రాష్ట్రపతి భవనాన్ని సందర్శించిన వై.ఎస్.ఎస్. సన్యాసులు

16 డిసెంబర్, 2022

నవంబర్ 9, 2022న గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును స్వామి స్మరణానంద గిరి గారు మరియు బ్రహ్మచారి ఆద్యానందగారు కలిశారు. వై.ఎస్.ఎస్. సన్యాసులకు ఆమె స్వాగతం పలికారు మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. పరమహంస యోగానందగారి పట్ల తనకున్న గొప్ప గౌరవాన్ని వ్యక్తంచేస్తూ ఆమె ఇలా అన్నారు: “పరమహంస యోగానందగారి ముఖం విభిన్నంగా ప్రకాశిస్తుంది. మానవాళికి [ప్రపంచానికి] ఆహారం, వస్త్రాలు మరియు నివాసం కంటే ఎక్కువ అవసరమైన వాటిని ఆయన అందించారు. ఆయన ఒక గొప్ప ఋషి, ఎందరో మహానుభావుల వలె, ఆయన చిన్న వయస్సులోనే తన శరీరాన్ని విడిచిపెట్టారు, అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక అనుగ్రహం అపారమైనది. నేను వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడల్లా గొప్ప ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభవించాను, ముఖ్యంగా పరమహంసగారు పెంచిన లిచీ చెట్టు దగ్గర. ఈ లిచీలు ఇతర లిచీల కంటే విభిన్నమైనవిగా నేను ఎల్లప్పుడూ గ్రహించాను మరియు ఉద్ధరించపడినట్టుగా భావించాను.”

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి లేఖను, ఒక పుష్ప గుచ్ఛమును, ఎస్.ఆర్.ఎఫ్. ఎంగేజ్‌మెంట్ క్యాలెండర్ — ఇన్నర్ రిఫ్లెక్షన్స్ ను మరియు చిత్ర రూపంలో ఉన్న వై.ఎస్.ఎస్. చరిత్రను వై.ఎస్.ఎస్. సన్యాసులు ఆమెకు బహుకరించారు.

2016 లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో జరిగిన ఐక్యరాజ్యసమితి యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె గౌరవించబడ్డారు. ఆ సమయంలో, ఒక వ్యక్తి జీవితంలో గురువు యొక్క ఆధ్యాత్మిక బోధనలు కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ శ్రీ పరమహంస యోగానందగారిని ఆమె ప్రశంసించారు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కష్టమైనప్పటికీ, అది లేకుండా భౌతికమైన విజయం నిరుపయోగమైనదని ఆమె పేర్కొన్నారు.

2017 నవంబర్ లో, గాడ్ టాక్స్ విత్ అర్జున హిందీ అనువాదం, పుస్తక విడుదల కార్యక్రమంలో అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పాల్గొన్న ఆమె భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కాపాడటంలోను, మరియు గురుదేవుల ఆచరణాత్మకమైన, ఆత్మ-విముక్తి బోధనలను వ్యాప్తి చేయడంలోను వై.ఎస్.ఎస్. నిర్వహిస్తున్న పాత్రకు తన గాఢమైన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.

ఇతరులతో షేర్ చేయండి