YSS

స్వామి చిదానంద గిరిగారి నుండి 2018 క్రిస్మస్ సందేశం

20 డిసెంబర్, 2018

మీకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులందరికీ ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర కాలంలో, ఏసు మరియు అన్ని భగవదైక్యం చెందిన ఆత్మలలో జన్మించిన విశ్వ జనీన క్రీస్తు చైతన్యం, మీ స్వీయ భక్తి-భరితమైన చైతన్యంలో వికసిస్తుంది. కేవలం బాహ్య వేడుక కంటే ఆధ్యాత్మిక క్రిస్మస్ గొప్పది; ఇది నమ్మకం మరియు నూతన ఆరంభాల తరుణం, దివ్య సామ్రాజ్యం నుండి స్వాగతించే హృదయాలలోకి కాంతి మరియు ఆనందం సుస్పష్టంగా జాలువారుతాయి. మనం నూతనోత్తేజం మరియు ఉత్సాహంతో దైవంతో అనుసంధానమై, మనలో అంకురించే క్రీస్తు దేవదూతల రాయబారులుగా మంచితనంతో కూడినవిశాల హృదయం, సహాయకత మరియు ఔదార్యాలను ఉత్తేజభరితం చేయడానికి, ఈ తరుణం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఆ నిజమైన క్రిస్మస్ స్ఫూర్తి మానవాళిలో కేవలం భూమిపై శాంతి కోసం మాత్రమే కాకుండా అందరిలో సుహృద్భావం యొక్క చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది.

పవిత్ర ప్రభు ఏసు, మరియు మహానుభావులందరూ భూమిపై అవతరించింది చేరుకోలేని లక్ష్యాన్ని మన ముందు ఉంచడానికి కాదు, మన ఆత్మ యొక్క అనంత సామర్థ్యాన్ని మనలో జాగృతం చేయడానికే—మనలో గుప్తంగా ఉన్న క్రీస్తు చైతన్యమే (కుటస్థ చైతన్యం) విశ్వాన్ని నిలుపుతున్నదని మనకు చూపించడానికి. భగవంతుని కృపా బహుమతిగా ఈ (కుటస్థ చైతన్యం) అంతర్లీన శక్తిని మరియు కాంతిని కనుగొనే తరుణం ఇది. ఏసు ద్వారా దృష్టాంతమైన క్రీస్తు విశ్వవ్యాప్తతపై లగ్నమగుట ద్వారా మీ మనో-బుద్ధి దిగ్మండలాల్ని విస్తరించండి. ఏసు మతం లేదా సామాజిక సరిహద్దులకు అతీతంగా అందరిలోనూ దైవాన్ని చూశాడు. తన కరుణతో ఆయన తప్పు చేసిన వారిని కూడా చేరదీశాడు. అంతేకాదు ఆయన తన శత్రువులను క్షమించాడు. భగవంతుని బిడ్డలందరిలోనూ పరివేష్టిత్గమైన ఆయన హృదయంలో శత్రుత్వానికి చోటు లేదు. దిన దినం శాంతి, సామరస్యం మరియు అవగాహన యొక్క స్వర్గాన్ని లోపల మరియు వెలుపల సృష్టించుకొని మీరు కూడా మీ సానుభూతి యొక్క పరిధిని విస్తరించవచ్చు—ఈ క్రిస్మస్ తో ప్రారంభించండి. వస్తు బహుమతులతో మాత్రమే కాక, ఉదార ​​హృదయ కానుకలతో: మీ శ్రద్ధా సమయ కానుకలు, క్షమ మరియు అవగాహనా కానుకలు—ఇతరులను కలుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేక తరుణంగా ఉండనివ్వండి. మన గురుదేవులు ఉపదేశించినట్లు, “ఎవరికోసమైనా మీరు నిస్స్వార్థంగా ఏదైనా చేసినప్పుడల్లా, మీరు క్రీస్తు చైతన్య పరిధిలోకి అడుగిడుతారు.”

మన స్వంత అవసరాలు మరియు కోరికలకు మించి మన చైతన్యమును విస్తరించడానికి లోతైన ప్రేరణ భగవంతుని అనంతమైన ప్రేమతో నిండిన హృదయం నుండి సహజంగా పొంగిపొర్లుతుంది. ఏసు జీవితాన్ని అంతటా వ్యాపింపచేసిన క్రీస్తు-ప్రేమ ఆ తరగని మూలం నుండే వచ్చింది. అందుకే పరమహంసగారు ఈ పవిత్ర తరుణంలో ఎక్కువసేపు ధ్యానం చేయడానికి సమయాన్ని వెచ్చించాలని కోరారు. గోడలు-లేని మీ ఆత్మ ఆలయం యొక్క పవిత్ర నిశ్శబ్దంలో, ఆనందం, శాంతి మరియు అనంతమైన ప్రేమగా దేవుడు మీ దగ్గరకు వస్తాడు; మరియు ఆయన సర్వసమగ్ర చైతన్యం యొక్క స్పర్శతో, మీరు విభజన సరిహద్దులు కరిగిపోయినట్లు, ఆయనతో మరియు ఇతర ఆత్మలతో మీ శాశ్వతమైన బంధాన్ని తెలుసుకొంటారు. ఆ అంతర్గత మేల్కొలుపు ద్వారా కించిత్తు ప్రకాశమొందే ప్రతీ ఆత్మ కూడా సహజంగా మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచానికి దోహదం చేస్తుంది. గురుదేవుల సొంత మాటల్లోనే ఆయన ప్రేమపూర్వక ఆశీర్వాదాన్ని స్వీకరించండి: “మీకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, మరియు మీ కోసం అందరూ కోరుకొను అత్యుత్తమమైన కానుకగా—మీ స్వీయ హృదయంలో క్రీస్తు తేజము యొక్క అవగాహన పొందండి. మీరు క్రిస్మస్ రోజున మరియు కొత్త సంవత్సరం అంతా ప్రతి రోజూ ఆయన ఉనికిని అనుభవించండి. దివ్యతేజస్సు యొక్క అద్భుతమైన బహుమతిని స్వీకరించడానికి మీ హృదయాన్ని తెరిచివుంచండి.”

మీకు మరియు మీ ప్రియతములందరికీ ఆనందదాయక క్రిస్మస్ శుభాకాంక్షలు,

స్వామి చిదానంద గిరి

అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక నేత, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp