యోగదా సత్సంగ ఇంటర్మీడియట్ మహావిద్యాలయం యొక్క భూమి పూజ

5 మార్చి, 2026

ప్రతిపాదిత భవన నిర్మాణ ఆకృతి యొక్క చిత్రం.

జనవరి 31, 2026న — మన ప్రియతమ మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ శ్రీ దయామాత యొక్క పవిత్ర జన్మదిన వార్షికోత్సవం — యోగదా సత్సంగ ఇంటర్మీడియట్ మహావిద్యాలయం (YSIM) జగన్నాథ్‌పూర్ విద్యా ప్రాంగణంలో ప్రతిపాదిత ఇంటర్మీడియట్ మహావిద్యాలయ భవనానికి భూమి పూజ (శంకుస్థాపన కార్యక్రమం)తో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది.

ఈ పవిత్ర కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు, విద్యా సంస్థల యొక్క నిర్వహణ కమిటీ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు భక్తులు పాల్గొన్నారు. భారతదేశానికి తీర్థయాత్ర చేస్తున్న సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ స్వామీజీలు కేశవానంద మరియు ప్రఫుల్లానంద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యోగదా సత్సంగ ఇంటర్మీడియట్ మహావిద్యాలయం యొక్క భూమి పూజ, స్వామి గోకులానంద మరియు బ్రహ్మచారి భాస్కరానంద చేసిన యజ్ఞంతో ప్రారంభమయ్యింది.
శంకుస్థాపన చేసి పుష్పాలు సమర్పిస్తున్న వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు.

దైవ ఆశీస్సుల ఆవాహన

భూమి పూజ ఉదయం సాంప్రదాయక వైదిక ఆచారాలతో ప్రారంభమయ్యింది. స్వామి గోకులానంద యజ్ఞ యజమాని పాత్ర వహిస్తూ, ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడానికి భగవంతుడి ఆశీస్సులు అర్థించారు.

తరువాత లాంఛనంగా దీపం వెలిగించడంతో అధికారిక కార్యక్రమం ప్రారంభమయ్యింది, ఆ తర్వాత బ్రహ్మచారి భాస్కరానంద కొంచెం సేపు ధ్యానం నిర్వహించారు. ప్రాజెక్ట్ సజావుగా పూర్తి కావడం కోసం, మరియు నిర్మాణంలో పాల్గొంటున్న సేవకులు మరియు కార్మికుల భద్రత కోసం అక్కడ హాజరైన వారందరూ ప్రార్థన చేశారు.

కీర్తన గానం నిర్వహిస్తున్న బ్రహ్మచారి భాస్కరానంద...
అనంతరం కొద్దిసేపు సామూహిక ధ్యానం.

గురుదేవుల దివ్య ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడం

సంస్థ వారసత్వాన్ని గుర్తుచేస్తూ, శ్రీ ఎ.కె. సక్సేనా (యోగదా సత్సంగ మహావిద్యాలయం కార్యదర్శి) రాంచీలోని యోగదా సత్సంగ విద్యా సంస్థల చరిత్రను వివరించారు. బ్రహ్మచర్య విద్యాలయం మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి చేత స్థాపించబడినదని, ఆయన జీవితకాలంలో శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు మహాత్మా గాంధీ వంటి ప్రముఖ వ్యక్తుల సందర్శనలతో గౌరవించబడినదని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ మహావిద్యాలయం యొక్క ప్రతిపాదిత నాలుగు అంతస్తుల భవనం దాదాపు 46,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, 30 తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, లైబ్రరీ, పరిపాలనా కార్యాలయాలు మరియు బాలురకు, బాలికలకు విడివిడిగా సౌకర్యాలను కలిగి ఉంటుంది.

వై.ఎస్.ఎస్. యొక్క సమగ్ర విద్యావిధానం యొక్క ముఖ్య లక్షణాలయిన వ్యక్తిత్వం, క్రమశిక్షణ మరియు అంకితభావాల ద్వారా ఈ ప్రాంత యువకులను తీర్చిదిద్దడంలో ఈ ప్రయత్నం ఒక ముఖ్యమైన అడుగు అని లెఫ్టినెంట్ జనరల్ జ్ఞాన్ భూషణ్ (వైస్-చైర్మన్, మేనేజింగ్ కమిటీ, YSIM) నొక్కిచెప్పారు.

స్వామి పవిత్రానంద తమ ప్రసంగంలో, నూతన భవనం పేద పిల్లల విద్యకు మద్దతు ఇచ్చే ఆధునిక సౌకర్యాలను అందిస్తుందని ప్రముఖంగా ప్రస్తావించారు. గురుదేవుల “జీవించడం ఎలా” ఆదర్శాలపై ఆధారితమైన ఈ సంస్థ, శరీరం, మనస్సు మరియు ఆత్మల యొక్క సమగ్ర అభివృద్ధిని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని ప్రధానంగా కోరుకుంటుంది. ఈ ప్రాజెక్టుకు ₹14 కోట్లు ఖర్చవుతుందని ఆయన ప్రకటించి, దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ అరవింద్ కటియార్ (సెక్రటరీ, YSIM) తెలిపిన ధన్యవాదాలతో వేడుక ముగిసింది. తరువాత ప్రసాదవితరణ మరియు భోజనం జరిగాయి.

ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న స్వామి పవిత్రానంద.
సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వామి పవిత్రానంద.

ఇతరులతో పంచుకోండి