ప్రియతములారా,
గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి పేరిట మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు.
నేపాల్‌లో పౌర అశాంతి గురించిన వార్తలను నేను శ్రద్ధతో అనుసరిస్తున్నాను, ప్రాణనష్టం, ఇళ్లు, సంస్థల విధ్వంసం మరియు సమాజం ఎదుర్కొంటున్న అనిశ్చితి పట్ల నా హృదయం తీవ్ర ఆందోళనలో ఉంది. నా ప్రార్థనలు మొత్తం దేశంతో, మరీ ముఖ్యంగా నేపాల్‌లోని గురుదేవుల ప్రియమైన మరియు అంకితభావంతో కూడిన భక్తులతో ఉన్నాయి — ఈ సంవత్సరం ప్రారంభంలోని నా పర్యటనలో నేను వారిని ఆనందంగా మరియు ఉత్సాహంగా కలుసుకున్నాను. ఇటువంటి సవాళ్ళతో కూడిన సమయాల్లో, మనలో ఉన్న దేవుని శాంతి యొక్క శాశ్వత సాన్నిధ్యంలో మనం అంతర్గతంగా నిలిచి, ఆయన దివ్య రక్షణ మరియు అనంతమైన కరుణ పట్ల విశ్వాసంతో ఉండాలని గుర్తుంచుకుందాం. పవిత్ర హిమాలయాల ఒడిలో ఉన్న ఈ అందమైన దేశాన్ని రక్షణ కల్పించే ఆయన ఉనికి కప్పి ఉంచుగాక.
మీలో ప్రతి ఒక్కరూ గురుదేవుల ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక ముఖ్యమైన భాగం; మీరు నాతో మరియు గురుదేవుల ఆశ్రమాలలోని సన్యాసులతో కలిసి, దేశమంతా దివ్యకాంతి ఆవరించి ఉన్నట్లుగా మానసిక కల్పన చేస్తున్నారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ప్రతిరోజూ ధ్యానం తర్వాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయంలో భాగంగా మనం యోగ స్వస్థతా ప్రక్రియను అభ్యసించేటప్పుడు, పవిత్రమైన ఓంకార స్పందనలు శక్తివంతమైన ప్రేమ తరంగంగా ప్రసరిస్తూ—సమతుల్యతను పునరుద్ధరించడానికి, సద్భావనను ప్రేరేపించడానికి, అవగాహన మరియు ఐక్యతకు హృదయాలను తెరవడానికి సహాయపడుతుందని సచేతనంగా భావిద్దాం. మన గాఢమైన ఆకాంక్ష యొక్క ఆవశ్యకతతో మరియు హృదయపూర్వక విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా, శాంతి మరియు సామరస్యం యొక్క అద్భుతమైన, అపరిమిత శక్తితో దైవ సహాయం ప్రపంచంలోకి ప్రవహించే ఒక మార్గాన్ని మనం తెరుస్తాము.
మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ కల్లోల పరిస్థితుల్లో, మన గురుదేవులు మరియు పరమగురువుల యొక్క కృప, ఆశీస్సులు, ఆధ్యాత్మిక బలం మరియు ఊరట కలిగించే సజీవమైన మూలంగా ఉండుగాక. మీలో ప్రతి ఒక్కరినీ నేను నా హృదయంలో ఉంచుకుంటున్నానని, మరియు దేవుని ప్రేమపూర్వక ఆలింగనంలో మీరు భద్రత మరియు ధైర్యాన్ని పొందాలని నేను ప్రార్థిస్తున్నానని దయచేసి తెలుసుకోండి.
దేవుని మరియు గురువులలో నిరంతర ఆశీస్సులతో,
స్వామి చిదానంద గిరి