కొత్త సంవత్సరంలోకి ప్రవేశం

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

నూతన సంవత్సరంలో అన్ని ఆశా ద్వారాలు తెరుచుకొన్న సూచనగా ఘంటానాదం వినవచ్చింది. నిరాశ, వ్యాధి, ఓటమిలతో మరణించిన పాత సంవత్సరాన్ని మున్ముందుకు సాగిపోతూనే ఉండే కాలం యొక్క శవ వాహకులు విస్మృతి అనే సమాధిలో పూడ్చివేశారు. నీ ఆత్మశక్తుల పంట చేలో నిశ్శబ్దంగా పడి తినేస్తూ, మీ నిశ్చయాన్ని, ఉత్సాహాన్ని, పట్టుదలను భయపెట్టేవిధంగా ఆ వేదనాభరిత పాత ఏడాది యొక్క ప్రేతాన్ని మళ్ళీ ఆహ్వానించకండి.

చూడండి, కొత్త సంవత్సరపు ద్వారాల్లోంచి మీ భవిష్యత్ విజయాల వన్నె వన్నెల అలంకారాలు నీ వైపు మెరుస్తూ తమను వెంబడించమని ధైర్యంగా నిన్ను ఆకర్షిస్తున్నాయి. వాటిని కేవలం చూస్తూ సాధిస్తాననే ఆశ కలిగి ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మానసిక, శారీరిక సోమరితనం, సృజనాత్మక సామర్థ్యం లేకపోవడం, సందేహం, భయం, నిరాశ, చెడు అలవాట్లు అనే గజ దొంగలను ఎదుర్కోవడానికి అవసరమైన దివ్యమైన నిశ్చయాత్మకతతో, వేగవంతమైన అద్భుతాలు దారిలో నెరవేరుస్తూ, నువ్వు ప్రశాంతంగా, అత్యంత వేగంతో వాటి వంక పరుగెత్తడం మొదలు పెట్టాలి.

అవకాశాలు అనే సూర్యకాంతితో దారి వెలుగునిండి ఉండొచ్చు లేదా కష్టాలతో భారంగా ఉండొచ్చు; కానీ నీ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలని గుర్తుంచుకో. నీవు చేయగలిగినంత చేశాననీ, ఇంకేమీ నీ వల్ల కాదనీ అనుకున్నాక కూడా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నం చేయాలని గుర్తుంచుకో. అలాంటి ప్రయత్నం చేశాక అప్పుడు, అంతుచిక్కని మాయాంధకారంలోంచి సమస్తాన్నీ ప్రకాశింప జేసె దివ్య మార్గదర్శకత్వ కాంతి నీ మార్గాన్ని తేజోమయంగా అలంకరిస్తుంది.

ఆయన ప్రకాశం ముందు అంధకారమంతా ఎగిరిపోతుంది. ఆయన జ్ఞానదూతలు నీ నిర్ణయమనే శిశువు చేయి పట్టుకొని నీ సచేతన ప్రయత్నాల అడుగులను పొరపాటు లేకుండా, నిర్భయంగా, నీ బలానికి పరీక్ష పెట్టే కష్టాల గుండా సదా సంతృప్తినిచ్చే కార్యసిద్ధి వైపు నడిపిస్తారు. భౌతిక, అధ్యాత్మిక విజయాలకోసం సచేతనంగా ఆరంభించిన నీ నిరవధిక ప్రయత్నాలను దివ్య మార్గదర్శకత్వం పట్ల విశ్వాసం, ఆశ కలిగి ఉండడం నిన్ను ఇప్పటికే కొత్త ఏడాది గుమ్మంలో గుండా మంద్రకాంతిలో కనిపిస్తూ ఉన్న నీ లక్ష్యం వైపు త్వరగా నడిపిస్తుంది.

రండి, సోమరిపోతులో, పనిదొంగలో, ఉత్సాహవంతులో అయిన సోదరులారా, మీలో మేల్కొన్న తరగని ఉత్సాహం, నిరంతర కృషితో సఫలత అనే సువర్ణ అడుగుజాడలను అనుసరిస్తూ, హామీ ఇస్తూ స్వాగతం చెబుతున్న నూతన సంవత్సర ద్వారాల గుండా వెళ్ళండి.

ఎన్నో జన్మల ప్రయత్నాల తరువాత అసహనంగా, రగులుతున్న కోర్కెతో ఈశ్వరుడు, దైవ ప్రసాదిత స్వేచ్ఛా సంకల్పంతో, మీ అంతట మీరే త్వరగా సంతోషంతో సమ్మతించిన దారితప్పిన అడుగులను సంపూర్ణ అంతరిక పరిపూర్ణత వైపు అనంతత్వపు గృహంలో విశ్రాంతి తీసుకోవడానికి నడిపిస్తావని ఎదురుచూస్తూ ఉన్నాడు.

ఇతరులతో పంచుకోండి