గురుపూర్ణిమ సందేశము — 2022

8 జూలై, 2022

ఈ సంవత్సరము జూలై 13 న గురుపూర్ణిమ అయిన సందర్భంగా మన గౌరవనీయ అధ్యక్షలు స్వామి చిదానంద గిరి గారి నుండి ప్రత్యేక సందేశము

స్నేహంలో ప్రేమను వ్యక్తీకరించడంలో గురుశిష్య సంబంధం అత్యున్నతమైనది; ఇది అన్నిటినీ మించి భగవంతుడిని ప్రేమించడం అనే కోరికయే ఏకైక లక్ష్యంగా పంచుకున్న దానిమీద ఆధారపడ్డ నిర్నిబంధమైన దివ్య స్నేహం.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియతములారా,

ఈ పవిత్రమైన రోజు మన ప్రియమైన గురుదేవులతో హృదయము, మనస్సు మరియు ఆత్మతో ఆంతరిక అనుసంధానమును గౌరవించడానికి మీ అందరితో నేను కలుస్తాను. ఎందుకంటే అదే మన ఆధ్యాత్మిక జీవితాలకు పవిత్రమైన పునాది. “మీకు తెలియకుండా మీ ప్రక్కనే నడుస్తూ అదృశ్య హస్తాలతో మిమ్మల్ని కాపాడతాను” అనే దివ్య ప్రమాణాన్ని ఈ సందర్భంలోను మరియు ఎల్లప్పుడూ మీ హృదయాలలో నిలుపుకోండి; ఆయనలో మీ విశ్వాసము ద్వారా మరియు ఆయన ఇచ్చిన సాధనను విధేయతతో ఆచరించడం ద్వారా మీరు క్రమంగా మరియు తప్పనిసరిగా మీ దివ్య లక్ష్యం వైపు పురోగమిస్తారు.

భగవంతుడిలో ఉన్న — సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము — అన్ని గుణాలూ భగవంతుడితో ఏకత్వం పొందిన పరిపూర్ణుడైన గురువులో రూపుదాలుస్తాయి. అందువల్ల మనము గురువు సహాయము, రక్షణ, మార్గదర్శకత్వము మరియు ప్రేమను కోరి ఆయనను చేరినప్పుడల్లా మన ఆత్మల గాఢమైన పిలుపుకి ప్రతిస్పందించడానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉంటారని మనకు తెలుస్తుంది.

అంతులేని ప్రేమ, ఆశీస్సులతో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి