ప్రియతములారా,
మీకు, పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు మిత్రులందరికీ హృదయపూర్వక, ప్రేమమయ, ఆనందభరిత క్రిస్మస్ శుభాకాంక్షలు! ప్రభువైన ఏసుక్రీస్తు జననాన్ని మనం ఈ పవిత్ర పర్వదినాన జరుపుకుంటున్న సందర్భంలో, మీ ధ్యాన నిశ్చలతలో, ఈ ప్రియతమ అవతారుని యొక్క ఎల్లలు లేని క్రీస్తు ప్రేమను మీరు ఎప్పటికంటే మరింత గాఢంగా అనుభూతి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రేమ ప్రపంచ కుటుంబమంతటికి నిరంతరం దీవెనలనందిస్తూ, దానిని ఆధ్యాత్మీకరిస్తూ ఉంటుంది.
ఏసుక్రీస్తు భగవంతుని స్థితికారక చైతన్యం యొక్క అపార వైభవాన్ని తనలో ధరించారు. . అయినప్పటికీ, బహుశా మనల్ని అత్యంత లోతుగా స్పృశించేది ఏమంటే, మానవాళి మధ్య ఆయన వినయపూర్వకమైన సరళతతో సంచరించిన విషయం — సమస్తాన్నీ అక్కున చేర్చుకోగల కరుణను ప్రతి వ్యక్తి పట్ల ప్రసరింపచేస్తూ, ఆలోచనలోనూ, చేతలోనూ మూర్తీభవించిన ధర్మంగా నడచుకోవడం. ఆయన తన ఉదాహరణ ద్వారా మనం కూడా జాగృతమవుతున్న ప్రపంచంలో ప్రేమ, కాంతి మరియు శాంతికి దూతలుగా ఉంటూ, మన జీవితాలను భగవంతుని సంకల్పానికి అనుగుణంగా మలచుకొని, ప్రతి పరిస్థితిలోనూ దివ్యంగా స్పందించడం ఎలాగో చూపారు. మన స్వంత ఆధ్యాత్మిక పరివర్తక శక్తిని మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయవద్దు. భగవంతునితో అనుసంధానంలో ఉన్న ప్రతి క్షణం, ప్రతి పవిత్రమైన ఆలోచన, ప్రతి నిస్వార్థమైన కార్యం స్వస్థత మరియు సామరస్యపు అలలను ప్రసరింపజేస్తుంది, మానవాళిని ఉద్ధరిస్తూ దాని పవిత్రీకరణకు దోహదపడుతుంది.
ఈ క్రిస్మస్, మన గురువు పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త ధ్యేయం (మిషన్) యొక్క ఆధ్యాత్మిక కేంద్రబిందువైన SRF మదర్ సెంటర్ యొక్క శతాబ్ది సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ పవిత్ర స్థలంలోనే ఆయన క్రీస్తును గౌరవించుటకు వార్షిక సార్వదిన క్రిస్మస్ ధ్యాన సంప్రదాయాన్ని ప్రారంభించారు — సార్వజనీన క్రీస్తు చైతన్యం లేదా కూటస్థ చైతన్యం యొక్క జననం మనలోపల అనుభూతమవడానికి, మరియు ఏసులో పరిపూర్ణంగా రూపుగట్టిన ఆత్మిక లక్షణాలైన వినయం, క్షమ, అందరి పట్ల నిస్వార్థ ప్రేమను మన జీవితాల్లో మరింత సంపూర్ణంగా ప్రతిబింబించడానికి ఇది మనకు ఒక అవకాశం. ఈ ధ్యానాలలో ఒకదానిలో, పరమహంసజీ ఇలా ఉద్ఘాటించారు: “అంతకంతకు అధికమవుతున్న గాఢతతో మీరు మీ భక్తిని నిరంతరం సమర్పించినట్లైతే, మీరు ఇంతకు ముందెన్నడూ అనుభవించనంతగా ఈరోజు భగవంతుడి సాన్నిధ్యాన్ని చూస్తారు, అనుభవిస్తారు.” మీకు ఆ విధంగా జరుగుగాక!
మీరు ఆత్మపోషకమైన ధ్యాన జనిత ఆంతరంగిక నిశ్చలతలో లీనమవుతూ, కుటుంబ సభ్యులు, మిత్రులతో క్రిస్మస్ బాహ్య ఉత్సవాలను జరుపుకునే ఈ సమయంలో, మీ హృదయం నుండి క్రీస్తు ప్రేమ పొంగిపొర్లి — మీ మార్గంలో తారసపడే వారందరికీ శాంతిని, సద్భావనను, ఆనందాన్ని ప్రసాదించు గాక.
అత్యంత ధన్యమైన క్రిస్మస్ పండుగ — మరియు సదా నూతన ఆనందంతో, పరిపూర్ణతతో నిండిన నూతన సంవత్సరం కొరకు — మీకు నా దివ్య మైత్రిని మరియు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
భగవంతుని, క్రీస్తు, మరియు గురువుల ప్రేమలో,
స్వామి చిదానంద గిరి




















