జన్మాష్టమి 2018 సందర్భంగా స్వామి చిదానంద గిరి గారి సందేశం

ప్రియతములారా, జన్మాష్టమి, ప్రియమైన భగవాన్ శ్రీ కృష్ణుని జన్మదినం, ఆయన ఉత్కృష్టమైన జీవితం యొక్క కాంతి మరియు మహిమతో ప్రపంచవ్యాప్తంగా స్పృశించబడిన మనందరికీ గొప్ప ఆనందకరమైన సమయం. ధర్మాన్ని పునరుద్ధరించడానికి దైవికంగా పంపబడినవాడు, భగవంతుని ప్రేమ మరియు ఆనందాల అవతారముగా శ్రీ కృష్ణుడు మన హృదయాలలో నివసిస్తున్నాడు. బృందావనంలోని గోపికలు మరియు గోపాలురు కృష్ణుడి వేణువు యొక్క మధురమైన రాగాలచే ఆపుకోలేని విధంగా ఆకర్షించబడినట్టుగా, ఆయన శాశ్వతమైన సన్నిధి యొక్క దివ్యమైన సౌందర్యం మన ఆత్మలను ఎప్పటికీ భగవంతుని వైపుకు నడిపించుగాక – అర్జునుడికి ఆయన తెలియజేసిన కాలాతీత సత్యాల ద్వారా మార్గనిర్దేశం చేసినట్లు, అవి, పవిత్రమైన భగవద్గీత ద్వారా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాయి. ఎల్లప్పుడు మారుతున్న ద్వంద్వత్వంతో కూడిన రాజ్యంలో మానవ జన్మ ఎత్తినప్పుడల్లా మనం విషయ వాంఛలను తీర్చుకుని ఆనందాన్ని పట్టుకుని గడుపుతాము. కానీ అది సురక్షితం కాదు. మాయ యొక్క ఆనందం మరియు దుఃఖం, లాభం మరియు నష్టాల యొక్క ప్రత్యామ్నాయ తరంగాలచే రువ్వబడ్డ జీవితం మనం జీవించాలని భగవంతుడు భావించడు. మన ఆత్మ యొక్క స్తబ్దమైన శాంతి మరియు దైవత్వాన్ని కనుగొనడానికి, గాఢంగా అంతర్లీనమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కృష్ణుని ద్వారా అర్జునుడికి భగవంతుడు మార్గనిర్దేశం చేసినట్లుగా, మీ నిజ స్వరూపాన్ని గ్రహించడంలో ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆత్మ అవగాహనను పెంపొందించుకోవడంతో ఆ ప్రయాణం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “నేను నా అలవాట్లు, ఇంద్రియ కోరికలు మరియు అహం యొక్క ఇష్టాలు మరియు అయిష్టాలను అనుసరిస్తున్నానా? లేదా ఆత్మజ్ఞానం ద్వారా మార్గనిర్దేశం పొందడానికి స్పృహతో ప్రయత్నిస్తున్నానా?” మీ జీవితానికి మరియు సంకల్పానికి బాధ్యత వహించడానికి, మీరు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ బలం మీలో ఉంది. అర్జునుడు బలహీనమైన క్షణాలను ఎదుర్కొన్నప్పుడు, కృష్ణుడు అతని నిజమైన, పరాక్రమ స్వభావాన్ని మరియు మాయకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఓడిపోకుండా ఒక దివ్య యోధునిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. మీరు కూడా మీ గురువు మరియు మీ స్వీయ ఆత్మ యొక్క వివేకవంతమైన మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తే, మీరు శాంతిని మరియు ఆనందకరమైన స్వేచ్ఛను అనుభవిస్తారు. అశాంతిని సృష్టించే ఆలోచనలు మరియు చర్యలు మనల్ని బంధిస్తాయి; శాంతిని ఇచ్చే ఆలోచనలు మరియు పనులు విముక్తినిస్తాయి. మన గురువైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు చెప్పినట్లుగా, “ఆత్మ నుండి శాంతి ఉద్భవిస్తుంది మరియు అదే నిజమైన ఆనందం వెల్లివిరిసే పవిత్రమైన అంతర్గత వాతావరణం.” గురువు ఇచ్చిన ధ్యాన పద్ధతులను నిష్ఠగా మరియు భక్తితో సాధన చేయడం ద్వారా భగవంతుని సాన్నిధ్యం యొక్క పూర్తి అనుభవం కలుగుతుందని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. శరీరం మరియు మనస్సు యొక్క అశాంతి మందగించినప్పుడు, మీరు మీ స్వంత హృదయంలో మరియు ఆత్మలో పరిపూర్ణ ఆనందానికీ, పరిపూర్ణ ప్రేమకు, సార్వార్థసాధక శక్తికీ మూలమైన ఆయనను అనుభూతి చెందుతారు. భగవంతునిలో లంగరు వేయబడిన మీరు ఇకపై ఊహించలేని ప్రపంచం నుండి కొంచెం ఆనందం కోసం వేడుకోవలసిన అవసరం లేదు. మీ ఆనందం ఇతరులకు ప్రోత్సాహాన్నిస్తూ, ఉత్తేజపరిచే ప్రభావాన్ని ప్రసరిస్తుంది. మానవ చైతన్యాన్ని దైవ చైతన్యంగా మార్చడానికి సమయం మరియు కృషి అవసరమవుతుంది. కానీ గురూదేవులు మనకు ఇలా హామీ ఇచ్చారు: “దేవునితో ఐక్యత కోసం గడిపిన గాఢమైన ధ్యానం యొక్క ప్రతి క్షణం, చేసిన పనుల యొక్క ఫలాల కోసం స్థిరచిత్తంతో మరియు పరిత్యాగంతో చేసే ప్రతి ప్రయత్నం ప్రతిఫలాన్ని ఇస్తుంది – దుఃఖాన్ని తొలగించి, శాంతి మరియు ఆనందాన్ని నెలకొల్పుతుంది మరియు భగవంతుని మార్గనిర్దేశక జ్ఞానంతో గాఢమైన అనుసంధానం ద్వారా నిర్ణయాత్మక చర్యలలో లోపాలను తగ్గించి కర్మ తీవ్రతను తగ్గిస్తుంది.” కృష్ణుడు అర్జునుణ్ణి విజయం వైపు నడిపించినట్లుగా, ఆత్మ-విముక్తి వైపు మీరు చేసే ప్రయాణాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీ కృష్ణ! జై గురు!

స్వామి చిదానంద గిరి

కాపీరైట్ 2018 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి