు. అది ఆ కళ్లలోని ఆకర్షణ శక్తిని చూడదు. లేక ఆకర్షణీయమైన ముఖం లేదా వ్యక్తిత్వం వంక చూడదు. కానీ హృదయంలో ఆవ్యక్తి నిజంగా ఎలాంటివాడో అనుభూతి చెంది గుర్తిస్తుంది.

. . .అభివృద్ధి చెందిన సహజావబోధం జీవితంలో విజయాన్ని అందిస్తుండగా:

అభివృద్ధి చెందాలన్నా, పొరపాట్లు చేయడం అనే కష్టాన్ని తప్పించు కోవాలన్నా, ప్రతీ దానిలోనూ సత్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి. మీరు మీ సహజావబోధాన్ని పెంపొందించుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. పదార్ధానికి సంబంధించిన ఆచరణాత్మక సత్యం ఇదే. అందుకే సహజావబోధనా శక్తిని పెంపొందించుకొని ఉపయోగించ మని నేను చెబుతుంటాను. ఇతరులతో మీ సంబంధాలలోనూ, మీ వ్యాపారంలోనూ, వైవాహిక జీవితంలోనూ, మీజీవితంలోని ప్రతీ భాగంలోనూ సహజావబోధం అతి ముఖ్యం. మీలో సహజావబోధనా సామర్ధ్యం లేకపోవడం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పు వ్యాపార భాగ్యస్వాములను ఎంచుకుంటారు, ఇంకా తప్పుడు వ్యక్తి గత సంబంధాలలో చిక్కుకుంటారు.

విజయానికి భౌతిక మార్గాలమీదే ఆధారపడడం లో అనిశ్చతి ఉంది. కానీ విజయానికి సహజావబోధనా మార్గం వేరుగా ఉంటుంది. సహజావబోధనాధారిత గ్రహణశక్తి ఎప్పుడూ పొరపాటు కాదు. అది ఒక ఆంతరిక అనుభూతి వల్ల కలుగుతుంది, దానివల్ల మీరు మీ నిర్దేశిత మార్గంలో వెళ్ళడం వల్ల విజయులవుతారో లేదో ముందే తెలుసుకుంటారు.

చాలామంది వ్యక్తులు సహజావబోధం లేక ఏమాత్రం లాభకరంకాని ఆర్ధిక పెట్టుబడులు పెడతారు, ఫలితంగా సమస్తమూ కోల్పోతారు. నేను నా ప్రతీ నిర్ణయమూ సహజావబోధంతో తీసుకోవడం వల్ల నా నిర్ణయాలన్నిటిలో విజయాన్నే పొందాను. అదెప్పుడూ ఓడిపోదు.

వైజ్ఞానిక సంబంధ వ్యక్తి కానీ, వ్యాపారి కానీ లేక విజయాన్ని ఆశిస్తున్న ఏ వ్యక్తి అయినా పుస్తకాలమీద, కళాశాల అధ్యయనం మీద కాక, తన మెదడులోని కణాల గ్రహణ శక్తిని పెంపొందించుకోవడం మీద శ్రద్ధ పెడితే ఎక్కువ విజయం సాధించ గలుగుతాడు. ప్రపంచం, పుస్తకాలతో, బాహ్యమైన పద్ధతులతో మొదలుపెడుతుంది, కానీ మీరు మీ సహజావబోధం యొక్క గ్రహణశక్తిని పెంచుకోవాలి. మీలోనే సమస్త జ్ఞానానికి సంబంధించిన అనంత సమాచార కేంద్రం ఉంది.

సహజావబోధాన్ని అభివృద్ధి చేసుకొనే పద్ధతులు

ముందుగా లోకజ్ఞానం పెంచుకోండి. . .

సహజావబోధనా జ్ఞానం, సాధారణ పరిజ్ఞానాన్ని అధిగమించినదైనా అది వ్యక్తిని వేరే లోకం వారిగా కానీ, అవాస్తవికంగా కానీ తయారు చేయదు; అది లోకజ్ఞానానికి తల్లిలాంటిది. అదే తన పరిసరాలకు సహజావబోధంతో స్పందిస్తుంది.

. . . తరువాత సహజావబోధాత్మక మార్గదర్శనం కోసం ప్రార్థించండి:

నీ లక్ష్యం గురించి, దానిని సాధించడానికి అనుసరించ వలసిన పద్ధతుల గురించి మీకు వీలైనంత తెలుసుకోండి. మీరు పెట్టుబడి పెడుతున్నా, వ్యాపారం మొదలు పెడుతున్నా, మీ వృత్తిని మార్చుకొంటున్నామీరు పరిశోధన చేశాక, పోల్చి చూసుకొన్నాక, మీ తెలివిని పరిమితి వరకు వాడినాక కూడా తలమునకలుగా అందులోకి దూకకండి. మీ వివేకమూ, పరిశోధనా ఒకవిషయాన్ని సూచిస్తోంటే, ఈశ్వరుడిపై ధ్యానం చేసి, ప్రార్థించండి. ఈ దారిలో ముందుకు పోవడం సరైనదేనా అని ఆంతరిక నిశ్శబ్దంలో భగవంతుడిని అడగండి. మీరు గాఢంగా, తీవ్రంగా ప్రార్థించినపుడు, ఏదో మిమ్మల్ని ఆపని నుండి వెనక్కు లాగుతున్నట్టనిపిస్తే ఇక అది చేయకండి. కానీ మీకు అపరాని సకారాత్మకమైన ప్రేరణలోపలినుండి తోసుకొస్తుంటే, మీరు ప్రార్థించి, మరింతగా ప్రార్థించి అప్పుడుకూడా ఈ ప్రేరణ అలాగే నిలిచి ఉంటే, ఇక ముందుకెళ్ళండి. దారి చూపమన్న మీ ప్రార్థన నిజాయితీగా ఉండాలి, అప్పుడే మీకు కలిగిన ప్రేరణ మీలోని చెడ్డ కోరికను ప్రోత్సహించేది కాక ఈశ్వరుడి నుండే వచ్చినట్టు.

నా సహజావబోధాన్ని ఆచరణాత్మకంగా అబివృద్ధి పరచుకోవడానికి నేను ఈ విధానాన్నేపాటించాను. ఏదైనా ప్రయత్నం ప్రారంభించేముందు నేను నా గదిలో నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చుని నా మనసులో ఆ శక్తిని విస్తరిస్తూ పోతాను. అప్పుడు ఏకాగ్రపరచబడిన నా మానసిక ప్రకాశాన్నినేనేం సాధించదలచానో దానిమీద ప్రసరింపజేస్తాను.

మీకు దారి చూపమని ప్రతిసారీ ఆ తండ్రిని అడగండి. మీలోని అహంకారం గుడ్డిది మరియు గట్టి స్వరం కలిగినడైతే అది మీ సహజావబోధాన్ని అణచి వేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. కానీ మీరు ఏదైనా ప్రయోజనకరమైన కార్యాన్ని సాధించాలనే ప్రయత్నంవల్ల కేవలం ఈశ్వరుడిని సంతృప్తి పరచాలన్నది మీ లక్ష్యమైతే ఆయన మీ అడుగులను తప్పు మార్గంనుండి మంచివైపుకు నడిపిస్తాడు. కేవలం ధ్యానమే ఇందుకు సరైన. . .నిశ్చయమైన మార్గం. సహజావబోధాన్ని వెలికితీయగల నిశ్చయమైన మార్గం ఉదయమూ, రాత్రి పడుకోబోయేముందూ ధ్యానం చేయడమే.

“అశాంతికరమైన ఆలోచనలు ఆగిపోయినప్పుడు మాత్రమే, సహజావబోధం యొక్క ఆ మౌనంలో మనతో మాట్లాడుతున్న ఈశ్వరుడి స్వరాన్నిమనం వినగలము….భక్తుడి మౌనంలో భగవంతుడి మౌనం విడుతుంది.”

ఎప్పుడైనా మీరు ఒక సమస్యను సహజావబోధంతో పరిష్కరించుకోవాలనుకుంటే, పాఠాల్లో చెప్పినట్టు ముందుగా గాఢమైన ధ్యానం లేక మౌనం లోకి వెళ్ళండి. ధ్యానం చేసే సమయంలో మీ సమస్యలను ఆలోచించకండి. మీ శరీరంలో అంతరంతరాల్లో ఒక ప్రశాంత భావన నిండేవరకు – మీ ఆత్మ అంతరాల్లోపల ఒక దివ్యానందం నిండేవరకు — శ్వాస నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఆయ్యేవరకూ ధ్యానం చేయండి. అప్పుడు కనుబొమల మధ్యభాగం (కూటస్థ చైతన్య కేంద్రం) లో మరియు హృదయం మీద ఒకేసారి దృష్టి కేంద్రీకరించండి. చివరిగా మీ సమస్యల పరిష్కారానికి మీరేమి చేయాలో తెలుసుకోవడానికి మీ సహజావబోధాన్ని నడిపించమని భగవంతుడిని అడగండి.

స్పష్టంగా ఆలోచించే మనిషికి అతిగా ఆలోచించే మనిషికి తేడా తెలుసుకోవాలి….సహజావబోధం నిశ్శబ్దతలోనే వ్యక్తమౌతుంది; అభివృద్ధి చెందని మనిషిలో చురుకైన మెదడు, అశాంతికర ఇంద్రియాల యొక్క ఖాళీ సమయాలు అనే రంధ్రాల్లోంచి అది అప్పుడప్పుడూ మాత్రమే తొంగి చూస్తుంది. స్పష్టంగా ఆలోచించే వ్యక్తి తన తెలివి సహజావబోధంపై పెత్తనం చేయడాన్ని అంగీకరించడు; ఓర్పుతో కూడిన ప్రశాంతతతో తాను సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహజావబోధం పూర్తి పాత్ర పోషించేలా దానికి స్వేచ్ఛనిస్తాడు.

ఉన్నత స్థాయి చైతన్య స్థితులను, దివ్యజ్ఞానాన్ని సాధించాలంటే ధ్యానం ద్వారామనసును తన నిరంతర చంచలత్వం నుండి వెనక్కు మళ్ళిం చాలి. ఆ అంతర్ముఖం చెందిన స్థితిలో ఆధ్యాత్మిక గ్రహణ శక్తి, లేక సహజావబోధం మేల్కొంటుంది.

సమాధి ధ్యానంలో తన చైతన్యాన్ని, ప్రాణ శక్తిని స్థూల శరీరమూ, ఇంద్రియాల సామ్రాజ్యం నుండి వెనక్కు మరలించగలిగిన పురోగమించిన క్రియా యోగి జ్ఞాన ఆవిష్కారాల ఆంతరిక ప్రపంచం లోకి ప్రవేశిస్తాడు. మెదడు, వెనుబాములలో పరమాత్మ నివాసముండే ఏడు పూజా వేదికలను అతడు గ్రహిస్తాడు, వాటిల్లోంచి వ్యక్తమయ్యే సమస్త జ్ఞానాన్నీ అతడు అందుకో గలుగుతాడు. అలా ఆత్మ సహజావబోధం ద్వారా తన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కర్తవ్యాల విషయంలో అన్ని రంగాల్లోనూ సరైన మార్గదర్శకత్వాన్ని అందుకొంటాడు.

యోగ శాస్త్రంయొక్క లక్ష్యం మనసును నిశ్శబ్ద పరచడం, తద్వారా వక్రీకరణ లేకుండా అది ఆంతరిక స్వరం యొక్క దోషరహిత ఉపదేశాన్ని వినగలుగుతుంది.

భగవంతుడు నీ సహజావబోధం ద్వారా నీతో మాట్లాడతాడు. . .

పరమాత్మ ఏదో దర్శనంలో ఒక రూపంతీసుకొని పెదవులతో. లేదా మానవరూపం తీసుకొని మాట్లాదకపోవచ్చు. కానీ భక్తుడి జాగృత సహజావబోధం ద్వారా మాట్లాడవచ్చు. భగవంతుడు ఒక సాధువు రూపంలో భక్తుడికి బోధించవచ్చు. కానీ తరచుగా భక్తుడి స్వంత సహజావబోధం ద్వారా అతడితో సంభాషించడం అనే సాదా మార్గాన్ని ఆయన అనుసరిస్తాడు.

భగవంతుడి స్వరం నిశ్శబ్దత. అశాంతికరమైన ఆలోచనలు ఆగిపోయినప్పుడు మాత్రమే, సహజావబోధం యొక్క ఆ మౌనంలో మనతో మాట్లాడుతున్న ఈశ్వరుడి స్వరాన్నిమనం వినగలము. భక్తుడి మౌనంలో భగవంతుడి మౌనం విడుతుంది.

నిష్పాక్షిక ఆత్మ పరిశీలన, క్రియాయోగం లో వలె గాఢమైన ధ్యానం ద్వారా ఆత్మ పరమాత్మల సంసర్గం జరిగేలా తన లోని సహజావబోధం తగినంతగా అభివృద్ధి చెందేవరకూ ఏ భక్తుడూ సంతృప్తి చెందకూడదు. భక్తుడు ప్రతిరోజూ కనీసం కొద్దిసేపు తీవ్రమైన ధ్యానం, వారంలో ఒకసారి మూడు లేదా నాలుగు గంటల గాఢధ్యానం చేసినట్టయితే, తన సహజావబోధం తగినంతగా సూక్ష్మతను సంతరించుకొని ఆత్మకు భగవంతుడికీ మధ్య జరిగే పరమానందకర జ్ఞానపూర్ణ “సంభాషణ”ను గ్రహించగలుగుతుంది. తన ఆత్మ పరమాత్మతో సంభాషించి ఆయన జవాబులు అందుకొనే — మానవ భాషలో పలకడం కాక మాటల్లేని సహజావబోధ సంభాషణ — ఆ అంతర్ముఖస్థితిని అతడు గ్రహిస్తాడు.

నిజమైన మతం సహజావబోధంపై ఆధారపడుతుంది

ప్రపంచంలోని అన్నిగుర్తింపబడిన మతాలూ సహజావబోధంతో కలిగిన జ్ఞానం పై ఆధారపడ్డాయి. ప్రతిదానికీ ఒక బాహ్య ప్రత్యేకత, గుహ్యమైన లేక అంతర్భూతమైన లక్షణం ఉంటాయి. బాహ్య లక్షణం ప్రజలలో దాని గుర్తింపును సూచిస్తుంది. దానిలో ఆ మతాన్ననుసరించే సామాన్య జనానికి మార్గదర్శకంగా ఉండేందుకు నైతిక నియమాలు, సిద్ధాంతాలు, వ్యాఖ్యానాలు, నిబంధనలు, నియమాలు ఉంటాయి. ఆంతరిక ఆకృతి ఆత్మ భగవంతుడితో సంబంధం నెలకొల్పుకోవడానికి పద్ధతులను కలిగిఉంటుంది. బాహ్య రూపం ఎక్కువ మంది కోసం; ఆంతరిక స్వరూపం తపన ఉన్న కొద్దిమంది కోసం. మతంలోని ఈ ఆంతరిక స్వరూపమే సత్యం గురించి నేరుగా తెలియజేసే సహజావబోధం వైపు నడిపించేది.

సృష్టికర్త గురించి మేధాపరమైన చర్చల వల్ల మీరు దేవుడిని పొందలేరు. కానీ ఆయన్ను ఆంతరంగంలో అన్వేషించడం వల్ల, ప్రతి రోజూ అందుకవసరమైన సాధన చేయడం వల్ల మీరాయనను కనుగొనగలరు. ఈశ్వరుడిని చేర్చే మార్గం మేధస్సు కాదు, సహజావబోధం.

ఈ భౌతిక జీవితంలో చదువుకుంటూనో, పని చేస్తూనో గడిపే సాధారణ మానవులు తమ ఇంద్రియ గ్రహణ శక్తి వల్ల, తర్కంపై ఆధారపడే మేధస్సు వల్లా తమ అవగాహనను పరిమితం చేసుకుంటారు. తమ సహజావబోధం అభివృద్ధి చెందకపోవడం వల్ల, మేధాశక్తి యొక్క పరిమితత్వం వల్ల వారు ఆత్మ గురించిన విషయాలను గురించి తమకు వివరించినప్పటికీ గ్రహించలేరు. బ్రహ్మాండమైన మేధాసంపన్నులూ, ప్రఖ్యాత వేదాంతులూ ఆత్మ గురించి చాలా చదివి ఉన్నప్పటికీవారు దానిగురించి వారేమీ అర్ధం చేసుకోలేరు!

మరోవైపు, నిరక్షరాస్యులైనవారు కూడా గాఢంగా ధ్యానం చేయడం వల్ల తమ స్వానుభవంతో ఆత్మ స్వభావాన్ని గురించి స్పష్టంగా వివరించగలుగుతారు. ఆత్మ గురించిన మేధా సంబంధమైన పరిజ్ఞానానికి, తనలోని దివ్యత్వాన్ని అనుభవైకవేద్యంగా గ్రహించడానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చగలిగేది సహజావబోధం.

మహా మేధాసంపన్నులు, అనేక భాషలలొ నిష్ణాతులు, అచ్చంగా నడిచే గ్రంథాలయాల లాంటి విజ్ఞాన సంపన్నులు, తర్క వేదాంత పండితులైనా, విషయాన్ని స్పష్టంగా దర్శించగలిగిన సహజావబోధం ఆలంబన లేనివారు, దైవ జ్ఞానానికి ఆటంకం కలిగిస్తూ, సాపేక్షతతా తలం మీద ఆధారపడి పనిచేసే, భ్రాంతికి లోనైన మేధస్సు కలిగి ఉంటారు.

సహజావబోధం వల్ల మాత్రమే భగవంతుడి అన్ని అంశలనూ గ్రహించగలుగుతాము. ఆయన గురించి మనకుతెలియచెప్పే ఇంద్రియం మనకు లేదు; మన ఇంద్రియాలు ఆయన వ్యక్త రూపాల ను గురించి మాత్రమే మనకు పరిజ్ఞానానందిస్తాయి. నిజంగా ఆయన ఏమిటో మనకు తెలియజెప్పే ఆలోచన, లేక ప్రతిపాదన ఏదీ లేదు. ఆలోచన ఇంద్రియాలు అందించిన సమాచారాన్ని వివరించే ఏర్పాటు మాత్రమే చేయగలదు.

ఈశ్వరుడు మనసుకు, మేధస్సుకూ అతీతమైనవాడు…ఆత్మ యొక్క సహజావబోధనా శక్తి ద్వారా మాత్రమే ఆయన నిజ తత్వం అనుభూతమవుతుంది. మనమాయన చైతన్యాన్ని — మనస్సుకూ, ప్రజ్ఞకూ కేంద్రస్థానమైన — అధిచేతన మనస్సు ద్వారా కనుగొనాలి. ఆత్మ యొక్క సహజావబోధనాయుక్త అధిచేతనా స్థితిలో ఆయన అనంత తత్వం మనిషికి వెల్లడి అవుతుంది. ధ్యానంలో లభ్యమైన ఆనందం సృష్టి అంతటా శాశ్వతానందం వ్యాప్తి చెంది ఉండటాన్ని వెల్లడి చేస్తుంది. ధ్యానంలో దర్శనమైన ప్రకాశం ఈ దృశ్యమాన సృష్టికి కారణభూతమైన సూక్ష్మ కాంతి. ఆ కాంతిని దర్శించగలిగిన వాడు అన్నివస్తువులతోనూ ఏకత్వాన్ని అనుభూతం చెందుతాడు.

“ఈశ్వరుడు మనసుకు, మేధస్సుకూ అతీతమైనవాడు. ఆత్మ యొక్క సహజావబోధం శక్తి ద్వారా మాత్రమే ఆయన నిజ తత్వం అనుభూతమవుతుంది.”

విశ్వ భ్రాంతికి విరుగుడు అయిన వాస్తవ జ్ఞానాన్ని సహజావబోధం కలిగిస్తుంది

మానవుడు మాయా మోహితుడై ఉండడం చేత అతడి గ్రహణ శక్తి మరుగుపరచబడి అతడిలోని అజ్ఞానాంధకారం అంతటా స్పందిస్తున్న ఈశ్వర ప్రకాశాన్ని గుర్తించ లేదు. విశ్వభ్రాంతి (మాయ), వ్యక్తి గత భ్రాంతి(అవిద్య) కలిసి పని చేసి భగవంతుడి సర్వ వ్యాపకత్వాన్ని ఎరిగి ఉన్న ఆత్మ యొక్క సహజ సహజావబోధాన్ని మరుగు పరచి అస్పష్టం చేస్తుంది. ధ్యానంలో ఇంద్రియాలమీద ఆధారపడడం అనే ఈ అంధకారం తొలగిపోయి గొప్ప కాంతితో ఏర్పడిన ఈ సమస్త విశ్వంలో తానూ కాంతినే అన్న ఎరుక కలిగించే సహజావబోధం నెలకొంటుంది.

మనిషి దివ్యచైతన్యమనే ఆ ఆంతరిక సామ్రాజ్యంలో స్థిరపడిన తరువాత ఆత్మ యొక్క ; జాగృత సహజావబోధనా శక్తి పదార్థము, ప్రాణశక్తి, చైతన్యమనే తెరలను చీల్చుకొని సమస్త వస్తువుల హృదయాలలోని ఈశ్వర సారాన్ని వెల్లడి చేస్తుంది.

ధ్యానము, దివ్య బోధల భక్తి పూర్వక అభ్యాసము ద్వారా ఆత్మ యొక్క సహజావబోధం మేధస్సును అభివృద్ధి చేయడంలో మార్గదర్శకం వహించడం మొదలుపెట్టగానేఅప్పుడు జ్ఞానానికి బదులు అజ్ఞానం నశించదమనే శిక్ష పొందుతుంది.

అతీత దర్శనం

ఈ జీవితం ఈశ్వరుడు రచించిన గొప్ప కావ్యం. దాన్ని తన వివేచనతో మాత్రమే అర్ధం చేసుకోవాలని మనిషి ప్రయత్నం చేస్తే పిచ్చివాడవుతాడు. అందుకే ఎక్కువ ధ్యానం చేయమని నేను మీకు చెబుతాను. మీ సహజావబోధం అనే మాయా పాత్రను విస్తరింపజేస్తే అప్పుడు అనంత జ్ఞానమనే సముద్రాన్ని దానిలో పట్టగలుగుతారు.

శరీర చైతన్యమనే హ్రస్వదృష్టిని అధిగమించిన భక్తుడు దివ్య సహజావబోధమనే ఉత్తమ దృష్టితో చూస్తూ, అంతకుముందు అర్ధం చేసుకోలేని ద్వంద్వాలను — సృష్టిని సౌందర్యామూ, ఆనందమూగా దర్శించిన పరమానంద స్థితిలో — తెలుసుకోగలుగుతాడు.

ఎంత భావస్పోరకంగా గీత ఈ సత్యాన్ని కీర్తిస్తుందో: “లెక్కలేనన్ని దేవలోక వస్త్రాలతో, పూల మాలలతో, నగలతో అలంకరింప బడి” — నక్షత్రాలు అతడి కిరీతంలోని మణులు; భూమి ఆయన పాద పీఠం; మెరుపు, ఉరుము, తుఫానులు, ప్రళయాలు సృష్టి భ్రమణం లో ఆనందంగా నాట్యమాడుతోన్న ఆయన అలంకారాల తళుకులు, ఆయన పైవస్త్రపు రెపరెపలు. ఈ తటస్థ సృష్టిలోని సమస్తమూ ఈశ్వరుడి విశ్వ వస్త్రానికి మెరుగు దిద్దే అదనపు అలంకరణ; వీటన్నిటి వెనుకా దివ్య సత్యం దాగి ఉంది.

సహనంతో, విడవకుండా ధ్యానం చేయండి. అప్పుడు పోగైన ప్రశాంతిలో, మీరు ఆత్మ సహజావబోధనా సామ్రాజ్యములో ప్రవేశిస్తారు. యుగయుగాలుగా మోక్షాన్ని సాధించినవారంతా దైవానుసంధానమనే ఆంతరిక ప్రపంచాన్ని ఆశ్రయించినవారే. ఏసు ఇలా అన్నాడు: “నీవు ప్రార్థించేటపుడు తలుపు మూసుకొని నీ గదిలో రహస్యంగా నీ తండ్రిని ప్రార్థించు; రహస్యంలో చూసే నీ తండ్రి నీకు బహిరంగంగా ప్రతిఫలమిస్తాడు.” *

ఇంద్రియాలు, ఈ అశాంతిమయ ప్రపంచంతో వాటి సంలగ్నత అనే ద్వారాన్ని మూసివేసి నీ ఆత్మలోకి వెళ్ళు, ఈశ్వరుడు తన అద్భుతాలన్నిటినీ నీకు వెల్లడి చేస్తాడు.

*మత్తయి 6:6.

ఇతరులతో పంచుకోండి