“ది స్పిరిట్యుయల్ ఎక్స్-ప్రెషన్ ఆఫ్ ఫ్రెండ్-షిప్” (The Spiritual Expression of Friendship) ను అధికారికంగా విడుదల చేసిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ స్వామి చిదానంద గిరి

6 జనవరి, 2026
ది స్పిరిట్యుయల్ ఎక్స్-ప్రెషన్ ఆఫ్ ఫ్రెండ్-షిప్ - పరమహంస యోగానంద రచించిన పుస్తకం

ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలలో కనుగొనబడడానికి వేచియున్న ప్రగాఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించే పరమహంస యోగానంద గారి పుస్తకం, ది స్పిరిట్యుయల్ ఎక్స్-ప్రెషన్ ఆఫ్ ఫ్రెండ్-షిప్ (The Spiritual Expression of Friendship) కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి, డిసెంబర్ 25 తేదీన, లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సన్యాసుల క్రిస్మస్ కార్యక్రమంలో ది స్పిరిట్యుయల్ ఎక్స్-ప్రెషన్ ఆఫ్ ఫ్రెండ్-షిప్ (The Spiritual Expression of Friendship) పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు విడుదల చేశారు. ఆ ప్రత్యేక సందర్భంలో, ఈ పుస్తకంలో పరమహంసగారు అందించిన అపారమైన స్ఫూర్తిసంపద గురించి అక్కడ వ్యక్తిగతంగా మరియు ఆన్‌లైన్ లో పాల్గొన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో స్వామి చిదానందగారు మాట్లాడారు. “ఇది ఒక చిన్న పుస్తకం,” అని ఆయన ఇలా అన్నారు, “కాని, గురుదేవుల చైతన్యం మరియు జీవితం స్పృశించిన ప్రతిదాని వలెనే, ఇందులో కూడా చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి!”

మూడు భాగాలుగా విభజింపబడ్డ ఈ పుస్తకం, పరమహంస గారి సాంగ్స్ ఆఫ్ ది సోల్ (ఆత్మ గీతాలు) పుస్తకం నుంచి గ్రహించబడ్డ అందమైన కవిత, “ఫ్రెండ్-షిప్” (స్నేహం) తో ప్రారంభమవుతుంది. ఆ తరువాత, స్నేహం యొక్క దివ్య స్వభావం మరియు ఆధ్యాత్మిక శక్తులపై ఒక లోతైన వ్యాసం ఉంటుంది. చివరి భాగం, “ప్రేమ అనేది ఆత్మ యొక్క శ్వాస” అన్న కవితాత్మక స్ఫూర్తిని అందిస్తుంది; ఇందులో పరమహంసగారు, “సృష్టి అంతటిలోనూ ప్రవహిస్తూ, అంతటా వ్యాపించి ఉన్న దివ్యప్రేమ గురించి ఆయన గ్రహించినదాన్ని, అనుభవించినదాన్ని మాట్లాడారు,” అని స్వామి చిదానందగారు వివరించారు.

ఈ పుస్తకం యొక్క పేరు, మరియు ఈ పుస్తకంలోని చాలా భాగం సంగ్రహించబడ్డ ఈ ఉత్కృష్టమైన వ్యాసం యొక్క పుట్టుక మరియు పరిణామాల గురించి కూడా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్పృశించారు. పరమహంసగారు ప్రప్రథమంగా 1930లలో రచించిన ఈ వ్యాసం, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల ముందటి వరుసలో మొదటిసారి ప్రచురించబడింది. ఈ పాఠాల నూతన సంపూర్ణ సంకలనం (2019లో ఆవిష్కరించబడింది) తయారవుతున్న సమయంలో పూర్వ అధ్యక్షులైన శ్రీ దయామాతగారు మరియు శ్రీ మృణాళినీమాతగారు, ఈ వ్యాసాన్ని సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండని గోప్యమైన గృహ-అధ్యయన పాఠాల పరంపరలో కలిపి వేయడానికి బదులుగా, ఆధ్యాత్మిక స్నేహంపై సార్వత్రికంగా వర్తించే ఈ సందేశాన్ని పుస్తకరూపంలో ప్రచురించి, ఆ విధంగా దాని వ్యాప్తిని, మానవాళిపై దాని ప్రభావాన్ని ఎక్కువగా ఉండేలా చేయాలని నిర్ణయించారు. అంతేకాక, పరమహంసగారు ఈ వ్యాసాన్ని 1949లో మళ్లీ సమీక్షించారని, ఇప్పటి వరకు ప్రచురింపబడని మరికొన్ని వివరణలను, స్పష్టీకరణలను జోడించారని, స్వామి చిదానందగారు తెలిపారు. కాబట్టి, ఇప్పుడు ప్రపంచానికి ఈ నూతన పుస్తకంలో, “ఆధ్యాత్మిక స్నేహం, దివ్యస్నేహంపై, పరమహంస యోగానంద గారి అద్భుతమైన గ్రంథం యొక్క అత్యంత స్పష్టమైన రూపం” లభించిందని స్వామి చిదానందగారు అన్నారు.

ఈ పుస్తకం యొక్క మూడవ భాగంలోని పద్యరూపక ప్రేరణ, ప్రతి చరణంలోనూ ఉన్న ప్రగాఢ ఆధ్యాత్మిక భావకల్పనకు తోడుగా ఉన్న అద్వితీయమైన చిత్రాల వల్ల ఈ భాగం మెరుగుపడిందని పాఠకులు గమనిస్తారు. 2000వ సంవత్సరంలో యోగదా సత్సంగ పత్రిక లో ప్రచురణ కోసం ఈ స్ఫూర్తిదాయక రత్నాన్ని వారు తయారు చేసి, భవిష్యత్తులో శాశ్వతంగా పుస్తక రూపంలో దీనిని ప్రచురించాలని సూచనలు ఇచ్చినప్పుడు, శ్రీ దయామాతగారు మరియు శ్రీ మృణాళినీమాతగారు, ముందుగానే దీన్ని కూడా ఊహించారు.

SEOF-లోపల

మౌంట్ వాషింగ్టన్ పైనున్న ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం వద్ద, ఆ భవనం యొక్క శతాబ్ది సంవత్సరంలో ఈ పుస్తకం విడుదల కావడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, స్వామి చిదానందగారు తమ ప్రసంగాన్ని ముగించారు. ఎందుకంటే, దివ్యస్నేహం యొక్క ఇతివృత్తం మరియు ఆదర్శం, ఈ ప్రాంగణంలో పరమహంసగారు స్థాపించిన సన్యాస సంఘం యొక్క అంకితభావంతో కూడిన సేవలో అల్లబడిన నిజమైన “అభివృద్ధికారక సూత్రమే” కాక, ఈ ప్రత్యేక కేంద్రం నుంచి వెలువడవలసిన వారి ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు మూలస్తంభం కూడానని ఆయన తెలిపారు. “మీరందరూ ప్రేమ, సామరస్యం, కరుణ మరియు వినయంతో కలసి పని చేస్తే, ఈ కార్యం ప్రపంచాన్ని ముంచెత్తుతుంది,” అని గురుదేవులు అన్నారు.

“నిజమైన స్నేహం కంటే, భగవంతుడి ప్రేమ యొక్క అత్యంత స్వచ్ఛమైన వ్యక్తీకరణ, ఈ భౌతిక ప్రపంచంలో మరొకటి లేదని పరమహంసగారు తరచుగా అనేవారు” అని స్వామి చిదానందగారు చెప్పారు. ఇంకా “ఈ పుస్తకంలో అతి చక్కగా వర్ణించబడిన స్నేహం అటువంటిదే. మన ఈనాటి ప్రపంచానికి ఈ బోధనలు, ఈ సూత్రాలు ఎంతో అవసరం. అలాగే, ఏసు క్రీస్తు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా క్రిస్మస్ రోజున, ఈ సుందరమైన పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పుస్తకంలో మన గురుదేవులు ఇలా అన్నారు: ‘ఏసుకు ఇంత అనుచరగణం ఎందుకు ఉంది? ఎందుకంటే, ఇతర గురువులు మరియు అవతారాల వలె, ఆయన కూడా మానవసేవలో అగ్రగణ్యుడు. స్నేహితులను ఆకర్షించడానికి, నిజమైన స్నేహితుడి లక్షణాలను కలిగియుండాలి.’ చిన్నదైనప్పటికీ అద్భుతమైనదైన ఈ పుస్తకంలో శక్తివంతంగాను, చిరస్మరణీయంగాను మన గురుదేవులు దాన్ని పొందుపరిచారు. దీనిని ఈ రోజు విడుదల చేసి, మీ అందరితోనూ పంచుకోగలుగుతున్నందుకు నాకెంతో ఉత్సాహంగా ఉంది,” అని ఆయన అన్నారు.

నిజమైన స్నేహం: అందరికీ ఒక సార్వజనీనమైన, ఐక్యతను చేకూర్చే సాధన

అందమైన చిత్రాలతో కూడిన ఈ పుస్తకంలో, నిజమైన స్నేహానికి ఆధారభూతమైన సార్వత్రిక అభ్యాసాలను వివరించి, కలహాలతో బాధపడుతున్న మానవాళికి సకాలంలో పరిష్కారాన్ని, యోగం మరియు ఆధ్యాత్మికతలలో అత్యంత గౌరవనీయులైన ఆధునిక గురువులలో ఒకరు అందిస్తున్నారు. స్నేహాన్ని దాని యొక్క పరిశుద్ధమైన, ఉదాత్తమైన రూపంలో అనుసరించినప్పుడు, మనల్ని మన సాధారణ దైనందిన చైతన్యాన్ని దాటించి, ఒక విస్కృతమైన, సర్వవ్యాప్తమైన చైతన్యంలోకి తీసుకొని వెళ్లే సామర్థ్యం దానికి ఉందనీ, అక్కడ మనం ఇతరులతోను, చివరికి మొత్తం జీవకోటితోనూ ఐక్యతను కలిగించే దివ్యమైన బంధుత్వాన్ని అనుభూతి చెందుతామని, ఆయన చూపిస్తున్నారు. ఆత్మ యొక్క సహజ స్వభావం — అందరినీ కలుపుకొని, స్వీకరించే ప్రేమను — మనం అనుభవిస్తాము.

పుస్తకంలోని అంశాలు:

  • స్నేహం యొక్క అమోఘమైన నియమాలను ఎలా ఆచరించాలి
  • పూర్వజన్మల్లోని స్నేహితులను గుర్తించడం
  • ఎక్కడికి వెళ్లినా నిజమైన స్నేహితులను ఆకర్షించే అయస్కాంతశక్తిని అభివృద్ధి చేసుకోవడం
  • మనల్ని ప్రేమించని వారిని ప్రేమించడాన్ని అభ్యసించడం
  • …ఇంకా మరిన్ని!

మీ ప్రేమ యొక్క ప్రకాశమానమైన రాజ్యాన్ని క్రమంగా విస్తరింపజేసి, మీ కుటుంబాన్ని, మీ ఇరుగుపొరుగు వారిని, మీ సమాజాన్ని, మీ దేశాన్ని, అన్ని దేశాలను, సకల జీవరాశులను దానిలో చేర్చుకోండి. భగవంతుడి సకల సృష్టి పట్ల కరుణ, ఆప్యాయతలతో నిండి ప్రతి చోటా, ప్రేమను వ్యాపింపచేసే విశ్వ స్నేహితులుగా ఉండండి.

— “ది స్పిరిట్యుయల్ ఎక్స్-ప్రెషన్ ఆఫ్ ఫ్రెండ్-షిప్” లో పరమహంస యోగానంద

ఇతరులతో పంచుకోండి