జ్ఞాపకార్థం: శ్రీ కమల్ నయన్ బక్షి (1938-2025)

11 జూన్, 2025
2Untitled-1
గురుదేవులు పరమహంస యోగానందగారికి 35 సంవత్సరాలకు పైగా ఒక ప్రియమైన క్రియాబాన్ శిష్యుడు మరియు 2012 నుండి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యులు అయిన శ్రీ కమల్ నయన్ బక్షి, జూన్ 6వ తేదీ ఉదయం ప్రశాంతంగా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు.

శ్రీ బక్షి గతించడంతో, తన దేశంపట్ల, తన ఆధ్యాత్మిక మార్గం పట్ల అచంచల అంకితభావానికి నిదర్శనంగా నిలిచిన గొప్ప ఆత్మను వై.ఎస్.ఎస్. కోల్పోయింది.

శ్రీ కె. ఎన్. బక్షి స్వీడన్, నార్వే, ఇరాక్, ఆస్ట్రియా, మరియు ఇటలితో సహా అనేక దేశాలకు భారత రాయబారిగా సేవలందించారు. దౌత్యవేత్తగా ఆయన ఉద్యోగజీవితాన్ని, మన దేశానికి ఆయన చేసిన అసాధారణ సేవ ద్వారా గుర్తించవచ్చు. ప్రపంచ వేదికపై దేశపు విలువలకు కంఠస్వరాన్నిచ్చి, ఆయన భారతదేశం యొక్క ఆదర్శాలను మరియు ఆకాంక్షలను గౌరవంగా నిలబెట్టారు. పదవీ విరమణ తరువాత, శ్రీ బక్షి తన జీవితాన్ని మరొక లక్ష్యానికి — తన గురుదేవులైన పరమహంస యోగానందగారి కార్యాచరణకు నిశ్శబ్దంగా, ఒక శక్తివంతమైన ప్రతినిధిగా అంకితం చేయాలనుకొన్నారు. ఒకప్పుడు మన దేశ స్వరాన్ని సరిహద్దుల ఆవలకు తీసుకువెళ్లినట్లే, మన గురుదేవుల ఆధ్యాత్మిక ఆదర్శాలను, కేవలం మాటల ద్వారా కాకుండా, తన జీవితాన్ని గొప్ప ఉదాహరణగా వ్యక్తీకరించి ప్రసరింపజేశారు.

సేవ మరియు భక్తితో కూడిన జీవితాన్ని గడుపుతూ, శ్రీ కె. ఎన్. బక్షి, వై.ఎస్.ఎస్. కు అనేక విధాలుగా సేవ చేశారు — పదమూడు సంవత్సరాలు వై.ఎస్.ఎస్. బోర్డు సభ్యునిగా ఉండడంతో సహా — భారతదేశమంతటా గురుదేవుల బహుముఖ వ్యవస్థలకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడ్డారు. నోయిడాలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు, మరియు ఆశ్రమ నిర్మాణ పనుల పురోగతిలో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. అనంతరం, నోయిడా ఆశ్రమ పరిపాలన కమిటీ మరియు వై.ఎస్.ఎస్. బోర్డు సభ్యునిగా, ఆశ్రమం యొక్క సార్ధకమైన నిర్వహణకు ఆయన దోహదపడ్డారు. శ్రీ బక్షి బాలికల కోసం స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు, మరియు నోయిడా ఆశ్రమంలో IX నుండి XII తరగతుల పేద విద్యార్థులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలు, అనేక మంది విద్యార్థులకు వృత్తి సంబంధిత తరగతుల్లోకి ప్రవేశించడానికి సహాయం చేయడం ద్వారా, నేటికీ చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. నోయిడా ఆశ్రమంలో ఒక ధార్మిక ఆస్పత్రి స్థాపించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు, ఇది ఇప్పుడు ఏటా వేలాది మంది పేద రోగులకు సేవలందిస్తోంది.

శ్రీ కె. ఎన్. బక్షి గౌరవార్థం త్వరలో వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో ఒక స్మారక సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది.

మన ధ్యానాల సమయంలో, శ్రీ బక్షిగారి ఆత్మకు మరియు ఆయనను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మన ప్రేమను, ప్రార్థనలను పంపిద్దాం.

ఇతరులతో పంచుకోండి