75 సంవత్సరాల దక్షిణేశ్వర ఆశ్రమం

“లాహిరీ మహాశయులు మరియు బాబాజీల సంకల్పం, మరియు దీవెనల ఫలితంగానే నేను దక్షిణేశ్వరంలో సరిగ్గా గంగఒడ్డునే ఎంతో అందమైన స్థలాన్ని మన యోగదా మఠం కోసం సంపాదించగలిగాను. అది కలకత్తా నుండి దాదాపు ఇరవై నిముషాల దూరంలో ఉంది. మన సంస్థకు ఇదొక గొప్ప సంపద. ఇది నాకు చాలా ఆనందకరం.”

గురుదేవులు పరమహంస యోగానందగారు 1935-36 నాటి తన భారతదేశ సందర్శన కాలంలో కలకత్తా నుండి రాజర్షి జనకానందగారికి ఇలా లేఖ వ్రాశారు, “బెంగాలుకు కిరీటం వంటి కలకత్తా నగరంలో ఒక శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడానికి, నేను అవిశ్రాంతంగా పనిచేస్తున్నాననీ, ఆ పని దాదాపుగా పూర్తి అయిపోయినట్టే అనీ నీకు తెలిస్తే నువ్వు చాలా సంతోషపడతావు.” ఆ సమయంలో భారతదేశం నలుమూలలా కొనసాగుతున్న తన ప్రయాణాల మధ్య కూడా కలకత్తా లోపలా, చుట్టుప్రక్కలా ఆశ్రమానికి తగిన ప్రాంతం కోసం అనేక చోట్ల తానే వివిధ స్థలాలు సందర్శించారు. అయితే ఆ విషయమై తుది నిర్ణయం తీసుకోక మునుపే ఆయన అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తరువాత అక్టోబర్ 9, 1939లో చక్కటి పళ్ల చెట్లతో, పూల చెట్లతో నిండిన ఉద్యానవనాల్తో కూడిన ఇప్పటి స్థలాన్ని జమీందారు — పంచానన్ భట్టాచార్య (మన పరమ పరమ గురువర్యులైన లాహిరీ మహాశయుల శిష్యుడు) గారి శిష్యుడు — శ్రీ నందో లాల్ కోరురి నుండి తీసుకోవాలని నిర్ధారించడమైంది. ఆయన కలకత్తాలోని ప్రముఖ వర్తకుల్లో ఒకరు.

తరువాత పరమహంసగారు తన ఒక యోగి ఆత్మకథలో, “1939లో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రాసాదంలాంటి భవనంలో యోగదా మఠాన్ని స్థాపించడం జరిగింది. కలకత్తాకు ఉత్తరాన కొద్ది మైళ్ళ దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం, నగరవాసులకు శాంతినిలయంగా ఉపకరిస్తుంది. దక్షిణేశ్వర మఠం, యోగదా సత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికున్న విద్యాలయాలకూ కేంద్రాలకూ ఆశ్రమాలకూ ప్రధాన కార్యాలయం,” అని పేర్కొన్నారు.

దక్షిణేశ్వరంలోని ఆశ్రమవాసులతో, భక్తులతో ఇష్టాగోష్టిగా సాగిన సత్సంగంలో సంభాషిస్తున్న శ్రీ దయామాతగారు. ఎడమవైపు మృణాళినీమాతగారిని చూడవచ్చు.
దక్షిణేశ్వరంలోని యోగదా మఠంలో 1964లో క్రియాయోగ దీక్ష నిర్వహిస్తున్న శ్రీ దయామాతగారు. కుడివైపు స్వామి శ్యామానందను చూడవచ్చు.
పూరీలోని గోవర్ధన మఠానికి చెందిన శ్రీ జగద్గురు శంకరాచార్య భారతి కృష్ణ తీర్థ స్వామి 1959లో దక్షిణేశ్వరం లోని యోగదా మఠం సందర్శించిన సందర్భంలో స్వామివారితో దయామాతగారు.

ఆనందమయిమాతగారు మరియు దయామాతగారు, 1961

గడచిన సంవత్సరాల్లో యోగదా సత్సంగ మఠాన్ని — 55 సంవత్సరాల పాటు మనకు సంఘమాత మరియు అధ్యక్షులుగా ఉన్న శ్రీ దయామాతగారు, ఆ తరువాతి సంఘమాత మరియు అధ్యక్షులు శ్రీ మృణాళినీమాతగారు సందర్శించారు. ఇంకా శ్రీ ఆనందమాతగారు, శ్రీ శైలసుతామాతగారు, శ్రీ ఉమామాతగారు, శ్రీ ముక్తిమాతగారు, స్వామి ఆనందమోయ్ గారు, స్వామి భక్తానందగారు, స్వామి విమలానందగారు వంటి గురుదేవుల ప్రత్యక్ష శిష్యులనేకులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి పావనం చేశారు. వారి స్ఫూర్తిదాయక సత్సంగాలు, క్రియాయోగ దీక్షలు మన ప్రియ గురుదేవులు ఇచ్చిన యోగసాధన అనే దివ్వెను ఆరిపోకుండా నిలబెట్టాయి. దక్షిణేశ్వరాన్ని సందర్శించే భక్తులు ఇప్పటికీ అక్కడ గొప్ప ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని పొంది తమ దైవ సాక్షాత్కార సాధనలో మరింత స్థిరంగా నిలదొక్కుకుంటున్నారు.

1958లో యోగదా సత్సంగ మఠాన్ని సందర్శించిన శ్రీ ఆనందమయిమాతగారు, యోగదా మఠం చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పూరీలోని గోవర్ధన మఠానికి చెందిన శ్రీ శంకరాచార్య జగద్గురు భారతి కృష్ణ తీర్థ స్వామి (1958లో ఆయన చేసిన చరిత్రాత్మకమైన అమెరికా యాత్రను వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నిర్వహించింది.) 1959లో యోగదా సత్సంగ మఠం సందర్శించి దయామాతగారిని కలుసుకున్నారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. చేపడుతున్న కార్యకలాపాలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు.

తామర కొలను, యోగదా సత్సంగ మఠం, దక్షిణేశ్వరం

తామర కొలను, యోగదా సత్సంగ మఠం, దక్షిణేశ్వరం

పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ చదవడం వల్ల నైతేనేమీ, లేక ఈ ప్రదేశం యొక్క ప్రశాంతతను గురించి తెలుసుకోవడం వల్ల నైతేనేమీ ఇతర ఆధ్యాత్మిక వ్యక్తులనేకులు యోగదా సత్సంగ మఠాన్ని సందర్శించేందుకు ఆకర్షితులయారు. వారిలో కొందరి హృదయానందం ఇలాంటి పదాల్లో ప్రతిఫలిస్తుంటుంది: “మాకు ఎంతో ప్రధానమైన యాత్రాస్థలాల్లో ఒకటి,” “పవిత్ర బృందావన భూమి,” “భూతల స్వర్గం,” “గంగాతీరంలోని ఆధ్యాత్మిక మందిరం,” “తపోవనాన్ని పోలిన పరిసరాలను కలిగి ఉన్న ప్రాంతం,” “ఆ గేటులోకి ప్రవేశిస్తే తప్ప మన ఊహకు అందని నిశ్శబ్ద, ప్రశాంత, సుందర ప్రదేశం,” “మన హృదయాన్ని, ఆత్మనూ ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసే అసాధారణ వాతావరణాన్ని కలిగి ఉన్న ప్రదేశం.”

దక్షిణేశ్వరంలోని యోగదా సత్సంగ మఠానికి చెందిన ఈ ఆవరణలో 1977, మార్చి 7న పరమహంస యోగానందగారి ఆదర్శ జీవనాన్ని, మానవజీవితానికి ఆయన చేసిన ఉపకారాన్ని శ్లాఘిస్తూ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక తపాలా బిళ్ళను, మొదటి రోజు పోస్టు కవర్ (first-day-cover)ను విడుదల చేసింది. ఆ కార్యక్రమానికి అమెరికాకు మాజీ భారత రాయబారి అయిన డా. వినయ్ రంజన్ సేన్ మరియు పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ఎస్. కె. ఘోష్ గార్లు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా డా. సేన్ మాట్లాడుతూ పరమహంస యోగానందగారు తమ ప్రియతమ భారతదేశం గురించిన తమ కవితను చదువుతూ ప్రసంగాన్ని ముగించిన వెంటనే మహాసమాధిలోకి వెళ్ళిపోవడాన్ని దర్శించగలగడమనే తన అత్యంత అసాధారణ అనుభవాన్ని గురించి మాట్లాడారు. ఈ సంఘటన 1952, మార్చి 7 లాస్ ఏంజిలిస్ లోని బిల్ట్ మోర్ హోటల్ లో ఇచ్చిన ఒక విందులో చోటుచేసుకుంది: “యోగానందగారి వంటి వ్యక్తులు మానవ జీవితానికి నూతన సంపన్నతను ప్రసాదిస్తారు….ఆయన లాంటి వారు మరణించరు….ఆయన తమ సందేశాన్ని అందుకొని స్ఫూర్తి పొందిన లక్షలాది ప్రజల హృదయాల్లో, మనసుల్లో జీవించే ఉంటారు అని మనం భావించాలి. రానున్న భవిష్యత్తులోనూ ఆయన జీవించే ఉంటారు….మన భవిష్యత్తుకు దారి చూపగల నిజమైన నక్షత్రం యోగానందగారు,” అన్నారు.

దక్షిణేశ్వరంలో యోగదా సత్సంగ మఠ స్థాపన యొక్క ప్లాటినం జూబిలీ సందర్భంగా యోగదా సత్సంగ మఠం అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది.

పరమహంస యోగానందగారి గౌరవార్థం 1977, మార్చి 7న భారత ప్రభుత్వం విడుదల చేసిన తపాలా బిళ్ళ ప్రారంభోత్సవం. దక్షిణేశ్వరం, యోగదా సత్సంగ మఠంలో. సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్య అతిథి, అమెరికాకు మాజీ భారత రాయబారి అయిన డా. వినయ్ రంజన్ సేన్. (ఎడమ నుండి కుడికి) స్వామి శాంతానందగారు, శ్రీ డి. ఎన్. జతియా, శ్రీ వనమాలి దాస్.

ఇతరులతో షేర్ చేయండి