గురుపూర్ణిమ విజ్ఞప్తి — 2026

23 జులై, 2026

“సానుభూతి ద్వారాను, లోతయిన చూపు ద్వారాను సద్గురువు, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పేదలయినవాళ్లలో భగవంతుడే బాధపడుతుండడం చూస్తాడు, అందుచేతనే ఆయన, వాళ్ళకు సహాయం చేయడం తన సంతోషకరమయిన కర్తవ్యంగా భావిస్తాడు.”

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

గురుపూర్ణిమ రోజున ప్రత్యేక సమర్పణ చేయండి

ఒక సద్గురువు అందరిలోనూ దైవాన్ని దర్శిస్తారని, వారి అభ్యున్నతి కోసం ఆనందంతో తమను తాము అంకితం చేసుకుంటారని మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు మనకు గుర్తు చేస్తారు. దైవప్రేమ మరియు కాంతికి ప్రతినిధులైన అటువంటి నిజమైన సద్గురువులను మనం గౌరవించి, అత్యంత కృతజ్ఞతాభావంతో వారికి ఆంతరంగికంగా ప్రణమిల్లే పవిత్రమైన సందర్భమే గురుపూర్ణిమ.

పరమహంసగారి శిష్యులమైన మనకు, ఈ రోజు ఇది ఒక వేడుక మాత్రమే కాదు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం గురుదేవుల నుండి పొందిన ఆశీస్సులను స్మరించుకోవడానికి, అలాగే ఆయనకు సాధ్యమైన రీతిలో సేవ చేయాలనే మన సంకల్పాన్ని పునరుద్ఘాటించుకోవడానికి తగిన సమయం ఇది.

గురుదేవుల కార్యాచరణకు ప్రేమపూర్వకంగా సేవ చేసేందుకు ఆహ్వానం

మన ప్రియతమ గురుదేవుల పాదపద్మాల వద్ద మన హృదయపూర్వక ప్రేమను సమర్పిస్తున్న ఈ పవిత్ర సందర్భంలో, అనేక మంది భక్తుల అంతరంగంలో ఇలా అడగాలనే భావన కలుగుతుంది:

“ఇతరులకు ఆనందంగా సేవ చేయడంలో నేను ఏ విధంగా వారి సాధనం కాగలను?”

ఈ గురుపూర్ణిమ సందర్భంగా, పరమహంసగారి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళడంలో మీ ప్రేమపూర్వక మద్దతు తోడ్పడే రెండు పవిత్రమైన కార్యక్రమాలలో పాల్గొని, అటువంటి సాధనంగా మారవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

మొత్తం అంచనా వ్యయం: ₹14 కోట్లు

గురుదేవుల క్రియాయోగ బోధనల కాంతిని మరియు వారి కరుణామయ ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు మాకు తోడ్పడుతున్న మీ ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు మరియు ఉదారమైన విరాళాల పట్ల మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము.

సవివరమైన విజ్ఞప్తిని ఈ క్రింద చదవండి.

మొదటి కార్యక్రమం

మహావతార్ బాబాజీ గుహ దగ్గర, రత్ఖల్ వద్ద ఒక అతిథి గృహం

మహావతార్ బాబాజీ
మహావతార్ బాబాజీ గుహ
1861లో ఈ గుహ వద్దనే లాహిరీ మహాశయులను మహావతార్ బాబాజీ కలుసుకున్నారు.

పవిత్ర స్థలమైన మహావతార్ బాబాజీ గుహ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు ఒక దిక్సూచిగా మారింది. ఈ పావనమైన ప్రదేశంలోనే 1861లో అమరులైన మహావతార్ బాబాజీ తమ ఉన్నత శిష్యులైన లాహిరీ మహాశయులను కలుసుకొని, ఆయన ద్వారా మరుగున ఉన్న క్రియాయోగ శాస్త్రాన్ని ఈ యుగం కోసం పునరుద్ధరించారు.

మన ప్రియతమ గురుదేవుల ఒక యోగి ఆత్మకథ ద్వారా, ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా మహావతార్ బాబాజీ గురించి మరింత ఎక్కువమందికి తెలుస్తుండడంతో, ఆ అమర గురువుల ఆశీస్సులు పొందేందుకు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించేవారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది; కొన్నిసార్లు బస్సుల నిండుగా వచ్చే ఈ సందర్శకులలో, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఉంటారు. అందులో కొంతమందికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) సంస్థల గురించి ఇప్పటికే తెలుసు, కాని చాలామందికి, ప్రపంచంలో క్రియాయోగ శాస్త్రాన్ని కొనసాగించేందుకు బాబాజీ ఆశీస్సులతోనే యోగానందగారు వీటిని నెలకొల్పారని తెలియదు.

బాబాజీ గుహ వద్ద భారతదేశ పూర్వ అధ్యక్షులు శ్రీ రాంనాథ్ కొవింద్
స్మృతి భవనం వద్ద భారతదేశ పూర్వ అధ్యక్షులు శ్రీ రాంనాథ్ కొవింద్

గుహ మరియు స్మృతి భవనాన్ని (గుహకు కొద్ది దూరంలో ఉండే ప్రదేశం) తమ పరివారంతో సందర్శించిన భారతదేశ పూర్వ అధ్యక్షులు శ్రీ రాంనాథ్ కోవింద్.

బాబాజీ గుహ మరియు స్మృతిభవన్లను సందర్శించిన జస్టిస్ అలోక్ మహ్రా
బాబాజీ గుహ మరియు స్మృతి భవనం (పైన చూపించినది) సందర్శించిన ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ మహ్రా.

బాబాజీ గుహకు యాత్రికులు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు వీలుగా, ఆ గుహ సమీపంలో సకల సౌకర్యాలతో కూడిన ఒక సందర్శన కేంద్రం నిర్మించాలని వై.ఎస్.ఎస్. చాలాకాలంగా భావిస్తోంది. ఆసక్తిగల సాధకులకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురించి మరియు గురుదేవుల క్రియాయోగ బోధనల గురించిన సమాచారం కూడా ఈ కేంద్రం అందిస్తుంది.

అంతే కాకుండా, సందర్శకుల కేంద్రం, బాబాజీ గుహ మరియు గుహకు సమీపంలో దిగువన ఉన్న స్మృతి భవనాన్ని చూసుకోవడానికి కొందరు సేవకులు బస చేయగలిగే ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వై.ఎస్.ఎస్. భావించింది. ఈ లక్ష్యసాధన కోసం కొన్ని సంవత్సరాల క్రితం బాబాజీ గుహకు సమీపంలో 11 ఎకరాల భూమిని వై.ఎస్.ఎస్. కొనుగోలు చేసింది.

2024లో గౌరవనీయులైన మన అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ఈ రెండు భవనాల నిర్మాణానికి దయతో తమ ఆశీస్సులను అందించారు:

I. అతిథి భవనం

బాబాజీ గుహను సందర్శించే యాత్రికులు మరియు యోగదా భక్తులను ఆహ్వానించేందుకు, 6200 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన ఈ రెండు అంతస్తుల భవనం క్రింది సదుపాయాలను అందిస్తుంది:

  • రిసెప్షన్ ప్రదేశం
  • వై.ఎస్.ఎస్. యొక్క ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందించే ఒక పుస్తకాల గది
  • వై.ఎస్.ఎస్. క్రియాయోగ బోధనలు, పవిత్రమైన వై.ఎస్.ఎస్. గురు పరంపర, వారి చరిత్రలను యాత్రికులకు పరిచయం చేసేందుకు ఒక దృశ్య-శ్రవణ ప్రదర్శనల కోసం ఒక గది, మరియు ఒక ఫోటో గ్యాలరీ కోసం ఒక గది ఉంటాయి.
  • తీర్థయాత్రికుల కోసం నీరు మరియు అల్పాహారం
  • శుభ్రంగా, అందుబాటులో ఉండే స్నానాల గదులు, మరియు
  • భద్రత, నీటి నిల్వ మరియు సంరక్షకుని నివాస గృహాల వంటి ఇతర అనుబంధ సౌకర్యాలు

II. సౌకర్యాల భవనం

ఈ నాలుగు-అంతస్తుల (16,000 చ.అ. విస్తీర్ణం కలిగిన) భవనంలో యాత్రికులకు సేవ చేస్తూ, సందర్శకుల భవనం, సౌకర్యాల భవనం, బాబాజీ గుహ మరియు దాని పరిసర ప్రాంతం, మరియు స్మృతి భవనాలను పర్యవేక్షించే సేవకులకు నివాసాన్ని కలుగజేస్తుంది. ఇందులో ప్రతిపాదించబడిన సౌకర్యాలు:

  • నివాస సేవకుల కోసం నివాస గృహాలు
  • సందర్శిస్తున్న భక్తులు కొద్దిమంది కోసం వసతి మరియు భోజన సౌకర్యాలు
  • ధార్మిక వైద్యశాల
  • సహాయ మౌలిక సదుపాయాలు — వర్షపు నీటిని సేకరించి ఆధారపడదగిన నీటి నిల్వను ఏర్పాటు చేయడం, సంవత్సరంలోని అన్ని కాలాలలోనూ యాత్రికులకు నిరాటంకంగా సేవలు కొనసాగే నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు ప్రత్యామ్నాయ జనరేటర్ తో కూడిన పటిష్టమైన విద్యుత్ సరఫరా.
  • పనులు సజావుగా సాగేందుకు వీలు కల్పించే కార్యాలయ స్థలాలు, సిబ్బంది నివాస గృహాలు, పార్కింగ్ మరియు ఇతర అనుబంధ సౌకర్యాలు.
Aerial Map of the Visitors Centre and Facilities Building
మహావతార్ బాబాజీ గుహకు వెళ్ళే మార్గానికి అత్యంత సమీపంలో ఉన్న సందర్శకుల కేంద్రం, మరియు సౌకర్యాల భవనం యొక్క ప్రదేశం.
బాబాజీ గుహ సమీపంలోని రెండు భవనాల నిర్మాణం
రెండు భవనాలు కనిపిస్తున్న నిర్మాణ స్థలం ఇది. బాబాజీ గుహకు వెళ్ళే దారి సందర్శకులు కేంద్రం వెనుక వైపుగా వెళ్తుంది.

ఆర్థిక అవలోకనం మరియు కాలక్రమం (ఫైనాన్సియల్ ఓవర్-వ్యూ మరియు టైం లైన్)

  • నిర్మాణ ఖర్చు అంచనా: ₹10 కోట్లు
  • పని పూర్తి చేయడానికి అంచనా సమయం: 2027 మొదట్లో


ఈ దివ్యకార్యం సాకారమయ్యేందుకు మీ సహకారాన్ని మేము ఆహ్వానిస్తున్నాం.

రెండవ కార్యక్రమం

గురుదేవుల రాంచీ ఆశ్రమాన్ని సంరక్షించడం

శతాబ్దానికి పైగా, వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. ఇక్కడ భక్తులు, సందర్శకులు గురుదేవుల సాన్నిధ్యంతో పవిత్రమైన ఈ ప్రాంగణంలో నడవడం, ధ్యానం చేయడం ద్వారా తమ హృదయాలను శాంతి, ఆనందంతో నింపుకుంటారు.

మన జనవరి 2026 వార్తాలేఖలో, ఇక్కడికి వచ్చేవారిని లేదా ఇక్కడ సేవ చేసేవారిని చూసుకోవడానికి, అలాగే రాబోయే తరాల కోసం ఈ పవిత్ర ప్రదేశం యొక్క ప్రశాంతతను, సౌందర్యాన్ని కాపాడడానికి చేపడుతున్న కార్యక్రమాలను మేము పంచుకొన్నాము:

  • రోడ్లు మరియు ఆశ్రమ ప్రాంగణం యొక్క వాతావరణాన్ని నవీకరించడం — మన్నికైన రోడ్లు, రాతితో వేసిన నడక మార్గాలు, పాదాచారుల దారులు; ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందించే రమణీయత, సౌర దీపాలు మరియు ఆధునీకరించిన విద్యుత్ యంత్రాంగం; మరియు కేంద్రీకృత మురుగునీటి పారుదల వ్యవస్థలు.
  • బాలలు, ప్రచార కార్యక్రమాలు మరియు మరియు సేవా కార్యక్రమాల సౌకర్యాల అభివృద్ధి — యువజనుల సేవల కోసం ఒక ప్రత్యేక భవనం; వై.ఎస్.ఎస్. పాఠాల కోసం అదనపు ముద్రణ మరియు అభాగ్యులకు మెరుగైన సేవలు అందించడానికి నూతన దంత వైద్య విభాగంతో పునరుద్ధరించబడిన ఒక ధార్మిక వైద్యశాల.

గురుదేవుల అనుగ్రహంతో ప్రాంగణంలోని ఈ కార్యక్రమాలన్నిటికీ సంబంధించిన నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఫోటోలను మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రాజెక్టులన్నీ 2027 ప్రారంభంలో పూర్తవుతాయని ఆశిస్తున్నాం.

రహదారులు మరియు నడకమార్గాలు

రోడ్డు నిర్మాణం యొక్క వివిధ దశలు

II. మురుగు నీటి మరియు డ్రైనేజీ వ్యవస్థలు

III. నిల్వ సౌకర్యాలు

మీ దయ మరియు ఆర్థిక తోడ్పాటుతో మేము ఈ ప్రాజెక్టులను చేపట్టేగలుగుతున్నాం.

ఈ పునరుద్ధరణ పనుల కారణంగా మేము రాంచీ ఆశ్రమాన్ని తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. దీనిని మేము, ఎంతోకాలంగా మిగిలి ఉన్న అదనపు ప్రాజెక్టులను చేపట్టడానికి ఒక అవకాశంగా భావించాము.

IV. భూగర్భ వాన నీటి నిల్వ టాంకు

ఆశ్రమం చుట్టూ ఇటీవల ఎత్తైన భవనాలు పెరగడం వల్ల భూగర్భ జలమట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి; పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఆశ్రమంలోని బావులలో కొన్ని ఎండిపోతున్నాయి. అంతేకాక, మన బోరుబావుల నుండి వచ్చే నీటి దిగుబడి కూడా నిరంతరం పడిపోతోంది. మున్సిపల్ నీటి సరఫరా అందుబాటులో ఉన్నప్పటికీ, అది సక్రమంగా ఉండడంలేదు; అంతేకాక, అది ఆశ్రమం యొక్క పెరుగుతున్న అవసరాలకు ఎప్పుడూ సరిపోవడం లేదు. అందువల్ల, ఉపరితల ప్రవాహంగా వృథా అయ్యే వర్షపు నీటిని సేకరించి, సంరక్షించడానికి ఒక సుస్థిరమైన మార్గంగా, సుమారు 5-లక్షల-లీటర్ల వైశాల్యం గల భూగర్భ వర్షపు నీటి నిల్వ టాంకును నిర్మించడం సముచితమని మేము భావించాము.

గోశాల మరియు శ్రవణాలయాల మధ్య నిర్మాణంలో ఉన్న భూగర్భ వర్షపు నీటి నిలువ టాంకు.

ఈ టాంకు యొక్క ముఖ్య ఉద్దేశం, వర్షాకాలంలో వర్షపు నీటిని సేకరించి, దానిని వేసవి కాలంలో, ముఖ్యంగా ఆశ్రమంలోని తోటల నిర్వహణ కోసం, ఉపయోగించుకోవడం.

శివ మందిరం పునరుద్ధనరణ నిర్మాణ నమూనా చిత్రం
పునరుద్ధరించబడిన శివ మందిరం యొక్క నిర్మాణ నమూనా చిత్రం

V. శివ మందిరం మరియు హోమగుండం

దశాబ్దాలుగా, శివ మందిరం మరియు దాని హోమగుండం, మన గురువుల గౌరవార్థం నిర్వహించే పూజలు, భక్తి కార్యక్రమాలకు ఒక పవిత్ర స్థలంగా ఉన్నాయి. కాలం మరియు ప్రకృతి ప్రభావాల వల్ల ఈ నిర్మాణాలు దెబ్బతిన్నాయి, కాబట్టి ఈ పవిత్ర స్థలానికి ఇప్పుడు పునరుద్ధరణ అవసరం. అందువల్ల, వీటి పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించబడింది.

ముఖ్యాంశాలు మరియు పని యొక్క పరిధి:

  • పైకప్పు పునఃస్థాపన — పాతబడిన ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు మరియు శిథిలమైన ట్రస్ తొలగించి, మందిరం యొక్క పవిత్రతను, సౌందర్యాన్ని కాపాడుతూ, మన్నికైన, సురక్షితమైన, అందంగా సరిపోయే పైకప్పు వ్యవస్థను ఏర్పాటు చేయడం.
  • నేలపై క్రొత్తగా గ్రానైట్ అమర్చడం — మన్నికను పెంచడం, నిర్వహణను సులభం చేయడం, ఆ ప్రదేశం యొక్క సౌందర్యాన్ని పెంచడం కోసం.
  • హోమగుండం పునర్నిర్మాణం — నిర్మాణ సమగ్రతను పునరుద్ధరించడం; వేడుకలు, భక్తి కార్యక్రమాల కోసం సురక్షితమైన వినియోగాన్ని నిర్ధారించడం.

ఆర్థిక అవలోకనం మరియు కాలక్రమం (ఫైనాన్సియల్ ఓవర్-వ్యూ మరియు టైం లైన్)

  • మొత్తం వ్యయం అంచనా: ₹4 కోట్లు
  • పని పూర్తి చేయడానికి అంచనా సమయం: 2027 మొదట్లో


ఈ దివ్యకార్యాచరణ ఫలించేందుకు మీ సహాయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం.

దీన్ని మనమందరం కలిసి నిర్మిద్దాం

మహావతార్ బాబాజీ గుహ సమీపంలోని పవిత్ర స్థలంలోను, మరియు గురుదేవులకు అత్యంత ప్రియమైన రాంచీ ఆశ్రమంలోను చేబట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా, సత్యాన్వేషకులందరినీ ప్రేమతోను, గౌరవంతోను ఆహ్వానించాలని, అలాగే భవిష్యత్తు తరాల అన్వేషకుల కోసం ఈ పవిత్ర స్థలాలను పరిరక్షించాలని మేము ఆశిస్తున్నాము.

సంవత్సరాల తరబడి మీరు చూపిన ఔదార్యం మరియు నిరంతర మద్దతు వల్లే మేము సాధించిన వాటినన్నిటినీ సాధించగలిగాము.

మీ సహాయం ఎలా అందించాలి

అన్నిటికంటే ముఖ్యంగా, ఈ పవిత్ర కార్యాలు సజావుగా పూర్తయ్యేందుకు మీ ప్రార్థనలను కోరుతున్నాము. హృదయపూర్వక ప్రార్థన అనేది ప్రతి సమర్పణకు నిజమైన పునాది.

ఈ పవిత్రమైన కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలని మీకు అనిపిస్తే, వై.ఎస్.ఎస్. విరాళాల పేజీలో క్రింద ఉన్న రెండు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఒకేసారి లేదా నెలవారీ విరాళం సమర్పించవచ్చు:

మీరు పెద్దమొత్తంలో విరాళం ఇవ్వాలనుకున్నా, లేదా ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టుకు సహాయం చేయాలనుకున్నా, మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి మేము సంతోషిస్తాము. దయచేసి సహాయ కేంద్రాన్ని 0651-6655 555 నెంబరుకు ఫోన్ చేసి (సోమవారం–శనివారం, ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు) సంప్రదించండి.

గురుదేవుల ఆశ్రమాలలో ఉండి సేవ చేస్తున్న మా సన్యాసుల బృందం మరియు సేవకుల బృందం, మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ మీ కోసం ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తున్నాం. మీ ప్రేమ మరియు తోడ్పాటుతో ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకు గురుదేవుల కాంతిని, ప్రేమను మరియు జ్ఞానాన్ని ఈ పవిత్ర ప్రదేశాలు ప్రసరిస్తాయి.

మన మహాగురువుల ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉండుగాక.

దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో పంచుకోండి