“మన పట్ల మనం ఒక ఆరోగ్యకరమైన, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడం” గురించి శ్రీ దయామాత

10 సెప్టెంబర్, 2025

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత (“సంస్థకు మాతృదేవి”) అయిన శ్రీ దయామాత నుండి వచ్చిన సందేశం ఇది; ఆమె 1955 నుండి 2010లో గతించే వరకు ఆ పాత్రలో సేవలందించారు. ఈ సందేశం మొదట 2010లో యోగదా సత్సంగ పత్రికలో “శ్రీ దయామాత నుండి ఒక లేఖ” గా ప్రచురించబడింది; దశాబ్దాలుగా పత్రికను చదువుతున్న పాఠకులకు ప్రోత్సాహకరమైన మరియు జ్ఞానముతో కూడిన ఇటువంటి సందేశాలు ఎంతో ప్రియమైనవి.

కమలం-నారింజ-రంగు-రేఖా-చిత్రం

భగవంతుని వైపు మనం చేసే ప్రయాణంలో — మరియు జీవితంలోని మన ఇతర లక్ష్యాల కోసం కృషి చేస్తున్నప్పుడు — మన పట్ల మనం ఒక ఆరోగ్యకరమైన మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.

గురుదేవులు పరమహంస యోగానందగారు ఎల్లప్పుడూ దీనిని నొక్కిచెప్పారు: మనం దేన్ని గురించి బలంగా ఆలోచిస్తామో, దేనిని విశ్వసిస్తామో, దానిని మన జీవితాల్లోకి ఆకర్షిస్తాం. మనల్ని మనం ఆత్మలుగా చూసుకొనే ఒక ఆనందకరమైన దృక్పథాన్ని స్థాపించుకొన్నప్పుడు — మన ఆధ్యాత్మిక సామర్థ్యంపై మరియు మన సహజమైన మంచితనంపై విశ్వాసం కలిగి, వాటిని పెంపొందించుకుంటే — మన నిజస్వరూపాన్ని, మనలోని దివ్యమైన ఆత్మను మరింతగా వ్యక్తపరుస్తాము.

ప్రతి ఆత్మను దేవుడు తన దేదీప్యమానమైన లక్షణాల యొక్క ప్రత్యేకమైన వ్యక్తీకరణగా విశిష్టంగా సృష్టించాడు. ఈ సత్యాన్ని గురించి ఆలోచించడం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది! స్వాభావికంగా మనకు లేనిది ఏమీ లేదు. ధ్యానం యొక్క శక్తి ద్వారా మరియు సరియైన జీవనవిధానం ద్వారా ఇప్పటికే మనదైన పరిపూర్ణతను మనం కేవలం తిరిగి కనుగొనాలి.

“మీరు ఏమిటి అన్నది మీరు ఎప్పుడూ ఆశించిన దేని కన్నా లేక మరెవరి కన్నా కూడా ఎంతో గొప్పది. దేవుడు మరే ఇతర వ్యక్తిలోనూ వ్యక్తమవని విధంగా మీలో వ్యక్తమవుతున్నాడు. మీ ముఖం ఇతరుల ముఖంలా ఉండదు, మీ ఆత్మ ఇతరుల ఆత్మలా ఉండదు, మీకు మీరే పరిపూర్ణులు; ఎందుకంటే మీ ఆత్మలో అన్నింటికంటే గొప్ప నిధి అయిన భగవంతుడు ఉన్నాడు”, అని పరమహంసగారు అన్నారు.

దీన్ని మరింత ఎక్కువగా అనుభూతి చెంది, విశ్వసించండి. గతంలోని పరిమితులను లేదా పొరపాట్లను మనకు మనం ఎందుకు ఆపాదించుకోవాలి? భగవంతుని బేషరతైన ప్రేమపై మరియు మన హృదయపూర్వకమైన నిరంతర ప్రయత్నాలకు ఆయన అందించే క్రియాశీలకమైన సహాయంపై పూర్తి విశ్వాసంతో ప్రతిరోజును క్రొత్తగా ప్రారంభిద్దాం. ఆనందాన్ని కలిగించే ఆలోచనలు మరియు పనుల యొక్క ప్రకాశవంతమైన కాంతితో సందేహం మరియు నిరుత్సాహం అనే చీకటిని పారద్రోలండి; అదే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆత్మ యొక్క సహజమైన మార్గం.

మీలో ఉన్న దివ్య లక్షణాల విలువను అభినందించి, వాటిని వ్యక్తపరచడం నేర్చుకోండి – అహంకారంతో కూడిన గర్వంతో కాదు; కాని, మీ ద్వారా ప్రపంచానికి తన నుంచి ఏదైనా అందించాలనుకునే నిత్య ప్రేమికుడు మిమ్మల్ని ప్రేమించి తన హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి.

“మీరు దేవుని సంతానమని ఎల్లప్పుడూ గర్వపడండి” అని పరమహంసగారు అన్నారు. “మాట్లాడటం, కదలడం మరియు అనుభూతి చెందడం వంటి మీ సామర్థ్యం వెనుక ఉన్నది ఆయన శక్తియే…. మీరు మీ అంతరంగంలోనే ఆయనతో అనుసంధానం పొందవచ్చు….క్రమం తప్పకుండా ధ్యానం చేయండి…మీరు విముక్తి పొందుతారు; మరియు మీ జీవితం యొక్క ప్రభావంతో ఇతరులు తమను తాము విముక్తి చేసుకునే మార్గాన్ని కనుగొంటారు.”

ఇతరులతో పంచుకోండి