స్వామి చిదానందగిరి గారి 2025 గురుపూర్ణిమ సందేశం

28 జూన్, 2025

గురువు పట్ల నిర్నిబంధ ప్రేమ అనే కాంతి పరివేషంలో ఓలలాడిన వెంటనే ఆధ్యాత్మికంగా సంసిద్ధంగా ఉన్న శిష్యుడిలో గురువు పట్ల విధేయత దానంతట అదే జాగృతమవుతుంది. తాను చివరికి ఒక నిజమైన మిత్రుడిని, హితబోధకుడిని, మార్గదర్శకుడిని కనుగొన్నానని ఆత్మ తెలుసుకుంటుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియతములారా,

గురుపూర్ణిమ ఆరాధన ఉత్సవ సందర్బంలో మీలో ప్రతి ఒక్కరికీ ప్రేమపూర్వక అభినందనలు. మన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల వంటి — యుగయుగాలుగా మానవ జాతిని ఆధ్యాత్మీకరించిన — ఆత్మజ్ఞానం పొందిన గురువులను పూజించే ఈ సంప్రదాయాన్ని పాటించడంలో మనందరి భక్తిని ఏకం చేద్దాం. మన గురుదేవులు పరమహంస యోగానందగారి రూపంలో మన వ్యక్తిగత విముక్తి కోసం అవతారం దాల్చిన ఈశ్వరుడి వంటి గురువు మనకు లభించినందుకు మనమెంత భాగ్యవంతులమో కదా. అలాంటి గురువు పాదాల వద్దకు మనం ఆకర్షింపబడడం — ఆధ్యాత్మిక మార్గంలో అన్ని సంపదలనూ మించిన సంపద — మనం ఎన్నో జన్మలుగా కూడబెట్టుకున్న పుణ్య ఫలితం అని నేను నమ్ముతున్నట్టుగానే మీరూ భావిస్తారని నా నమ్మకం.

తనలోని అనంత కరుణ, అగాధం వంటి ప్రేమలతో గురుదేవులు తన ఆధ్యాత్మిక సమృద్ధి నుండి మనకెంతో ప్రసాదించారు — పవిత్ర విజ్ఞానమైన క్రియాయోగం, ఈశ్వర సంస్పర్శను, అత్యున్నత ఆనందాన్ని ప్రసాదించే జీవించడం ఎలాగో నేర్పే నియమాలు, మనకు తెలియకుండానే మనకు ఆదర్శంగా నిలిచే ఆయన విజయవంతమైన జీవితం. అంతేకాక ఆయనను సద్గురువుగా భావించే ప్రతి శిష్యుడికీ ఆయన ప్రసాదించే ఆత్మానందానికి, స్వేచ్ఛకు పరిమితే లేదు.

అమరమైన తన బోధనలు, మన ధ్యానజనిత గ్రహణశీలత ద్వారా మనతో మాట్లాడుతూ ఉండే మన గురువులో ఒక శాశ్వత స్నేహితుడు, హితబోధకుడు, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మనకు లభిస్తారు. మనము నిజాయితీగా ఆయన ప్రసాదించిన సాధనను అభ్యసించడం ద్వారా ఆయన ఇక్కడ భౌతిక రూపంలో ఉన్నప్పుడు ఎంత వాస్తవంగా ఉండేవారో ఇప్పుడు ఈ నిముషంలో కూడా అంతే వాస్తవంగా మనతో ఉంటారు.

ఈ ప్రత్యేకమైన రోజు మరియు ఎల్లప్పుడూ మన గురుదేవులకు మనం ఇవ్వగల అత్యున్నత సమర్పణ ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండడం అనే పూమాల — విధేయత అనే దారంలో ఆయన ఆధ్యాత్మిక ఆదర్శాల పట్ల మన భక్తి, చెక్కుచెదరని నిబద్ధత అనే పూవులతో అల్లినది — సమర్పించుకోవడమే. రక్షణ నిచ్చే ఆయన సాన్నిధ్యము, దివ్య ప్రేమ ఎప్పుడూ మిమ్మల్ని హత్తుకొని ఉంటూ, మీ చైతన్యాన్ని శాశ్వత ప్రకాశం, ఆనందాల లోకంలోకి లేవనెత్తాలని మీ కోసం నేను చేసే ప్రార్థనలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. జై గురు!

ఈశ్వరుడు, గురుదేవుల నిరంతర ఆశీర్వాదాలతో,
స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి