అత్యున్నత ప్రశంసలు పొందిన పరమహంస యోగానంద గారి జీవిత కథ, ఒక యోగి ఆత్మకథలోని “గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం” అనే అధ్యాయం నుండి ఈ క్రింది భాగం సంగ్రహించబడింది. దీనిలో తన ప్రఖ్యాత గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారితో తమకు కలిగిన అనేక అత్యంత స్ఫూర్తిదాయకమైన అనుభవాలను ఆయన వివరిస్తారు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయి మరియు సనాతన జ్ఞానం యొక్క సంగ్రహావలోకనం ఈ క్రింద ఇవ్వబడింది. ఈ భాగంలో పరమహంస గారు తరచుగా శ్రీయుక్తేశ్వర్ గారిని “గురుదేవులు” అని సంబోధిస్తారు; సంపూర్ణ ఆత్మాధిపత్యం సాధించిన ఆత్మను సూచించే ఈ పదం, గురువును గౌరవపూర్వకంగా సంబోధించే ఒక పద్ధతి.
శ్రీయుక్తేశ్వర్ దగ్గరి అంతేవాసిత్వంలో తొలినెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి: “దోమను జయించడం ఎలా?” మా ఇంట్లో అయితే మావాళ్లు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసం ఏర్పడ్ద ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు; సమృద్ధిగా నివాసం చేసేవి; తలనుంచి పాదాలదాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నామీద జాలి పడ్డారు.
“నువ్వో దోమతెర కొనుక్కో; అలాగే నాక్కూడా ఒకటి కొను,” ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు, “నువ్వు నీ ఒక్కడి కోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నామీదకి వచ్చి పడతాయి!”
నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్ లో గడిపిన ప్రతి రాత్రీ, మా గురువుగారు, దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు.
ఒకనాడు దోమలు ఒక మబ్బులా మామీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజూలా, తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటూంటే బెదురు పుట్టింది. నా పక్కమీదికి వెళ్ళి, వాటిని మంచి చేసుకోడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తరవాత, గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికి చిన్నగా దొంగ దగ్గు దగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయకమశకం చేసే రొదతో, నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను.
నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరికి చేరాను. ఆయన ఊపిరి తీసుకోడం లేదు. ఆయన యోగసమాధిలో ఉండగా దగ్గరినుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి; దాంతో నాకు భయం పట్టుకుంది.
“ఆయన గుండె ఆగిపోయి ఉండాలి!” నేను ఆయన ముక్కుకింద ఒక అద్దం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోడానికి, ఆయన నోరూ ముక్కురంధ్రాలూ కొన్ని నిమిషాలపాటు నా వ్రేళ్ళతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా, నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఎవరినయినా సహాయానికి పిలుద్దామని గుమ్మం వేపు తిరిగాను.
“ఓహో! ఒక కొత్త పరిశోధకుడు తయారవుతున్నాడన్నమాట! అయ్యో, నా ముక్కు!” గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. “వెళ్ళి పడుక్కోవేం? ప్రపంచమంతా నీకోసం మారాలా? నువ్వే మారు: దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో.”
నేను పిల్లిలా నా పక్క దగ్గరికి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోష పెట్టడానికేనన్న సంగతి గ్రహించాను ఆయనకు దోమల భయంలేదు. యోగశక్తి వల్ల ఆయన, దోమలు తమను కుట్టకుండా ఆపగలరు; లేకపోతే, ఆయన తలుచుకుంటే ఆంతరికంగా అభేద్యులై ఉండగలరు.
“ఆయన నాకోసం ఇది ప్రదర్శించారు. నేను కృషిచేసి సాధించవలసిన యోగస్థితి అది,” అనుకున్నాను. నిజమైన యోగి, అధిచేతన స్థితిలోకి ప్రవేశించి, దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లుగొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకుపరుస్తాయి; ఈ భూమిమీద అవి లేకపోవడమన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్కపెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలో (సవికల్పస్థితి) యోగి, బాహ్య ప్రపంచపు ఇంద్రియబోధలన్నిటినీ అటకాయించేస్తాడు. అప్పుడు ఆయనకు బహూకృతిగా, తొలుతటి ఈడెన్ స్వర్గం కంటె కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి; దృశ్యాలు కనిపిస్తాయి.1
గుణపాఠం నేర్పగల ఈ దోమలు, నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయంసంధ్యవేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంధాల్ని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాదసన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి, రమణీయమైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్ళించడానికి పాల్పడింది. విషపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసరికి, దానిమీద కసి తీర్చుకోడానికి నేను చటుక్కున చెయ్యి ఎత్తాను. కాని దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు, అహింసను గురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది.2
“పని పూర్తి చెయ్యలేదేం?”
“గురుదేవా! జీవహింసను సమర్థిస్తారా?”
“లేదు. కాని ఇప్పటికే నువ్వు, నీ మనస్సులో చావుదెబ్బ కొట్టావు.”
“నాకు అర్థం కాలేదు.”
“అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం, చంపాలన్న ‘కోరిక’ను తొలగించడం.” నా మనస్సులోని ఆలోచనల్ని, తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీయుక్తేశ్వర్ గారు. “అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటయింది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చెయ్యక తప్పని స్థితి వస్తే రావచ్చు. కాని అదే మాదిరిగా, కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని కనుక్కున్న సాధువుకు, ప్రకృతి తాలూకు దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాక అభివ్యక్తులతో సామరస్యం ఉంటుంది. హింసాభిలాషను కనక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు.”
“గురూజీ, క్రూరజంతువును చంపడానికి బదులు, తాను బలి కావడానికి సిద్ధంకావాలా?”
“అక్కర్లేదు. మానవదేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడూ వెన్నులో షట్చక్రాలూ ఉన్న కారణంగా దానికి, పరిణామాత్మకమైన విలువ అన్నిటికన్న ఎక్కువ ఉంది. ఉన్నతస్థితి నందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోడానికీ అభివ్యక్తీకరించడానికీ సామర్ధ్యం కలిగిస్తాయి ఇవి. కిందిస్థాయి జీవికి దేనికీ అటువంటి ఏర్పాటు లేదు. ఒక వ్యక్తి ఒక జంతువును కాని, మరే జీవినయినా కాని తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కాని నిష్ప్రయోజనంగా మానవ దేహనాశం కావించడం కర్మసిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి.”
మనస్సు తేలికపడి నిట్టూర్చాను; మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు.
నాకు తెలిసినంతవరకు గురువుగారు, చిరుతపులికి కాని, పులికి కాని ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి, భయంకరమైన నాగుబాము ఒకటి ఆయన ఎదటికి వచ్చింది. కాని, ఆయన ప్రేమకు వశమైపోయిందది. ఈ సంఘటన పూరీలో, సముద్రపు ఒడ్డున మా గురువుగారికున్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రఫుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు.
“మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చుని ఉన్నాం.” అంటూ చెప్పాడు ప్రఫుల్లుడు. “దగ్గరలో ఒక నాగుబాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము నాలుగడుగుల పొడుగుంది. అది మావేపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్నిచూసి, ఒక పసిపిల్లవాణ్ణి చేరబిలుస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూండడం చూసి నేను గాభరా పడిపోయాను.3 భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు! నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలాచేరువగా వచ్చిన తరవాత ఆ పాము నిశ్చలంగా నిలిచి పోయింది; ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమైనట్టుంది. భీతావహంగ ఉన్న పడగ క్రమంగా ముడుచుకు పోయింది. అది శ్రీయుక్తేశ్వర్ గారి కాళ్ళసందులోకి దూరి, అక్కణ్ణుంచి పొదల్లోకి పోయి అదృశ్యమయింది.
“గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వెయ్యలేదో అప్పట్లో నాకర్థం కాలేదు,” అంటూ ముగించాడు ప్రఫుల్లుడు. “మన గురుదేవులు, ఏ ప్రాణివల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని తరవాత గ్రహించాను.”
అధోజ్ఞాపికలు:
- యోగి తన బాహ్య జ్ఞానేంద్రియాల్ని ఉపయోగించకుండానే చూడడం, రుచి చూడడం వాసన గ్రహించడం, తాకడం, వినడం అన్నవి చెయ్యడానికి అతనికి సామర్థ్యం కలిగించే సర్వవ్యాపక శక్తుల్ని గురించి తైత్తిరీయ ఆరణ్యకంలో ఇలా వర్ణించటం జరిగింది: “గుడ్డివాడు ముత్యానికి చిల్లి పొడిచాడు; వేళ్ళు లేనివాడు దాంట్లోకి దారం ఎక్కించాడు; మెడ లేనివాడు దాన్ని ధరించాడు; నాలిక లేనివాడు దాన్ని పొగిడాడు.”
- “అహింసలో పరిపూర్ణత సాధించినవాడి సమక్షంలో (ఏ జీవిలోనూ) శత్రుభావం కలగదు.” (అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః) – యోగసూత్రాలు II:35.
- నాగుబాము తన పరిధిలో కదులుతున్నదాన్ని దేన్నయినా టక్కున కొట్టగలదు. చాలా సందర్భాల్లో, పూర్తిగా కదలకుండా ఉండడం ఒక్కటే క్షేమకరం.
ప్రపంచంలో అత్యున్నత ప్రశంసలు పొందిన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటైన పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ గురించి మరింతగా తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను స్పృశించి, మనస్సులను సుసంపన్నం చేసింది.




















