జగన్మాత దివ్యసాన్నిధ్యంలో జీవించడం

పరమహంస యోగానందగారి జ్ఞాన వారసత్వం నుండి

బ్రహ్మ, విష్ణు మరియు శివుని రూపాలతో పరిపాలించే విశ్వ ప్రకృతి, జగన్మాత

ఈ విశ్వాన్ని సృష్టించడంలో దేవుడు రెండు అంశాలను వెల్లడించాడు: పురుష లేదా తండ్రి స్వభావం, మరియు స్త్రీ లేదా మాతృ స్వభావం. మీరు మీ కళ్ళు మూసుకుని, విశాలమైన, అపరిమితమైన అంతరిక్షాన్ని ఊహించుకొంటే, మీరు సమ్మోహన పూరితులై ఆకర్షితులవుతారు — మీరు స్వచ్ఛమైన జ్ఞానం తప్ప మరేమీ కాదని తెలుసుకొంటారు. సృష్టి, నక్షత్రాలు లేదా గ్రహాలు లేని రహస్యమైన, అనంతమైన గోళం — కేవలం స్వచ్ఛమైన జ్ఞానమే — తండ్రి. మరియు వజ్రాల వంటి మిరుమిట్లుగొలిపే నక్షత్రాలు, పాలపుంతలు, పువ్వులు, పక్షులు, మేఘాలు, పర్వతాలు, ఆకాశంతో కూడిన ప్రకృతి — సృష్టి యొక్క లెక్కలేనన్ని అందాలు — జగన్మాతకు ప్రతిరూపాలు. సౌందర్యం, సౌమ్యత, సున్నితత్వం మరియు దయతో నిండిన, భగవంతుని మాతృస్వరూపాన్ని ప్రకృతిలో మీరు దర్శిస్తారు. ప్రపంచంలోని సౌందర్యం భగవంతుని యొక్క సృజనాత్మక మాతృ ప్రవృత్తిని తెలియజేస్తుంది మరియు ప్రకృతిలోని మంచితనాన్ని మనం దర్శించినప్పుడు, మనలో సున్నితత్వం యొక్క అనుభూతిని మనం అనుభవిస్తాము — ఆ ప్రకృతిలో భగవంతుణ్ణి మనం జగన్మాతగా దర్శించవచ్చు మరియు అనుభూతి చెందవచ్చు.

“సరే, నీకు ఏమి కావాలి?” అని జగన్మాత స్పందించే వరకు, పట్టుదలతో ఉన్న పిల్లవాడిలా నిరంతరం పిలుస్తూనే ఉండండి. సృష్టి కార్యంలో ఆమె తీరిక లేకుండా ఉంది. ఆమె ఒక్కసారిగా ప్రత్యుత్తరం ఇవ్వదు; కానీ ఆమె కోసం ఆపకుండా ఏడ్చే కొంటె బిడ్డ కోసం, ఆమె తప్పకుండా వస్తుంది.

మీరు తనను తిరిగి పొందాలని జగన్మాత చాలా ఆత్రుతగా ఉంది, అయితే మీరు ఆమెను మాత్రమే కోరుకుంటున్నారని ముందుగా ఆమెకు నిరూపించాలి. మీరు అత్యవసరంగా మరియు నిరంతరాయంగా ఆమె కోసం దుఃఖించాలి; అప్పుడు ఆమె చిరునవ్వులు చిందిస్తుంది మరియు తక్షణమే మీతో ఉంటుంది. దివ్య ఆత్మకు పక్షపాతం లేదు; తల్లి అందరినీ ప్రేమిస్తుంది. కానీ ఆమె భక్తులు ఆమె ప్రేమను ఎంచుకొంటారు, ఆమె ప్రేమకు ప్రతిస్పందిస్తారు. కొంచెం మానవ ప్రేమ లేదా కొంచెం డబ్బు సంపాదించిన వ్యక్తులపై వాటి ప్రభావాన్ని నేను చూస్తున్నాను — వారు ఎంత సంతోషంగా ఉన్నారు! కానీ జగన్మాతలో ఎంత బలం, ఎంత ఆనందం, ఎంత ప్రేమ ఉందో చూడగలిగితే, వారు అన్నిటికీ దూరంగా ఎగిరిపోతారు.

దివ్య మాతా, గులాబీ పరిమళంలో నీ స్వరాన్ని విన్నాను. నా భక్తితో కూడిన గుసగుసలలో నీ స్వరం విన్నాను. నా గంభీరమైన ఆలోచనల మధ్య నీ స్వరాన్ని విన్నాను. స్నేహమనే స్వరం ద్వారా మాట్లాడేది నీ ప్రేమే. కలువపువ్వు మృదుత్వంలో నీ సున్నితత్వాన్ని తాకాను.

ఓ దివ్య మాతా, తెల్లవారుజామును ఛేదించి, విరజిమ్మే నీ కాంతి ముఖాన్ని చూపించు! సూర్యుడిని ఛేదించి నీ శక్తి ముఖాన్ని చూపించు! రాత్రిని ఛేదించి నీ వెన్నెల ముఖాన్ని చూపించు! నా ఆలోచనలను ఛేదించి నీ జ్ఞాన ముఖాన్ని చూపించు! నా భావాలను ఛేదించి నీ ప్రేమ ముఖాన్ని చూపించు! నా అహంకారాన్ని ఛేదించి నీ వినయ ముఖాన్ని చూపించు! నా జ్ఞానాన్ని ఛేదించి నీ పరిపూర్ణత యొక్క ముఖాన్ని చూపించు!

నా ఒంటరితనపు అరణ్యంలో నిన్ను పిలిచినప్పుడు, నీ ఆనందంతో నన్ను పలకరించడానికి నీవు తెల్లవారుజామున సాక్షాత్కరిస్తావు. నా జీవిత రంధ్రాలలో నీ శక్తిని నింపడానికి సూర్యుని కరిగిన ద్వారం నుండి నీవు ఉద్భవిస్తావు. మౌనంగా మాట్లాడే నీ వెండి కిరణాలను బహిర్గతం చేసి నా అజ్ఞానపు రాత్రిని నీవు కూల్చివేస్తావు! 

ఇతరులు తమ సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు మీరు ధ్యానం చేస్తే, ధ్యానంలో నిశ్శబ్దం మీతో మాట్లాడుతుందని మీరు గమనిస్తారు….ప్రతి చోటా పరమాత్మ మాతృమూర్తి రూపంలో సాక్షాత్కరించడాన్ని నేను దర్శిస్తాను. ఘనీభవించిన నీరు మంచుగా మారుతున్నట్లు, అదృశ్య ఆత్మ నా భక్తి యొక్క మంచు ద్వారా జగన్మాత రూపంలో స్తంభింపజేయబడుతుంది. నిన్న రాత్రి నేను చూసిన అమ్మ యొక్క అందమైన కనులను మీరు చూడగలిగితే ఎంత బాగుంటుంది, నా హృదయం శాశ్వతమైన ఆనందంతో నిండిపోయింది. నన్ను చూస్తూ, కొన్నిసార్లు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ కళ్ళలో నేను చూసిన ఆనందాన్ని మరియు ప్రేమను నా హృదయమనే చిన్న పాత్ర నిలుపుకోలేకపోతోంది. నేను ఆమెతో, “ఓహ్! ప్రజలు నిన్ను అవాస్తవం అంటారు!” అని చెబితే జగన్మాత నవ్వింది. “నువ్వే నిజమైన దానివి మరి మిగతావన్నీ అవాస్తవమైనవి,” అని నేను చెప్పాను. జగన్మాత మళ్ళీ నవ్వింది. నేను ప్రార్థించాను, “ఓ తల్లీ, అందరికి నీ అస్థిత్వాన్ని ప్రసాదించు.”

రెండు రకాల అన్వేషకులు ఉంటారు: కోతి పిల్ల మరియు పిల్లి పిల్ల వంటి వారు. కోతి పిల్ల తల్లిని హత్తుకుని అంటిపెట్టుకుని ఉంటుంది; కానీ ఆమె దూకినప్పుడు, అది పడిపోవచ్చు. చిన్న పిల్లిని తల్లి పిల్లి తీసుకువెళుతుంది, ఆమె ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటుంది. పిల్లి పిల్లకి తన తల్లిపై పూర్తి నమ్మకం ఉంటుంది. నేను మరి అలాంటి వాడినే; నేను అన్ని బాధ్యతలను జగన్మాతకి అప్పగిస్తాను. కానీ ఆ వైఖరిని కొనసాగించడానికి గొప్ప సంకల్పం అవసరం. అన్ని పరిస్థితుల్లో — ఆరోగ్యం లేదా అనారోగ్యం, ఐశ్వర్యం లేదా పేదరికం, సూర్యరశ్మి లేదా దట్టమైన మేఘాలు — మీ భావన ప్రశాంతంగా ఉండాలి. బాధల బొగ్గు డబ్బాలో ఉన్నప్పుడు కూడా అమ్మ మిమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచిందని మీకు ఆశ్చర్యం కలుగదు. ఉత్తమమైనది ఆమెకు బాగా తెలుసని మీకు నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు కనిపించే విపత్తు మీకు ఆశీస్సులుగా మారుతుంది….

అంధకారం అనేది జగన్మాత చేతి యొక్క నీడ మాత్రమే. అది మర్చిపోవద్దు. కొన్నిసార్లు, తల్లి నిన్ను లాలించబోతుంటే, ఆ చేయి నిన్ను తాకక ముందే ఆమె చేతి నీడ స్పృశిస్తుంది. కాబట్టి ఇబ్బంది వచ్చినప్పుడు, ఆమె మిమ్మల్ని శిక్షిస్తోందని అనుకోకండి; ఆమె చేతిని చాపి ఆశీర్వదించి మిమ్మల్ని ఆమె దగ్గరికి తీసుకుంటోందని భావించండి.

మీరు భగవంతుని అనంత విశ్వప్రదర్శనను అనుభవించదానికే భూమిపైకి పంపబడ్డారు….మరియు ఆయనలోని మీ నివాసానికి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది….“ప్రభూ, ఇది నీ ప్రదర్శన. అలానే ఉంచండి. కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చడం తప్ప అందులో భాగస్వామ్యాన్ని నేను పట్టించుకోను. వీలైనంత త్వరగా, నేను నీ కార్యాన్ని నిర్వహిస్తాను మరియు నీ ఈ నాటకం నుండి బయటపడతాను; హాస్య మరియు పీడ కలల యొక్క ఈ మాయా నాటకం నుండి ఇతరులను కూడా బయట పడవేయాలనుకుంటున్నాను,” అని నేను చెప్పాను.

కానీ అది మీకోసం ఉన్నంత వరకు, మీ మనస్సులో ఒకే ఆలోచన ధోరణిని కలిగి ఉండండి — దేవుడు….మీ కళ్ళు మూసుకొని, భగవంతుని గురించి ఆలోచించండి మరియు మీ ఆత్మ నుంచి జగన్మాతను పిలవండి. దీన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. మీరు ఇంకా ఏమి చేస్తున్నా, మీరు భగవంతునితో మానసికంగా సంభాషించవచ్చు: “నా ప్రభూ, నేను నీ కోసం వెతుకుతున్నాను. నాకు నువ్వు తప్ప మరేమీ అక్కర్లేదు. నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను. నీవు నన్ను నీ ప్రతిరూపంలో తయారుచేశావు; మరియు నా నివాసం నీతోనే ఉంది. నన్ను నీ నుండి దూరం చేసే హక్కు నీకు లేదు. బహుశా నేను తప్పు చేసి ఉంటాను, మీ విశ్వ నాటకం యొక్క భ్రమలతో పరీక్షించబడి ఉండవచ్చు; కానీ నీవే నా తల్లి, నా తండ్రి, నా స్నేహితుడు కాబట్టి, మీరు నన్ను క్షమించి తిరిగి వెనక్కి తీసుకుంటారని నాకు తెలుసు. నేను నా స్వస్థానానికి వెళ్ళాలి. నేను నీ వద్దకు రావాలనుకుంటున్నాను.”

ఇతరులతో షేర్ చేయండి