శ్రీ శ్రీ మృణాళినీమాతగారి నుండి గురు పూర్ణిమ సందేశం – 2014

22 ఆగస్టు, 2014

ప్రియతమలారా,
ఈ పవిత్రమైన రోజున భారతదేశం అంతటా, భక్తులు గురువుకు నివాళులు అర్పిస్తారు—విశ్వాసం మరియు భక్తితో ఆ దైవ ప్రతినిధిని అనుసరించే వారికి భగవంతుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలు ప్రవహించే స్వచ్ఛమైన సాధనం గురువు. మన స్వంత గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి, మన ఆత్మల ప్రేమ మరియు విధేయతలను మనం అర్పిస్తున్నప్పుడు, మీ జీవితాల్లో ఆయన వల్ల కలుగుతున్న పరివర్తన ప్రభావానికి మీ హృదయాలు కృతజ్ఞతతో నూతనంగా నిండుగాక. నిజమైన గురువు మాయ యొక్క తుఫానుల నుండి మనకు గొప్ప ఆశ్రయం మరియు దేవుని మార్పులేని సన్నిధి యొక్క సురక్షితమైన నౌకాశ్రయానికి మనలను తీసుకువెళ్ళటానికి మనం విశ్వసించగల మార్గదర్శకులు.
జీవితం నిరంతరాయంగా మరియు తరచుగా తికమక పెట్టే వివిధ రకాల అనుభవాలు, సమాచారం మరియు ఎంపికలతో మనల్ని దెబ్బలు కొడుతుంది. ఎందుకంటే మనల్ని మనం పరిస్థితులు మరియు మన స్వంత మానవ స్వభావం విధించిన పరిమితులకు లోబడే మర్త్య జీవులుగా చూస్తాము గనుక, మన నియంత్రణకు మించిన శక్తుల దయకు మనం కొన్నిసార్లు బద్ధులవుతాము. కానీ మాయ యొక్క అస్పష్టమైన ముసుగులో దోషరహిత దృష్టితో చొచ్చుకుపోయే గురువు, మనం నిజంగా ఎలా ఉన్నామో మనలను అలా చూస్తారు—భగవంతుని కాంతితో ప్రకాశించే అమర ఆత్మలగా, అతని అన్ని లక్షణాలను వ్యక్తపరచగల సామర్థ్యం కల ఆత్మగా. చిన్న స్వీయ పరిమితుల నుండి బయటపడటానికి మరియు ఆత్మ యొక్క విస్తారమైన దృక్కోణం నుండి జీవించడంలో మనకు సహాయం చేయడానికి భగవంతుడు స్వయంగా గురువు ద్వారా వస్తాడు. గురూజీ వివరించినట్లుగా, “గురువు శిష్యునిలో నిద్రిస్తున్న దేవుడిని మేల్కొల్పే మేల్కొన్న దేవుడు.” మనలోని దైవ ప్రతిమను మేల్కొలపడానికి కావలసినవన్నీ ఆయన మనకు అందజేస్తారు, అవి ఏమిటంట: మనల్ని నిలబెట్టే అనంతమైన స్పృహను తాకడానికి మన చంచలమైన మనస్సును దాటి మనల్ని తీసుకెళ్ళే పద్ధతులు; ఈ ప్రపంచంలో నిత్యం మారుతున్న విలువల మధ్య ఆత్మ-స్వేచ్ఛకు మార్గం చూపే ఆధ్యాత్మిక జీవనం కోసం కావలసిన కాలాతీత సత్యాలు; మరియు ఆయన (గురువు) షరతులు లేని ప్రేమ. ఆయన ఒక ప్రియమైన శిష్యుడికి ఇలా వ్రాశారు, “నీ గురించి నా బాధ్యతను నేను ఎప్పటికీ వదులుకోను….నేను నిన్ను క్షమించడం మాత్రమే కాక, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను ఎప్పటికీ పైకి లేపుతాను.” కర్మ మరియు పాతుకుపోయిన అలవాట్ల ప్రభావం కంటే శక్తివంతమైనది ఆయన సహాయం మరియు ఆశీర్వాదాము యొక్క శక్తి, అంతేకాకుండా ఆయన సహాయంతో, అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు. మనల్ని దేవునిలో మేలుకొలపటము కొరకు ఆయన (గురువు) ఎటువంటి ప్రయత్నం లేదా త్యాగం చేయటానికైనా సిద్ధము.
గురువుకు మనపై విశ్వాసం ఉంది, మరియు ఆయన మార్గనిర్దేశాన్ని గ్రహించి, అన్వయించుకోవడానికి ఆయన పట్ల మనకున్న విశ్వాసం, ఆయన ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని పొందేందుకు మన మనస్సు మరియు హృదయం యొక్క ద్వారాలను తెరుస్తుంది. అహం యొక్క ప్రతిఘటనను జయించటానికి మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడం ద్వారా, మీ స్పృహను మార్చడానికి మరియు శుద్ధి చేయడానికి మీరు ఆయన్ని అనుమతిస్తారు. మీరు ఆయన్ని మీ ఆత్మకు నిరంతర సహచరుడిగా మార్చడానికి ప్రతిరోజూ కృషి చేస్తున్నప్పుడు ఆయన ప్రేమపూర్వక మద్దతు గురించి అవగాహన మీలో క్రమంగా పెరుగుతుంది. మీరు ఆయన రచనలను అధ్యయనం చేసినప్పుడు, మీ మనస్సాక్షిలో ఆయన సజీవ స్వరం మరియు ఆయన ఆశీర్వాద హస్తం యొక్క ఓదార్పు మీలో స్పర్శగా మారే వరకు ఆయన మాటలను మీ స్పృహలోకి లోతుగా మునిగిపోనివ్వండి, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరని మీకు గుర్తు చేస్తుంది. మరియు మీరు ధ్యానం చేసినప్పుడు, మీ భక్తి ద్వారా ఆయన్ని మీ ఆత్మ యొక్క నిశ్శబ్దంలోకి ఆహ్వానించండి. ఆ పవిత్రమైన నిశ్శబ్దంలో, ఆయన మీరు వేరు అనే భ్రమ నుండి భగవంతుని అనంతమైన ప్రేమ మరియు ఆనందంతో సంపూర్ణమైన ఏకత్వంలోకి మిమ్మల్ని తీసుకురావడానికి వేచి ఉన్నారు. జై గురూ!

దేవుడు మరియు గురుదేవుల ప్రేమ మరియు ఎడతెగని ఆశీర్వాదాలలో,
శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2014 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో పంచుకోండి