స్వామి చిదానంద గిరి గారి 2022 క్రిస్మస్ సందేశం

16 డిసెంబర్, 2022

ప్రియతములారా!

మీ అందరికీ పరమహంస యోగానందగారి ఆశ్రమాల నుండి దివ్య స్నేహము, ప్రేమతో కూడిన ఆనందదాయకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు! మీ లోపల క్రీస్తు చైతన్య జననం — క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశ్యం — యొక్క ఆత్మ జాగృతినిచ్చే ఎరుకతో మీ జీవితం నూతనంగా ప్రకాశించుగాక! ఈ చైతన్యమే ఏసుప్రభువులో అవతరించినది మరియు సృష్టి అంతటా అనంత ప్రేమగా, దివ్య సామరస్యతగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది.

ఏసు భూమి మీదకు వచ్చినది సత్యత, స్వచ్ఛత, పవిత్రతలకు ఒక ఉదాహరణగా నిలవడానికి — వాటిని అస్పష్టమైన ఆదర్శాలుగా కాకుండా, వసుధైక కుటుంబం కోసం ఉద్దేశించిన సార్వత్రిక సామరస్యతను వేగవంతం చేసే ఒక దృఢమైన పరిణామ శక్తిగా చూపడానికి. పవిత్రమైన మరియు దైవ సంబంధమైన విషయాల పట్ల మానవుల అలక్ష్యం మూలంగా నాస్తికత్వమూ, అధర్మమూ మరింత వృద్ధి పొందుతున్న ప్రస్తుత కాలంలో, ఏసుక్రీస్తులో ఉన్న దైవీ గుణాలన్నీ అమరమైన మన ఆత్మలలో కూడా ఉన్నాయనే గుర్తింపుని మనం చురుకుగా వ్యాప్తి చెయ్యాలి. ఏసు పరిపూర్ణంగా వ్యక్తం చేసిన స్వాస్థ్యప్రదాయక శాంతి మరియు సార్వజనీన ప్రేమలను; తన ధ్యానంలోని అనుసంధానంతోను పరమపితతో గల నిరంతర ఏకత్వంతోను ఆయనలో నిత్యమూ బలపడిన సహజావబోధాయుత జ్ఞానం మరియు అజేయమైన విశ్వాసం అనే ఈ కాంతి మరియు శక్తి యొక్క ప్రకాశవంతమైన మూలాలను మీరు మీలోని నిశ్శబ్దపు లోతులలో కూడా కనుగొనవచ్చు; మీ సంసిద్ధత ద్వారా మరియు ఆధ్యాత్మిక ఉత్సాహం ద్వారా వెలిగింపబడడానికి అవి ఎదురు చూస్తున్నాయి.

క్రీస్తు మరియు మహాత్ములవలె అందరిపట్లా నిర్నిబంధమైన ప్రేమను, సేవాతత్పరతను, క్షమాగుణాన్ని వ్యక్తం చేస్తూ, దేవుని పట్ల ఏకాగ్రమైన భక్తి , విశ్వాసాలతో జీవించడానికి ఎంతో ధైర్యం అవసరమౌతుంది, అయినప్పటికీ ఆ విధమైన జీవనము సర్వ సంతుష్టికరమైన ఆనందాన్నీ, మనలోని అజేయమైన మరియు పవిత్ర సారభూతమైన తత్త్వం యొక్క ఎరుకనూ కలిగిస్తుంది. ఇతరులకు అవగాహనను, హృదయపూర్వకమైన కారుణ్యాన్నీ ఇవ్వడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, మనలోని ఔన్నత్యాన్ని ప్రతిఫలించే దివ్యగుణాలలో దేనితోనైనా మనం ప్రవర్తించిన ప్రతిసారీ, క్రిస్మస్ యొక్క స్ఫూర్తిని మనం నిజమైన విధంగా వేడుక జరుపుకుంటున్నాము; అప్పుడు క్రీస్తు చైతన్యం మనలో ఉదయిస్తోంది.

క్రిస్మస్ సమయంలో దివ్యమైన అనుగ్రహము, ప్రత్యేకమైన క్రీస్తు ప్రేమ స్పందనలు ఉన్నత లోకాల నుండి వెలువడుతూ వాటిని స్వీకరించగలిగినవారి చైతన్యంలో వ్యాపిస్తాయి. దివ్యలోకాలు వర్షించే ఈ అనుగ్రహం మూలంగా మనం ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యగలుగుతాము మరియు ఇంకా అధికమైన కృత నిశ్చయంతో భగవంతుని చరణాల వద్ద, క్రీస్తు చరణాల వద్ద మన ఆత్మలోని ప్రేమను, భక్తిని సమర్పించగలుగుతాము. ఈ క్రిస్మస్ పండుగ సమయంలో మీ ప్రియతములతో పాటు మీరు బాహ్య వేడుకలను సంతోషంగా జరుపుకుంటూ, గాఢమైన ధ్యానంలో ఆంతరికమైన క్రీస్తు జన్మ వేడుకను కూడా జరుపుకుంటున్నప్పుడు మీ ధన్యమైన ఏకత్వాన్ని మీకు గుర్తు చేస్తూ, మీ ఇంటికీ, కుటుంబానికీ, ప్రపంచానికీ ఆనందాన్ని తీసుకువచ్చే క్రీస్తు చైతన్యపు గుసగుసలను మీరు అనుభూతి చెందెదరు గాక!

భగవంతుడు, క్రీస్తు మరియు గురువుల నిరంతర ఆశీస్సులతో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి