మన గౌరవనీయ సంఘమాత నుండి జూలై19న రానున్న గురుపూర్ణిమ ప్రత్యేక సందేశం
ప్రియతములారా,
పవిత్రమైన ఈ గురుపూర్ణిమ నాడు భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గురువును పూజించే అందమైన ఆ సాంప్రదాయంలో మేమూ మీతో పాలుపంచుకొంటున్నాము. తనను తెలుసుకోవాలని తపించే ఆత్మలకు ఈశ్వరుడు సమాధానమిచ్చేది గురువుద్వారానే. మన ప్రియతమ గురుదేవులను, ఆయన బోధనలను కనుగొన్నప్పటి ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవించి, ఆ దీవెన యొక్క ఔన్నత్యాన్ని మరలా కొత్తగా అర్థం చేసుకొనే సమయం ఇది. ఆయన ప్రేమ, దివ్య జ్ఞానం మీలో ఎన్ని విధాలుగా మార్పు తీసుకువచ్చిందో మీరు తలచుకొనేకొద్దీ ఆయన చూపిన మార్గంలో పట్టుదలగా ముందుకు సాగాలన్న నిర్ణయం మీలో మరింత బలపడాలని నేను ప్రార్థిస్తున్నాను.
గురుదేవులు తన ఆధ్యాత్మిక సంపదలోంచి మనకు ఎంతో ఇచ్చారు: విముక్తిని ప్రసాదించే క్రియాయోగ శాస్త్రం, ఈశ్వరుడితో అనుసంధానాన్ని కలిగించే సరైన జీవన విధానం, ఇంకా, మనకు స్ఫూర్తిదాయకంగా ఉండగల తన విజయవంతమైన జీవనం. కానీ గురుశిష్య సంబంధానికి జీవాధారమైన ఆత్మీయ మూలకం ఒకటుంది, గురువుగారు తన గురువైన శ్రీయుక్తేశ్వర్ గారిని కలిసినప్పుడు: “నీకు బేషరతుగా నా ప్రేమ అందిస్తాను. నువ్వు కూడా అలాగే బేషరతుగా నాకు ప్రేమ అందిస్తావా?” అని శ్రీయుక్తేశ్వర్ గారు అడిగినపుడు “మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను,” అని మన గురువుగారు సమాధానమిచ్చారు. వారి ఈ పరస్పర సంభాషణలోనే గురుశిష్య సంబంధం యొక్కసారం ఇమిడి ఉంది. మీరు మీ గురువుతో అదే అధ్యాత్మిక ఒప్పందం చేసుకున్నారు. పరస్పర విశ్వాసం, విధేయతతో ఏర్పడిన ఆ బంధం మీ హృదయంలో, మనసులో నిత్యం నవీకరించబడుతూ మిమ్మల్ని ఆయనకు ఎప్పటికీ దగ్గరగా ఉంచుతుంది. జీవితం కష్టంగా ఉన్నప్పుడూ, అధ్యాత్మికాభివృద్ధిలో వెనుకబడిపోయినట్టు మీకనిపించినప్పుడూ, ఓదార్పు కలిగించే ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి.
“నేనెల్లపుడూ మీతోనే ఉంటాను,” దానివల్ల ఆయన సహాయంతో ఆంతరిక, బాహ్య ఆటంకాలన్నిటినీ జయించగలమన్న బలమూ, ఆత్మవిశ్వాసమూ మీలో పెంపొందుతాయి. ఆయన మిమ్మల్ని గమనిస్తున్నారు, అంతులేని ఓర్పుతో మీరు మాయ యొక్కజాడను పూర్తిగా వదిలించుకోగలిగేవరకు మీకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటారు. అవధుల్లేని ఆయన ప్రేమ అనే వాస్తవాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే మిమ్మల్ని ఏదీ భయపెట్టలేదు.
మనం మన గురువుగారి నుండి పొందడమే కాక, ఆయనకు మన అవ్యాజ ప్రేమను ఇవ్వగలిగిననాడు గురువుతో మన అనుబంధం రోజురోజుకూ గాఢతరమవుతుంది. మనం మన గురువుగారి కోసం మనకు చేతనైనంత చేయడం ద్వారా, మన భక్తిని, కృతజ్ఞతను చేతల్లో చూపించడానికి ప్రతి రోజూ మనకు ఒక కొత్త అవకాశం వస్తూనే ఉంటుంది. మన గురువును గౌరవించే అత్యుత్తమ విధానం ఏమిటంటే ఫలితాలకోసం అసహనంతో ఎదురుచూడకుండా, ఆయన బోధించిన దాన్ని విశ్వాసంతో ఆచరించడం. మీరు ధ్యానం చేసేటప్పుడు ప్రక్రియలను ఒక భక్తిపూర్వక కానుకగా అభ్యసించండి. రోజువారీ జీవితంలో మీరు అభివృద్ధి చెందడానికి నిలకడగా చేసే ప్రయత్నాలే ఆయనకు కానుకగా అర్పించండి. అలాగే ఆయన పట్ల మీకుగల అవ్యాజ ప్రేమ పరిస్థితుల ప్రభావాన పరీక్షకు గురైనపుడు, లేదా మీకువచ్చిన ఏదైనా కష్టాన్ని తొలగించమని మీరు ప్రార్థించినా ఆయన మౌనంగా ఉండిపోయినట్టు మీకనిపించినప్పుడు కూడా ఆయన మీతోనే ఉన్నారని, మిమ్మల్ని కొత్త దైవానుసంధాన, ఆంతరిక బలం, అవగాహన స్థాయిల్లోకి లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకోండి. ఉత్కృష్టమైన ఆయన విజ్ఞతలో విశ్వాసముంచి, మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొన్నపుడు, మీ చైతన్యంలో మార్పు అనుభూతమై, ఆయన సంకల్పమే మీ సంకల్పంగా, ఆయన జ్ఞానం మీ అవగాహనగా, ఆయన ప్రేమ మీ ప్రేమగా మారుతుంది. ఆయన యొక్క పరివర్తనశీలక స్పర్శకు మీ హృదయం తెరుచుకొంటుంది. గురుదేవులకు తమ గురువైన శ్రీయుక్తేశ్వర్ గారితో అనుభూతమైనట్టు మీ మాయా సంకెళ్ళు తెగిపోయి గురువు ద్వారా భగవంతుడితో ఐక్యత అనే మహాద్భాగ్యం చివరకు అందుకుంటారు. అప్పుడు మీ ఆత్మ: “మన పరిమితులను శాశ్వతంగా కరిగించి మనిద్దరం అనంతజీవంలో ఐక్యమవుదాము” అన్న ఆయన మాటలు ప్రతిధ్వనిస్తుంది. మీ నిరంతరకృషి, ఆయన కృప వల్ల సర్వశ్రేష్టమైన దీవెన మీరు పొందుదురుగాక.
గురుదేవుల ప్రేమ మరియు నిరంతర దీవెనలతో,
శ్రీ శ్రీ మృణాళినీమాత
![]()
కాపీరైట్ © 2016 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.



















