లాస్ ఏంజిలిస్ లో 2007 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం సందర్భంగా ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిని నమితామాయి ఇచ్చిన సత్సంగం (ప్రశ్నలు మరియు సమాధానాలు) నుండి ఇది సంగ్రహించబడింది. నమితా మాయి యాభై సంవత్సరాలకు పైగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసినిగా ఉన్నారు, మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు మరియు ప్రియతమ సంఘమాత అయిన శ్రీ దయామాత కార్యాలయంలో ఆమెకు గల కార్యదర్శులు మరియు వ్యక్తిగత సహాయకులలో ఒకరిగా సేవలందించారు. ఆమె ప్రస్తుతం లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ లో నివసిస్తున్నారు. “ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడటం,” అనే శీర్షికతో గల ఈ సత్సంగం యొక్క పూర్తి సారాంశం యోగదా సత్సంగ పత్రిక 2025 వార్షిక సంచికలో ప్రచురించబడింది.
ప్రశ్న: “నేను ఇతరులను ప్రేమించగలగాలని మరియు ఇతరులతో మరింత మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆ విధంగా చేయడానికి దయచేసి మీరు కొన్ని సలహాలు ఇవ్వగలరా?”
ఇది చాలా పెద్ద విషయం, కానీ బహుశా సరళమైన సమాధానం ఏమిటంటే, మనం ధ్యానం చేసినప్పుడు, మనం దేవుని మాధుర్యాన్ని, ఇతరులను చేరుకొనే ప్రేమను అనుభూతి చెందడం ప్రారంభిస్తాం.
దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని, మనలో ప్రతి ఒక్కరూ ఆ దివ్యప్రియతముడి తేజోకణం తప్ప వేరేమీ కాదని మనం గ్రహించడం ప్రారంభించినప్పుడు, మనం ఇతరులను వేరే విధంగా, వేరే వెలుగులో చూస్తాము.
13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి హఫీజ్ ఈ ఆలోచనను చాలా అందంగా వ్యక్తపరిచాడు. “దేవుడు మిమ్మల్ని ఒక విందుకు ఆహ్వానించి, ‘ఈ రాత్రి ఈ నృత్యమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా ప్రత్యేక అతిథి’ అని చెబితే — మీరు అక్కడకు చేరుకోగానే వారితో ఎలా వ్యవహరిస్తారు? నిజంగా నిజంగా హఫీజ్ చెబుతున్నాడు, ఈ ప్రపంచంలో దేవుని రత్నాల నృత్యవేదికపై లేనివారు ఎవ్వరూ లేరు.”
చాలా సంవత్సరాల క్రితం, నేను ఎస్.ఆర్.ఎఫ్. సభ్యురాలైన కొద్ది కాలానికే, చదువుకోవడం కోసం లండన్ వెళ్ళాను. నేను లండన్ చేరుకోగానే చేసిన మొదటిపని అక్కడ ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన కేంద్రాన్ని వెతకడం.
నేను అక్కడకు చేరినప్పుడు, నాలాగే ఇటలీ నుండి వచ్చిన మరొక మహిళ నాకు పరిచయమయ్యింది. ఆమె చాలా అందంగా, చాలా సొగసుగా ఉంది. నేను ఆమెను పలకరించినప్పుడు, ఆమె చాలా అహంకారంతో, “నేను ఫలానా దొరసానిని (కౌంటెస్)” అని చెప్పింది. అంతే. తక్షణమే నాకు ఆమె పట్ల విరక్తి కలిగింది. ధ్యానం ప్రారంభమైనప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే ఇక నేను ఆమెతో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి.
సేవ ముగిసిన వెంటనే శుభరాత్రి అని చెప్పి, నేను త్వరగా నా హోటల్‌కి తిరిగి వచ్చాను. నా గది తలుపు తెరవగానే, నేను ఆశ్చర్యపోయాను. మన గురుదేవులైన పరమహంస యోగానంద గారి “చివరి చిరునవ్వు” చిత్రాన్ని ఒక అల్మారాలో ఉంచాను. ఆ క్షణంలో ఆయన ఆ దొరసాని లాగానే కనిపించారు! ఆయన జుట్టు కూడా బంగారు రంగులోనే ఉంది!
కొన్ని సంవత్సరాల తరువాత ఆ దొరసాని మౌంట్ వాషింగ్టన్‌లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు నేను ఆవిడను కలిశాను — ఆ సమయానికి నేను ఆశ్రమంలో సన్యాసినిగా నివసిస్తున్నాను. ఇప్పుడు ఆమె పట్ల నేను నిజంగా కృతజ్ఞతను, ప్రేమను అనుభవించాను — నాకు చాలా మంచి పాఠం నేర్పించడానికి గురుదేవులు ఆమెను ఉపయోగించుకున్నందుకే కాదు, నేను ఆమె ముఖానికి, బంగారు జుట్టుకు అవతల చూసినప్పుడు, నేను పరమహంస గారి కొంటెచూపును చూడగలిగినందుకు కూడా.
మనం ఎల్లప్పుడూ ఇతరులను ఆత్మ-సాక్షాత్కార మార్గంలో మన తోటి ప్రయాణీకులుగాను — మరియు చాలా తరచుగా తెలియని వ్యక్తిగత బోధకులుగా — చూడటానికి ప్రయత్నిస్తే, మనం వారిని మరింత సులభంగా ప్రేమించే అవకాశం ఉంటుంది.
మరి మనం ఇంకా ఏమి చేయగలం? చిన్నచిన్న విషయాలతో ప్రారంభించండి. మీ ఉదయపు ధ్యానం అనంతరం ఆరోజు ఎవరికైనా సహాయం చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకోమని గురుదేవులను అడగడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? మీ హృదయాన్ని మరియు మనస్సును మీరు తెరిచి ఉంచడం వల్ల జరిగే అద్భుతమైన విషయాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఆయన మీ ద్వారా పనిచేయగలరు.
మరొకరిని సంతోషపెట్టడం కోసం మీకు ఇష్టమైన వస్తువు దేనినైనా ఇచ్చివేయడానికి భయపడకండి. అది మీకు విలువైనదే అయినప్పటికీ, దానిని ఇవ్వడానికి భయపడకండి, ఎందుకంటే మనం (మరణం తర్వాత) సూక్ష్మ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, మనం మనతో ఏమీ తీసుకెళ్లలేము. దేనినీ కూడా. మన ఆత్మ మాత్రమే ముందుకు సాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా సంతోషపెట్టి, అదే సమయంలో కొంచెం మంచి కర్మను ఎందుకు పొందకూడదు?
ఎవరికైనా కృతజ్ఞతా పత్రాన్ని లేదా కొంచెం ప్రశంసలను పంపడానికి, లేదా ఒంటరిగా ఉన్నవారికి పూలగుత్తిని పంపడానికి భయపడకండి. ఇతరులను చేరుకోండి. మీరు ఇతరులకు ఇచ్చినప్పుడే ప్రేమ తిరిగి వస్తుంది, మీరు దాన్ని మీకోసమే ఉంచుకున్నప్పుడు కాదు.
ఇంకా ఇతరుల కోసం ప్రార్థించడానికి భయపడకండి. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ మీ ధ్యానం చివరలో కొన్ని నిమిషాలు కేటాయించుకుని ఇతరుల కోసం ప్రార్థించండి. ప్రార్థన చాలా శక్తివంతమైనది. మీరు ఆ విధంగా కూడా ఇతరులను చేరుకోవచ్చు. మీరు వారి కోసం ప్రార్థించారని వారికి ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ అలా చేయడం ద్వారా వారి జీవితాలను మీరు మార్చవచ్చు.
ఆ తరువాత, గురుదేవులు మీ ద్వారా ఏం చేశారో మీరు గుర్తించినప్పుడు, మీరు చాలా సంతోషపడతారు — ఇతరులను చేరుకోవడంలో ఈ అశక్తతను అధిగమించడానికి మీరు ఏదో ఒకటి చేశారని తెలుసుకుని ఎంతగానో సంతోషపడతారు.
అత్యంత ఆలోచనాత్మకమైన పిల్లవాడిని కనుగొనడం కోసం ఒక పోటీని నిర్వహించిన వ్యక్తిని గురించి నేను చదివాను. అందులో విజేత ఒక నాలుగేళ్ల బాలుడు. అతని పక్కింటి పొరుగువాడైన ఒక వృద్ధుడు తన భార్యను కోల్పోయాడు. ఆ చిన్న పిల్లవాడు, తన ఇంటి బయట పచ్చికపై కూర్చుని దుఃఖిస్తున్న ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరకు వెళ్లి అతని ఒడిలోకి ఎక్కాడు.
ఆ తరువాత, అతని తల్లి ఆ బాలుడిని, “ప్రియా, ఆ వృద్ధుడికి నువ్వు ఏం చెప్పావు?” అని అడిగింది, దానికి అతను, “ఏమీ లేదు, నేను అతనికి ఏడవడానికి సహాయం చేశాను” అని అన్నాడు.
మనం ప్రతిరోజూ చేయగలిగే చిన్నచిన్న ఆలోచనాత్మకమైన పనులే తప్ప, తరచుగా జనుల హృదయాలను తాకేది గొప్ప గొప్ప పనులు కాదు. కాబట్టి, మీరు ఇతరులను ప్రేమించగలిగేలా, వారి ప్రేమను మీకు ఇవ్వమని భగవతుడిని మరియు గురువును అడగండి. అప్పుడు మీ హృదయం తెరుచుకుంటుంది — మరియు మీరు అదే ప్రేమను అందరికీ ఇవ్వగలుగుతారు మరియు ఇతరులను చాలా సులభంగా చేరుకోగలుగుతారు.
మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్న దేవుని అపరిమితశక్తి అయిన ప్రార్థన యొక్క క్రియాశీలకమైన శక్తి ద్వారా, మీరు ఇతరులకు ఎలా సహాయపడగలరో మరింతగా తెలుసుకోవడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచ వ్యాప్త ప్రార్థనా మండలిలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.




















