“నాకున్న స్వప్నాలు, ఏ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి పని చేశానో, వాటినన్నిటినీ నా ప్రణాళికల కంటే చాలా ఎక్కువగా — భగవంతుడు నెరవేర్చాడు. మౌంట్ వాషింగ్టన్ కేంద్రం ఎల్లప్పుడూ భగవంతుడి సాధనంగా ఉండేందుకు కృషి చేసినందున ఆ ప్రణాళికలు సాకారమయ్యాయి.”
— పరమహంస యోగానంద
పరమహంస యోగానందగారు లాస్ ఏంజిలిస్ లోని మౌంట్ వాషింగ్టన్ పై సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం స్థాపించిన 100వ వార్షికోత్సవానికి గుర్తుగా 2025వ సంవత్సరం నిలుస్తుంది. ఇక్కడ ఆయన 25 సంవత్సరాలకుపైగా నివసించారు, బోధించారు, భగవంతుడితో అనుసంధానం పొందారు, మరియు ఈ ఆశ్రమ కేంద్రం నుండే వారి ఉపన్యాసాలు, రచనలు మరియు రికార్డ్ చేసిన ప్రసంగాలు ప్రచురించబడి ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్నాయి.

లాస్ ఏంజిలిస్ నడిబొడ్డున భారతదేశానికి చెందిన ఒక యువ స్వామి ఈ 12 ఎకరాల ఆస్తిని ఎలా సంపాదించారు? ఈ కథ చాలా సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రారంభమవుతుంది. కాశ్మీర్‌ను యువకుడిగా సందర్శించిన సమయంలో, ప్రాచీన శంకర ఆలయాన్ని దర్శించినప్పుడు పరమహంస యోగానందగారికి ఒక అధిచేతన అనుభవం కలిగింది. ఆ గిరిశిఖర మందిరం రూపాంతరం చెంది మౌంట్ వాషింగ్టన్ పై తదనంతర కాలంలో తాను స్థాపించబోయే ప్రధాన కార్యాలయ భవనంగా మారినట్టు దర్శనమయింది. దీన్ని ఆయన ప్రేమగా మదర్ సెంటర్ అని పిలిచేవారు. అపూర్వమైన ఆ అంతర్దర్శనం ఎంత స్పష్టమైనదంటే, ఆ భవనం యొక్క లోపలి మెట్లదారి వంటి వివరాలను కూడా దర్శించానని ఆ తరువాత పరమహంసగారు గుర్తుచేసుకున్నారు.
1924 డిసెంబరులో, బోస్టన్ మరియు ఇతర తూర్పు తీర నగరాల్లో కొన్ని ఏళ్లపాటు బోధనలతో గడిపిన తరువాత, ఖండాంతర బోధనా యాత్ర పూర్తి చేసిన తరువాత పరమహంస యోగానందగారు లాస్ ఏంజిలిస్ చేరుకున్నారు. ఆయన సందేశం ఉత్సాహభరితమైన పశ్చిమతీర నగరంలో వెంటనే అనుకూలమైన ప్రతిస్పందనను ఆకర్షించింది. డౌన్‌టౌన్‌లోని ఫిల్హార్మోనిక్ ఆడిటోరియంలో వేలాదిమంది ఆయన ఉపన్యాసాలకు హాజరయ్యారు. తనకు సహాయం చేసే కొంతమంది విద్యార్థులతో ఒకరోజు ఆయన ఇలా అన్నారు : “ఒక కేంద్రాన్ని స్థాపించేందుకు దేవదూతల నగరమైన లాస్ ఏంజిలిస్ లో ఇక్కడ మనం ఒక స్థలాన్ని చూద్దాం. నేను ఇక్కడ చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక స్పందనను కనుగొన్నాను.”
గురుదేవులు మరియు వారి విద్యార్థుల చిన్న బృందం వృక్షాలు, మొక్కలతో నిండిన మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలోని ఒక చిన్నపాటి ఆస్తిని చూడటానికి బయలుదేరారు, చివరకు ఆయన కారు ఒకప్పటి సొగసైన మౌంట్ వాషింగ్టన్ హోటల్ పెద్ద భవనాన్ని దాటింది.

పరమహంస యోగానందగారు కుతూహలముతో, వారు ఆ ఆస్తిని తిరిగి చూడటానికి వెళ్ళేలా చేశారు. కారు నుండి ఆయన బయటకు వచ్చి, ఖాళీగా ఉన్న ఆ గొప్ప భవనం వైపు చూస్తూ ముందువైపు బాట ప్రక్కన నిలబడి ఇలా అన్నారు “ఈ భవనం మనదే ననిపిస్తోంది!”
ఉదారమైన వారి విద్యార్థుల సహాయంతోను, మరియు గురుదేవులు భుజస్కంధాలపై వేసుకొన్న రెండు తనఖాలతో 1925లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఆవిర్భవించింది. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శాశ్వత స్థావరం ఏర్పడటంతో పరమహంస యోగానందగారు ఎక్కువ మంది సత్యాన్వేషకులను చేరుకోవడానికి వీలు కలిగింది.
పరమహంసగారి మార్గదర్శకత్వంలో ఈ ప్రదేశం, ఉద్యానవనం వంటి భూములు, గొప్ప వృక్షాలు మరియు ధ్యాన వనాలను కలిగి ఉన్న ప్రశాంతమైన స్వర్గధామంగా — కోలాహలంగా ఉండే లాస్ ఏంజిలిస్ లో ఒక శాంతి, సామరస్యాల పవిత్రస్థలంగా – రూపొందింది. మదర్ సెంటర్‌లోని ఆయన నివాసం ఈరోజు వరకు ఒక పావనప్రదేశంగా భద్రపరచబడింది, లైబ్రరీ, మరియు రిసెప్షన్ హాల్‌లో ఆయన ఉపయోగించిన కొన్ని వ్యక్తిగత సామగ్రి ప్రదర్శించబడుతున్నాయి. సంవత్సరాలపాటు ఆయన కార్యక్రమాలు నిర్వహించిన ప్రార్థనాలయం, ధ్యానం మరియు ప్రార్ధనల కోసం ప్రతిరోజూ తెరిచి ఉంటుంది; మరియు ఆయన తరచూ తరగతులు నిర్వహించిన ఒక సుందరమైన బహిరంగ ప్రదేశం “టెంపుల్ అఫ్ లీవ్స్,” నిశ్చలమైన ధ్యానానికి ఆహ్వానిస్తుంది.



ఎస్.ఆర్.ఎఫ్. ప్రధాన కార్యాలయ ప్రదేశాలలో ఆవరించి ఉన్న పరమహంసగారి దైవచైతన్యపు శక్తివంతమైన ప్రకంపనలు వ్యాపించినందున, దీన్ని గ్రహణశీల హృదయంతో సందర్శించినవారు తమ జీవితాలపై వాటి పరివర్తనకారక ప్రభావాన్ని ధృవీకరించారు.
మీకు తెలిసి ఉన్నట్లుగా, 2024 మార్చిలో మేము ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణకు అవసరమైన ప్రణాళికలను లాస్ ఏంజిలిస్ నగరానికి సమర్పించాము, పరమహంసగారికి ప్రియమైన మదర్ సెంటర్ ను రాబోయే 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాలంపాటు నిలబెట్టేందుకు ఈ ప్రణాళిక చక్కగా రూపుదిద్దుకొంది. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయ భవనానికి కీలకమైన భూకంప మరియు జీవిత-భద్రతా నవీకరణలతోపాటు, ఈ ప్రణాళికలో అదనంగా పరమహంస యోగానందగారికి నివాళులర్పించేందుకు ఒక చిన్న వనమందిరం కూడా ఉంది. ఆమోదం పొందే ప్రక్రియలో భాగంగా లాస్ ఏంజిలిస్ నగరంతో కలిసి పనిచేయడాన్ని మేము కొనసాగిస్తున్నాము మరియు రాబోయే నెలల్లో ప్రణాళిక గురించి నవీకరణలను మీతో పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాము.

పరమహంసగారి హృదయానికి ప్రియమైనది మరియు యోగా యొక్క సార్వత్రిక శాస్త్రాన్ని అందరికీ చేరువచేసే ఆయన లక్ష్యానికి కేంద్రంగా ఉన్న ఈ ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్‌కు వర్చువల్ యాత్ర చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.