స్మృతి మందిరం — యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ

1920లో పరమహంస యోగానందగారు తన అమెరికన్ శిష్యుల అంతర్దర్శనం పొందిన పవిత్ర స్థలంలో స్మృతి మందిరం నిర్మించబడింది. అన్ని మతాలు, సంప్రదాయాలు మరియు జాతులకు చెందిన ప్రజలకు క్రియాయోగం యొక్క సార్వత్రిక బోధనలను వ్యాప్తి చేయాలనే ఆయన ప్రపంచవ్యాప్త కార్యానికి ఇది ప్రేరణగా నిలిచింది. నిరంతరం అత్యధికంగా విక్రయించబడే పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథలో, రాంచీలో బ్రహ్మచర్య విద్యాలయం ప్రారంభించినప్పుడు ఒక సామానుగదిలో పొందిన తన అంతర్దర్శనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు:

“అమెరికా! వీళ్ళు కచ్చితంగా అమెరికన్లే!” కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది.

రాంచీ విద్యాలయంలోని సామానుగదిలో, దుమ్ముపట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో, ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే నాకు కష్టంగా ఉండేది!

అంతర్దర్శనం కొనసాగింది; అపార జనసమూహం ఒకటి తదేకంగా నావేపు చూస్తూ నటీనటబృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది.

సామానుగది తలుపు తెరుచుకుంది; మామూలుగానే, కుర్రవాళ్లలో ఒకడు, నేను దాక్కుని ఉన్న చోటు కనిపెట్టేశాడు.

“ఇలా రా, విమల్,” అని ఉత్సాహంగా పిలిచాను. “నీకో వార్త చెప్పాలి; ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు!”

1950వ దశకంలో, యోగానందగారిని తన ప్రపంచవ్యాప్త కార్యం కోసం పశ్చిమ దేశాలకు నడిపించిన ఈ సందర్భాన్ని స్మరించుకొనేందుకు అదే ప్రదేశంలో ఒక చిన్న ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది. 1960లలో ఒకసారి మరియు 1980లలో మరొకసారి ఈ మందిరానికి మార్పులు చేయడం జరిగింది.

యోగానందగారి 100వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా, ఆయనకు తగిన విధంగా నివాళి అర్పించేందుకు ఈ పవిత్ర స్థలంలో ప్రత్యేక మందిరాన్ని నిర్మించాలని శ్రీ దయామాతగారు సంకల్పించారు.

1993లో యోగానందగారి జన్మదినం సందర్భంగా పూర్వపు వై.ఎస్.ఎస్. ధర్మాచార్యులు స్వామి భావానంద గిరి స్మృతి మందిరానికి పునాదిరాయి వేయడం జరిగింది. ఈ స్మారక ప్రాజెక్టు కోసం రాజస్థాన్ నుండి అనుభవజ్ఞులైన కార్మికుల బృందాన్ని పిలిపించడం జరిగింది; పాలరాళ్లతో గోపురం మరియు స్తంభాలను చెక్కడం వారి పని. శిల్పకళలో నైపుణ్యం కలిగిన మరొక బృందానికి పూజావేదిక మరియు కలువలను రూపొందించే బాధ్యత అప్పగించడం జరిగింది.

మార్చి 22, 1995న, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) స్థాపించబడిన 78వ వార్షికోత్సవంనాడు, ఈ మహా గురువుల జ్ఞాపకార్థం రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠంలో తెల్లని పాలరాతిలో ఉన్న ఒక అందమైన స్మృతి మందిరాన్ని అంకితం చేయడం జరిగింది. 1,200 మందికి పైగా భక్తులు మరియు అతిథులు వీక్షిస్తుండగా, గురుదేవుల ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన స్వామి ఆనందమోయి గిరి స్మృతి మందిరాన్ని వ్యక్తిగత ధ్యానం కోసం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి గుర్తుగా, వారం రోజులపాటు స్మృతి మందిర సమర్పణ సంగమం నిర్వహించబడింది.

1995లో అంకితం చేయబడినప్పటి నుండి, దాని విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు నిర్మాణ సౌందర్యంతో, రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠాన్ని సందర్శించే భక్తుల దృష్టిని స్మృతి మందిరం ఆకర్షిస్తోంది.

భక్తులు మరియు సందర్శకుల వ్యక్తిగత ధ్యానం కోసం ఈ మందిరం రోజంతా తెరిచి ఉంటుంది.